Wednesday, September 21, 2011

వావ్! నేను తెల్లవారుఝామున కన్న కల నిజమైంది....



విజయ గర్వం తో జై జై ద్వానాల మధ్య.. నాలుగు వైపులా జనాలు కరతాళ ధ్వనులు.... ఒక చేతిలో ఖడ్గం.. రెండో చేతిలో రథం పగ్గాలు. రథాన్ని ఆపి శిరస్త్రాణం తీసి,కవచాన్ని వదులు చేసి దిగాను. నా చేతిలో ఉన్న వస్తువుల్ని ఇద్దరు ముగ్గురు అందుకున్నారు.. దుమ్ముకొట్టుకుపోయిన,అక్కడక్కడా చిరిగిన బట్టలు, చిన్నపాటి గాయాలు. జుట్టు చెదిరి, వొళ్లు నొప్పులు .. బురద తో నిండిన పాదరక్షలు.. వెనక్కి తిరిగి చూశాను. చాలా మంది ఇంచుమించు నాలాగే.. యుద్ధం లొ పోయిన వారు పోగా.. కొందరు క్షతగాత్రులై చికిత్సా శిబిరాలకి తరలి వెళ్లిన వారు కొందరైతే.. రథాలు విరిగి, వాహనాలకి, శరీరాలకి గాయాలయినా.. కొండలూ, కోనలూ, నదులూ దాటి, విజయాన్ని చేజిక్కించుకుని ఆనందం చిందుతున్న మొహాలతో నా వాళ్లు నా వెనక..



‘కృష్ణా..లే.. మళ్లీ లేటయింది అని గోల పెడతావు.. నువ్వు లేస్తే కానీ.. పిల్లలు లేవరు’ అని మా వారు.. ‘ఆహా! ఇదంతా కలయా!..తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమౌతాయంటారు.ఐతే ఇవ్వాళ్ల యుద్ధం చేస్తానా? రాత్రంతా వర్షం కురిసినట్టుంది.. సరే లే జీవితమే ఒక యుద్ధం.... ‘ అనుకుంటూ లేచి పనుల్లో పడ్డాను.

ఎవరితో అవుతుంది యుద్ధం? అత్తగారితో.. ఆవిడకా ఓపిక లేదు. నాకా తీరిక లేదు. పిల్లలతో, పక్కవాళ్ళతో,పని మనిషితో.. పాలు పోసే అబ్బాయితో.. మా వారితో.. ఫోన్లో స్నేహితులతో.. ఇలా సరదాకి..ఎవరితో అవవచ్చో ఆలోచించాను.

బాసు తో యుద్ధం అవుతుందేమో.. ఇవ్వాళ్ల.. లేక మా సింగం,నేనూ కలిసి టెస్ట్ టీం వాళ్లతో గొడవ పడం కదా.. అనుకుంటూ బయటకి స్కూటర్ తీశాను.. హెల్ మెట్, జాకెట్ వేసుకుని రివర్స్ చేస్తున్నాను. DRDO లొ సైంటిస్ట్ ఆవిడ కార్ లొ వెళ్తూ నా వైపు పలకరింపు గా చూసి నవ్వి..’ఏంటి? వర్షం రాత్రంతా వర్షం! స్కూటర్ మీద వెళ్తున్నారా? జాగ్రత్త!’ అంది. కొద్దిగా జంకు గా అనిపించింది కానీ ఎక్కుబెట్టిన రామ బాణాన్నీ, ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక వెనక్కి తిప్పే ప్రశ్నే లేదు.




కాస్త మెయిన్ రోడ్డెక్కా.. ఒక ఇరవై నిమిషాల తర్వాత పావు కిలో మీటర్ నడిచి ఆగింది బండి.. పర్వాలేదు.. ఇవ్వాళ్ల పెద్దగా ట్రాఫిక్ లేదు.. అనుకుని బండి పార్క్ చేశా నడి రోడ్డు మీద. పక్క స్కూటర్ ఆయన ఎవరితోనో.. ఫోన్లో కబుర్లు చెప్తున్నాడు.. ముందు మోటార్ సైకిల్ ఆయన షేవింగ్ కిట్ తీసి గడ్డం గీస్తున్నాడు. ఇంకో ఆవిడ హెల్ మెట్ తీసి దాంట్లో పాకెట్ లోంచి సన్నజాజులు గుమ్మరించి మాలలు కడుతోంది. నేను బ్యాగ్ తీసి చూస్తే.. ట్రాఫిక్ జాముల్లో చదువుకునే పుస్తకం కనపడలేదు. పోన్లే.. కాసేపు యోగా చేద్దాం అని మొదలు పెట్టాను.


కాసేపయ్యాక ఒక్కసారి గా హారన్ లు కొడుతున్నారు. ‘హమ్మయ్య.. ఇంకో రెండు ఇంచులు ముందుకెళ్లచ్చు.. అని మళ్లీ స్కూటర్ ఆన్ చేసి రెండించులు ముందుకెళ్లి ఆగి అటూ ఇటూ చూస్తున్నా రాత్రి మీటింగ్ అర్థ రాత్రి దాకా అయ్యింది. ఒక్క కునుకు తీద్దామా? అని కాస్త సెంటర్ స్టాండ్ వేసి బ్యాగ్ దిండు లా అడ్జస్ట్ చేస్తుంటే ‘హాయ్ కృష్ణా!’ అని మా ఎదురింటావిడ కార్ లోంచి పిలుస్తోంది. సరే కబుర్లేసుకోవచ్చు.. అని ఉత్సాహంగా ఆవిడ విండో దగ్గరకెళ్లి ఈ ఆదివారం చూసిన ఈ టీ వీ సుమన్ సినిమా ట్విస్ట్ కథ మొదలు పెట్టా.. ఆవిడ..’కృష్ణా! యూట్యూబ్ లొ ఉందన్నావు గా.. చూస్తాలే’ అని రెండు చేతులూ జోడించి దీనం గా అడిగింది. ‘అమ్మా! ఆశ! నువ్వు మళ్లీ ఇంత తీరిగ్గా దొరుకుతావా?’ అని మొదటి భార్య ఎంట్రీ దాకా చెప్పా.. మరి మొన్న వాళ్లింట్లో తమ్ముడి పెళ్లి ఫోటోలు దాదాపు ఏడు వందలు చూపించినప్పుడో?

