Saturday, December 22, 2012 29 comments

యుగాంతం రోజు.. (21.12.2012)

యుగాంతం,.. Dooms day,.. क़यामत का दिन.. ఏమో వీటి మీద ఇంటి చుట్టుపక్కల వాళ్ల చర్చలు, ఆఫీసు లో కబుర్లు.. Dec. 21 sales, .. టీవీల్లో షోలు,


ఉదయం లేస్తూనే.. ఆఫీసుకి వెళ్లాలంటే రోజూ లాగే బద్ధకం.. బయట అంతా కొద్దిగా పొగమంచు... పిల్లలకి స్కూలు లేదు. క్రిస్ మస్ కార్నివాల్, తల్లిదండ్రులు-టీచర్ల మీటింగు అయితే ఉంది పదిన్నర కి. సరే సగం రోజు సెలవ పెట్టి మధ్యాహ్నం ఇంటి నుండి పని చేద్దాం అని నిర్ణయం తీసుకుని.. నా చాయ్, నిన్నటివి, ఇవ్వాల్టివీ న్యూస్ పేపర్లూ నేనూ వెచ్చ వెచ్చగా హాయిగా కూర్చుని మొదటి పేజీ తీశాను...



దేశ రాజధాని లో మెడికో పై సామూహిక అత్యాచారం మీద కవరేజ్. వెచ్చదనం కాస్తా సెగలు గా.. దేశ రాజధాని లో అర్థ రాత్రి కూడా కాదు.. తొమ్మిదింటికి సినిమా చూసి వస్తే.. రోడ్డు మీద ఉన్న ప్రతివారికీ జవాబు చెప్పాలా? చెప్పకపోతే.. కొట్టేసి అత్యాచారం చేసి.. ఎదిరించిన పాపానికి పొట్టలో చిన్న ప్రేగుల దాకా నాశనం చేస్తారా? బస్సులోంచి తోసేసి వెళ్లిపోతారా? టీ మరీ చేదు గా,.. భయంకరమైన పశు ప్రవృత్తి.. ఢిల్లీ అంతే.. మహిళలకి అస్సలూ సేఫ్ కాదు. ఛీ.. అనుకున్నాను. ఏదో మిగిలిన ప్రాంతాలన్నీ మహా సేఫ్ అన్నట్టు.



ఈ సంవత్సరం మహా నగరం లో నమోదయిన అత్యాచారాల సంఖ్య 530+ ట. క్రితం ఏడు 630+. ఒక వంద తక్కువ అత్యాచారాలు అయ్యాయని సంతోషించాలా? ఇవన్నీ కేవలం రిపోర్ట్ చేసిన సంఘటనలే. ఇంక వెనక ఎన్ని అవుతున్నాయో.. ఎవరికెరుక? అయినా ఒక దేశ రాజదాననే ఏముంది.. ఆడ,మగ, వయసు తో సంబంధం లేకుండా.. ఒక సామాజిక భద్రత ఉంది, రాత్రి తల దాచుకోవడానికి చిన్నో, పెద్దో ఇల్లు అంటూ ఉన్న మధ్యతరగతి, లేదా ఆర్థికం గా ఉన్నత వర్గాల వ్యక్తులకి కూడా రోడ్డు మీద రక్షణ లేదు. ఫుట్ పాత్ మీద పడుకునే కుటుంబాల మాట, అర్థరాత్రి పొట్ట కూటి కోసం ఉద్యోగాల చేసి వెనక్కి వచ్చే అమ్మాయిల విషయం చెప్పనే అక్కర్లేదు. చిన్న సైజ్ పట్టణాల్లో.. 



ఒక మహా నగరం లో దేశ రాజధాని లో ఒక చదువుకున్న అమ్మాయికి జరిగిన ది కాబట్టి ఇంత వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపేసింది.. మీడియా, విద్యార్థులు, సంఘ సేవ చేసే వాళ్లు, అందరూ ధ్వజమెత్తి నిరసిస్తున్నారు. వీధుల్ని నినాదాలతో దద్దరిల్లేలా చేస్తున్నారు... ఉదయం నుండీ ఏ చానల్ చూసినా గొంతులు చించుకుని మరీ దులిపేస్తున్నారు.. మంచిదే. యువత నిరసన ప్రదర్శించడం మంచిదే. వీరిలో చైతన్యం ప్రశంసనీయమే. మరి మిగిలిన ఐదు వందల సంఘటనలో? టైమ్స్ లో బెంగుళూరు, హైదరాబాదు, ఇంకా చిన్న పట్టణాల్లో గణాంకాలు కూడా ఇచ్చారు. ఎనిమిదేళ్ల పిల్లలు, ఐదేళ్ల పిల్లలు... వాళ్ల గురించి ఒక కార్నర్ లో చిన్న వార్త తప్ప, ఎంతవరకూ ప్రజలని ఎఫెక్ట్ చేసింది..



మా అమ్మాయి వచ్చి పేపర్ చదవడానికి కూర్చుంది. సాధారణంగా రోజూ పేపర్ చదవదని దెబ్బలాడతాను. ఈరోజు మాత్రం.. వద్దు.. ఆటల పేజీలు, కార్టూన్లు చదువు చాలు అని మెయిన్ పేపరు ఇవ్వలేదు. ఇలా మెయిన్ పేపర్ ఎన్నాళ్లు దాచాలి? అసలు దాచాలా? జాగ్రత్తలు చెప్పాలా? ఏరకమైన జాగ్రత్తలు చెప్పాలి? అభద్రతా భావం, సాటి మనిషన్నవాడిని ఎవ్వర్నీ నమ్మరాదని చెప్పాలా? అన్నీ నాకు ప్రశ్నలే. ఎవర్నడగాలో తెలియదు. ఎవరికైనా ఖచ్చితమైన సమాధానం తెలుసని నేననుకోను.

http://www.youtube.com/watch?v=hY8CyTeegrM , http://www.ted.com/talks/sunitha_krishnan_tedindia.html

ఈ మధ్య మనసు కలచి వేసేలా చేసిన ఈ వీడియోలు గుర్తొస్తూనే ఉన్నాయి. ఇంకోసారి చూసి కన్నీరు పెట్టుకుని,.. ఇంక కార్నివాల్ సమయం అయిందని లేచి రెడీ అయిపోయాం అందరం.



యుగాంతం రోజున ఆఫీసు లో ఒంటరి గా ఈ సువిశాల అంతరిక్షం లో ఒక ధూళి రేణువు లా కలిసిపోలేను.. కుటుంబం తో కలిసి నాలుగు రేణువుల సమూహం లా మిగిలిపోతాను. ఉదయం స్కూల్లో పని కాబట్టి సెలవ కావాలి. మధ్యాహ్నం ఇంటి నుండి పని చేస్తాను... అని మెయిల్ కొట్టాను.



స్కూల్లో కార్నివాల్ సరదాగా గడిచిపోయింది..కానీ ఏదో ముల్లులా గుచ్చుకుంటోంది. ఏంటో అర్థం కాలేదు. కాసేపటికి పిల్లలు ఏవో ఆటలాడుతుంటే పక్కనే నుంచుని ఆలోచిస్తున్నాను.ఒకమ్మాయి.. ‘Maam.. please go out and stand. NOW.. just get going .. We need space.. come on.. move...’ అని స్టాల్ లోంచి బయటకి తరిమింది. వెళ్తూ గొణిగాను. ‘బయట చాలా వేడి గా ఉంది. మా అమ్మాయి గోరింటాకు పెట్టించుకోవడానికి ఇంకో ఐదు నిమిషాలు పడుతుంది. మళ్లీ వెతుక్కోవాలి కదా..’ ఇంకా ఏదో అనేలోగానే.. ‘That’s not my problem Mam. You need to handle it. We need space. Please move’ అంది. ‘వార్నీ.. ఎంత మాట సొగసు. అక్కడికి వచ్చే వాళ్లు విద్యార్థుల తల్లిదండ్రులని తెలుసు.. తను ఒక విద్యార్థి .. బహుశా.. ఎనిమిదో/తొమ్మిదో తరగతి అయ్యుండచ్చు.. అనుకుంటూ.. బయటకి నడిచాను. అప్పుడర్థమైంది.. ముల్లు ఎక్కడుందో.. స్టేజ్ మీద ముగ్గురమ్మాయిలు.. ముగ్గురబ్బాయిలు డాన్సు వేస్తున్నారు. చుట్టూ పెద్దలు, పిన్నలు, చేరి చప్పట్లతో ఉత్సాహ పరుస్తున్నారు. వాళ్ల పాటలు..



‘Radha on the dance floor, Radha likes to party.. Radha wants to move that ... Radha body’,

‘సారొచ్చారొచ్చారే .. వచ్చాదోచ్చాడే’

‘ఆకలేస్తే అన్నం పెడతా..(కి తమిళ్/కన్నడ వర్షన్.. సరిగ్గా అర్థం కాలేదు. నా పిచ్చి గానీ కొన్ని తెలుగు పాటలే నాకు అర్థమయి చావవు..)

ఏజెంట్ వినోద్ లో పాట ప్యార్ కీ పుంజీ బజాదే..

Why this kolaveri Di’..



వయసుకి తగని పాటలకి డాన్స్ చేయడం నచ్చక, అక్కడ నుంచుని చప్పట్లు కొడుతున్న టీచర్ కి ఒకావిడ కి చెప్తే,.. ‘మా చేతుల్లో లేదు. మా సూపర్ వైజర్ ఇష్టం. ఆవిడకి రాత పూర్వకం గా మీరు కంప్లైంట్ ఇవ్వండి’ అంది. సర్లే.. మధ్యాహ్నం పని పూర్తి చేసుకోపోతే మళ్లీ వారాంతం లో పని చేసుకోవాలి.. ఎందుకొచ్చింది అని .అక్కడ నూడిల్సు, ఫ్రైలు, బర్గర్లు తినేసి ఇంటికొచ్చి పడ్డాము..



