Friday, July 16, 2010

NRI నుండి పక్కా ఇండియన్ గా మారడం దాకా..

ఏదో ఆఫీస్ పార్టీ.. అంటే బయటనుంచి సమోసాలు, పకోడీలు, 2 రకాల స్వీట్లు, సలాడ్ తెప్పించి బ్రేక్ రూం లో పెట్టి మా అడ్మిన్ మెయిల్ పంపితే అందరం ' యెటాక్ ' అని నచ్చినవి తీసుకుని అక్కడ కూలబడి కబుర్లు చెప్పుకుంటూ కొత్తగా వచ్చిన ఇంజినీర్ ని గమనిస్తున్నాం.

'హ్మ్మ్మ్ .. లుక్స్ గుడ్!! ' అని కళ్ళెగరేసి.. చూసి.. ' వావ్ !! ' అని కాస్త అరిచినట్టుగా చేసి.. అతి జాగ్రత్త గా ఒక టిష్యూ పేపర్ మీద ఒకటే 'వెజెటబుల్ ' తీసుకుని ఒక కార్నర్ కొచ్చి సాటి IE లతో నుంచున్నాడు (Imported Engineers). " జిలియన్ కాలరీస్ " , "గ్రీజీ " లాంటి పదాలు వినబడుతున్నాయి మంధ్రం గా ...

IE .. ముద్దుగా మా గ్రూపు లో పెట్టుకున్న పేరు లెండి. మేమందరం కళ్ళతోనే ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాం. ఇది పునహ్ భారతీకరణ లో మొదటి ఫేజ్. (పది పదిహేనేళ్ళ విదేశీ వాసం తర్వాత భారత జన జీవన స్రవంతి లో మళ్ళీ కలిసిపోవడం ...)

మా హెడ్ ఆఫీసు అమెరికా లో ఉండటం తో.. ఆర్థిక మాంద్యం మొదలైన దగ్గర్నించీ , దాదాపు 2 వారాలకొకరు బెంగుళూరు వచ్చేస్తునారు మూటా ముల్లే సద్దుకుని.

మొదటి ఫేజ్ లో ఉన్నాడు సుభాష్. అందరు RI (Returning Indians) ల్లాగానే.. కొద్దిగా వెలిసినట్టున్న లేత రంగుల షర్టులూ, అవే రంగుల్లో పాంటులూ, హైకింగ్ లేదా స్పోర్ట్ షూలూ, కనబడిన వాళ్ళందరినీ, పెదాలు సాగదీసి నవ్వినట్టు పోజిచ్చి
తల తో ' రా ' అని పిలిచినట్టు ఒకసారి కిందకి వంపి హాల్ వే లల్లో కుడి వైపు నడుస్తూ, అందరికీ తగలబోయి సారీలు చెపుతూ ..

కాఫెటేరియా తిండి లో కాలరీలు లెక్కపెట్టడం, టిష్యూ పేపర్ల కట్టలు క్యూబ్ లో పెట్టుకుని వాడటం.. ఇతర క్యూబ్ లలోకి తొంగి చూడకుండా డీసెంట్ గా ఆయిల్స్ లోంచి వెళ్ళటం.. ఇతరులు మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి మాట్లాడక పోవటం.. ఒక తేదీ న పని పూర్తి చేస్తానన్నప్పుడు అది పాటించి పూర్తిచేసి చూపటం లాంటివి మంచి బుద్ధులతోనే ఉంటారు మొదట్లో ..

ఇళ్ళు ఎగ్సెట్రా..

రావటం రావటం గెస్ట్ హౌజ్ లోనో, లేక వారి ఆత్మీయిలు ఇళ్ళల్లోనో దిగి.. ఇక వాళ్ళు ఇళ్ళు వెతకటం చూస్తే ముచ్చటేస్తుంది. మొదటి ప్రశ్నలు.. 'ఈజ్ ఇట్ సేఫ్ నైబర్ హుడ్?' , ' ఇతర ఆర్ ఐ లు ఉన్నారా లేరా? '.. గేటెడ్ కమ్యూనిటీ తప్పని సరి. ఇంటికి మారగానే పని మనుషులు కుప్పలు తెప్పలు గా వచ్చి..' అమ్మగారో.. ' అంటూ చక చక లాడుతూ పనిచేస్తారనే ఊహలు! అయినవాళ్ళంతా.. @సర్వీస్.. అంటూ అండగా ఉంటారని కూడా అంతర్లీనం గా ఆశ పడటం.. అదే విధం గా మనం కావాలనుకున్నప్పుడు మాత్రమే మనల్ని ఎంటర్ టెయిన్ చేసి వద్దనుకున్నప్పుడు తెర చాటుకెళ్ళే బంధుగణం..

