Saturday, November 19, 2011

బంగారు మనిషి


శుక్రవారం రాత్రి నాకు పదిన్నర కి ఈ టీ వీ లో సెకండ్ షో చూడటం మహా సరదా! మర్నాడు సెలవ, కాస్త ఆలస్యం గా లేవచ్చు, (సోమ- శుక్ర) వారం రోజుల్లో అస్సలూ టీవీ చూడను.

ఈ మధ్య పనెక్కువై కాస్త ఆ అలవాటు అటకెక్కింది. చాన్నాళ్లకి నిన్న రాత్రి మళ్లీ అవకాశం దొరికింది. సరే అని కూర్చున్నా. కొద్దిగా తొందర గా వచ్చినట్టున్నాను. వావ్! అంటూ సాయి కుమార్ కిక్కెక్కిస్తున్నాడు.. (వావ్, మంచి కిక్కెక్కించే షో.. ) సరే కాసేపాగి వద్దామని వచ్చి చూసేసరికి సినిమా టైటిల్స్ వచ్చేస్తున్నాయ్. పేరు తెలియ లేదు. తర్వాత నెమ్మదిగా గూగుల్ సర్చ్ ద్వారా అర్థమైంది.. 'బంగారు మనిషి' (1976)



మొదటి సీన్ లో పేద్ద బంగళా లో, లక్ష్మి తండ్రి తన చిన్న నాటి స్నేహితుడికి వ్యాపారం లో నష్టం వచ్చిందని తెలిసి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి ఆ పైన అప్పు పత్రాల మీద సంతకం కూడా పెట్టాడు. అంతే! సగం సినిమా అర్థమైంది. మిత్రుడు చేయబోయే మోసం, వీళ్లకి పోబోనున్న ప్రాభవం, లక్ష్మి చెంగావి రంగు చీర, జాకెట్ తో, ‘కాలేజీకి వెళ్ళొస్తానని చెప్పి కార్ ఎక్కి ఒక నిర్జనమైన రోడ్డు మీద పోతోంది. అంతలో ఎన్ టీ ఆర్ స్క్రీన్ నిండా, తెల్ల చొక్కా, చెంగావి రంగు బెల్ బాటం పాంటూ వేసి. ఆయన ముఖం మీద పడేలా విగ్గు పెట్టుకుంటే, పక్కన లక్ష్మి నెత్తి మీద పేద్ద విగ్గు అటూ, ఇటూ వేలాడేలా ! ఇద్దరూ ఒకే కాలేజ్, బాగుంది. ఈయన లెక్చరర్, అమ్మాయి విద్యార్థిని అనుకున్నాను. తీరా చూస్తే ఇద్దరూ ఓకే క్లాస్, నిజమే నాదే తప్పు. ఓకే ఒక్క పుస్తకం చేతిలో పట్టుకుని నడుస్తున్నాడు అనగానే అర్థమయి ఉండాల్సింది. ‘ కారెక్కమంటూ’ లక్ష్మి, ‘వద్దు, ఆడపిల్లకి చెడ్డపేరు తేలేను’ అంటూ వేణు (అదే మన ఎన్ టీ ఆర్ గారు) వాదించు కుని, చివరకి లక్ష్మి ని కరుణించి కారెక్కాడు. కానీ వేణు చెప్పిందే నిజం. లోకులు కాకులు, వీళ్ల మీద పిచ్చి కూతలు కూశారు, గోడల మీద బొమ్మలు గా వేశారు. వేణు హర్ట్! లక్ష్మి వారికి తగిన విధం గా బుద్ధి చెప్పి, కాలేజీ తోట లోకి వేణుని వెతుక్కుంటూ వచ్చి, ‘మేలుకోవయ్యా వేణు గోపాలా! ‘ అని పాడుతోంది.


