ఒకవేళ పొరపాటున బాగా కుదిరి ఆనందం గా తిన్నా 'ఆ .. ఉల్లీ, వెల్లీ ఉంటే మా మల్లి గూడా బానే వండుతుంది ' అని తీసి పారేస్తారు. అదే నేను కాక ఇంకెవరు చేసినా 'న భూతో భవిష్యతి ' అని మెచ్చుకుంటూ తినేస్తారు. అప్పటికీ ' ఈ వంట తింటే భవిష్యత్తు లో భూతాలవుతారనా లేక భూతాలకి కూడా భవిష్యత్తు ఉండదనా ? ' అని రిటార్ట్ ఇస్తూనే ఉంటాననుకోండి.
నన్నేడిపించటానికే ఇలా మా వారు అంటున్నారని .. 'నేతి బీరకాయలో నెయ్యంత ఉందో ' వాళ్ళ మాటల్లో నిజం పాలు అంత ఉందని నా నమ్మకం. 'అబ్బే.. వేపకాయలో తీపి, వేసంగి లో చలవా, నీ వంటలో రుచి ' అని వెక్కిరిస్తూనే ఉంటారు. అయినా మా ఇంట్లో వాళ్ళకే సరైన టేస్ట్ లేదు లెండి. భోజరాజు వంటి రాజుంటే.. కాళిదాసు లాంటి కవి అప్పుడే పుడతాడు.
మా చిన్న పాప ని చూస్తే..'వచ్చీరాని మాటలు రుచీ, ఊరీ ఊరని ఊరగాయ రుచీ' అని ఎందుకన్నారో తెలుస్తుంది.. కాకపోతే ముద్దొచ్చిన్నప్పుడే చంకెక్కాలని దానికి తెలుసు. .ప్రేమ గా ఏం వండిపెట్టనూ అంటే వెన్నతో అట్టేయమనే రకం!! అదీ ఆ తాను ముక్కేగా? పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు తండ్రి పోలికలు బానే పుణికి పుచ్చుకుందది. చిన్నప్పటినించీ ఇంట్లో ఏం వండినా సొక్కదు. వంక పెట్టకుండా తిననే తినదు.
వాశిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే, కారెడ్ల కామక్క వంకాయల భారం తూగిందట. అలాగ నేనేం తక్కువ అని మా పెద్దమ్మాయికీ అదే గొడవ. దానికెప్పుడూ పొరుగింటి పుల్లకూరే రుచి! అది చాలదన్నట్టు శుభ్రం గా కంచం ఖాళీ చేసి రామాయణం అంతా విన్నాక రాముడికి సీతేమవుతుందన్నట్టు.. 'నేను తిన్నది ఏంటి? ' అని అమాయకమ్మొహం వేసుకుని అడుగుతుంది!! అద్దం అబద్ధం చెప్పదు.. దానికి వంట నచ్చిందనటానికి, కడిగేసినట్టున్న దాని కంచమే సాక్ష్యం. రైల్లోకి టిఫిన్ బాక్సు కట్టినా 'రామేశ్వరానికి పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టు చూస్తుంది నావైపు.
అగ్ని కి ఆజ్యం పోసినట్టు, తండ్రి వంటంటే చెవులు కోసుకుంటారు పిల్లలు!! ఇక నా పరిస్థితేమో .. అత్త కొట్టినందుకు కాదు. తోటి కోడలు నవ్వినట్టు ' తయారవుతుంది.
ఆడలేక మద్దెల వోడన్నట్టు, నాకు చెదిరిన వంటలకి, ముదిరిన కూరగాయల వంకా, పులిసిన పెరుగు వంకా, కుదరని వంట పాత్రల వంకా పెడతాను లెండి.
అందుకే 'అడుసు తొక్కనేల? కాలు కడగనేల' అనుకుని ఒక్కరోజూ..వంటెలా ఉందీ.. అని అడిగి, 'కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకోవటం ' ఎందుకని పెద్దగా ఫీడ్ బాకులు అడగను. కానీ వంకలు పెట్టకుండా తినాలంటే మన కిటుకుల సంచీ లోంచి తీసిన చిట్కా..'ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు..'