కలలు కరిగాక .. వారానికో రోజు ఆరోగ్యం,చుట్టాలు, నానా రకాల ఫంక్షన్ల పేర్లు చెప్పి ఎగ్గొట్టే పని మనుషులు,.. వాళ్ళ వాళ్ళ రొటీన్ లో ఉన్న ఆత్మీయులు, అవసరాన్ని బట్టి ప్రత్యక్షమయ్యే బంధువులూ..

వీకెండ్ లు?

అమెరికాలోలాగే ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలేమో అన్న రంధిలో కొంతకాలం కొట్టుకోవటం.. బెంగుళూరు ట్రాఫిక్ లో అడుక్కి అరవైనాలుగు సార్లు కార్ ఆగుతూ.. ఏదో విధం గా కష్టపడి తిరిగి రావటం..

ఆరు నెలలు తిరిగేసరికి..
వారాంతాలంటే..హాయిగా ఇంటిపట్టున పడి ఉండటం.. పిల్లలూ, పెద్దలూ, వారం లో పేరుకుపోయిన పనులు పూర్తిచేసుకోవటం.. ట్రాఫిక్ తక్కువ ఉన్న వైపు తప్ప పొరపాటున కూడా వెళ్ళకపోవటం!

ప్రయాణాలు?


మొదట్లో వారి సొంత ఊళ్ళకి ప్రయాణాలన్నీ విమానాల్లో.. లేక 7-8 వందల కిలో మీటర్లు కూడా కార్ డ్రైవ్ చేయచ్చా అని ఆలోచనలూ.. లేదా రైలెక్కారంటే.. తప్పని సరిగా స్టేషన్ కి టాక్సీలు.. కూలీలకి అడిగినంత ఇచ్చేయటం.. చేతి సంచీలో టాయిలెట్ టిష్యూలు, ఎక్వా ఫినా నీళ్ళ సీసాలు మాత్రం మరిచిపోకపోవటం!

ఓ ఏడాది తిరిగేటప్పటికి.. బస్సూ, థర్డ్ ఏ సీ, స్లీపర్ కోచూ... కార్లలో వెళ్ళినా.. అద్దె కార్లలో..డ్రైవర్ ని నియమించుకోకుండా వెళ్ళే సాహసాలు చేయకపోవటం..

కబుర్లు?


' సాన్ హోసే (వారుండి వచ్చిన సిటీ) ' లో ఉన్నప్పుడు.. తో మొదలు పెట్టి.. బెంగుళూరు లో క్రమశిక్షణ లేని ట్రాఫిక్ ని తిట్టుకోవటం తో ముగించటం.
ముదిరిన లంచగొండిదనం, సమయపాలన చేయని వారి ప్రవర్తన గురించి,విదేశాల్లో ఉండగా తిరిగిన ప్రదేశాల చర్చలు...
విదేశాల్లోని వస్తువుల నాణ్యత గురించి, భారతావని లోని కాలుశ్యం గురించీ మాట్లాడకుండా ఉండని ఆర్ ఐ లుంటారా?
అమెరికన్/వారుండివచ్చిన ప్రాంతపు కూరలూ, పళ్ళూ, ఇతర ఆహార/ఇతర పదార్థాలు ఎక్కడ దొరుకుతాయో..వివరాలు ఎక్స్ చేంజ్ చేసుకోవటం..
అక్కడ పిల్లల చదువు లో సృజనాత్మకతా,..ఇక్కడ బట్టీ కొట్టే పద్ధతి గురించి విపులం గా మాట్లాడుకోవటం..
విదేశాలకి ఒక్కసారి కూడా వెళ్ళని వారు తారసపడితే కాస్త గంభీరం గా మొహం పెట్టి, స్టైలిష్ గా పలకరించి ఊరుకోవటం..