ఈ పాట మాత్రం ఎందుకో చూడబుద్ధి కాక, పక్క చానెల్ లో నాగార్జున, నయనతార పాట ఏదో వస్తుంటే అది చూశాను.అదవ్వగానే ఇంకో పాట ఏదో చూస్తూ ఉండి పోయా. కాసేపయ్యాక మళ్లీ ఇటు వచ్చి చూస్తే, ‘బంట్రోతు గుమ్మడి’ కలెక్టర్ కుర్చీ కి మొక్కుకున్నాడు. కలెక్టర్ ముక్కామల(?), మంచి డాబు గా హుక్కా పీలుస్తూ ‘ఏంటి రంగా? నాకన్నా ముందు ఆ కుర్చీ కి దణ్ణం పెడుతున్నావే?’ అన్నాడు. ‘ఆహా! గుహుడి లా మొహం పెట్టి గుమ్మడి చెప్పే డైలాగులు వినే అవకాశాన్ని వదులుకోకూడదని కాస్త ముందుకి వంగాను.



‘బాబు గారూ! ఈ కుర్చీ లో కలెక్టర్లు ఎందరో వచ్చారు, వెళ్లారు! కొందరు ఆ కుర్చీ లో కూర్చుని ప్రజల మీద కరుణ కురిపించితే, మరి కొందరు కన్నెర్ర చేసి దుష్ట శక్తులని అణిచినా, అది ఆ కుర్చీ ఇచ్చిన అధికారమే బాబూ. ఆ కుర్చీ ఇచ్చిన అధికారమే! నిజమైన దేవుడిని నేనెప్పుడూ చూడలేదు. అలాంటి అధికారాన్నిచ్చే ఈ కుర్చీ యే నాకు దేవాలయం, దానిని అధిష్టించే కలెక్టరే నాకు దేవుడు. అని అరమోడ్పు కన్నులతో, దణ్ణం పెట్టి బయటకి వెళ్లాడు. అది చూసి, కలెకటారు బాబు ‘అందరూ రంగడిలా ఉంటే ఎంత బాగుంటుంది?’ అనుకున్నారు. ఈ సీన్ లో మీకు గుమ్మడి హావభావాలెలా ఉంటాయో చెప్పవలసి వస్తుంది అంటే, మీరు తెలుగు వారు కారని అర్థం, లేదా మీలో తెలుగుదనం పాళ్లు కాస్త తక్కువ అయి ఉండవచ్చు.

ఇంతలో రేషన్ షాప్ లోనూ, నకిలీ సారాయి దుకాణాల్లో , ప్రభాకర్ రెడ్డి జరిపించే అక్రమాలూ, ప్రభాకర్ రెడ్డి కొడుకు రంగనాథ్, ఇంటికి వేణుని కాఫీకి తెస్తే, బంట్రోతు కొడుకు ని తెస్తావా అని అవమానం, ..

‘ఆ.. ఆ.. ఆ.. ‘ ఆవులింతలొస్తున్నాయి..

నాకు ఈ పాటికి మాంచి ఆకలేస్తోంది. కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న నానా రకాల ఉద్యోగుల మధ్య కామెడీ సీన్ నడుస్తోంది. అల్లు రామలింగయ్య ఆడ క్లర్కులని ఆట పట్టిస్తున్నాడు. సరే నేను తీరిగ్గా వంటింట్లో ఒక కప్పు ఆకుపచ్చ చాయ్ చేసుకుని, ఒక ఫుల్కా మీద జామ్ రాసుకుని వచ్చి కూర్చున్నా.. సీన్ మారింది. వేణు నిలువు చారల చొక్కా, చెక్స్ పాంట్ వేసుకుని, కిటికీ బయట నుంచుని తల్లి దండ్రుల మాటలు వింటున్నాడు.

గుమ్మడి : ‘మన బాబు చదువు అర్థంతరం గా ఆగిపోకూడదు, మంచి చదువు చదివి సమాజానికి ఉపయోగపడేలా ఒక స్థాయికి మన బాబు ఎదగాలి! బాబుని ఎంత కష్టమైనా చదివిస్తాను. చివరకి నా ప్రాణాలు పోయినా సరే. ఈ విషయం లో వెనక్కి తగ్గేది లేదు’ (పది సార్లు బాబు అంటూ, మనకి రిపీటెడ్ గా వేణు చిన్న వాడు, కాలేజ్ లో చదువుకునే యూత్ అని గుర్తు చేయటమన్నమాట!)