 
ఇంతలో ఏ కమ్యూటర్ చేసిన వ్రత ఫలమో..అక్కడ ఆక్సిడెంట్ తాలూకు శకలాల్ని తొలగించి వదిలినట్టున్నారు.. ముందు నుండి ఒక హారన్ మోగింది.. అందరూ ఉత్సాహం గా బోయ్ బోయ్ అని ఒకటే మోత. ఒకేసారి అందరూ బండ్లు ముందుకురికించారు.


కళ్ళు మూసి తెరిచేలోగా అన్ని వైపులనుండీ బండ్లు... ముందుకు దూసుకుపోతున్నాయి. దుమ్ము మేఘం లా చుట్టూ దట్టం గా..
స్కూటర్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, కార్లు, టెంపో ట్రక్ లు, వాన్లు, బస్సులు, లారీలు, ఒకటేమిటి.. మధ్యలో పాదచారులు, వీళ్లు చాలదన్నట్టు మహా నగర సింహాలు (అవేనండీ గ్రామ సింహాలు/శునక రాజాలు) ఆవేశం తో రోడ్డు మీద.. బరి లోకి ముందడుగు వేస్తున్నాయి..




అదేదో యుద్ధం శంఖారావం ముందున్న సైన్యాధ్యక్షుడు చేయగానే.. సైన్యం అంతా వారి వారి శంఖాలు పూరించి శూలాలు పట్టుకుని వెళ్లే పాదచారులు, గుఱ్ఱాల మీద వెళ్లే వారు (ఆశ్వారూడులు), ఏనుగుల పై వెళ్లేవారు, రథాలనధిరోహించి రథ సారథి పై ఆధారపడి బాణాలూ అవీ సరి చూసుకునేవారు ముందుకి ఉరకలేస్తూ వేగం గా వెళ్తున్నట్టు..


ఒక్కసారి గా బల్బ్ వెలిగింది ఉదయపు కల నిజమైంది అని అర్థమైంది. టపటపా కన్నీళ్లు కారిపోయాయి. జ్ఞాన/ఆనంద/దుఃఖ భాష్పాలు కావవి.. దుమ్ము వల్ల కలిగిన కాలుశ్య భాష్పాలు. తుడుచుకుందామంటే శిరస్త్రాణం లోకి చేయి పెట్టి తుడవాలి. ఒక Ford I10 కీ, వాల్వో బస్సుకీ మధ్య ఉన్న అరమీటర్ గాప్ లోంచి అతి లాఘవం గా బండిని ఇరికించి ఇద్దరు డ్రైవర్ల చూపులూ, అరుపులూ, హాంకులూ విననట్టు, చూడనట్టు, నటిస్తూ ముందుకెడుతూ ఆలోచిస్తున్నా.. ఎలాగోలా ఇంటర్వ్యూ కాండిడేట్ వచ్చే సమయానికి చేరుకుంటే చాలు..



ముందు ఒక కాల్ టాక్సీ శకటం వెళ్లి ఒక ద్విచక్ర వాహనాన్ని స్పృశించింది. ఒక చిన్న పాటి గొడవ ని పట్టించుకోకుండా..శకటం దెబ్బ తింది. ద్విచక్ర వాహన చోదకుడి కాలి కి గాయం తగిలి రక్తం కారుతోంది.. కరుణ తో కూడిన ఒక చూపు అరసెకను వారి వైపు విసిరి ముందుకేగుతూనే ఉన్నా. రింగు రోడ్డెక్కా! అన్ని దేశాల సైన్యం చిన్న చిన్న దారుల ద్వారా వచ్చి ప్రధాన రహదారి లొ కలిసినట్టు.. రోడ్డు రంగు కనిపించట్లేదు. అన్నీ వాహనాలే.








ఇంకా ఎక్కడైనా గాప్ దొరుకుతుందా అని చూస్తున్నా.. అబ్బే.. లాభం లేదు. చుట్టూ దుమ్ము మేఘం పలచబడుతోంది. గుండె లబలబ లాడింది.. ‘అంటే..మళ్లీ ట్రాఫిక్ జామా! అయ్యో!! పోన్లే బాబాయి కి ఫోన్ చేసి రెండు నెలలవుతోంది.. ఇప్పుడు చేసేస్తే సరి!’ అనుకుంటున్నా.. ‘అదేంటి? ఆ చివర జనాలు పోతున్నారే! అసలు అక్కడ మాత్రం ఖాళీ ఏదబ్బా!’ అని బండి ని అటువైపు ఉరికించా.. చూస్తే.. రోడ్డు పక్క ఉన్న కాలువ పైన రెండు బండలు వేసి అప్పటికప్పుడు తాత్కాలికం గా వేసిన అడ్డ రస్తా! మీద ఒక్కొక్కరు గా కాలవ దాటి సర్వీస్ రోడ్డు మీదకి చేరుతున్నారు. అద్భుతమైన టీం వర్క్! చాలా ఆనందం వేసింది. నేనూ వెళ్దామని చూశా.. కానీ.. కొద్దిగా భయం వేసింది. స్కూటర్ తూలితే.. మురికి కాలవ లోకే! కార్ల వారు, బస్సుల వారు ఇదంతా ఈర్ష్య గా చూస్తున్నారు.