2012 సినిమా చూడలేక పోయానే.. ఎంత మిస్సయ్యానో.. అని నిన్నంతా తెగ బెంగ పడిపోయాను.. స్కూల్లో ఫంక్షన్ లో ఒక్కసారి గా నిలబెట్టిన వినైల్ హోర్డింగ్ గాలిలో, పరిగెట్టుకు వచ్చిన పిల్లల మూక తోసినందుకో, రెండూ జరిగినందుకో.. ఢామ్మని పడిపోయింది. ఇంకేం.. జనాలు.. బాబోఓఒయ్ అని పరుగులు ఒక నిమిషం తర్వాత తేరుకుని నవ్వుకున్నాం.

పక్కింట్లో కూడా పైన్నుంచి ఏదో కుర్చీ పిల్లలు పడేస్తే,.. పిల్లలు అంతా వచ్చి చూసి..’ఓస్ ఇంతేనా..అని బ్హాగా నిరాశ చెందారు..



ఒక స్నేహితురాలితో నా ఉదయం బాధని gchat ద్వారా పంచుకుని కాస్త శాంతించి... రాత్రి రోజూ లాగే శుభ్రం గా తినేసి, పుస్తకాలు చదువుకుంటూ అందరం పడుకున్నాకా, పాలు ఫ్రిజ్ లో పెట్టలేదని గుర్తొచ్చి లేచి వచ్చాక టీవీ పెడితే.. స్టార్ ప్లస్ లో 2012. నేనైతే కూర్చుని పూర్తిగా చూశాను. సాంకేతికం గా బాగా నచ్చింది. భలే తీశాడనిపించింది. అమెరికన్ల ప్రపంచం,వాళ్ల “ఉదారత” ..నవ్వొచ్చింది..



సినిమా చూస్తుండగా ఇంకో ఫ్రెండ్ ‘కర్ణాటక సంగీతం పాడే నిత్యశ్రీ భర్త ఆత్మహత్య వివరాలు చెప్తే బాధ వేసింది. ఇద్దరు అమ్మాయిలట. భర్త ఆత్మహత్య తర్వాత, తనూ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందిట. నిన్న రాత్రి అత్తగారు చనిపోయిందట. అసలు పాపం ఏమవుతోంది తన జీవితం లో?


 చాలా ఏళ్ల క్రితం నాకు చెన్నై లో శ్రీమతి పట్టామ్మాల్ గారి కోడలు (లలిత గారనుకుంటా) శిష్యురాలితో పరిచయం ఉండేది. ఓరోజు బీచ్ కి వెళ్లి వస్తూండగా ఆ అమ్మాయి ‘హమ్మో.. నాకు క్లాస్ సమయమైంది. చూసుకోలేదు.. ఎలా’ అని కంగారు పడి ‘పోనీ నువ్వు నాతో వస్తావా? పట్టమ్మాళ్ ఇంటికి తీసుకెళ్తాను వస్తావా?’ అనడిగింది. నేను ఏదో ఒక పిచ్చి పాత నూలు సల్వార్ కమీజ్ లో ఉన్నాను. పైగా ఇసుక రాలుతోంది. అయినా.. carnatic musical trinity లో ఒకరైన పట్టమ్మాళ్ ని చూసే అదృష్టమే!! నాకు నోట మాట రాలేదు. అలా వెళ్లిపోయాం. అక్కడ నిత్యశ్రీ ని చూపించి.. ‘ఈ అమ్మాయే.. మా మాడం కూతురు. తనూ బాగా పాడుతుంది.కచేరీలు చేస్తుంది.’ అని పరిచయం చేసింది.



నా స్నేహితురాలు క్లాస్ లో కూర్చుంటే.. నిత్యశ్రీ తో నేనూ పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చున్నాను. చాలా సరదాగా మాట్లాడింది. ‘అంత పెద్ద విద్వాంసురాలి మనవరాలు కదా.. మీకు చాలా గర్వం గా ఉండి ఉండవచ్చు కదా..’ అంటే.. ‘అవును. చాలా గర్వం గా ఉంటుంది. అలాగే చాలా అదృష్టం నాది’ అనిపిస్తుంది.. అంది. ‘మీరూ చాలా అదృష్టవంతులు..’ అంది.

‘అవును.పట్టమ్మాళ్ మనవరాలితో మాట్లాడే అవకాశం దక్కినందుకు.. కదూ’ అన్నాను.

‘చనువు గా ఒక్కసారి భుజం మీద చరిచి పక్కున నవ్వుతూ.. ‘కాదు. మీకు తెలుగు తెలుసు. తెలుగు వారు. త్యాగరాజ కృతుల్నినేర్చుకోవడానికి ఎంత ఈజీ మీకు? నాకు మా అమ్మ తెలుంగు నేర్పిస్తుంది..’ అంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించి ఆసక్తి గా అడుగుతూంది.

‘సబాపతిం..’ అని రాగం తానం.. పల్లవి అంటూ ఏదో పాడి వినిపించింది. అప్పట్లో నాకర్థం కాలేదు.. విని మొహమాటానికి బాగుందని చెప్పాను. ఈలోగా, మా నాయనమ్మ ని చూడాలంటే పక్క వీడు కెళ్ళాలి అంది.



అంత పెద్ద కళాకారిణి ఇంటికెడుతూ కనీసం ఒక మూర పూలు, ఒక స్వీట్ ముక్క,కనీసం మంచి బట్టలు కూడా వేసుకోలేదు  అనుకుని చాలా మొహమాటం గా వెళ్లాను. పట్టమాళ్ నాతో ఎవరో అమ్మమ్మ మాట్లాడినంత ప్రేమ గా మాట్లాడి ఊరూ, పేరూ తెలుసుకుని ఒక మూర మల్లెపూలు చేతిలో పెట్టి, ‘పెట్టుకో. నా ప్రోగ్రాం ఉంది. త్యాగరాయ సభలో.. వస్తావా? ‘ అని అడిగింది. నాకు నోట మాట రాలేదు. పట్టు చీరల్లో పట్టమాళ్, లలిత గారు, నిత్యశ్రీ, పక్కన దిష్టి బొమ్మల్లా నేనూ, నా ఫ్రెండూ.. పట్టమ్మాళ్ కొడుకు నాచేతికి ఒక ఎలక్ట్రానికి తంబూరా ఇచ్చి కాస్త పట్టుకోమ్మా.. అని కార్ లోకి ఇచ్చారు. అప్పుడు చూసుకున్నాను. హవాయి చెప్పులు..చింపిరి జడ.. కానీ పట్టమాళ్ ఇచ్చిన మల్లెమాల.. నిత్యశ్రీ కార్ లో కూర్చుని నేను వెళ్లటమేమిటి? అని.



రెండు కార్లు వెళ్లి ఆ సభ దగ్గర ఆగుతూనే, చాలా మంది ఆవిడకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతుంటే, ఆ వెనక మేము ఎలా వెళ్లామో, మొదటి వరస లో కూర్చుని ఏం విన్నామో.. దేవుడికెరుక. ప్రోగ్రాం అవుతూండగానే హాస్టల్లో మళ్లీ రానీయరని. స్టేజ్ మీద పాడుతున్న పట్టమాళ్ కి నమస్కారం చేసి, నాయనమ్మకి సహకారం ఇస్తున్న నిత్యశ్రీ కి బై అన్నట్టు చేయి ఊపేసి, నందనం బస్సెక్కేసాం...



జీన్స్ లో ‘కన్నులతో చూసినదీ’ పాటా,..చంద్రముఖి లో ‘వారాయ్’ అన్న పాట పాడి తెలుగు సినిమా ప్రేక్షకులకి చేరువ అయినప్పుడూ .. కర్ణాటక సంగీత సీడీ లు అమ్మే ప్రతి షాపు లోనూ తన సీడీ లు ఎప్పుడు చూసినా గర్విస్తూ ఉంటాను.. ఇదంతా ఇంకోసారి గుర్తు చేసుకుని..నిద్రపోయాను...



ఈరోజు లేచి చూస్తే.. నరకం లో నూనె లో కాల్చబడుతూనో, స్వర్గం లో కుర్చీల్లో కూర్చుని రంభా వాళ్ల డాన్సులు చూడకుండా,.. పాల పాకెట్లు మళ్లీ చింపుకుని స్టవ్ మీద పెట్టుకుని రోజు మొదలు పెట్టాల్సి వచ్చినందుకు సంతోషం గానే ఉన్నా,.. ఏమూలో ఒక చిన్న, mild disappointment.

Saturday, December 8, 2012 29 comments

గేటెడ్ కమ్యూనిటీ కథలు... రాధా మామియార్, సెంథిల్ మామ




“రాధా మామీ వస్తోంది.. లోపలకి పోదాం. లేకపోతే అరగంట దాకా వదలదు!! పద పద.. “..అని గబుక్కున ఇంట్లోకి లాక్కెళ్లి పోయింది రెండో నంబరావిడ.. అతి లాఘవం గా మిగిలిన జనాలు కూడా ఆవిడకి కనబడకుండా అందరూ భాగో అని తలుపులేసేసుకున్నారు..