పండరీ బాయి కన్నీరు కారుస్తూ, : ‘హంత మాటనకండి! రాలిపోయే ఆకుల్లాంటి వాళ్లం మనం. వేణుని చదివించటమే మన జీవిత ధ్యేయం!’ నేను బహుశా మొదటి సారి ఆవిడ శాలువా కప్పుకోకుండా నటించటం చూడటం.. శాలువా లేకున్నా బానే ఆనంద భాష్పాలు రాల్చింది. పర్వాలేదు.

వేణు ముఖం ఆందోళన తో, తండ్రి మాటలు ఒకటి కి రెండు సార్లు అతని మస్తిష్కం లో రీ సౌండ్ అవుతుంటే ఇక భరించ లేక, బాగా చదువుకుని మంచి స్థాయి కి వచ్చాకే తిరిగి ఇంటికి వస్తానని ఉత్తరం ముక్క రాసి వెళ్లిపోయాడు. అప్పుడు అర్థమయింది. కాబోయే దేవుడు ఈయనేనని. లక్ష్మి తండ్రిని అనుకున్నట్లే ఆ చిన్న నాటి స్నేహితుడు మోసం చేసినట్టున్నాడు, ఇంటికి స్వాధీనం చేసుకోవటానికి వచ్చిన సేట్ గారి ముందే తండ్రి పోయాడు. గుడిసె లోకి లక్ష్మి, తల్లి, తమ్ముడు, చెల్లెళ్లని తీసుకుని వెళ్లి పోయింది.

ఛా! నేనే ఒక ఇరవయ్యేళ్ల క్రితం పుట్టుంటే ఇలాంటి సినిమాలని మొదటి అరగంట చూసే రివ్యూలు రాసి పడేద్దును! బాడ్ లక్! అనుకున్నాను.

సీన్ మారిపోయింది. కొత్త కలెక్టర్ గారు రైలుకి వచ్చారు, ఊళ్లో జనాలు ఒక పక్క, బక్క బంట్రోతు ఒకపక్క నుంచున్నారు, గాగుల్స్, సూటూ బూటూ వేసి వేణు దిగి అటూ ఇటూ చూశాడు. ఒక పక్క పూల దండలతో పురప్రముఖులు,మరో పక్క అపర కుచేలుడిలా గుమ్మడి. దిగి అందర్నీ డిజాప్పాయింట్ చేసేసి ‘నాన్నా!’ అని తండ్రికి నమస్కరించి,.. కౌగిలించుకుని, కన్నీరు, ఉద్వేగం, ఆనందం.. ‘అబ్బ బ్బా.. వర్ణించలేను..’ ఏ తండ్రికైనా ఇంకేం కావాలి?
ఎందుకో 'బావా ఎప్పుడు వచ్చితీవు? ' గుర్తొచ్చింది.

బస్తీ లో బంట్రోతు గుమ్మడి పెంకుటింట్లోనుంచి ఆఫీసుకెళ్ళటానికి తయారీ. తండ్రికి తన స్వంత చేతులతో కాఫీ ఇచ్చి, ‘నాన్నా.. నా కోసం కార్, డ్రైవర్.. నాతో రా నాన్నా! ‘ అని ఆర్తి గా అన్నాడు ‘లేదు బాబూ! బంట్రోతు వాహనం ఇదే, అయినా బంట్రోతు కలెక్టర్ వచ్చే లోపల ఒక అరగంట ముందుగా వచ్చి సీటు అదీ దుమ్ము దులపాలి ‘ అంటూ మూల నున్న తన సైకిల్ ని చూపించాడు.

ఆఫీసు లో తన చిన్ననాటి స్నేహితుడైన శరత్ బాబు ప్రదర్శించిన అతి చనువు ని కంటి చూపుతో కంట్రోల్ చేసి, ‘బంట్రోతు తండ్రి కి పని చెప్పలేక సంఘర్షణ తో, బ్రతికి చెడి అదే ఆఫీస్ లో స్టెనో గా చేరిన ఒకనాటి ప్రేయసి లక్ష్మి ని రోజూ చూస్తూ అసలే సీరియస్ మనిషి మరికాస్త గంభీరం గా, టెన్స్ గా తయారయితే, ఇది చాలదన్నట్టు మన ప్రభాకర్ రెడ్డి కొడుకు, తన ఆప్త మిత్రుడైన శ్రీధర్ ఎస్ పీ గా అక్కడికే పోస్టింగ్ రావటం.. వేణు నిజంగా గొప్పవాడు. ఎలా నలిగిపోయాడో, భరించాడో.. మనసు ద్రవించుకుపోయింది. కరిగి నీరైంది.