నా వెనక శంఖారావాలు తారా స్థాయికి అందుకున్నాయి. వెనక్కి చూస్తే.. ‘ఆ వంతెన ఎక్కవేం!! ‘ అని కొందరు చూపులతో గద్దిస్తే.. కొందరు చేతులతో మార్గ నిర్దేశన చేస్తున్నారు. నేను వెళ్తే గాని వెనక వారు వెళ్ళలేరు. సరే అని నా వెనక బండాయన దిగి నా స్కూటర్ పడకుండా చూస్తానని మాటిచ్చాడు. బండ ఇలా ఎక్కానో లేదో..ఒక చక్రం ఇరుక్కుపోయింది. నలుగురు వచ్చి తీసి మళ్లీ రింగు రోడ్డు మీదకి తెచ్చేశారు. ఈలోగా.. ఇంత సాహసం చేసి బ్రిడ్జ్ కట్టి మరీ సర్వీస్ రోడ్డు మీదవెళ్లిన జనం మళ్లీ తిరిగి వస్తున్నారు. ముందు అంతా పైప్ లైన్ కోసం తవ్వేశారు ట. లాభం లేదట.


చతుర్చక్ర వాహన చోదకులు ‘బాగా అయింది!’ అన్న లుక్కు ఇచ్చి సంతృప్తి గా నిట్టూర్చారు. కానీ పట్టు వదలని విక్రమార్కులు ద్వి.చ.వా.చోలు (ద్విచక్ర వాహన చోదకులు) డివైడర్ మీద కెక్కించి ఎదురుగా వస్తున్నా ట్రాఫిక్ వైపు వెళ్దామని ప్రయత్నిస్తున్నారు.


ఇంతలో మళ్లీ శంఖారావం మ్రోగింది. అందరూ.. మళ్లీ ముందుకు.. ఒక్కసారి గా మళ్లీ ప్రకృతి పరవశించి, దుమ్ము మేఘం వెలిసింది, బురద ఫౌంటెన్.. చిమ్మింది. ప్లెయిన్ చుడీదార్ మీద మంచి డిజైన్లు ఏర్పడ్డాయి. చెప్పులు మీద చాక్లెట్ కోటింగ్ లా బురద చేరింది. ఏం చేస్తాం.. కొంతమంది అభినవ కర్ణులు తమ బండ్ల చక్రాలు బురద లొ కూరుకుపోయాయి. పక్క బండి వాడి బూటు కాలు కొట్టుకుంది. ‘ఒక్క సారి గా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు..’.. ఈ సినిమాల్లో ఎన్ని దెబ్బలు తిన్నా.. ఎలా మళ్లీ లేచి ఫైట్ చేస్తారబ్బా! అనుకున్నాను. అవున్లే..ఉత్తుత్తి నే తంతే అంతే.. పైగా లేచేదాకా.. కర్ణ కఠోరంగా స్పూర్తిదాయక గీతాలు పాడుతుంటే ఆపటానికైనా లేవాలి తప్పదు.

అభినవ భీష్మాచార్యులు ట్రాఫిక్ పోలీసు నిస్సహాయం గా చూస్తున్నారు.



మరీ మడమలు దాటెంత ఎత్తు వర్షపు నీరు. అయ్యప్ప స్వామి లా లూనాల వాళ్లు కాళ్లు పైకెత్తేసారు. నేను ఒక అడుగు పైకి కాళ్లు పెట్టి ముందు వెళ్తున్న స్కూటర్ వెనకే జాగ్రత్త గా వెళ్తున్నా.. ముందర ట్రాఫిక్ మళ్లీ ఆగింది. అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు. విధిగా ఆగి ప్రోగ్రెస్ చూసి ప్రతి ప్రయాణికుడూ/రాలూ తరించాలి గా.. చిన్న గాప్ ఉంది ఎదురుగా.. పడతానా? పట్టనా? భయం గానే ఉంది. వెనక బండి అతను హాంక్ చేస్తున్నాడు. ఇంకో నిమిషం ఆగితే దిగి హారన్ బదులు నన్ను కొడతాడేమో అని భయం వేసింది. గాప్ ఇచ్చిన వాడు గమ్యం చేర్చక పోతాడా అన్న ధీమా తో.. ముందుకు వెళ్లాను. డివైడర్ మీద ముళ్ల కంప గీరుకుని కమీజ్ పక్క కొర్రు, చేతి మీద ఎర్ర రక్తపు చార.. కనీసం ఇంకో నాలుగు మీటర్లు ముందుకొచ్చాం సంతోషం..పక్క బండి మీద వారు ఎవరో ఏసుక్రీస్తుకి మొక్కుకుంటున్నారు.. నేనూ ‘ఆమెన్’ అని నా దేవుళ్ళు రామ కృష్ణులని పూజించుకున్నా.