ఇతరత్రా..

ఒక ఏడాది పాటు అక్కడనుంచి తెచ్చిన బట్టలూ, ఇతర వస్తువులూ వాడటం, ఎవరైనా వస్తుంటే తెప్పించుకోవటం.. ఓ రెండేళ్ళు అక్కడికి ఎవ్వరి వెళ్తున్నా.. విదేశాల్లో స్నేహితులకి మైసూర్ పాక్ ల నుండీ.. కాటన్ కుర్తీల వరకూ పంపటం..
క్రెడిట్ కార్డ్ బిల్లుల్లో డబ్బు మేరుపర్వత ప్రమాణాన కనిపిస్తుంటే.. నెమ్మదిగా తగ్గించేయటం..

ప్రైవసీ కరువైందని బెంగపెట్టుకోవటం.. తెలిసీ తెలియని వారి పార్టీల్లో 'ఆర్ ఐ ' లు గా గుర్తింపు పొందాలని తాపత్రయపడటం..

ఇలాగ ఎన్ని చేసినా ఎన్ని విషయాల్లో కష్టపడ్డా.. నష్టపడ్డా, డిజపాయింట్ అయినా, అనారోగ్యం పాలయినా (మొదట్లో వాతావరణం మార్పు కి..ముఖ్యం గా పిల్లలకి), ప్రైవసీ లేదని బెంగపెట్టుకున్నా.. ట్రాఫిక్ ని తిట్టుకున్నా, టైంలీ నెస్ ఏదీ? అని నిట్టూర్చినా...

చక్కగా నచ్చినవి కొనుక్కోవటం, లేదా చేయించుకోవటం, అదీ కుదరకపోతే..పని వారి సహాయం తో స్వయం గా చేసుకోవటం.. వాతావరణం ఎలా ఉంది? ఎన్ని లేయర్ల తొడుగులు అవసరం లాంటి లెక్కల్లేకుండా.. చటుక్కున వీధిలోకి వచ్చేయటం. పిల్లలని మరీ ఇంట్లో కట్టిపారేయకుండా వీధిలోకి.. (లేదా కాంప్లెక్స్ ఆవరణ లోకి) ధైర్యం గా పంపగలగటం.. తల్లిదండ్రులతో వీసాలూ, ఇన్ష్యూరన్సులూ, లాంటి టెన్షన్లు లేకుండా వారి జీవన చరమాంకం లో ఆసరా ఇవ్వగలగటం.. వారితో పిల్లలకు అనుబంధాన్ని పెంచగలగటం.. అన్నింటినీ మించి మాతృ దేశం లో వచ్చి పడ్డామన్న తృప్తి తో పోల్చుకుంటే.. ఈ ట్రాఫిక్కూ, సమయపాలనా, లంచగొండిదనం.. పెద్ద విషయాలే కావేమో..

విదేశాల్లో పరిచయమైన పాత ఫ్రెండ్స్ ఎక్కడ తగిలినా.. 'ఎంత సుఖపడిపోతున్నామో.. పని మనిషి (ఎంత మంది మారినా, ఇంట్లో వస్తువులు ఎన్ని కొట్టేసినా.. డ్రైవర్ (కార్ లో ఒక్క ముక్క మాట్లాడినా 'ట్రూ మన్ షో ' లా ప్రపంచానికి తెలుస్తుందని నోరు మూసుకుని కార్లో పడి ఉన్నా.. తోటమాలి తో (మొక్కల్ని ఎండబెట్టినా, లాన్ ని కుళ్ళబెట్టినా).. ఇస్త్రీ అమ్మాయితో (పట్టు చీరలు కాల్చినా, షర్టులు మాయం చేసినా)..

వీళ్ళందరి సహాయం..మేమేమీ చేయం.. హాయిగా అక్కడా ఇక్కడా తిరగటం, ఆఫీస్ పని చూసుకోవటం, ఎంజాయ్ చేయటం.. అంతే! అని చెప్పుకుంటారు. (లేకపోతే అర్థరాత్రి దాకా కాల్సూ, నిద్రలేమీ,..ల్లాంటివి చెప్పుకుంటామా ఏంటి? మరీ..)

