Wednesday, June 9, 2010

ఈ తెలుగోళ్ళంతా ఇంతే..

' మా తమిళ్ వాళ్ళు ఇంద మాదిరి సేయరి మాడం. కన్నడ, తెలుంగు రొంబ మోసం మాడం ' మా పనమ్మాయి పొద్దున్నే కసి గా అన్న మాటలివి. మేరీ కి తెలుసు నేను తెలుగు దాన్నని. తనకి మా డ్రైవర్ పడడు. అతనికి ఎక్కడ ఎక్కువ అధికారం, చనువు మాతో ఏర్పడతాయో.. ఎక్కడ తను తక్కువవుతుందేమో అని తన బాధ. నాకు నవ్వొచ్చింది. కానీ తను అంత బాధగా చెప్తుంటే.. ఎందుకు లే అని సీరియస్ గానే మొహం పెట్టాను. 'ఎవర్నైనా నమ్మవచ్చు కానీ ఈ అరవ వాళ్ళని నమ్మలేం.. ' అని మరి రోజూ చాలా మంది నోట వింటూ ఉంటాను ఆఫీస్ లో..

తర్వాత ఆఫీసుకొస్తూ ఆలోచిస్తూ ఉన్నాను. తన దగ్గర్నించి ఇలాంటి కామెంట్లు చాలానే విన్నాను ఇంతకుముందు. 'ఎన్ వీటికిట (మా ఇంటి దగ్గర) బ్రాహ్మిన్స్ ఉండారు మాడం.. క్లీన్ గా ఉండరు మాడం. బ్రాహ్మిన్ జాతి ఎల్లా రొంబొ మోసం మాడం..' మళ్ళీ తనే ఇంకో సారి 'ఎన్ వీటికిట బ్రహ్మిన్స్ ఉండారు మాడం.. నల్ల స్వీట్స్ సేస్తండారు. నాన్ తీసుకువస్తాన్ ' అనేది. బ్రాహ్మలూ, మిగిలిన వాళ్ళని శుభ్రం లేదనీ, అదనీ అనుకోవటం నాకు బాగానే తెలుసు.


ఈ విషయం మీద బ్లాగాలని అనుకుంటూ ఉన్నాను. మా ఆఫీస్ లో శ్రీను వచ్చి.. 'మా ఇంటి వాళ్ళు తెగ గొడవ పెడుతున్నారండీ.. కన్నడ గౌళ్ళు కదా గీరెక్కువ!! ' అన్నాడు. నేను.. 'కన్నడ గౌళ్ళు కాకుండా పంజాబీలో, హర్యానా జట్ లో, లేక తెలుగు రెడ్లో, తమిళ బ్రాహ్మలో అయితే గీర ఉండదంటారా? ' అన్నాను నవ్వుతూ.. దానికి శీను.. 'నీ దగ్గర అంటే ఇలా అంటావని నాకు తెలుసు కృష్ణా..' అని టాపిక్ మార్చేసాడు.

అందరూ ప్రపంచం లో తమ ఐడెంటిటీ తప్ప వేరే వన్నీ.. చాలా చెత్తవనీ.. వాళ్ళు అపరిశుభ్రం గా, అచేతనం గా, గ్యాంగు కట్టి, క్రూరం గా లేక కల్మషం గా, క్రుకెడ్ గా, తేనె పూసిన కత్తి లా అలాగ నానా రకాల అవలక్షణాలతో ఉంటారని అనుకుంటారనుకుంటా.

మా తోటి కోడలి వరస ఒకమ్మాయి గుంటూరు పిల్ల. తను 'మా అక్క వాళ్ళ అత్తగారూ వాళ్ళు గోదావరి జిల్లాల వాళ్ళని తెలియక పెళ్ళి చేసారు మా అమ్మావాళ్ళు. అమ్మో వాళ్ళు తేనె పూసిన కత్తులు, ఇప్పటికీ బాధ పడతారు మా పేరెంట్స్ ' అంది. మా చిన్నప్పుడు మేము పెరిగిన కరీం నగర్ లోనూ, మా పెద్దమ్మగారి ఊర్లోనూ.. 'అమ్మో గుంటూరు వాళ్ళు అతి తెలివి వాళ్ళు.. ' అనటం విని నిజమేమో అనుకుంటూ ఉండేదాన్ని.. నెమ్మదిగా అర్థమైంది అందరూ మిగిలిన వాళ్ళందరినీ అలాగే అనుకుంటారని...