ఈలోగా అందరూ మెయిన్ రోడ్డు పక్కన గ్రామం లోంచి వెళ్తే బెటర్ అని అటుపోతున్నారు. నేనూ ఒక్క క్షణం ఊగిస లాడా.. కానీ.. మెయిన్ రోడ్డు మీద, అందునా రింగు రోడ్డు మీద, బురద లొ మునిగి, గాయం అయి, బట్టలు చిరిగి దుమ్ము కోటింగ్ తో ఉన్నా.. ఇంక చిన్న గుంతల రోడ్డు మీద వెళ్లి కొత్త సమస్యలనెదుర్కునే మానసిక స్థైర్యం, శారీరక బలం లేక వదిలేశా. ఇంకో అరగంట తర్వాత ఇంకో రెండు కిలో మీటర్ల దూరం వెళ్లాకా చూస్తే అర్థమైంది. నేను తీసుకున్నది సరైన నిర్ణయమని. అక్కడ రైల్ ట్రాక్ దాటాలి. రైలోస్తుంటే.. ఆఫీస్ తొందరలో ఎవరో దాటాలని పట్టాల కింద పడ్డారట! దానితో.. మళ్లీ అటు డీ-టూర్ అయిన జనాలు మా వెనక కలిసారని. బాధ తో హృదయం నిండి పోయింది.


ఉక్క గా.. చెమట గా కాసేపు హెల్ మెట్ తీద్దామని తీసి చేత్తో పట్టుకున్నా.. మళ్లీ శంఖారావం. దుమ్ము మేఘం.. బురద ఫౌంటెన్.. అలాగే ముందుకు పరిగెత్తిస్తున్నా బండి ని.

 
మా ప్రార్థనలు కాస్తా పొరపాటున వరుణ దేవుడు విన్నట్టున్నాడు..ఆయన కరుణించాడు. ఒకేసారి ఫెళ్ళున వాన. ‘వామ్మో నా లాప్ టాప్’ అనుకుని ఒడుపు గా జాకెట్ తీసేసి లాప్ టాప్ బాగ్ మీద కప్పి హెల్ మెట్ పెట్టేసుకున్నా. ముందరేమవుతుందో తెలియదు. వెనక్కెళ్ళటానికి లేదు. ఎవరో అండర్ పాస్ కోసం తవ్విన గుంట లొ పడ్డారని అంటున్నారు. ‘అయ్యో’ అనుకోవటం తప్ప చేసేదేదీ లేదు. వర్షం వల్ల గుంటల్లోకి ధబ్ ధబ్ మని పడుతూ లేస్తూ మా ఆఫీస్ గేట్ దగ్గర కి చేరుకొని ఆత్రం గా షెడ్ కిందకి వెళదామంటే.. ‘అబ్బే! మా సెక్యూరిటీ వాళ్లంత కర్తవ్య నిష్ఠ కలిగిన వారు యావద్ప్రపంచం లొ ఉండరాయే. నిజమే.. ఈ ట్రాఫిక్ వల్ల ఉన్న ఆవేశం తో బిల్డింగ్ కూల్చేస్తే! చెప్పలేం..

అసలు ఈ నోబుల్ పీస్ ప్రైజులు, సెయింట్ హుడ్లూ, మఠాలకి పీఠాధిపతుల పోస్టులూ గట్రా ఇచ్చే ముందు ఈ ట్రాఫిక్ టెస్ట్ చేసి చూడాలి. ఈ ట్రాఫిక్ లో ఒక్క తిట్టు వాడకుండా, ఒక్క రూలైనా బ్రేక్ చేయకుండా.. చిరునవ్వు చెదరకుండా, ప్రశాంత చిత్తం తో ఐదు కిలో మీటర్లు రెండు గంటల్లో ప్రయాణం చేస్తేనే ఇవ్వాలని.. ఏమంటారు?


ఆ వర్షం లొ బ్యాగ్ లోంచి ఐడీ కార్డ్ తీసి చూపించి ముఖాన్ని మాచ్ చేయటానికి హెల్ మెట్ తీసా.. సెక్యూరిటీ వాళ్లు నా బ్యాగ్ లో ఏమైనా మారణాయుధాలు తెచ్చానేమో అని చూస్తున్నారు.. వెనక్కి తిరిగి చూశా..




అచ్చం నా కల లాగానే!!!




ఒక చేతిలో ఖడ్గం.. రెండో చేతిలో రథం పగ్గాలు. రథాన్ని ఆపి శిరస్త్రాణం తీసి,కవచాన్ని వదులు చేసి దిగాను. నా చేతిలో ఉన్న వస్తువుల్ని ఇద్దరు ముగ్గురు అందుకున్నారు.. దుమ్ముకొట్టుకుపోయిన,అక్కడక్కడా చిరిగిన బట్టలు, చిన్నపాటి గాయాలు. జుట్టు చెదిరి, వొళ్లు నొప్పులు .. బురద తో నిండిన పాదరక్షలు.. వెనక్కి తిరిగి చూశాను. చాలా మంది ఇంచుమించు నాలాగే.. యుద్ధం లొ పోయిన వారు పోగా.. కొందరు క్షతగాత్రులై చికిత్సా శిబిరాలకి తరలి వెళ్లిన వారు కొందరైతే.. రథాలు విరిగి, వాహనాలకి, శరీరాలకి గాయాలయినా.. కొండలూ, కోనలూ, నదులూ దాటి, విజయాన్ని చేజిక్కించుకుని ఆనందం చిందుతున్న మొహాలతో నా వాళ్లు నా వెనక..


































49 comments:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

బావుంది. మంచి పోలికే :)
మీరుండేది బెంగుళూరని మరొక్కసారి చెప్పినట్టయ్యింది.