(రాధక్క - మైత్రి)

‘అరే.. ఎవరబ్బా..ఆవిడ.. అంతలా హడిలిపోతున్నారు జనాలు’ అనుకుని కర్టెన్ లోంచి నెమ్మది గా తొంగి చూశాను. జుట్టుకి మైదాకు పెట్టి పెట్టి ఎర్రగా ఉంది. కాస్త భారీ మనిషి ముసలావిడ.. రోడ్డు మీద కొద్దిగా బాలన్స్ చేసుకుంటూ నడుస్తోంది.. నాకెప్పుడూ ఆవిడ తో మాట్లాడే సందర్భం రాలేదు.. నేను ఇక్కడ దిగే సమయానికి ఆవిడ కోడలి డెలివరీ కి అమెరికా వెళ్లిందట. అందువల్ల పరిచయ భాగ్యం కలగలేదు.

తర్వాత తీరిగ్గా కాస్త తెహ్కీకాత్ చేస్తే బయట పడ్డ విషయాలు.. రాధా మామియార్ కి కనీసం అరవయ్యయిదు వయసు. ఆవిడ భర్త సెంథిల్ గారికి ఓ డెబ్భై ఉంటుంది. కొడుకులు ముగ్గురూ ఖండానికొక్కరు గా వెళ్లి సెటిల్ అయ్యారు. ప్రతి సంవత్సరం,.. లండన్ కో, ఆస్టేలియాకో, అమెరికా కో ప్రయాణం కడుతూనే ఉంటారు భార్యా భర్తలు. కాలనీ లో ఉన్నప్పుడు వాళ్లని భరించడం మానవ జాతి తరం కాదు.

సెంథిల్ మామ రహస్యం చెప్తే మా నలభై ఇళ్లవాళ్లకీ మైక్ లో చెప్పినట్టు ఉంటుంది. ఇక గళమెత్తి ఏదైనా పద్యం అందుకుంటే చిన్నస్వామి స్టేడియం వాళ్లు మైకూ, స్పీకరుల్లాంటి ఖర్చులు లేకుండా ఈయన చేతే అక్కడ క్రికెట్ మాచిలకి కామెంటరీలు చెప్పించీగలరు. ఇక రాధా మామియార్ కి తను పెద్దదాన్ని అని ఒప్పుకోవడం ఇష్టం ఉండదు..ఇరవైల్లో, ముప్ఫైల్లో ఉన్న ఆడవాళ్ల తో అక్కా అని పిలిపించుకోవాలని బాగా తహ తహ. విధి వశాత్తూ రోజు లో ఏ సమయం లో ఎక్కడ కనిపించినా.. ఇక కనీసం ఒక గంట ఇంక ఆవిడ వదలరు.. గడగడా మాట్లాడుతూనే ఉంటుంది.

ఈ విషయాలు విన్నాకా నేను ప్రత్యేకం గా ఆవిడ తో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నించలేదు. రోడ్డు మీద కనిపించినప్పుడు పలకరింపు గా ఒక చిరు నవ్వు., ఎవరో తోస్తే వంచినట్టు తలని అరక్షణం దించి, ఏదో పని మీద వెళ్తున్నట్టు ఉరుకులూ పరుగులూ పెట్టడం. మావారు మేనేజ్మెంట్ కమిటీ లో ఉండటం వల్ల సెంథిల్ మామ మాత్రం ఆ సంవత్సరం కోశాధికారి గా పనిచేయడం వల్ల చాలా సార్లు ఇంటికి వచ్చి ఏవో డబ్బుల లెక్కలు మాట్లాడుకోవడం మాత్రం జరిగేది. ఆయన మొదట్లో వచ్చి మాట్లాడేప్పుడు మావారి ని ఎందుకు అంతలా అరుస్తున్నారు అని ఒకటి కి పది సార్లు తొంగి చూసి, కొన్నాళ్లకి ఆయన తీరే అంత అని అర్థమయ్యాకా పట్టించుకోవడం మానేశాను.

ఈలోగా పంద్రాగస్తు వచ్చేసింది. మరి పొద్దున్నే ఖచ్చితం గా ఎనిమిది కల్లా జండా ఎగరేద్దామని నిర్ణయించుకుని అందరం ఠంచన్ గా తొమ్మిదీ, తొమ్మిదీ పదికి బద్ధకం గా జండా కర్ర దగ్గర నుంచున్నాము. ఈలోగా గున గునా నడుస్తూ రాధా మామీ.. ఆవిడని చూసి అప్పడిదాకా ముఖం గంటు పెట్టుకున్న వాళ్లు ఆవిడని చుట్టు ముట్టేసి ‘బాగున్నారా మామీ.. కనిపించడం మానేసారే? ‘ అని కుశలం అడుగుతుంటే ముక్కున వేలేసుకోవడం నా వంతైంది. ఆవిడ తీవ్రం గా ‘ఎనిమిది గంటలకి రమ్మంటే సంవత్సరానికి రెండు సార్లు కూడా స్నానాలు చేసి ఇక్కడకి రాలేరా? నేను ఇది మూడోసారి రావడం.. ఒక్కరూ లేరని వెనక్కి పోవడం.. ఏంటమ్మా? ఒక్క పూట కాస్త ఉదయమే లేవ లేరా? మీరే ఇలాగైతే మీ పిల్లలకి ఏం క్రమశిక్షణ నేర్పుతారు? ‘ అని అందరి మీదా విరుచుక పడింది.


నాకు భలే కిక్ వచ్చింది. నేనూ పిల్లలకి అల్పాహారం పెట్టేసి హడావిడి లో ఉదయం చాయ్ కూడా మానుకుని జెండా కర్ర దగ్గర పడిగాపులు కాస్తుంటే.. నాకూ ఇంచుమించు అదేస్థాయి అసహనం వచ్చింది. కానీ ఆవిడ లా బయట పడక నోరు మూసుకుని కృత్రిమ చిరునవ్వు అతికించుకుని తిరుగుతున్నాను. ఆవిడ వాక్ప్రవాహానికి అడ్డు వేయడానికే అన్నట్టు జండా ఎగరేసే కార్యక్రమం మొదలై పోయింది. పదకొండు గంటలకి మళ్లీ అందరూ కలవాలనీ, అప్పుడు అంత్యాక్షరీ, క్రికెట్ కార్యక్రమాల తర్వాత భోజనాలనీ నిర్ణయించుకుని అందరూ ఎవరిళ్ళకి వాళ్లు బయల్దేరారు. పిల్లలు, మావారు క్రికెట్ వైపు వెళ్లడం తో, నేనూ ఏదైనా టిఫిన్ తినేసి హాయిగా మాంచి పుస్తకమో, లేక టీవీ లో సినిమాయో చూద్దామని ఉత్సాహం గా ఇంటికేసి అడుగులేస్తుంటే, వెనక నుంచి ‘కృష్ణా.. ఉదయపు కాఫీ తాగలేదన్నావు కదా ఇంకా? నీతో ఈ రోజు పరిచయం సందర్భం గా ఫిల్టర్ కాఫీ పెడతాను మా ఇంటికి పద..’ అని మొహమాట పెట్టేసింది రాధా మామీ.


సరిగ్గా పని చేయనప్పుడు కాబిన్ లోకి .మేనేజర్ వెనక వెళ్తున్న ఉద్యోగి వెళ్తుంటే మిగిలిన వాళ్లు చూసినట్లు కొంతమంది జాలిగా, కొంతమంది ‘బాగా అయ్యింది దీనికి’ అన్నట్టు చూస్తున్నారు. నాకూ కొద్దిగా బెరుకు గా అనిపించింది.. ఇంట్లోకి వస్తూనే గమనించింది.. హాల్లో రకరకాల పత్రికలు చిందర వందర గా.. ఒక పక్క బల్ల నిండా మందులే. ఇంకో పక్క తాగేసిన కాఫీ కప్పులు.. మడత పెట్టాల్సిన బట్టలు. వంటింట్లో కి నడిస్తే అక్కడ సింక్ నిండా అంట్లు, పొయ్యి మీద ఉదయం పొంగిన పాల తాలూకు మరకలు, రాత్రి మూకుడు లోంచి ఎగిరి తప్పించుకున్న తాళింపు గింజలు.. అరుగు నిండా సామాన్లు.. ఆవిడ ఏమాత్రం సిగ్గు పడకుండా ఫిల్టర్ కాఫీ కప్పులోకి పోసి ‘పద..హాల్లో కూర్చుందాం.. ఇక్కడ చాలా సఫోకేటింగ్ గా ఉంది.. ‘ నన్ను సోఫాల్లోంచి పత్రికలని ఓ వైపు తోసుకొమ్మని, ఆవిడ బట్టల మూటని దీవాన్ మీదకి పెట్టి కబుర్లు చెప్పడం మొదలు పెట్టింది. చక్కటి ఆంగ్లం.

ఐదు నిమిషాల్లోనే ఆవిడ అద్భుతమైనభాషా జ్ఞానం నాకు అవగతమైంది. ఇంకో పది నిమిషాలకి ఆవిడకి సంగీతం లో ప్రవేశం ఉందనీ, మొక్కలంటే ప్రాణమనీ, ఈ వయసు లో పది కిలోమీటర్లు వెళ్లి సంగీతం నేర్చుకుంటుందనీ, చిన్న స్కూల్లో ఆంగ్లం, లెక్కలూ చెప్తుందనీ, అప్పుడప్పుడూ ఆడపిల్లల సంక్షేమ హాస్టల్ లో వాలంటీరింగ్ చేస్తుందనీ అర్థమైంది.