(అన్నట్టు శరత్ బాబు, శ్రీధర్ ఎంత లేతగా ఉన్నారో వేణు బాబు పక్కన)

అప్పుడెప్పుడో నా స్నేహితురాలి భర్త నాకు బాస్ అవబోయాడు. మా బాసు గారి దగ్గరకెళ్లి ‘బాబోయ్ నా వల్ల కాదు’ అన్నాను. ‘you must be above this Krishna!’ అని తెగ కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేశాడాయన! ‘ఎంత చెప్పినా వినడే?’

సరే అని నా కారణాలు చెప్పటం మొదలు పెట్టాను.

“ఈయన గారికీ, వాళ్లావిడకీ జరిగే చిన్ని గిల్లి కజ్జాల దగ్గర్నించీ, మహా సంగ్రామాలదాకా నాకు తెలుసు.. అలాగే వారింట్లో అత్తాకోడళ్ల కథ ఒక వైపు నుండి నాకు తెలుసు, వాళ్లావిడ పూరణ్ పోళీలు చేస్తే ఈయనే నాకు డబ్బా కట్టిస్తాడు, ప్రతి ఏటా ఆవకాయ ఆయన కుటుంబానికి కూడా మా అమ్మే పెడుతుంది. ‘నన్నొగ్గేయండి!!’

ఆయన ఇంకా సద్ది చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు....

ఏం చేయను ఇంక? చెప్పాను.. ‘బాసుగారిని తనివి తీరా కాస్త తిట్టుకోవటానికి ఉండదు..’ దీనికి ఆయనకే ఏం సమాధానం చెప్పాలో తోచక..’సరే ఆయన కి నువ్వు రిపోర్ట్ చేయక్కర్లేదు లెమ్మన్నాడు. అదంతా గుర్తొచ్చి నవ్వుకున్నాను...

తండ్రి, ఇద్దరు మిత్రులు, ప్రేయసి ఓకే ఆఫీస్ లో .. దుర్మార్గుల భరతం ఎలా పడతాడు? ఈలోగా, ఇంతమంది ‘మంచి’ వాళ్లు, కావలసిన వాళ్లు ఒకేదగ్గర, దేవుడు లాంటి వేణు బాబు ఆఫీస్ లో పని చేస్తుంటే వారికొచ్చిన మనస్పర్థలేంటి? అవి వారు ఎలా పరిష్కరిస్తారు? ఎవరి కోసం ఎవరు ఎప్పుడు త్యాగం చేస్తారనేదే సస్పెన్స్.. ఆవలింతలు ఎక్కువయ్యాయి, సర్లే.. చూసింది చాలు.. అని ఇక ఆపేసా.

ఎవరైనా ఈ సినిమా నిన్న చూసుంటే, చివరకి శరత్ బాబుకీ, విలన్ కూతురికీ, ఒక పెళ్లి, NTR కీ, లక్ష్మికీ ఒక పెళ్లీ, అల్లు రామలింగయ్యా, ప్రభాకర్ రెడ్డీ జెయిల్ కీ (కన్నకొడుకే బేడీలు వేసి....) , రావు గోపాలరావు చనిపోగా, చివరి సీన్ లో మిగిలిన వారంతా పధ్ధతి గా ఒక వరస లో నుంచుని, కమెడియన్ వేసిన జోకుకి నవ్వో, లేక అందరూ మూకుమ్మడి గా ‘బంగారు మనిషి అని NTR ని పొగుడుతూంటే, వినమ్రం గా NTR, గుమ్మడి, పండరి బాయిలు తృప్తి గా వీరందరినీ తమ చల్లని చూపులతో చూసుకుంటూ, శుభం కార్డ్ పడటం..