మా హైదరాబాద్ లో మరీ అంత బాడ్ కాదు. ఒకవేళ మరీ ట్రాఫిక్ ఎక్కువవుతున్నట్టుంటే ఎంచక్కా బందులూ అవి చేసేసికుంటాం ;)

సిరిసిరిమువ్వ said...

:)..బ్రేవో!

లత said...

చాలా బావుంది
ఈ ట్రాఫిక్ లో డ్రైవింగ్ అంటే నిజంగా యుద్ధమే కదా, అందుకే ముందే మీకు కల వచ్చేసింది.

Anonymous said...

Superb........A real life scenario
Rams...

Anonymous said...

చాలా బాగుంది. రొజూ మనం చేసే ట్రాఫిక్ యుద్దాలలో ఇంత కవిత్వం దాగుందా!!! మీరు చేప్పేవరకు గమనించనేలేదు.

కాముధ

sunita said...

>>మరి మొన్న వాళ్లింట్లో తమ్ముడి పెళ్లి ఫోటోలు దాదాపు ఏడు వందలు చూపించినప్పుడో? >>

ప్చ్..ట్రాఫిక్ కష్ఠాలు.

Krishna said...

చాలా బాగా రాసారు ట్రాఫిక్ కష్టాలు.
అలాంటి ట్రాఫిక్ అనుభవాలు ఇక్కడా, బయటి దేశాల్లోను ఎదుర్కొన్నప్పుడు కింది శ్లోకం గుర్తుకువచ్చేది...

న కాంక్షే విజయం కృష్ణా! న చ రాజ్యం సుఖాని చ !
కిం నో రాజ్యేన గోవిందా! కిం భోగైర్జీవితేన వా !

మనసు పలికే said...

హహ్హహ్హా.. కృష్ణప్రియ గారూ.. నవ్వలేక చస్తున్నా;);) టపా ని ఎలా పొగడాలో అర్థం కావట్లేదు. అద్భుతం అంతే. అసలు బస్సులూ కార్లూ మోటర్ బైకులూ అన్నీ కప్పేస్తూ ఉండే అధునాతన రోడ్లెక్కడ.. శంఖాలు, గుర్రాలూ, సైన్యాలు ఉండే యుద్ధ భూమి ఎక్కడ. అసలు మీ ఊహాశక్తికి ఏమిచ్చి జేజేలు చెప్పగలను. అద్భుతమైన పోలిక.. :))))

రాజేష్ మారం... said...

Excellent .... :)

మీ... నోబుల్ పీస్ ప్రైజు అయిడియా మాత్రం సూపర్.. I Vote for that ...

మధ్య వరకి చదివిన తర్వాత, మొదటి పేరా .. మళ్ళీ చివరి పేరా గా ఉంటె హిట్టనుకున్న... అలానే ఉంది :)

సూపర్ హిట్...

Kathi Mahesh Kumar said...

:) :) :) 1/2

Anonymous said...

అద్భుతంగా రాశారు.

Ruth said...

వా... నేను బ్లాగుల్లో నా రెండో ఇన్నింగ్స్ నా హైద్ ట్రాఫిక్ కష్టాలతో మొదలెడదామని ఎప్పట్నుంచో అనుకుంటుంటే మీరు రాసేసారు ....... అసలు నేను పేరుకూడా అనేసుకున్నాను " నా దారి అడ్డదారి" అని.... ఈ లోగానే మీరు తొందర పడాలా?
@ Week end గారు, ఏంటీ, హైదరబాదు బెటరంటారా? మీరు ఎప్పుడైనా week Days లో కూకట్పల్లి నుంచి JNTU,MMTS స్టేషన్ మీదుగా మాధాపూర్ వెళ్ళి ఈ మాట అనండి మళ్ళీ అప్పుడు ఒప్పుకుంటాను !

Mauli said...

మీ 'కల' నిజమయ్యిన౦దుకు క౦గ్రాట్స్ ;-)

చాణక్య said...

అద్భుతం, అమోఘం లాంటి పొగడ్తలు స్వీకరిస్తానన్నారుగా. తీసుకోండి. ఇంక చెప్పేదేముంది. ఎప్పట్లాగే అదరగొట్టేశారు. మొత్తానికి కల నిజమయ్యింది. అందుకే ఇంకెప్పుడూ ఇలాంటి కలలు కనకండి. ; )

..nagarjuna.. said...

హహ్హహ్హ... ఇప్పటికే నోబెల్ కమిటివాళ్లు తలపట్టుకుంటున్నారు సరైన వ్యక్తులు దొరకడంలేదని. ఇప్పుడు మీరిలాంటి ఫిట్టింగ్ పెడితే వాళ్ళెమైపోనూ !!

@రుత్‌గారుః హైదరాబాద్‌లో ఏ రెండు మూడు చోట్ల (చాదర్ఘాట్, అబిడ్స్, పజగుట్ట.....) తప్ప అంతగా ట్రాఫిక్ ఉండదండీ. బెంగళూర్ అలాక్కాదు సిగ్నల్ సిగ్నల్‌కు ట్రాఫిక్ జాములే..

Anonymous said...

కృష్ణ ప్రియ గారు ఏమోనండీ ! మీరు మరీ భయపెట్టేస్తున్నారు. సెలవుల్లో అయినా సరదాగా మీ ఊరు రాకుండా చేసేస్తున్నారు

మాలా కుమార్ said...

ట్రాఫిక్ కష్టాలు మేమూ అనుభవించాము కాని మరీ ఇంతలా కాదు .
ఐతే మీ అత్తగారికి ఓపికా , మీకు తీరికా వుంటే ఆవిడతో యుద్దం చేసేవారన్నమాట :)

said...