మొన్నీ మధ్య మా ఆఫీస్ లో ఎవరో చెప్తున్నారు. 'ఫలానా కాస్ట్ వాళ్ళు అంతే.. వాళ్ళ హీరోల సినిమాలే చూస్తారు .. వాళ్ళ పిల్లలకి వేరే కాస్ట్ హీరోల పాటలు హం చేసినా,డాన్స్ చేసినా.. తప్పమ్మా. మనం వాళ్ళ సినిమాలు చూడకూడదు.. మన హీరోలు వీరే.. అని చెప్తారు. ' అని. దానికి ఇంకొకరు 'అయ్యో మీకు తెలియదేమో.. ఫలానా కాస్ట్ వాళ్ళు అయితే.. స్వాతంత్ర్య సమర యోధుల్లో కూడా.. నేషనల్ లెవెల్ లో ఫలానా వాళ్ళని మాత్రమే ఆరాధిస్తారు..' అని వాళ్ళ అభిప్రాయం చెప్పారు.

'చా.. మరీ చెప్తారు మీరు..' అంటే.. మీరు గమనించి చూడండి.. ఈసారి అని చెప్పారు.
జాతీయ లెవెల్లో, సింధీలా.. అమ్మో.. భాంగ్స్ లతో పెట్టుకోకూడదు .. మల్లూస్ తో మనకెందుకు? మార్వాడీల్లా ఏంటి ఈ లెక్కలు? గుజ్జూలింతా ఇంతే.. సౌత్ అంతా పిసినారులు, నార్త్ వాళ్ళకి ఆర్భాటం ఎక్కువ, విషయం తక్కువ.. ..

మేము చదువుకున్నప్పుడు మా స్నేహితులు ఏ ప్రాంతమో అంతగా పట్టించుకోలేదు ఎప్పుడూ...ఆవిధం గా మా ఇంట్లో ఒకళ్ళు గోదావరి జిల్లాలు, ఒకళ్ళు తెలంగాణ, వేరొకళ్ళు అనంతపురం, ఇంకా గట్టి గా మాట్లాడితే కజిన్లు పెళ్ళి చేసుకున్నవాళ్ళల్లో బెంగాలీలు, బీహారీలు, మరాఠీ వారు, చైనీయులు, తెల్లవారు కూడా ఉన్నారు.

గమ్మత్తేంటంటే.. మాకు తెలిసిన పెద్దమనిషి రోజుకి ఒకసారైనా అనకుండా ఉండరు..
మహాత్మా గాంధీ అన్నారు.. 'మంచీ,చెడూ, ఏ ఒక్క జాతి లక్షణాలు కావు.. ఎల్లపుడూ మన మనసు కిటికీలు తెరిచే ఉంచుకోవాలి.. అని. '

ఆయన ఈ విషయం మనస్పూర్థిగా నమ్మి ఆచరించటానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తారు.. కానీ.. ఆయన నోటి నుండే.. చాలా సార్లు 'ఫలానా ప్రాతం,కులం,మతం వారికి ఫలానా .. గుణం ఎక్కువ.. వాళ్ళని భరించలేం' అనీ అంటూనే ఉంటారు.

చెప్పడం కన్నా ఆచరించటం ఎంత కష్టమో తెలుస్తుంది.. ఆయన మాటల్ని వింటుంటే..

మా ఆరేళ్ళ అమ్మాయి వచ్చి.. ' కార్నర్ ఇంట్లో ముస్లింస్ వచ్చారమ్మా.. వాళ్ళతో జాగ్రత్త గా ఉండాలట అని చెప్పింది మొన్నీ మధ్య. అప్పుడు 'అలా అనకూడదు.. నీకేం తెలుసని అలా అన్నావ్? తప్పు ' అని వదిలేసాను. ఈరోజు.. ఇంటికెళ్ళాక దానికి ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా ఎలా వివరించాలా అని ఆలోచనలో పడ్డాను..

మా బాస్ చూసాడంటే.. 'అమ్మా.. ఆఫీస్ విషయాలు కూడా కాస్త ఆలోచించు తల్లీ..' అంటాడు.. మళ్ళీ వారాంతం లో రాస్తాను.. సెలవు!

10 comments:

Kathi Mahesh Kumar said...

మొత్తానికి అత్యంత వివక్షాపూరితమైన భావాలుండేది భారతీయులకే అని తెలుసుకున్నారు. మంచిది.

సుజాత వేల్పూరి said...

మీ అబ్జర్వేషన్స్ భలే ఉంటాయి కృష్ణప్రియా, ప్రతి ఒక్కళ్ళూ భుజాలు తడుముకు చూడాల్సిందే!