'చేత కానమ్మకి చేష్టలెక్కువ ' అని కాస్త గార్నిషింగులు చేసేస్తే సరి!! ఆవురావురుమంటూ తినక ఏం చేస్తారు? మూల విగ్రహానికే ఈగలు దోలుతుంటే,.. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగినట్టు, రోజూ వారీ వంటకే దిక్కు లేదు ఇక పిండివంటల సంగతి చెప్పనక్కరలేదు.
ఆ.. నేను పట్టించుకుంటే గా!!!!.. హెచ్చు గా పేలున్న వాళ్ళకు, హెచ్చుగా అప్పులున్నవాళ్ళకు దురదలేదు.వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్ల దాగిన వాడిని చావ మోదినట్టు మా వారినే దెప్పుతూ ఉంటాను లెండి. అయినా పిల్లలు 'చీ బావుళ్ళేదంటే.. '
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు! మా ఫ్రెండ్ భర్త.. ఇంట్లో చూరు నీళ్ళు తాగి, బయటకొచ్చి చల్ల దాగి వచ్చానని చెప్పుకునే రకమైతే.. బయట అంతా నా వంట గురించి గొప్ప గా చెప్పుకుంటుంటే.. నా పరిస్థితేమో ఇంట ఈగల మోత, బయట పల్లకీ మోత అయింది :-(
అయినా ఒక ఊరి కరణం ఇంకో ఊరి వెట్టి ట.. మా అమ్మ ఊరెళ్ళితే.. మా నాన్న గారు నానుబాయి గా అన్నం వండి పెట్టినా పొగుడుకుంటూ తినేవారు..
ఏం చేస్తాం ? కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు లెండి.. మా ఇంకో స్నేహితురాలైతే.. టీ కూడా వంటావిడ తోనే పెట్టిస్తుంది.
మొన్నేమైందో తెలుసా?
కల కాలపు దొంగైనా ఏదో ఒకనాడు దొరుకుతాడంటే ఏంటో అనుకున్నాను కానీ,
నా విషయం లో రుజువయ్యింది!! మొన్నీ మధ్య మా స్నేహితులొక్కరు ఆకస్మికం గా ఫోన్ చేసి, భోజనానికొచ్చేయండి ' అని పిలిచింది. 'అయ్యో వంట మొదలు పెట్టానే.' అంటే..'చేసినంత తెచ్చి, సగం చేసింది ఫ్రిజ్జిలో పడేసి వచ్చేయ మంది. గుత్తి వంకాయ కూర బాక్స్ లో పెట్టుకుని బయలు దేరాను. మరి మా వారికీ సంగతి తెలియదుగా.. అక్కడ భోజనం చేస్తూ.. 'అబ్బా.. పద్మజ గారూ, అన్ని వంటకాలొక ఎత్తు! ఈ గుత్తి వంకాయ ఒకెత్తు.. క్రిష్నా.. కాస్త రెసిపీ తెలుసుకోవచ్చు గా' అనేసారు. సదరు పద్మజ ఇచ్చిన అదోరకమైన ఎక్స్ ప్రెషన్ చూసి.. పాపం ఆయన కేం అర్థం కాలేదు..
తర్వాత ఏం జరిగిందో .. మీ ఊహకే వదిలేస్తున్నాను !!! :-)))))
Blog Author' s note:
ఇది నా కథ కాదు. :-) మా ఇంట్లో అందరం ఏది బడితే అది హాయిగా తినేసే రకాలే.. ఊర్కే బోల్డు సామెతలు వాడి ఏదైనా రాయాలని చేసిన ప్రయత్నం ... 32 సామెతలు వాడాను. కాకపోతే చివరి పారా మాత్రం నిజం గా జరిగిందే!!