వచ్చేసేముందు అన్నాను... 'రాధా మామీ,.. ఇంత చక్కటి ఇంగ్లిష్ ఎలా మాట్లాడుతున్నారు? ఒక పక్క తమిళ్, ఇంగ్లిష్ పెద్ద పెద్ద నవల్లు చదువుతున్నారు.. ఒక పక్క భజన సంఘాలు, పూజలు..కిట్టీ పార్టీలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఆసక్తి.. ఇదంతా చేయటానికి ఎంత ఓపిక, ఆసక్తి ఉండాలి.. మీరు చాలా యూనీక్ పర్సన్ '

వెంటనే.. ఆవిడకి ముఖం లో అప్రసన్నత ఆవహించింది. 'నన్ను మామీ అనద్దు. పేర్లతో పిలుచుకుందాం. నన్ను రాధా అని పిలువు. లేదా.. నీకన్నా పెద్ద కాబట్టి రాధక్కా /రాధాజీ అని పిలిచినా ఓకే.. ' నేను ‘అలాగే అలాగే ‘అని కంగారు గా అనేశాను. ఆవిడ కూడా తగ్గి ‘నేను సింగపూర్ లో పుట్టి పెరిగాను. నాకు 18 ఏళ్లు వచ్చేసరికి మా నాన్నగారికి జబ్బు చేసి అర్జెంట్ గా పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోతుందని మెడిసిన్ చదువుతున్న నన్ను బలవంతం గా మీ అంకుల్ కి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆయన ఇండియా కి వచ్చేసి ‘నువ్వు వస్తే రా.. నేను మాత్రం విదేశాల్లో ఉండే ప్రసక్తే లేదు..’ అనడం తో చదువు ఆపేసి వచ్చేయాల్సివచ్చింది. ఈలోగా వరసగా ముగ్గురు పిల్లలు.. ‘ అనేసి ఆపేసింది.

తర్వాత ‘చూడు ఇల్లు.. It’s all mess. Clean & neat house is a sign of a wasted life’ అని నమ్ముతాను. నాకున్న ప్రతి క్షణాన్నీ నాకిష్టం వచ్చినట్లు గడపటానికి ఇష్టపడతాను’ అందావిడ.

ఆరోజు అంత్యాక్షరీ లో ఎవ్వర్నీ పాడనీయకుండా ఆవిడే అన్నీ పాడేసిందనీ, ఎవ్వరికీ మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా ఆవిడే మాట్లాడేస్తోందనీ అందరూ విసుక్కుంటూనే ఉన్నారు. తర్వాత ఆవిడ నన్నూ ఎప్పుడూ వదిలేది కాదు. ఎప్పుడో స్కూల్లో కడుపు నొప్పి సాకు తర్వాత, మళ్లీ ఆవిడ తో కబుర్లకి ‘మీటింగ్ ఉంది.. పిల్లలకి పరీక్షలు.. చుట్టాలొస్తున్నారు.. ‘ లాంటి సాకులు చెప్పి తప్పించుకోవడం లో Expert అయిపోయాను. తోట పని చేసుకుంటున్నా, ఎవరితోననైనా కబుర్లు చెప్తున్నట్టు కనిపించినా అంతే సంగతులు. ఖాళీ గానే ఉన్నావు కదా అని ‘రాధక్క’ నుంచి అలా కబుర్లు జీవనది ప్రవహిస్తూనే ఉండేది. అప్పుడప్పుడూ కొత్తరకం సాంబారు. పోరియల్, కేకులు, పాస్తా లూ తెచ్చి ఇస్తూ ఉండేది.  నాకు ఆవిడ ని తప్పించుకు తిరిగే ప్రణాళికలేయడం దినచర్య లో భాగమైపోయింది.


(సెంథిల్ మామ - ధాత్రి)
ఈలోగా సెంథిల్ గారిమీద అందరూ విసుక్కోవడం విపరీతమైపోయింది. ఆటోలో మోటారు బాగుచేయించుకుని వచ్చిన కాలనీ సిబ్బంది ని ‘ఆటో ఫేర్ కి రసీదు ఇస్తే కానీ బిల్లు పాస్ చేయననీ, అలాగే కాలనీ లో నాలుగు మొక్కలేస్తే.. ఛీప్ గా వస్తున్నాయని రాసీదులివ్వని చోట కొన్నారని తెలిసి డబ్బులు రిలీజ్ చేయలేదని ఒక గొడవ.. అంతకుముందు పని చేసిన కోశాగారాధికారి రిజిస్టర్ లో బాలన్స్ షీట్ సరిగ్గా టాలీ అవలేదని.. కాలనీ వాసులు నీళ్లు ఎక్కువ వాడేస్తున్నారని విమర్శిస్తున్నాడని ఎప్పుడూ ఆయన నిరంకుశ ధోరణి చర్చలే. అన్నింటికీ మించి ఆయన కసురుకున్నట్టు మాట్లాడటం మాత్రం తెల్ల కాలర్ ఉద్యోగులెవ్వరికీ కిట్టక అంతా లబలబ లాడిపోయారు.


ఆయన టర్మ్ అయ్యేసరికి ఆయనకి కాలనీ నిండా విరోధులే. ఆవిడ ని చూస్తే చాలు పరుగున ఇంట్లోకెళ్ళి తలుపులేసుకునే వారే ఎక్కువ. నేను మాత్రం ప్రతి ఆగస్టు 15 కీ, జనవరి 26 కీ ఆవిడ ఇంట్లో ఫిల్టర్ కాఫీ కార్యక్రమం మాత్రం వదల్లేదు. ఆవిడ పుస్తక పరిజ్ఞానం, సంగీతం విజ్ఞానం, సామాజిక స్పృహ .. వహ్వా..వహ్వా.. కానీ ఇలాగ అందరినీ ఊదరకొట్టకుండా ఉంటే ఎంత బాగుండు? అని రోజూ అనుకునేదాన్ని.

ఈలోగా.. ఓరోజు రాధా మామీ కింద పడిందని, కాలు ఎత్తలేక పోతోందని విన్నాను. ఆవిడ ఉంటే విముఖత వదిలి అందరూ తండోపతండాలు గా వెళ్లి పలకరించి వచ్చాం. నాకు ఎక్కువ కుదరకపోయినా.. చాలా మంది ఆవిడకి వంటావిడ కుదిరేలోపల కూరో, కుమ్మో అన్నంతో ఇచ్చి రావడం అలవాటు చేసుకున్నారు. ఆవిడ ధోరణి లో మార్పు లేదని, ఇంకా కబుర్లతో వాయిస్తూనే ఉందని విన్నాను. నేనూ సాయంత్రం నడక చివ్వర్లో ఓ నిమిషం ఆగి పలకరించి పరిగెత్తుకొచ్చేసేదాన్ని. ఆవిడ ఎలాగైనా లేచి నడవాలని ఒక పట్టుదల తో ఉండేవారు. భయంకరమైన విల్ పవర్. ఓసారి వెళ్లినప్పుడు ‘ఇంకో నిమిషం ఉందా నీ దగ్గర కృష్ణా’ అని అడిగారావిడ. ‘ష్యూర్ చెప్పండి అక్కా..’ అంటే.. లోపల అల్మారా లో ఒక పాకెట్ లో చీరలున్నాయి. ఇలా తీసుకురా.. అందావిడ. సరేనని తెచ్చాను.. అన్నీ పరవమంది. పరిచాకా, నువ్వొకటి తీసుకో.. అంది.

‘బానే ఉంది. నాకెందుకు? అస్సలూ వద్దు’ అనేశాను. ‘లేదు. మీ అందరికీ ఇద్దామని.. తెప్పించాను..’ నా పిల్లలెవ్వరూ రాలేదు.. మీరే కదా నాకు ఇంత సహాయం చేశారు! మేము ఇక్కడినుంచి వెళ్లిపోతున్నాము.. వచ్చేవారం.’ అంది. ‘అయ్యో మనిపించింది.’ కానీ వాళ్లు వెళ్లేది సిటీ మధ్యలో అపార్ట్మెంట్ లో మొదటి అంతస్తు లోకి.. ఎదురుగా డాక్టర్, బొక్కెన కి తాడు కట్టి కిందకి వదిలితే కూరగాయలు, పచారీ కొట్టు సామాన్లు, చప్పట్లు కొట్టి పిలిస్తే ఆటో సదుపాయం,.. అపార్ట్ మెంట్ లో బోల్డు మంది సీనియర్ సిటిజన్లు..ఎదురింట్లో ఆవిడ అక్కగారి కొడుకు..

నిజమే అదే కదా కావాలి వాళ్లకి ఈ వయసులో.. రెండు కిలో మీటర్లు నడిస్తే కానీ బస్సు/ఆటో దొరకని చోటు, డాక్టర్ కావాలంటే అరగంట వెళ్ళాల్సి వస్తే.. ఉప్పు కి అరకిలో మీటర్, కాయగూరలకి రెండు కిలో మీటర్లు వెళ్లాల్సి వచ్చే చోట, తన అనుభవ సారాన్ని రంగరించిన కబుర్లు వినేందుకు మనిషి లేని చోటు.. ప్రేమ గా అదిలిస్తే, క్రమశిక్షణ, సిన్సియారిటీ ని బోధిస్తే ‘shouting/interfering ’ అనుకుని విసుక్కునే చోటు..

అది నందనవనమైతే ఏంటి? ఇల్లు విశాల భవనమైతే నేంటి..కాలుష్య రహితమైతే నేంటి.. “Good Decision, we will miss you Radhakkaa..’ అన్నాను.. మనస్పూర్థి గా.. ఆవిడ ఒకింత సిగ్గు గా.. ‘You are like my daughter.. Call me Radha maaami.. No akkaa business’ అనేసింది. సెంథిల్ మామ దగ్గర్నించి కూడా సెలవు తీసుకుని కొద్దిగా బరువు గా అనిపిస్తుండగా వచ్చేశాను.