కాకుండా ఇంకే రకమైన ఎండింగ్ అయినా ప్లీజ్, ప్లీజ్ చెప్పరూ?

20 comments:

balasubrahmanyam.b said...

క్రితం వారం ఒక సి డి షాపు లో ఈ సినెమా సి డి చూసి కొందాం అనుకున్నా కవర్ ఫేడ్ అయిందని వదిలేసా నేనెంత అద్రుష్టవంతుడిని. మెత్తం సినిమా చూపించారు.ధన్యవాదాలు.

యశోదకృష్ణ said...

‘హంత మాటనకండి!
konthamandi actors ha kaaraalu palukuthunte manam hahakaaralu cheyyalsinde, super vundi review.

జ్యోతిర్మయి said...

కృష్ణ గారూ ఆకుపచ్చ చాయ్, పుల్కా మీద జాము బావున్నాయండీ...

Anonymous said...

30సం|| పాత సినేమాకి కొత్త ముగింపు గురించి ఆలోచించటం కన్నా, రాబోయే కాలం లో మనుషుల జీవితం ఎటువంటి మార్పులకు లోనౌతుందో ఈ క్రింది వీడీయోలను చూడండి, మీకే అర్థమౌతుంది. ఇక బాస్,టిం అనే పాత తరహా పని తీరు విధానం పాత పడిపోయేమో! అనుబంధాల స్థానం లో e-బంధాలు వస్తున్నాయి.
The Future of Communication
http://www.youtube.com/watch?v=OS6AQTTi76M&feature=player_embedded

The Future of Mobile Media
http://www.youtube.com/watch?v=FScddkTMlTc&feature=related

Interactive Mirror
http://www.youtube.com/watch?v=dxIOOY2uP3A&feature=player_embedded

The Future of Teaching
http://www.youtube.com/watch?v=t6UEoguiRS8&feature=related

Micro soft office in 2019
http://www.youtube.com/watch?v=ENTTvZpF44M&feature=related

Microsoft's Vision of the Future: Retail
http://www.youtube.com/watch?v=AJL_oivIMhQ&feature=related

House of the future
http://www.youtube.com/watch?v=9DJr8QwgLEA&feature=related

శ్రీ రాం

కృష్ణప్రియ said...

@ balasubrahmanyam.b,
:) You are welcome!

@ గీత_యశస్వి,
థాంక్స్! ఎంత 'హ' కారం తగిలిస్తే అంత భారం గా అన్నట్టు :)

@ జ్యోతిర్మయి,

అయితే రివ్యూ? సినిమా? :) థాంక్స్!

@ శ్రీరామ్,

Thanks for your your videos! I will watch them soon.. ఇక ఈ సినిమా ముగింపు దాకా చూసే ఓపిక లేక వదిలేశాను. పాత సినిమా లో కాచి వడబోసిన కథలూ, కథనాలూ చూసి, కనీసం ముగింపు దాకా ఎవరైనా చూసి ఉండి ఉంటే, అది predictable end కాకపోయుంటే చెప్పమని రాశానన్న మాట :)

Anonymous said...

ఇంకా నయం. బంగారు మనిషి అని టైటిల్ చూసి మీ ఆరుముగం గురించి అనుకున్నాను.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Same pinch, Bonagiri garu!!

కృష్ణప్రియ said...

@ bonagiri, వెంకట గణేశ్,
:) ఆర్ముగం మూడో భాగం దాదాపు రాసేశాను. ఒకసారి అతనికి చూపించి అప్రూవల్ తీసుకుని బహుశా సోమవారం ప్రచురిస్తాను.

ఈలోగా, ఎంతోకాలానికి తీరిగ్గా కూర్చుని చూసిన సినిమా గురించి రాయాలనిపించి :)

Chandu S said...

కృష్ణ ప్రియ గారూ

పి సుశీల పాట ఒకటి ఉంటుంది

కలగన్నాను, ఏదో కలగన్నాను.

నాకు బాగా ఇష్టం ఆ పాట. పాట విని ఆ సినిమా చూడాలి అని ఎంతో ట్రై చేశాను. మొత్తానికి చూపించారు. థాంక్స్.

lakshmana kumar malladi said...