ఓ ఏడాది పోయాక.. మళ్ళీ ఇలాంటి పార్టీ యే ఉంటే RI లు ఈ పాటికి ప్యూర్ 'I' లు గా రూపాంతరం చెంది ..గాఢమైన రంగుల బట్టలూ, అందర్నీ గట్టిగా పలకరించటం, (వీలైతే..భుజం మీద ఒక్క చరుపు చరిచి మరీ..),.. పెద్ద సమోసాని తీసుకుని చిదిమి చట్నీలు పోసుకుని.. చేత్తో తిని.. పెట్టిన స్వీట్లన్నీ తినేసి.. కొత్తగా వచ్చిన ఆర్ ఐ ల మీద కామెంటుతూ ఉంటారు..

" ఏంటీ..? నీకెలా తెలుసూ అంటారా? నేనూ ఇదంతా స్వయంగా అనుభవించటమే కాక.. నాలుగైదేళ్ళనుండీ చూస్తున్నాకదండీ :-)

ps : సరదాగా రాసిందే .. ఎవ్వర్నీ కించపరచాలని కాదు

35 comments:

Anonymous said...
This comment has been removed by the author.
Telugu said...

కెవ్వు కేక

భావన said...

అవునా సినిమా చూపించారు కదా.. ఇలానే వుంటారా? మీరు గేరంటీ ఇస్తున్నారు కదా వుంటారేమో లే. ఐనా San jose నుంచి వచ్చి అంత చేటూ మీరు చెప్పినట్లు వుంటారేమిటీ అదీ, హైదరాబాద్ ఒక్కటే కదా..

భాస్కర రామిరెడ్డి said...

హ హ..చాలా బాగా వ్రాసారండి. మీరు చివరి ఫేజ్ కూడా దాటేసి వుంటారు కదా ఈ పాటికి? ఆత్మసంతృప్తికి సొసైటీలో గుర్తింపు కు మధ్య చాలానే యుద్ధం చేసి చివరికి అలసిపోయి RI ల నుండి True Indians గా మారేదాకా [ ఈలోపు ఇండియారావాలనే నిర్ణయాన్ని రకరకాలుగా తిట్టుకోని ] పైన ముఖంలో నవ్వు , కంఠంనుంచి గట్టిగా నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడడం చాలానే చాలానే కదా!

ఏమైనా అంతరాత్మలో లేచే అలజడిని సమర్థించడం మనల్ని మనం సమాధాన పరచుకోవడం అంత తేలిక కాదేమో.

శ్రీ said...

హమ్మయ్య! మొదటి కామెంటు నాదే!

ఇంత కరెక్టుగా ఎలా రాసారా అని అలోచిస్తూ చదువుతుంటే చివరి బోల్డ్ లైను చదివాక తెలిసింది.

ఉన్నదున్నట్టు రాసారు.

మీరు నాలుగేళ్ళ నుండీ అలవాటైపోయారా?

నేనయితే విమానం దిగడం ఆలస్యం, లుంగీ కట్టుకుని తిరిగేస్తూ ఉంటాను.

kumar said...

wonderful....chala baaga raasaru.

Bhãskar Rãmarãju said...

అత్భుతంగా రాస్తున్నారండీ కృష్ణ గారూ
మీ నెరేషన్ అనగా వర్ణన బాగుంది.
మీ ప్రతీ టపాని చదువుతున్నాకానీ వ్యాఖ్యానించలేక పోతున్నా, ఆఫీస్లో ప్రాక్సీ నిలిపివేస్తున్నందువల్ల

శుభం

వాత్సల్య said...

Very funny and saw a few of these as well :)

సుజాత వేల్పూరి said...

ఈ RIలు ఏడాదో ఆర్నెల్లో ఉండి వచ్చినా ఇదే రకంగా ప్రవర్తిస్తూ అందర్నీ వింతగా చూస్తూ ఎప్పుడూ ఈ దేశం మొహమే ఎరగనట్లు చేయడం,,,అబ్బో బోల్డు మందిని చూశామండీ!రోడ్డు మీద కుడివేపు కారు నడపటం, ఇంకా "ఓ బాయ్," చిన్న పొరపాట్లు చేసినపుడు "అ..అ "అనడం,మొహంతోనే సగం మాట్లాడ్డం(ఎక్స్ ప్రెషన్స్ తో)ఇవన్నీ అక్కడక్కడా ఇంకా చూస్తున్నా! మా కజినొకడు ఆ స్టేజీలోనే ఉన్నాడు ప్రస్తుతం!