ఇప్పుడు మా కమ్యూనిటీ లో శబ్ద కాలుష్యం తక్కువైంది బాబూ.. ఎవ్వరూ వచ్చి ఆపేసి కబుర్లు చెప్పేయరు. సమయపాలన గురించి లెక్చర్లు ఇవ్వరు. అకౌంట్లు మెయింటెయిన్ చేయడం గురించి నిలదీయరు.. కాలనీ నీళ్లు వృధా చేస్తే అడిగే వాళ్లుండరు. ఏంటో...చుట్టూ ప్రశాంతతే! అది తినూ, ఇది తాగూ.. అని బలవంత పెట్టేవారు లేరు. నాకు ఈసారి జనవరి 26 న కమ్మటి కాఫీ చేతికిచ్చి ఎవ్వరూ మిల్టన్ పొయెట్రీ, త్యాగరాయ కృతుల చర్చలు చేయరు. టీవీ లో ఏదో ఒక చానెల్ లో సుత్తి ప్రోగ్రాం హాయి గా ఎంజాయ్ చేయవచ్చు...

Sunday, November 25, 2012 38 comments

ఆల్ రౌండర్ సుబ్బు గాడి కబుర్లు..



ఇంటి నుంచి పని చేస్తున్నాను కదా.. కాస్త కులాసా గా పడక్కుర్చీ లో కాళ్లు జాపుకుని, లాప్ టాప్ లో సినిమా పాటలు పెట్టుకుని, మధ్యాహ్నం భోజనం తాలూకు సుషుప్తావస్థ లో జోగుతూ,  మధ్యలో ఉలిక్కి పడి ‘ఎవరైనా పింగ్ చేశారా?‘ అని చూసుకుంటుండగా   ‘డింగు’మంటూ కాలింగ్ బెల్ మోగింది. ఉలిక్కి పడి లేచి తలుపు తీసేపాటికి. మా చిన్నమ్మాయి తలుపు తోసుకుని వచ్చి విసురు గా సంచీలు ఓపక్క విసిరి ‘హుం’ అనుకుంటూ లోపలకి వెళ్లిపోయింది.

ఏమైందో ఏంటో నని నేను లేచి వెనగ్గా వెళ్లి కాసిని ఊసుబోక కబుర్లు చెప్పి, నెమ్మది గా  ఆ విసుగు కి కారణం ఏంటో కనుక్కుంటే తేలింది... క్లాస్ టెస్టుల మార్కులు ఇచ్చారు, దీనికి పదిహేడు మార్కులొచ్చాయి ఇరవై కి.
 ‘ఓస్.. ఆ మాత్రానికేనా?.. బాగానే వచ్చాయి కదే? ఇరవై కి పదిహేను దాటితే చాల్లే..’ అని తేలిగ్గా తీసిపడేసి నా పని నేను చేసుకుంటున్నాను..
‘ఇరవై కి పదిహేడంటే, వందకి ఎంతన్నట్టు?’ అడిగింది.

‘నన్నడుగుతావా? నువ్వే కట్టు లెక్క! నేర్చుకున్నావు కదా.. పర్సెంటేజ్ కట్టటం..’

‘ఓకే..ఓకే.. చూస్తాను..‘ అని పావుగంట ప్రయత్నించి.. నెమ్మదిగా తేల్చేసింది.. ‘ఇలాగ ఆడ్ నంబర్లకి పర్సెంటేజ్ లు కట్టలేరు. మా టీచర్ చెప్పింది.’

ఇంక మా టీచర్ చెప్పింది అన్న మాట ఫైనల్! దానికి తిరుగు లేదు. ప్రపంచం లో ఏ ఆర్గ్యుమెంటూ ఇక పని చేయదు. టీచర్ ఏది చెప్తే అదే రైటు. అంతే కాదు టీచర్ ఏం చెప్పినా, పిల్లలకి ‘ఏవిధంగా’ అర్థమయితే అదే రైటు..

‘ఆహా.. మరాలంటప్పుడు ఒక బిట్ ప్రశ్న ఎక్కువ రాయటమో, ఒక ప్రశ్న మానేయటమో చేయాల్సింది..’

‘అమ్మా.. రాసేటప్పుడు ఎలా తెలుస్తుంది? రాసినప్పుడు ఇరవై కి ఇరవై వస్తాయనుకున్నా!’

‘సర్లే..ఇంతకీ సుబ్బుగాడికెన్నొచ్చాయే?.. పక్కింటి భవానీ కి?’
కోపం గా చూస్తూ ‘సుబ్బు కాదు, శుభ్రోతో  అని ఎన్నిసార్లు చెప్పా! నీకు..’ అని అంతలోనే మొహం అదోలా పెట్టి..’నీకు తెలుసు కదమ్మా.. ఇరవై కి ఇరవై..’  

నవ్వొచ్చింది నాకు.. ఎప్పుడూ ఈ సమాధానం లో మార్పుండదు.. ప్రతి సబ్జెక్టు లోనూ వంద శాతం.. మార్కులే..  ఒక క్వార్టర్ మొత్తం లో కొన్ని చెప్పి, కొన్ని ముందస్తు గా చెప్పకుండా పెట్టిన వివిధ పరీక్షల్లో, ఒక్కసారైనా ఒక్క మార్కైనా తక్కువ వస్తుందేమోనని చూస్తాను.

వాళ్లకి తక్కువ రావాలని నా కోరికయితే కాదు.. కానీ.. అసలు అంతలా ఎలాగ చదవగలుగుతున్నారని నాకు ఆశ్చర్యం... అబ్బే.. నేను ఇంతవరకూ వాళ్లకి ఒక సబ్జెక్ట్ లో అరమార్కు తక్కువ వచ్చినట్లు ఎప్పుడూ వినలేదు. ఒక్కోసారి భవానీ కి అటూ ఇటూ అవటం విన్నాను. కానీ సుబ్బు? నో వే! వాళ్లమ్మ ఉత్తర ప్రదేశ్, నాన్న బెంగాలీ. IIT టాపర్లు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లి తన పెద్ద ఉద్యోగం పిల్లలకి దిశా నిర్దేశం చేయటానికే మానేసి అహర్నిశలూ కష్టపడుతుందని విన్నాను. బస్ లో వస్తే చుట్టూ తిప్పి తెచ్చి పిల్లవాడి 'క్రియేటివ్' సమయం వృధా అవుతుందని రోజూ ఆవిడే పిల్లవాడిని దింపి తెచ్చుకుంటుందని విన్నాను. చాలా సార్లు స్కూల్లో ఆవిడని చూశాను, కొంత పరిచయం ఉంది.

వారం దాటాకా, త్రైమాసిక పరీక్షల మార్కులిచ్చేసారు. క్లాస్ లో పదమూడో రాంక్ వచ్చింది దీనికి. 538/600. ‘చాలా మంచి మార్కులు’ .. అని మనస్పూర్తి గా మెచ్చుకున్నాను. రాంక్ ఎంతైతే నేంటి? దానికే ఆనందం గా లేదు. మొహం అంతా అదోలా పెట్టుకుని తిరిగింది ఒక పూట. సాయంత్రానికి వచ్చి కూర్చుంది. 

‘అమ్మా! నువ్వు.. ఈసారి సుబ్బుగాడికి ఎన్నొచ్చాయో ఎందుకడగ లేదు?’
‘అమ్మలూ.. అది నాకు అనవసరం. చిన్న చిన్న టెస్టులకి సరదా గా అడుగుతాను. కానీ I really don’t care.. సుబ్బుగాడికి తల్లిని నేను కాదు.. అయినా వాడికీ , భవానీకీ మొదటి రెండు రాంకులు వచ్చే ఉంటాయి. నాకు తెలుసు’

కొన్ని క్షణాల ఆలోచన తర్వాత..
‘కానీ వాడికన్నా నాకు మార్కులు తక్కువ వచ్చినందుకు నీకు బాధ కలగలేదా?’
‘ఎందుకు అలాగ అడుగు తున్నావు? నేనేమైనా ఆనందం గా లేనని నీకనిపించిందా?’

‘లుక్ అమ్మా..  ప్రతి పేరెంట్ కీ వాళ్ల వార్డ్ కి మొదటి రాంక్ రావాలని ఉంటుందని నాకు తెలుసు. కానీ.. సుబ్బు గాడికి ఎన్ని మార్కులొచ్చాయో నీకు తెలుసా? 599/600. వాడికే ఫస్ట్ రాంక్. రెండో రాంక్ భావీ కి! దానికి 595/600. నేను వాళ్లతో కంపీట్ అయి ఫస్ట్ రాంక్ తెచ్చుకోవాలంటే.. ప్రతి క్లాస్ టెస్ట్ లో ఒక్కసారి కూడా I can not afford to lose even half a mark.. that means, I have to be 100% prepared all the time. I can not fall sick,or simply take a day off. I need to be at school every single day, fully prepared, so I can attend every single surprise test,.. ‘

‘హ్మ్మ్.. కానీ, నేను నిన్న ఫస్ట్ ప్లేస్ లో ఉండి తీరాలని ఎప్పుడైనా పట్టు పట్టానా? ‘
‘ఇప్పటి వరకూ అలాగ అనలేదు. కానీ.. నేనే చెప్తున్నా.. మీరిద్దరూ బాధ పడను.. అని అంటే.. నాకు హాయిగా ఉంటుంది’

ఈ మధ్య దీని ఫ్రెండ్స్ లో ఈ ట్రెండ్ బాగా గమనిస్తున్నాను. ప్రతి వాళ్లూ 'ధోనీ, తారే జామీన్ పే..' లు చూసేసి మంచి మార్కులు తెచ్చుకునే పిల్లల గురించి కచ్చగా ‘నెర్డు’లని, వాళ్లకి ఇంకే వ్యాపకం లేదని.. అదంతా ఒక ‘అన్ కూల్’ వ్యవహారం అని అనటం. తల్లిదండ్రులు కూడా ‘మా పిల్లలని మేము గుడ్డిగా చదువు అని వాళ్లని తొయ్యం.. ఫలానా వాళ్లల్లాగా.’ అంటూ, ఇంట్లో మాత్రం రహస్యం గా బెత్తాలు విరగదీసి మరీ చదివించటం..