ఈ టపాలో నేను ఒకసారి భుజాలు తడుముకున్నా!:-)

మహేష్, ఈ వివక్ష అనేది మానవజాతికే ఉన్న ఒక జాడ్యం! ఇండియాలోనేనా ఏంటి, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇలాగే ఏడుస్తున్నాయి పరిస్థితులు! మేము ఒక్లహామాలో ఉన్నపుడు అక్కడ నేటివ్ అమెరికన్స్(రెడ్ ఇండియన్స్)ఎక్కువగా ఉండేవాళ్ళు.వాళ్ళని అమెరికన్లు తక్కువగా చూస్తారు(ఎక్కడినుంచో వచ్చి వాళ్ళదేశాన్ని వీళ్ళు కబ్జా చేసి..)నల్లవాళ్లని,హిస్పానిక్ లని....తెల్లోళ్ళు తక్కువగానే చూస్తారు.

తవ్వితే ప్రపపంచ చరిత్ర అంతా వివక్షలే!

మనమేం ఎక్సెప్షనూ కాదూ!మెరుగూ కాదు!

భావన said...

హి హి బలే రాసేరండి కృష్ణప్రియ. నేను కూడా ఒకటి రెండు చోట్ల భుజాలు తడూముకోవలసి వచ్చింది. అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం. టాక్కు మని ముద్ర వేసేస్తాము ఒకరి మీద ఇలా అని. ఎంత వదిలించుకోవాలన్న ఒక్కో సారి ఆ తరాల నుంచి వచ్చిన ద్వేషమో కక్ష్యో ప్రేమో అలా ఒక మాట మాట్లాడిస్తుంది అనుకుంటా.

మహేష్ అలా ఏం కాదు భారతీయులనేం కాదు ప్రపంచమంతా వుంది ఇది. ఇటాలియన్స్ కు ఐరిష్ వాళ్ళు తక్కువని భావం. గ్రీక్ వాళ్ళకు అసలు మిగతా వాళ్ళెవ్వరు లెక్క రారు అని అంటారు. జ్యూయిష్ వాళ్ళు ఒక చోట గుంపు లు గా చేరి మిగతా వాళ్ళని తరుముతారు ఆ ప్రాంతం నుంచి అని ఒక మాట. పోలిష్ వాళ్ళు తిక్క వాళ్ళు అతి తెలివి అని మిగతా వాళ్ళు అంటారు. ఇది అంత తెల్ల తోలు ల మధ్యనే. నేణు పైన చెప్పిన రేస్ ల మధ్య పెళ్ళీళ్ళు జరిగేప్పుడూ ఎంత అసంతృప్తో ఎన్ని మాటలు విసురుకుంటారో. ఇక అది కాక స్పేనిష్, నల్ల నేటివ్ అమెరికన్స్ (రెడ్ ఇండీయన్స్) మీద మాటలైతే చెప్పనే అక్కర్లేదు. రెడ్ ఇండీయన్స్ ను ఆ నలు చదరపు మొహమోళ్ళు అనే హేళన గా మొదలెడతారు కొందరైతే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పోస్టే రాయవచ్చు. నేణు అనుకోవటం ఒకళ్ళను ఒకళ్ళు హేళన అనేది మానవ జాతి ప్రాధమిక లక్షణాలలో ఒకటనుకుంటా.

keerthana4ever@gmail.com said...

బాగా చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో రకమైన వివక్షకు గురి అవుతూనే ఉంటాము. మన పరిధి లో మనమూ అలాగే ఎంతో కొంత ప్రెజుడిస్ వ్యక్త పరుస్తూనే ఉంటామేమో...కాకపోతే దాన్ని గుర్తించి విచక్షణ తో సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి.
నాకు నిన్న మొన్నటి వరకు హిందూ మతమంటే ఒకరకమైన న్యూనత, గిల్ట్ ఫీలింగ్-వర్ణ విచక్షణ పేరుతో మన దేశ ప్రజల్ని మనమే అణగదొక్కుకున్నాము కదా. ఇలా ఎక్కడ ఎప్పుడూ జరిగిఉండదేమో అని. ఈ మధ్యనే "రోం" గురించి హెచ్ బీ వో వాళ్ళ వీడియో చూసాను.
వెంటనే అనిపించింది....ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం..నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం.

Anonymous said...

కృష్ణ ప్రియ గారూ
మీరు చెప్పింది నిజమేనండీ!
సుజాత గారూ, భావన గారూ అన్నట్టు ఇలాటి ప్రవృత్తి ప్రపంచమంతా వుంది. ఇంగ్లీషు వారికీ, ఫ్రెంచి వారికీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆస్ట్రేలియాలో అబొరిజీన్ల మీద శ్వేత జాతీయుల జులుం, మారణ కాండా గురించి తెలిస్తే, వీళ్ళసలు మనుషులేనా అనిపించక మానదు.