చివరాఖరి పేరా కేక! కాకపోతే మరీ ఏడాదికేనా? రెండు మూడేళ్ళైనా ఆగాలి.

kavitha said...

super , as always!!

Unknown said...

అదిరింది అండి. చదివినంత సేపు నవ్వుతూనే ఉన్నాను. హస్యాన్ని జత చెసి విషయాన్ని బాగా చెప్పారు.

sunita said...

Hahaha! super post!

మాలా కుమార్ said...

బాగా రాశారండి .ఆఫీస్ లోనే కాదండీ బాబూ . బయటి ప్రపంచం లోనూ వున్నారు వీరు . ఇలాంటి వారిని చూసి నేనూ , మావారు తెగ జోక్ లేసుకుంటాము . తెలిసి వాళ్ళైతే వారి ముందే జోక్ చేస్తారు మావారు .

నేస్తం said...

నేనూ నెక్స్ట్ ఇయర్ ఇండియా వచ్చేస్తున్నాను..ఇవన్నీ నోట్ చేసుకోవాలి :) .. అయితే పైన చెప్పినవాటిలో ఎన్ని పాటిస్తానో తెలియదు కాని.. వాతావరణం విషయం లో బెంగ వచ్చేస్తుంది..దాదాపుగా పదకొండేళ్ళుగా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డానేమో ఇండియా వెళ్ళానంటే నెలకూడా ఉండలేకపోతున్నా.. అటునుండీ మళ్ళీ ఇక్కడి కొచ్చినా జ్వరాలు ,జలుబులు ఒకటి కాదు.. హూం ఎలా సర్దుకుంటానో ఏమో..
బాగా రాసారు

Raghav said...

హి హి బాగా చెప్పారు, అదేంటొ పాపం ఆక్వాఫినా నీళ్ళు తాగినా ఇంఫెక్షన్లు వస్తాయి వీళ్ళకు మరీ సున్నితం అనుకుంటా :)

హరే కృష్ణ said...

అదిరింది పోస్ట్
wonderful

పెద్ద సమోసాని తీసుకుని చిదిమి చట్నీలు పోసుకుని.. చేత్తో తిని.. పెట్టిన స్వీట్లన్నీ తినేసి.. కొత్తగా వచ్చిన ఆర్ ఐ ల మీద కామెంటుతూ ఉంటారు.. ఇది కెవ్వు కేక :)

Anonymous said...

Haa haa haaa enjoyed.

అమెరికా అనబడు త్రిశంకు స్వర్గం నుంచి వూడిపడిన వారి లక్షణాలను, ప్రవర్తనను చక్కగా సెలవిచ్చారు.
'సేల్ ' అని బోర్డు పెడితే ఈ త్రిశంకులంతా లైను కట్టేస్తారు, ఇదీ ఓ గుర్తింపు పరీక్ష.

Anonymous said...

//ఇంకా "ఓ బాయ్," చిన్న పొరపాట్లు చేసినపుడు "అ..అ "అనడం,//
' ఊప్స్ ' అని అనేవాళ్ళు, ఇపుడాపేశారా ఏమిటి?
మలసంస్మరణ ( అదేనండి ప్రతిదానికి ' షిట్ ' అని పందిలా గుర్ గుర్ లాడటం) కూడా అప్రాచ్య త్రిశంకుల ప్రధమ లక్షణం

కృష్ణప్రియ said...

@ శ్రీకర్,

నేను డిలీట్ చేశానా మీ కామెంట్ పొరపాటున?

@తెలుగు, @కుమార్, @రిషి, @ఆవకాయ, @కవిత, @వేణు, @సునీత, @రాఘవేంద్ర, @ హరే కృష్ణ,

థాంక్స్! ఇవ్వాళ్ళంతా భూమి మీద నాలుగించుల పైనే నా నడక :-)

కృష్ణప్రియ said...