‘యా.. మేమేం బాధ పడం.. నీ సంగతి నువ్వు చూసుకో.. 100% తయారీ తో వెళ్లి రాయటం లో తప్పు లేదు. అదేమీ.. పెద్ద ‘nerdish/uncool’ ఏమీ కాదు. ఇంక ఒక పూట స్కూల్ కి వెళ్లాలనిపించలేకనో లేక అనారోగ్యం వల్లనో వెళ్లలేక మార్కులు తగ్గితే దానికి మనమేమీ చేయనక్కరలేదు..సంతోషం గా చదవగలిగినంత చదువు. శ్రద్ధ గా పరీక్షలు రాయి అది చాలు.’  అని చెప్పా..
అప్పటితో ఆ టాపిక్ అయిపోయింది.

ఆలోచిస్తూ కూర్చున్నాను. దీని క్లాస్మేట్ తల్లి కూడా ఇలాంటి సంభాషణ ఈ కాలం పిల్లలకి ఎంత క్లారిటీ.. అంతే కాదు.. ఒక నాలుగో తరగతి పిల్ల తల్లిదండ్రుల దగ్గర తన ఆర్గ్యుమెంట్ ఎంత ధైర్యం గా చెప్తోంది.. తనకి రాంక్ రాకపోవటానికి థీరీలు చెప్పి, సమర్ధించుకుని మేము ప్రశించకుండా ముందరి కాళ్లకి బంధాలు వేయటానికి ప్రయత్నిస్తోంది.  మేము చదువుకున్నప్పుడు .. ప్రోగ్రెస్ కార్డ్.. ఎప్పుడూ.. ఫ్లయింగ్ సాసర్ లా విసిరేస్తే మళ్లీ తెచ్చుకోవటం..సంతకం చేయమని బ్రతిమలాడుకోవటం తప్ప ప్రశ్నించింది చాలా తక్కువ సందర్భాల్లో..

సుబ్బు గాడికి క్రితం ఏడు కూడా, అన్నింటిలోనూ ఫస్టే.. చదువే కాదు, లెక్కల క్విజ్, ఒలింపియాడ్లు, ఈత, చెస్, తైక్వాండో.. టెన్నిస్ ఏడు గోల్డ్ మెడల్స్...   మా పిల్లల గురువు గారి దగ్గరే సుబ్బు గాడు సంగీతం నేర్చుకుంటాడు. ప్రతి సంవత్సరం సంగీతం స్కూల్ వార్షికోత్సవం లో కనిపిస్తాడు. ఓ మాదిరి గా పాడతాడు. ‘exceptional,gifted...’ అయితే కాడు. కానీ, ఒక్క పాట హార్మోనియం వాయిస్తూ మరీ పాడి, వాళ్ళక్క పాడినప్పుడు తబలా మీద వాయిద్య సహకారం ఇచ్చాడు.  

‘వార్నీ.. వీడికి తెలియని విద్య అంటూ ఉందా? అసలు?’ అనుకున్నా.   ఏది ఏమైనా, సుబ్బు గాడిని పరిశీలించటం గత మూడేళ్లుగా నాకొక హాబీ అయిపోయింది.. గత నెల్లో స్కూల్లో ఏదో సైన్స్ ఎక్జిబిషన్ అంటే వెళ్లాం.. మా అమ్మాయి ప్రాజెక్ట్ అయితే వాళ్లు ఎంచుకోలేదు కానీ సుబ్బు, భవానీ ఒకే ప్రాజెక్ట్ చేసినట్టున్నారు. నేను వెళ్లి దాని గురించి అతని వాక్చాతుర్యం గురించి కూడా తెలుసుకున్నాను. చాలా ఉత్సాహంగా, సరదాగా నవ్వుతూ, మధ్యలో భవానీ మీద జోకులు కూడా వేస్తున్నాడు.  ఈ అబ్బాయి నిజంగా ‘exceptional’ అని ఒక ముద్ర మనసులో వేసేసాను.

ఈ మధ్య కూరగాయలు కొంటుంటే, పక్కనే సుబ్బు తల్లి.. పలకరింపు గా నవ్వింది. కుశల ప్రశ్నలయ్యాకా, ‘సంగీతం మాస్టారు ఎందుకో మా అబ్బాయి కి నచ్చట్లేదండీ ఈ మధ్య.. ఎంత బాగా పాడినా.. బాగా పాడటం లేదని దెబ్బలాడుతున్నాడు ఆయన. అసలు మా అబ్బాయి సంగతి తెలుసు కదా.. వాడు పర్ఫెక్ట్. వాడికే తప్పులు పడుతున్నాడు. ఆయన తీరు నాకూ పెద్దగా నచ్చట్లేదు. మీకు ఎలా ఉన్నాడు ఆయన?’ అని అడిగారు.

‘ఏమో నండీ.. మా పిల్ల ఎప్పుడూ అల్లరి చిల్లర గా పెద్దగా ప్రాక్టీస్ చేయకుండా వెళ్తుంది. ఆయన ఓపిగ్గా చెప్తున్నారు అనిపిస్తుంది. మా చిన్నప్పటి టీచర్ అయితే, కళ్ళు కిటికీ వైపో,  గడియారం వైపుకో తిరిగితే కూడా క్లాస్ ఆపేసి పొమ్మనేది. బోల్డు తిట్లు తిట్టేది. ‘ అన్నాను. 
‘అదీ నిజమే.. కానీ మావాడు బాగా ఇరిటేట్ అవుతున్నాడు. భరించలేకపోతున్నాడు.He is very sensitive you know.. ’ అనేసిందావిడ. నేనేమనాలో తెలియక ఊరుకుండిపోయాను. 

ఈలోగా, ఓ రోజు మా చిన్నది ఇంటికొచ్చి ‘అమ్మా.. ఇవ్వాళ్ల స్కూల్లో సుబ్బు చాలా ఏడ్చాడు. ఎర్రగా అయిపోయాడు. తెలుసా? అదీ ఎందుకో తెలుసా? సైన్స్ క్విజ్ లో వాడికన్నా భావీ కి ఒక్క మార్కు ఎక్కువ వచ్చిందని.. ‘just for one mark ‘ అమ్మా.. ఛీ అంత మంది లో ఒక సైన్స్ క్విజ్ గురించి ఏడవటం నాకైతే చాలా సిల్లీ అనిపించింది..’ అంది.
ఈ ఫస్ట్ వచ్చి తీరాలనే జబ్బు వీడికి ఇంత బలం గా ఉందన్నమాట.. అనుకున్నాను.

 ఈమధ్య  ఆధార్ కార్డులకి ఫోటోల కోసం లైన్లో నుంచున్నా. చాలా రద్దీ గా ఉంది. ఒక గంటైనా పట్టేట్టు ఉంది. పక్క లైన్లో సుబ్బు తల్లి కనిపించింది. పిచ్చాపాటీ మొదలు పెట్టాం.
‘సంగీతం మానేశాడండీ మావాడు’
‘అయ్యో! అదేంటి? పాట, హార్మోనియం, తబలా.. అన్నీ చేస్తాడు. ఆల్ రౌండర్ అనుకుంటాము మేము.. ఏమైంది?’
‘సంగీతం సార్ ఒకసారి సరిగ్గా శృతి లో పాడటం లేదని తిట్టాడు. దానితో he got terribly hurt!. ఇలాగైతే ఇక సంగీతం చెప్పను. ఒక్క మాట కూడా అనకూడదంటే ఎలాగ? అన్నాడాయన. మా వాడు కొద్దిగా మొండి గా ‘నేనే కరెక్ట్ పాడుతున్నాను..’ అని ఇంకా అలాగే తప్పు శృతి లో పాడుతూ ఉన్నాడు. దానితో ఆయన కి కోపం వచ్చి నీకు అన్నీ వచ్చనుకుంటున్నావా? ప్రతివాడికీ అన్నీ రావు ప్రపంచం లో గుర్తుంచుకో.. నీకు పాడాలనిపించినప్పుడు నాకు ఫోన్ చేయి.. అప్పుడే వస్తాను. అని వెళ్లి పోయాడాయన. తర్వాత ఫోన్ చేద్దాం అంటే.. ‘నాకే తప్పులు పట్టిన వాళ్లతోనేను మాట్లాడను అని భీష్మించుకు కూర్చున్నాడు.  ఆతర్వాత సార్ గారే కాల్ చేసి ఒక్కసారి మాట్లాడతాను అబ్బాయితో.. అని ఎంత బ్రతిమలాడినా ఒక్క క్షణానికి కూడా ఫోన్ దగ్గరకి రాలేదు. నోరు విప్పలేదు.గురువు గారు ఇంటికి వచ్చి మాట్లాడతానంటే బాత్ రూమ్ లోకెళ్ళి ఆయన ఇంట్లోంచి వెళ్లేంత వరకూ బయటకి రాలేదు.. ఇంక చేసేది లేక ఆయన దగ్గర మాన్పించేసాం మీము.. మళ్లీ ఒక మంచి సంగీతం మాష్టారిని వెతకాలి..’ అని నిట్టూర్చింది ఆవిడ. 
అంతలోనే మళ్లీ సద్దుకుని..