బెంగలూరు లో బండి తోలితే, రోజు గని కార్మికుల(సిమెంటు కార్మికుల?) లాగ తయారవుతాము.

మా ఇంటి నుంచి ఆఫీసు కి నాల్గు కిలో మీటర్లు, దానికే నాకు వెళ్ళే దారి ఒకటి,ఒచ్చే దారి ఒకటి. మధ్యలో ఏదో DPRL ప్రాజెక్ట్ అని సర్వీసు రోడ్డు మొత్తం తోవ్వారు. ఆ బురదలో నుంచి దాటి మట్టి బురద పూసుకొని ఆఫీసు కి వెళుతున్నాను.

Anonymous said...

నవ్వించి, నవ్వించి చంపేస్తున్నారండి. హైదరాబాదులో ఒక్కోసారి ట్రాఫ్ఫిక్ జామ్ మధ్యలో ఒక మాంచి యెండమూరి నవల పూర్తిచేయడమో లేక ఒక కునుకు తీయడమో నిస్సందేహంగా చేయొచ్చు. భలేగా వుంది మీ కథనం. థాంక్స్ నవ్విన్చేస్తున్నందుకు.

Srikanth Eadara said...

:))

జేబి - JB said...

అసలు ఇలాంటి పోలిక పెట్టచ్చ్హని ఎపుడూ అనుకోలేదండీ! అదిరింది.

లూనావాళ్ళేకాదు, నాలాంటి హోండా చోదకులుకూడ కాళ్ళు ఎత్తుతారు. చిన్నపుఢూ స్టార్ స్పోర్ట్స్ లో డర్ట్ రేసులు చూసినపుడు కలిగిన కోరికలు ఇపుడు తీర్చుకుంటున్నా!

kiranmayi said...

అంటే? అత్తగారికి ఓపికుంటే చేసేసేవారా యుద్ధం?
నాకు నచ్చినవి:
ట్రాఫిక్ జామ్ లో బాబాయి కి ఫోన్
ప్రకృతి పరవశించిన పారాగ్రాఫ్
గ్యాప్ ఇచ్చిన వాడు ....
నోబుల్ పీసు ప్రైజ్ పారాగ్రాఫ్

Ennela said...

kRshna garuu,
meeru marchipoyyaaraa? naa list lo mee peru ledemo anukuni naato yuddam chesesaarugaa..idi rendo yuddam annamaata!!!!
ammo! ilaanti kalaloste inka bhayapadaalsinde!!!!

శ్రీ said...

భలే సరదాగా ఉంది.

స్నిగ్ధ said...

కృష్ణ గారు కేకో కేక...మా ఆఫిస్ వాళ్ళది కేబ్ ఉంది కాబట్టి సరిపోయింది..లేదంటేనా వామ్మో తలచుకుంటే భయమేస్తోంది...
అత్తగారితో.. ఆవిడకా ఓపిక లేదు. నాకా తీరిక లేదు. >>హి హి హి..
మొత్తానికి మీ ఆఫిస్ కి జయప్రదంగా చేరి మీ కల నిజం చేసుకున్నందుకు బ్రేవో...మరే బెంగళూరా మజాకా..

కృష్ణప్రియ said...

@ WP,

మా బెంగుళూరు ట్రాఫిక్ మీద హైదరాబాదు బెటర్ అంటారు.

నిజమే మీరు బందులూ అవీ చేసుకుంటారు.. మా బెంగుళూరు వారు గనులు తవ్వుకున్నా, రోడ్లు తవ్వుకున్నా.. ముఖ్యమంత్రులు మారినా.. పెద్దగా సమ్మెలూ, బందులూ చేయరు ఏంటో.. :-(((

@ సిరిసిరి మువ్వ,

:) థాంక్స్!

@ లత,

అవునండీ.. వర్షం ..అదనపు ఆకర్షణ :)

కృష్ణప్రియ said...

@ Anon,
 ధన్యవాదాలు!
@ కముధ,
 మొదటి సారనుకుంటా ఇటు రావటం! స్వాగతం
@ సునీత,
మరే! పైగా.. ఫోటోల్లో ప్రతి ఒక్కరూ, వేరే వారికి ఏమవుతారో చెప్తూ... (
@ కృష్ణ,
 Do I know you?

కృష్ణప్రియ said...

@ అపర్ణ,
థాంక్స్!
@ రాజేష్ మారం,
కదా! నోబుల్ ప్రైజ్ ఐడియా ని మనం సోషలైజ్ చేద్దాం. 
@ మహేశ్ కుమార్,
థాంక్స్! మళ్లీ రేటింగ్ తగ్గినట్టుంది.

@ రుత్,
అయ్యో మీరు రాసేయండి. సీత కష్టాలు సీత వి, పీత కష్టాలు పీతవి అన్నారు పెద్దలు. బెంగుళూర్ కష్టాలు హైదరాబాద్ కష్టాలు వేరే గానే ఉం

కృష్ణప్రియ said...

@ పక్కింటబ్బాయి,
థాంక్సండీ.. 
@ మౌళి,
 నిజమవ్వాలనుకున్న కల కాదు బట్ ఓకే.. ఈసారి మంచి కలలు కనాలనుకుంటున్నా..
@ చాణక్య,
మీ ఇష్టం.. ఎన్ని పొగడ్తలైనా భరిస్తాను. ఎందుకంటే.. బెసికల్లీ నేనొక మంచి బ్లాగర్ ని అన్నమాట 
@ లలిత గారు,
ఎంత మాట! వర్షం రానప్పుడు ఈ గొడవ తక్కువేనండీ.. మీరు నిర్భయం గా వచ్చేయండి. ఎలాగూ కొత్త ఊర్లో టూ వీలర్ నడపరని అనుకుంటున్నాను.
మా ఇంటికీ రండి..