@భాస్కర రామిరెడ్డి గారు

ధన్యవాదాలు! :-) మేము చివరి ఫేజ్ దాటేశాం. కాకపోతే.. ఇంకా..కొన్ని కొన్ని అక్కడి విషయాలు తలచుకోవటం, కొన్ని అక్కడి వస్తువులు జాగ్రత్త గా వాడుకోవటం, కొన్ని బిహేవియర్లు వదుల్చుకోకుండా ఉంచుకోవటం.. ఉన్నాయి లెండి.

మొన్న వేసవి సెలవలకి మేము బే ఏరియా కెళ్ళాం. 15 రోజులు హాయిగా గడిపాక వెళ్ళే రోజున.. కార్ ఎక్కేసి గాస్ స్టేషన్ లోకెళ్ళాం. అప్పుడు మా ఫ్రెండ్.. 'అయ్యో సెల్ ఇంట్లోనే వదిలేశా. ఒక్క నిమిషం వెనక్కెళ్ళి వద్దాం ' అని కార్ వెనక్కి తిప్పాడు. మా అమ్మాయి మళ్ళీ వారింటి దగ్గర కార్ ఆగుతూనే ..' మళ్ళీ వచ్చామేమిటి.. ఇండియాకెళ్ళిపోదాం!! ఇంక చాలు అనీ భోరున ఏడుపు.. 'అమ్మయ్యా అనుకున్నాం

కృష్ణప్రియ said...

@శ్రీ,

థాంక్స్! కామెంట్ మాడెరేషన్ మహిమ.. :-)

@భాస్కర్ రామరాజు,

చాలా సంతోషం గా ఉంది, థాంక్సండీ..


@సుజాత,

:-) అవును.. సగం ఎక్స్ ప్రెషన్ తో కమ్యూనికేట్ చేయటం.. ఏడాదికేనండీ.. లేకపోతే వర్క్ లో ఊరుకుంటారా? తెగ అల్లరి చేయరూ? అసలు జనవరి లో వచ్చిన మా ఎక్స్ బాస్ పకోడీ అందరికోసం పెట్టిన చట్నీ డబ్బా లో ముంచి కారుతుంటే నాకేసి.. ఎవరూ చూడలేదు కదా అని .. చూడటం చూసి ఆయనతో 'అయితే ఆఖరి ఫేజ్ లో పడ్డారన్నమాట ' అని.. తర్వాత స్టేట్ మెంట్ వివరించాక . ఇంటికొచ్చి ఈ టపా మొదలు పెట్టాను.

కృష్ణప్రియ said...

@ భావన,

అందరూ, అన్నివేళలా అని కాదు కానీ.. చాలా వరకూ ఇలాగే ఉంటారు. కొంత మంది ఎన్నాళ్ళయినా అలాగే ఉంటారు. కొంతమంది శ్రీ గారన్నట్టు విమానం దిగుతూనే అవతారం మారుస్తారు. ఏమైనా నూనె పదార్థాలని తినటం లో (ఇళ్ళల్లో ఎలాగూ డైట్ చేస్తారనుకోండి...) మార్పు, ప్రయాణాలూ, వారాంతాలు గడపటం లో చేంజ్ మాత్రం కనీసం 2 డజన్ల మందిని చూశాను :-)


కృష్ణప్రియ/

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

No need to publish my previous comment.

కృష్ణప్రియ said...

@ మాలా కుమార్ గారూ,

థాంక్స్ అండీ..

@ నేస్తం,

థాంక్స్!
ఇండియాకి స్వాగతం! మా పిల్లలు కొద్దిగా 2-3 నెలలు అనారోగ్యాల పాలయినా.. కాస్త సద్దుకున్నాక.. హాయిగా సెటిల్ అయిపోయారు..

సవ్వడి said...

చాలా బాగా చెప్పారు. నాకు ఇవేమీ తెలియదు కాని... మీరు చెప్తుంటే అలాగే ప్రవర్తిస్తారని అనిపిస్తుంది.
సో మీరు ఇప్పుడు పూర్తి భారతీయులుగా మారిపోయారు అన్నమాట.
good post..

సుజాత వేల్పూరి said...