 ‘అయినా మా అబ్బాయి బ్రిలియంట్ కిడ్. ఒక్క క్షణం వేస్ట్ చేయడు. ఎప్పుడూ జ్ఞాన సాధన లోనే నిమగ్నమై ఉంటాడు. ఖాళీ గా ఉండటమే వాడికి రాదు. అలాంటి వాడిని పట్టుకుని నీకిది రాదు, అది రాదు అంటే వాడికి కోపం రాదూ? అసలే వీడు చాలా సెన్సిటివ్. ఇప్పటి వరకూ మా వాడు పాల్గొని ఓడినది అంటూ ఏదీ లేదు. సార్ దే తప్పు.ఇన్ని వచ్చినప్పుడు ఒక్క సంగీతం సరిగ్గా రాకపోవటమేమిటి.. నాన్సెన్స్! ఆయనకి సరిగ్గా చెప్పటం రాదు. I will find a good teacher..’ అని ఆవేశం గా చెప్పింది.

‘వామ్మో!.. అంటే.. అతని టాలెంట్ ని ఎప్పుడూ పొగుడుతూ, అతని తెలివితేటలని చూసి ఆశ్చర్యపోతూ, అతని గుణగానం చేస్తూ .. ఉండే వాళ్లు మాత్రమే అతనికి చుట్టూ ఉండాలి. ఓటమి అన్నది అతని దరిదాపులకి చేరకూడదు. మరి జరిగినంత వరకూ చెల్లుతుంది. అతని పరిథి విస్తరించినప్పుడో? అతన్ని మించిన వారు ఎదురుపడితేనో? హార్ట్ మాటర్స్ లోనో? ఓటమి అంటూ ఎరగని మనిషి అంటూ ఉన్నాడా? అలెగ్జాండర్ అయినా అనారోగ్యానికి తల వంచలేదూ?’

పిల్లలకి ఏదో ఒక విషయం లో ఎప్పుడో ఒకప్పుడు చిన్నదో, పెద్దదో ఓటమి అనేది అనుభవం లోకి రాకుండా ఉండనే ఉండదు. ఓటమినీ, బోర్ డం నీ, ఒంటరిదనాన్నీ, లేమినీ స్వీకరించటం, అనుభవించటం, దాని నుంచే విజయం, వ్యాపకం,స్నేహం, ప్రశాంతత, సంపాదన.. ల్లాంటివి అమర్చుకోవటం, మలచుకోవటం తెలియజేయటం ఎంత ముఖ్యమో సుబ్బు ద్వారా అర్థమైంది. 
అంటే పిల్లలకి నేను నేర్పాలనుకున్నవన్నీ నాకొచ్చనీ, ఈ విషయం లో నేను సిద్ధ హస్తురాలినని కాదు లెండి.. J
Wednesday, July 11, 2012 44 comments

సీతారాముడు బెంగుళూరొచ్చాడు - ఉపోద్ఘాతం.


(By Vishnupriya)
“ఓ పని చేయి మామయ్యా! వాడిని బెంగుళూరు బస్సెక్కించెయ్! ఓ పది రోజులు చూస్తాను, నాకు తోచినది నేర్పిస్తాను… కొద్దిగా ఒక దిశా నిర్దేశం చేసేందుకు నాకు కాస్త అవకాశం దొరుకుతుంది..” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

సీతారాం మా చుట్టాలబ్బాయి. వాళ్ల నాన్నగారు మా నాన్నగారికి ఆప్తులు. కాకపోతే రాకపోకలు తగ్గి నాకు ఆ కుటుంబం లో పిల్లల తో పరిచయం తక్కువే. బొత్తి గా పల్లెటూరు, ఓ ఎకరం కాస్త అమ్మి మరీ, ఒక మాదిరి పట్టణం లో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ ల్లో, ఒకానొక కాలేజీ నుండి తన కొడుక్కి మా మామయ్య బీ టెక్ పట్టా తెప్పించగలిగాడు. పిల్లవాడు చాలా ‘బుద్ధిమంతుడు’ అని చుట్టాల్లో పేరు. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు. వాళ్లింట్లో అతనే మొదటి ఇంజనీరు. చిన్న సిటీ లో, చిన్న కాలేజీ లో చదువుకోవటం తో, పెద్దగా కాంపస్ ఇంటర్వ్యూలు జరగలేదు. జరిగిన వాటిలో వాళ్లబ్బాయి వ్రాత పరీక్ష లో ఉత్తీర్ణుడయినా, గ్రూప్ డిస్కషన్ల లో వెనకంజ వేశాడు అని తండ్రి చెప్పాడు.

“అమ్మా! కృష్ణా! నువ్వే కాస్త వాడికి ఒక దారి చూపించాలి. మీ కంపెనీ లోనో, తెలిసిన వారి దగ్గరో, ఒక ఉద్యోగం ఇప్పించు!” అని పదే పదే చెప్పటం తో, నేను కూడా చేతనైనంత సహాయం చేద్దాం.. అని నిశ్చయం చేసుకున్నాను. నాకూ, నాకు తెలిసిన వారికి చాలా మందికి కాంపస్ సెలక్షన్లలో ఉద్యోగం దొరికేయటం తో, కొత్తగా పాస్ అయిన వారు ఉద్యోగాల కోసం ఎలాగ ప్రయత్నిస్తారో నాకు అస్సలూ ఐడియా లేదు. నాకు తెలిసిన వాళ్లకి కాస్త చెప్పి 2012 లో పాస్ అయిన ఇంజనీర్లు అసలు అవకాశాల కోసం ఎలాగ ప్రయత్నించాలో తెలుసుకోవటం మొదలు పెట్టా.

పది మందికీ విషయం చెప్పటం తో, వంద రకాల సలహాలు రావటం మొదలు పెట్టాయి. నాకూ తల తిరిగిపోయింది. మంచి కాలేజీల్లో చదివి కొద్దిగా ‘స్మార్ట్’ గా ఉన్న పిల్లలకి ఎలాగూ అవకాశాలున్నాయి. B గ్రేడ్ టౌన్లల్లోని అరగొర సదుపాయాలున్న ఇంజనీరింగ్ కాలేజీ ల్లోంచి వచ్చిన పిల్లలకి మొదటి సాఫ్ట్వేర్ (మంచి) ఉద్యోగం సాధించటం దాదాపు తెలుగు సినిమాల్లో హీరో/హీరోయిన్ వేషం సాధించటమంత కష్టతరవిషయం అని. ఆంగ్లం లో గడగడా మాట్లాడగలగాలి, సబ్జెక్టుల్లో ఎలాగూ దిట్టలై ఉండాలి, వాళ్ల సబ్జెక్టులేకాక, కంప్యూటర్ల లో కొత్త విషయాల్లో ప్రవేశం ఉండాలి. అంతే కాక, కనపడిన ప్రతి వాక్ ఇన్ కీ పరిగెత్తాలి, అనుభవం లేదు కాబట్టి నామ మాత్రపు జీతాలకి పని చేయటానికి రెడీ గా ఉండాలి, ఒక్కోసారి ఎదురిచ్చి కూడా పని చేయటానికి కూడా సిద్ధం గా ఉండాలి, చిట్టెలుకంత చురుకు గా తిరగాలి, చిరుతంత వేగం గా ఉండాలి, చీమలు బెల్లం ఎక్కడ దాచినా వాసన పసి గట్టినట్టు, సిటీ లో అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలమీదా ఓ కన్నేసి ఉంచి అన్నింటిలోకీ ఒక రాయేసి చూడగలగాలి.. అన్నింటికీ మించి ‘మీ వాడికి ఇంకా ఉద్యోగం రాలేదా? పాపం! మా వాడికి ఫలానా కంపెనీ వాళ్లు ఆరు లక్షల పాకేజీ ఇస్తున్నారు, వేరేవాళ్లు తొమ్మిది ఇస్తున్నారు కానీ, బొంబాయి కి వెళ్లాలట.. ఎందుకూ, ఉన్నఊళ్లో కళ్ళ ఎదురు గా ఉండి ఆరు కి కాంప్రమైజ్ అవమని అడుగుతున్నాం.. ‘ అని సాటి వారు చెప్పే సోది విని నిర్వికారం గా ఉండగలగాలి!

మన వాడికి విషయ జ్ఞానం ఎలాగుంది? వాడి ఆంగ్లం పరవాలేదా? చురుకు గా ఉంటాడా? చెప్పింది చెప్పినట్టు అల్లుకుపోగలడా? ఇలాంటి ప్రశ్నలతో నాకు ఉక్కిరి బిక్కిరి అయినట్లయింది. ఈలోగా ఊరి నుండి ఫోన్ల మీద ఫోన్లు. ‘ఏమైంది ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయి? ‘ అంటూ. మా మామయ్య స్వాతి ముత్యం లో కమల్ హాసన్ లా రోజూ నన్ను అడగటమేకాక సీతా రాం చేత కూడా ఫోన్లు చేయించాడు. నా ఫోన్ పండగ పూట కోవెల్లో గంట లా గణగణ లాడుతూనే ఉంది.