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

@Ruth గారు,

నిజమే ఇక్కడాకొన్నిసార్లు ట్రాఫిక్ దారుణంగా ఉంటుంది. కానీ బెంగుళూరు ముందు మనం దిగదుడుపేనండీ. అసలు బెంగుళూరు లో గతుకులు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా ! మన ఇంజినీర్లంతా కావాలని ట్రై చేసినా అలాంటి గుంటలూ, గతుకులూ రోడ్ల మీద తయారు చెయ్యలేరు తెలుసా :)

వర్షం పడినప్పుడు బెంగుళూరు సైడు రోడ్ల మీద మాత్రమే అర్థమవుతుంది అసలు సిసలు చక్కని చిక్కనైన చాక్లెట్ టైపు బురదంటే ఏంటో :))

కృష్ణప్రియ said...

@ నాగార్జున,
ఇది ఒక లిట్మస్ టెస్ట్. మరి ఊర్కే ప్రైజ్ మనీ ఇచ్చేస్తే? 
@ మాల గారు,
 అబ్బే.. ఓపికా, తీరికా ఉన్న అత్తా కోడళ్ల కి యుద్ధం ఎంతవారలకైనా తప్పదు కదండీ.. సావిత్రీ, శాంతకుమారులకైనా పనీ పాటా ఉన్నంత కాలం పర్వాలేదు. లేదంటే.. చిన్న సైజు యుద్ధమైనా జరగకకుండా గడుస్తుందంటారా? మరీ అస్సలూ చిటపటలు అప్పుడప్పుడూ అయినా లేకపోతే బోరు ఏమంటారు?
@ సాధారణ పౌరుడు,
నిజంగా ఒక్కోసారి వెగటు వస్తోంది. రోజూ ఇలాగ బురదల్లో, దుమ్ములో వెళ్లటానికి. పోనీ బస్సు వాడదామంటే బస్ స్టాప్ ఇంటికి బోల్డు దూరం, ఆఫీస్ కీ అంతే..
@ తొలకరి,
థాంక్సండీ! చాలా సంతోషం 

కృష్ణప్రియ said...

@ Srikanth Eadara,
నా బ్లాగ్ కి స్వాగతం! థాంక్స్!
@ జేబీ,
 పోన్లెండి కనీసం నా కలలు నెరవేరుతున్నాయి, మీ చిన్నప్పటి కోరికలు తీరుతున్నాయి.. బెంగుళూరు ట్రాఫిక్ వల్ల! 
@ కిరణ్మయి,
 ముందుగా.. అత్తా-కోడళ్ల యుద్ధం సరదాకి రాసింది. అలాగే.. యుద్ధం కాకపోయినా.. ఒపికలూ, తీరికలూ ఉన్నప్పుడు కొద్దిలో కొద్ది చిటపటల అవకాశాలు ఉంటాయి కదా అని..
ప్రకృతి పరవశించిన విధానం గురించి ఎవ్వరూ అనలేదనుకున్నాను. హమ్మయ్య కనీసం మీకు నచ్చింది! ధన్యోస్మి..
@ శ్రీ,
 ధన్యవాదాలు.

vasantham said...

క్రిష్న ప్రియ గారు, నవ్వి, నవ్వి, ఏడుపు వచ్ఛిందండి..మీ బ్లొగ్..అమొఘమ్..అబ్బె,ఎక్కువ నవ్వితె కన్నీళ్లు వస్తాయి నాకు.

అన్నిసిటీ లు అలగే ఉన్నాయి..మీ పట్తు వదలని స్కూటీ ప్రయానమ్..భలే బాగున్ది.

వసంతం.

suneel said...

polika chala bagundandi...mee vyasam chusaka..eppudoo aapesina naa blog ni malle modalupettalani undi..

తెలుగుయాంకి said...

ట్రాఫికోద్ధాన్ని బలే వర్ణించారి. లాప్ టాప్ తో ఆఫీసు లోపలికి వెళ్లాక చేయబోయో ఆ రెండో యుద్ధము గురించి కూడా చెప్పాలి.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ద్విచక్ర వాహనానికి కూడా ఒక సారధి కావాలి. అప్పుడు మీరు వెనక సీటు మీద పద్మాసనం వేసుకొని యోగా, తపస్సు లాంటివి చేసుకోవచ్చు. బాసాసురుడిని విరామం లేకుండా తిట్టుకోవచ్చు.

టపా కి .. పో.ప.న (పొట్ట పగిలేటట్టు నవ్వు)

Varuna Srikanth said...

KP garu:)
chala funny ga rasarandi:) ETV Suman and Prakruthi : naku chala nachesayandi.....as usual you just rocked in this post too:)
mee blog ki vaste...manasara...hayiga navvukuni chakkaga relax avachu...

మధురవాణి said...

ఏంటో.. ఇన్నేసి కష్టాలని చిరునవ్వుతో భరించడమే కాకుండా మీ కష్టాలని ఇంతందంగా వర్ణించి మమ్మల్ని కూడా నవ్విస్తున్నారంటే ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఏదో ఏదో ఒక రోజు మీకే వస్తుంది కృష్ణమ్మా గారూ.. తప్పకుండా మీకే వస్తుంది! (కన్నీళ్లు తుడుచుకుంటూ నేను.. ;)

ఆ.సౌమ్య said...

wow, what a narration!