గుమ్మడి గారి మాట వింటేనే ఆయన ముఖం లో కనిపించే భావాలు కళ్ళు మూసుకున్నా కనిపించేస్తాయి. మీ తెలుగుతనం వ్యాఖ్యానం బాగుంది. మహామంత్రి తిమ్మరుసు లో ఆయన నటన నాకు చాలా ఇష్పం

sunita said...

appuDeppuDoe amma mammalandarini toelukelhlhi cinima choopinchae roejulloe choosina cinima idi. ending teleedu,endukanTae naenu aakharuloe nidrapoeyaanu:((tiTTi nidralaepi inTiki paTTukochchindi amma:((

Anonymous said...

Krishnakka,

Thanks. Continue your good work. Maree silent ga chadivi vellipothunte meerekkada nirutsahapadi tapaalu taggistarani ee commment pedutunnanu. Veeranari laga dusukellandi

జ్యోతిర్మయి said...

కృష్ణప్రియ గారూ రివ్యూ మీర్రాసాక ఇక చెప్పేదేము౦ద౦డీ...రివ్యూ చదువుతున్నప్పుడు నాక్కూడా ఆకలేసింది. అదే సమయంలో మీరు సూపర్ ఐడియా ఇచ్చారు. "ఆకుపచ్చ చాయ్, పుల్కా మీద జాము" అవి ఎంజాయ్ చేసే సంబరంలో అలా కమెంటానన్నమాట.

Disp Name said...

కృష్ణబ్రియా,

మీరు ఈ వాక్యం లో ముఖ్యమైన విషయం మరిచారు-

", గాగుల్స్, సూటూ బూటూ వేసి వేణు దిగి అటూ ఇటూ చూశాడు. "

బెల్బాటం సూటు ఉండాలే సుమా !

చాణక్య said...

>>>పది సార్లు బాబు అంటూ, మనకి రిపీటెడ్ గా వేణు చిన్న వాడు, కాలేజ్ లో చదువుకునే యూత్ అని గుర్తు చేయటమన్నమాట!

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్..... అ.హా.

చాణక్య said...
This comment has been removed by the author.
కృష్ణప్రియ said...

చందు గారు,
 మీకు ఖర్చు, శ్రమ, సమయం వృధా అవకుండా కాపాడినందుకు, చాలా సంతోషం గా ఉంది. 

@ మల్లాది లక్ష్మణ కుమార్ గారు,
నాకూ గుమ్మడి అంటే ఇష్టమే. సినిమాల్లో, కారక్టర్ కనిపిస్తాడు కానీ ఆయన కాదు. ధన్యవాదాలు!

@ సునీత గారు,
: ) అదృష్టవంతులు .. నేను ఊర్కే, ఇంత predictable story/narration ఉన్న సినిమా NTR, గుమ్మడి, లక్ష్మి, శ్రీధర్, శరత్ బాబు, ఇలాంటి మంచి నటులంతా చేసిన సినిమా అని చూసి, ఆశ్చర్యపోయా.. ఆవిధం గా అలాంటి సినిమాలు ఒక సమయం లో చాలా చేసినట్టున్నారు (వయ్యారి భామలు, వగల మాడి భర్తలు, రామకృష్ణులు, .. లాంటివి )

కృష్ణప్రియ said...

అజ్ఞాత,
So nice of you.. Thanks for your comment!

జ్యోతిర్మయి గారు,

: ) అయితే మీరూ ఎంజాయ్ చేశారన్న మాట. నా ఫేవరేట్ అర్థరాత్రి స్నాక్ అది.

@ జిలేబి,
: ) అంతే అంతే..

కృష్ణప్రియ said...

@ చాణక్య,

:))

కృష్ణప్రియ said...

శ్రీనివాస్ గారు,

థాంక్స్. మీరు చెప్పింది నిజమే. శ్రీధర్ ని రంగనాథ్ అని పొరపాటున అన్నాను. :)

నిర్మలమ్మ కూడా మీరన్నట్టు రొటీన్ గా నటించేసింది.
డైలాగుల పేపర్ ఇస్తే, సీన్ చూడకుండా.. ఆవిడ ఎలా నటిస్తుందో చెప్పచ్చు.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;