కానీ ఒకటి మాత్రం నిజమండీ! సుఖాన పడ్డ ప్రాణం మళ్ళీ కష్టాన పడాలంటే అంత త్వరగా ఒప్పుకోదు. అందుకే అక్కడించుంచి వచ్చిన కొత్తల్లో మిగతావాటి సంగతెలా ఉన్నా,అడ్డదిడ్డంగా నడిచే ట్రాఫిక్ ని,చెత్త గతుకుల రోడ్లని మాత్రం భరించడం, చాలా కష్టం! గంటలతరబడి ట్రాఫిక్ వ్యూహంలో ఇరుక్కుపోతే ఏడుపొచ్చేసేది!

ఒకపద్ధతి ప్రకారం నడవటానికి అలవాటు పడతామేమో ఇక్కడికొచ్చిన కొత్తల్లో కొద్దిగా బాధే!

..nagarjuna.. said...

:)

కృష్ణప్రియ said...

@snkr, సవ్వడి, నాగార్జున,

థాంక్స్!

కృష్ణప్రియ/

వీరుభొట్ల వెంకట గణేష్ said...

కృష్ణప్రియ గారు:
చాలా బాగా వ్రాస్తున్నారు.
Excellent post.

కృష్ణప్రియ said...

గణేష్ గారూ

ధన్యవాదాలు! మీకు నా టపా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

కృష్ణప్రియ/

sphurita mylavarapu said...

చాలా బాగా రాసారండి. రోజుకొకసారైనా నాకు మా వారికి మధ్య చిన్న సైజు యుధ్ధం జరుగుతూ వుంటుంది...ఇండియాకి తిరిగి వెళ్ళిపోదామని నేనూ...అక్కడకి వెళితే మనం ఇమడలేమని ఆయనా...మీరు చెప్పిన చివరి వాక్యాలే నేనూ చెప్తూ వుంటాను. ఎప్పటికి అర్ధం చేస్కుంటారో మరి. నేనూ మా వారిలా, True NRI లా మారిపోకముందే వచ్చెయాలని నా తాపత్రయం...మీరు ఇచ్చిన ముగింపు చక్కగా వుంది

మైత్రేయి said...

కల:
.అదే విధం గా మనం కావాలనుకున్నప్పుడు మాత్రమే మనల్ని ఎంటర్ టెయిన్ చేసి వద్దనుకున్నప్పుడు తెర చాటుకెళ్ళే బంధుగణం..
నిజం:
వాళ్ళ వాళ్ళ రొటీన్ లో ఉన్న ఆత్మీయులు, అవసరాన్ని బట్టి ప్రత్యక్షమయ్యే బంధువులూ..

సూపర్ అబ్సర్వేషన్. అక్కడనుండి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడనుండి అక్కడికీ అంతే కదా. మనం డాలర్ షాప్ లో కొనే గిప్ట్ లకు చుట్టాలందరూ పడి పోతారనుకొంటే ఎలా?

కృష్ణప్రియ said...

@ స్పురిత,

:-) సేం స్టోరీ, ఓన్లీ నేంస్ డిఫరెంట్ .. మేమూ అలాగే నానా రకాల 'డిస్కషన్లు ' పెట్టి పెట్టి విసుగొచ్చి వచ్చేసాం. అలవాటయిన ప్రాంతం నుండి, పైగా యేళ్ళు గడుస్తున్నకొద్దీ, అనుబంధం కూడా పెరుగుతుంది కదా.. కష్టమే.. నాకు తెలిసి మా అమ్మావాళ్ళు రిటైర్ అయ్యాక సొంత ఊళ్ళో సెటిల్ అవుదామని ఎన్నోసార్లు అనుకునేవారు. రిటైర్ అయి 10 యేళ్ళు కావొస్తోంది. ఇంకా అలాగే అనుకుంటున్నారు. ఒకరోజు ముహూర్తం నిర్ణయించుకుని దూకేయటమే.. లేకపోతే..అయ్యో అనుకున్నది జరగలేదే అన్న బాధ ఉండిపోతుంది ...

@ మైత్రేయి,

ధన్యవాదాలు.. మీరు చెప్పింది నిజం.

రామ said...

చాలా బాగా రాసారు. మేము ఇండియా వచ్చేసినప్పుడు చేసే ప్రతీ పని ముందూ మీ పోస్ట్ తప్పక గుర్తు వస్తుంది :).

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;