బెంగళూరు రోడ్లు కళ్ళకు కనిపించేసాయి. బెంగళూరు ట్రాఫిక్ కి మహాభారతయుద్ధానికి...ఏం ముడిపెట్టారండీ బాబు! :)

కృష్ణప్రియ said...

@ వసంతం,
:) థాంక్సండీ..

@ సునీల్,

చాలా సంతోషం! మీరు తప్పక మళ్లీ మొదలు పెట్టండి.

@ తెలుగు యాంకీ,

:) రెండో యుద్ధం గురించీ అప్పుడప్పుడూ రాస్తున్నాను.

@ బులుసు వారు,

:) స్కూటర్ డ్రైవర్ ని వెతుక్కోమంటారు. ష్యూర్.. మంచి సలహా..

@ మధురవాణి,

:) అయితే ఏదో ఒక రోజు నాకు నోబుల్ ప్రైజ్ వస్తున్నమాట! థాంక్స్!

@ సౌమ్య,

థాంక్స్! థాంక్స్!

Anonymous said...

మీరు "మగధీర" సినిమా చూసి నిద్రపోయుంటారు. అందుకే అలాంటి కల వచ్చింది.
ఈ సారి "3 ఇడియట్స్" సినిమా చూసి నిద్రపోండి. కరీనా కపూర్ అయిపోతారు.

ఫోర్డ్ ఐ10 కాదండి. హ్యుండయి ఐ10.

smandalemula said...

మీ ట్స్పా బావుందని మళ్ళీ చెప్పక్కర్లేదు గానీ...ఒక సందేహం...
రాత్రంతా వర్షం కురిసాకా మళ్ళీ దుమ్ము ఎలా లేచిందా అని...అది మీ బంగలూరు గొప్పతనమా :)

Anonymous said...

అందుకే అల్లసాని పెద్దన వారు బెంగుళూరులో( అంటే ఆరోజుల్లో హంపి అనుకోండి) వున్నరోజుల్లోనే 'పాదలేపనం' గురించి ఆలోచించారు, ప్రవరుణ్ణి హిమాలయాలకు పంపించారు. మీరూ ఏదో ఓరోజు, అలాంటి ఫార్ములా లేపనం కనుక్కుని గాలిలో ఎగిరి ఆఫీసుకు చేరుకునేవరకూ ఈ కష్టాలు తప్పవు.

రక్తాలు, దుమ్మూ అని మొదట పేరాలో చూచి బస్ లో నకిరేకల్లు వెళ్ళారేమో అనుకున్నా. :)

kiran said...

ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక వెనక్కి తిప్పే ప్రశ్నే లేదు. -- అబ్బో
కాసేపు యోగా చేద్దాం అని మొదలు పెట్టాను. -- ట్రాఫ్ఫిక్ లోనే :)))
హేహీహ్హేహే...బహు బాగు..మీ కష్టాలు...:)

Anonymous said...

హుమ్మ్, బావుంది బెంగళూరు కురుక్షేత్రం. నేను కూడా ఈ యుద్దంలో రోజు పాల్గొంటున్నా!

Sravya V said...

హతవిధీ నేనెటుల మిస్స్యితిని కృష్ణ ప్రియ గారు మహాభారత యుద్దమును బెంగళూర్ రోడ్ల పై సిమ్యులేట్ చేయగా :((
ఇప్పటికి నా తక్షణ కర్యవ్యం పోస్టు చదివి కామెంట్ పెట్టుటే :)))
బాగా రాసారండి బెంగళూర్ రోడ్డు ప్రయాణ కష్టాలని !

కృష్ణప్రియ said...

@ bonagiri,
 sure! తప్పు పట్టేసారు. ఐకాన్ అనబోయి ఐ 10 అనేసాను. థాంక్స్! 
@smandalemula,
 పట్టేశారు! తాళింపు అంటే అదే మరి.

@ snkr,
 నిజమే! కానీ మళ్లీ గాల్లో గుద్దేసుకుని అక్కడా జామ్ లె అయిపోతే?

@ అనాన్,
 థాంక్స్! అయితే మీరూ వీరులే నన్నమాట!

@ శ్రావ్య,
:) థాంక్స్!

Unknown said...

రామ బాణాన్నీ, ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక వెనక్కి తిప్పే ప్రశ్నే లేదు.
ముందు మోటార్ సైకిల్ ఆయన షేవింగ్ కిట్ తీసి గడ్డం గీస్తున్నాడు. ఇంకో ఆవిడ హెల్ మెట్ తీసి దాంట్లో పాకెట్ లోంచి సన్నజాజులు గుమ్మరించి మాలలు కడుతోంది. నేను బ్యాగ్ తీసి చూస్తే.. ట్రాఫిక్ జాముల్లో చదువుకునే పుస్తకం కనపడలేదు. పోన్లే.. కాసేపు యోగా చేద్దాం అని మొదలు పెట్టాను.
మొన్న వాళ్లింట్లో తమ్ముడి పెళ్లి ఫోటోలు దాదాపు ఏడు వందలు చూపించినప్పుడో?
ఇలా నేను కాపీ చేస్తే మొత్తం పోస్ట్ అంతా చేయాలి.
చివరాఖరిలో మీ నోబెల్ పీస్ ప్రైజ్ ఆలోచన సూపర్ అసలు.
ఎలా మిస్ అయ్యాను మీ బ్లాగ్ ని.
ఇక వదలనంతే...

జ్యోతిర్మయి said...

మీరేమో యుద్ధం చేశానంటున్నారు. మాకేమో విశ్వరూపం కనిపించింది....కృష్ణార్పణం

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;