ఎప్పుడో పదేళ్ళ కింద నేను రాసిన్ ఈ కథ చూడండి వీలైతే,
http://www.eemaata.com/em/issues/200007/5.html

కీర్తన గారూ, ఇది చదివితే చాలా బాధ పడతారు,

http://sbmurali2007.wordpress.com/2007/10/02/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81-%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81-6/

శారద

కృష్ణప్రియ said...

చదివినవారికీ, ప్రతిస్పందించినవారికీ,

ధన్యవాదాలు. అవును.. ఈ ప్రవృత్తి మానవ జాతి లక్షణం. అందరికీ ఏదో మోతాదు లో ఉండే ఉంటుంది. దీన్ని అధిగమించినవారు ఋషులో, మహాత్ములో..

కాకపోతే.. శారద గారి కథ లో లాగా మనం అసోసియేట్ చేసుకునే వర్గాలు ఎన్ననేవి వారి నైజాన్ని బట్టి ఉంటుందనుకుంటా.

ఈ టపా లో నేను అనుకున్నవి, అనుకున్నట్టు గా వ్యక్తీకరించలేదని,.. ఏదో ఇంకా చెప్పాలనుకుని చెప్పలేకపోయానని, అసంపూర్ణంగా వదిలేసానని..అసంతృప్తి గానే ఉంది నాకు. మళ్ళీ దీంట్లో చిన్న టాపిక్ తో రాస్తాను ఎప్పుడో..

కృతజ్ఞతలతో,..
కృష్ణప్రియ/

Anonymous said...

తొండి, నేనొప్పుకోను...వారం రోజులుగా ఈ టాపిక్ మీద రాద్దాం అనుకుంటున్నా.

ఎందుకైనా మంచిది ఎవరైనా రాసారేమో అని చూస్తే ఇంకేంటి మీరు రాశేశారు. (అఫ్ కోర్స్ చాలా బాగా రాశారు అనుకోండి)

ఎంతైనా మీ సాఫ్ట్వేర్ వాండు ఎల్లామే ఇప్పిడిదా, రొంబా కాఫీ కొడుతురు, రొంబ కాపీ కొడుతురు. :D (జస్ట్ జోకింగ్)

నేను ఎవరో చెప్పలేదు కదా..నేనో పిల్ల బ్లాగరుని, ఈ లోకంలో బుడిబుడి అదుగులు వేస్తున్నా...మీలాంటి పెద్దవాళ్ళ అడుగుజాడలలో...

మీ పోస్టులు అన్నీ బాగుంటాయి.

- పవన్

కృష్ణప్రియ said...

పవన్ తంబీ..

నేను చచ్చినా నమ్మను.. మీరూ టపా వేసేదాకా! :-) ప్రపంచం లో ఈ టాపిక్ ని ఎవ్వరూ ఇంతవరకూ అసలు ఆలోచించలేదు అన్నది ఉండదు. అలా అయితే.. ఈ పాటికి మనకి సినిమాలూ,కథలూ, నవలలూ, కొత్త సంగీతం అనేదే ఉండదు!
మీ సాఫ్ట్ వేర్ వాళ్ళ జెనరలైజేషన్ .. కత్తి!

అన్నట్టు.. నేనూ బ్లోగ్లోకానికి కొత్తే.. ఏప్రిల్ ముందు నేను అమితాబ్, అమీర్ ల బ్లాగులు తప్ప చూడలేదు ఎవరివీ.. ఏప్రిల్ 17 న నా మొదటి టపా!

Please go ahead and post.. and have a blast! All the best..

Anonymous said...

>> అని వాళ్ళ అభిప్రాయం చెప్పారు.

Is it ? how do you know it is their opinion !?!

Did they stereotype or did they sighted their observations to express how folks might be stereo typing based on their experiences only without considering other things !?!

Have you discussed about this with anyone of those you quoted ?

Have you ever asked any of them why they subscribed to stereo typing? or checked whether they subscribe to stereo typing or not?

You are just using the conversations for your purpose ?!! If you are using the conversations to send a point across, in my opinion the better way would have been writing in a more direct way by stating your opinions.

Anonymous said...

>> చెప్పడం కన్నా ఆచరించటం ఎంత కష్టమో తెలుస్తుంది.. ఆయన మాటల్ని వింటుంటే..

Have you ever discussed with him ?

what is that you are trying to convey? in stead if highlighting the difficulty in practice, you are simply presenting as if the ideals are waste.

I know it was not your intent. But its your limitation and lack of courage. You somehow seem to be justifying all the nonsensical things by attributing impracticability to them.

I know you learned and understood a lot by now than what you know at the time of writing this post. But just want to provide some stimulus for thinking.

Let me know, if you want to further discuss this :)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;