ఓ నెల పాటూ ఫోన్ల ద్వారా సంభాషణలు మామయ్య తో అయ్యాకా, కొద్దిగా నాకు విషయం అర్థమవటం మొదలైంది. మా మామయ్యకి తానొక ‘అపర ఐన్ స్టీన్ కి తండ్రంత వాడినని గట్టి నమ్మకం! ‘అబ్బాయి ఇంజనీరయ్యాడు..’ అనగానే వరసగా క్యూలు కట్టి అందరూ వెనక వెనక పడి ‘మా కంపెనీ లో చేరు.. లక్షిస్తాం’ అంటే.. మా కంపెనీ లో రెండు లక్షలిస్తాం..’ అంటూ వేలం పాటలా పైకి తీసుకెళ్లి ‘అమెరికా వెళ్తావా! ఆస్ట్రేలియా కెడతావా?’ అని బ్రతిమాలుతూ, పాత సినిమాల్లో నాగేశ్వరరావు ని అడిగినట్టు.. ‘ ‘మీరు మీ తెలివి పెట్టుబడి పెట్టండి.. మేము డబ్బు పెడతాం..‘ అంటూ ఆఫర్లు ఇచ్చే పారిశ్రామికవేత్తలూ, .. గ్రూప్ డిస్కషన్ లో నోరు పెగలక పోతే, “భాష కాదు! భావం ముఖ్యం.. మిమ్మల్ని ఇంగ్లిష్ లో మాత్రమే మాట్లాడమని ఎవరన్నారు? తెలుగు లో మాట్లాడండి! ” అని అదో టైప్ సీరియస్ ఎక్స్ ప్రేషన్లు ఇచ్చి ప్రోత్సహించే ‘త్రిష’ ల్లాంటి ఎగ్జెగ్యూటివ్ లూ.. అబ్బో.. మా మామయ్య గారికి చాలానే భ్రమలు ఉన్నాయి అని అర్థమైంది.

“మామయ్యా! ఓ సారి వాడికి ఫోన్ ఇయ్యి... మాట్లాడతాను” అన్నాను. ‘ సీతారాముడు పూజ లో ఉన్నాడు.. ఇప్పుడు మాట్లాడలేడు. ఓ ఇరవై నిమిషాలాగి చేస్తాడు.. ‘ ఇరవై నిమిషాల పూజా! ఏదైనా పండగా! ఏంటి? మరీ పండగలూ, పబ్బాలూ పట్టించుకోని మెకానికల్ బతుకైపోయింది బొత్తి గా.. :- ( అనుకుంటూ, ‘అబ్బో.. ఏంటి స్పెషల్ ఈరోజు? ‘ కొద్దిగా గిల్ట్ నిండిన గొంతు తో అడిగాను. మామయ్య ‘లేదమ్మా! ప్రతి రోజూ రెండు పూటలా తలస్నానం చేసి సంధ్యావందనం, పారాయణం వంటివి అన్నీ చేసుకోవటం వాడి దినచర్య లో భాగం.. అన్నట్టు మా వాడు తిరుచూర్ణం, తిరువణిక్కాపు తో నామం పెట్టుకుంటాడు.. మరి ఉద్యోగాలకి ప్రయత్నిస్తున్నప్పుడు అదొక అడ్డంకి కాదు కాదు కదా? ‘ అని ఒకింత అమాయకం గా అడిగాడు..

నాకెందుకో ఒక్కసారి గా జాలి, నవ్వూ, వీడికి ఒక మంచి ఉద్యోగం ఎలాగైనా సంపాదించుకునేలా చేసి తీరాలనే పట్టుదలా కలగా పులగం గా తలకెక్కేసాయి. దాని ఫలితమే ఈ ఫోన్ కాల్...

(సశేషం)


Monday, June 11, 2012 20 comments

అగ్వగ్వాగ్వాగ్వ! మీకు పండగ, మాకు దండగ...

తెలుగు కవిత్వం చెప్పాలంటే, మగవారికి, థళ థళ లాడే తెల్లని ధోవతి, కుర్తా, కండువా, ఆడవారికి హుందా తనం ఉట్టిపడే చీరలు,..గట్రా... బాసంపెట్లు వేసుకునో, లేక ఎటో అలౌకికావస్థ తో, తీరిగ్గా ప్రశాంతత నిండిన ముఖం తో, ఉండాలేమో, అనే స్టీరియో టైపింగ్, మనసులోకి వచ్చేస్తుంది నాకు.. నిత్య జీవితం లో దాక్కున్న కవిత్వం ఎన్నో సందర్భాల్లో, తొంగి చూసినా, కొన్ని సార్లు కొన్ని చిత్రాలు ఇలాగ మస్తిష్కం లో నిలిచిపోతాయి.


ఈ మధ్య భాగ్య నగరం లో కొన్ని ప్రాంతాలకి వచ్చి వారానికో సారి సంత పెడుతున్నారు గా.. ఆకు కూరల దగ్గర్నించీ, ఇనప మూకుళ్ళదాకా! అప్పడాల నుండీ, సమోసాల దాకా కూడా అమ్మేస్తూ.. మా అమ్మగారింటి దగ్గర ప్రతి మంగళవారం పెట్టుకునే ‘మంగళవారం మండీ’ గురించి ఎన్నోసార్లు విన్నాను, చూశాను, కానీ ఎప్పుడూ, మంగళ వారం సాయత్రం హైదరాబాదు లో అమ్మగారింట్లో, తీరిగ్గా గమనించే అవకాశం రాలేదు. ఈసారి వేసవి కాలం లో హైదరాబాదు కెళ్లినప్పుడు కాస్త తీరిక చేసుకుని, కాస్త షాపింగ్ చేశాను. కొద్ది మందిని అడిగి నాలుగు ఫోటోలు తీశాను.. మా పిన్ని నాకు మోడలింగ్ కూడా చేసింది గా :)


మంగళ వారం అయ్యేసరికి, మా కళ కళ లాడే కూరగాయల మార్కెట్ కి చిన్ని కవితలూ,సరదా పిలుపులూ, స్లోగన్లూ, పెట్టని తోరణాలు..

మధ్యాహ్నం రెండు దాటడమేంటి! ఇళ్ల ముందు రోడ్డు బ్లాక్ చేసి పట్టాలు పరవటం మొదలు పెట్టారు. మా స్కూటర్లు అవీ కూడా లోపల పెట్టేసాం. మా ఇంటి ముందు గోరు చిక్కుడు కాయలమ్ముకునే లక్ష్మి, తన బిడ్డని అలవాటు గా మా ఇంట్లో పడుకో పెట్టి వెళ్లి కూర్చుంది. మేమూ, ఓ సంచీ వేసుకుని సంత లోకి దూరిపోయాము.

‘అగ్వగ్వాగ్వాగ్వాలూ బీస్కుదో కిల ..బీస్కుదో కిల..’

‘ఏంటండీ? అంటున్నాడూ!’ అంటోంది ఒకావిడ కొత్తగా వచ్చినట్టుంది భాగ్యనగరానికి.. కాస్త కోస్తా యాస తో ..

‘ఇరవై కి రెండు కిలోల్.. బామ్మగారూ.. బంగాళా దుంపల్ చవ్కా.. చవ్కా! గింత చవ్కాగా ఎక్కడ దొర్కాద్!’ అని స్లోగన్ మార్చి పిలిచాడు, ఆలుగడ్డలమ్ముకునే అబ్బాయి.



మామిడి కాయలమ్ముకునే ఈ కవి హృదయం చూసే జనాలు అయస్కాంతానికి ఆకర్షించబడే ఇనప రజను లా వచ్చి చేరుతున్నారంటే నమ్మండి...

‘పప్పులకూ, ఉప్పులకూ,

చట్నిలకూ, పుల్సులకూ,’

‘రైసులకూ, షర్బత్తులకూ’

ఏడుకొక్కటి, పదికి రెండు,

‘తియ్యంగ కావాల్నా! రాండ్రి.. పుల్లంగ కావాల్నా! రాండ్రి,

చప్పని కాయ కావల్నంటే ఈడ కష్టం, ఆ యేన్క మీ ఇష్టం!’

అని అందర్నీ పిలుస్తుంటే, కాయ ఎలా ఉన్నా కోనేయాలనిపించి సంచీ నింపేసా.



‘పది కి మూడు, దస్కూ తీన్’ అంటూ అమ్ముకుంటున్న ఆకుకూరలమ్మి ని వెళ్లి ‘పది కి ఐదిస్తావా?’ అని అడిగి ‘పోమ్మా! ఎప్పుడైనా కూరలు కొన్న ముఖమేనా? చేయి తీయి నా ఆకు కూర మీద !’ అనిపించుకుని, ‘అందరికి నాలుగిస్తున్న, కళ్లజోడు ఆంటీ బిడ్డవి కద! నువ్వు ఐదు తీస్కో పో’ మని కూడా ఇంకో చోట కాస్త తగ్గింపు ధర సాధించుకుని, ‘బోణీ బేరం.. తీస్కోమ్మా బేరం వద్దు’ అని అప్పటికే కనీసం పది మందికి నా కళ్లముందే ముందుగా అమ్మినా సెంటిమెంట్ తో కొట్టి కొనిపించిన వారిని వారించలేక, సంచీలు నింపుకుంటూ,.. తిరుగుతూ ఉన్నాను..

‘దస్కూ చార్ దస్కూ చార్.. మీకు పండగా.. మాకు దండగా.. దస్కూ చార్..’ అని ములక్కాడల వ్యాపారి కవితా ధోరణి లో పిలిచాడు. ములక్కాడ అప్పుడు కొనాలనుకోక పోయినా, ‘మీకు పండగా.. నాకు దండగా..’ లైన్ నచ్చి ఓ నాలుగు కొనేశాను.

బంగారం.. బంగారం.

బంగారం, బంగారం, రేపు ప్రియం, ఇయ్యాల నయం.. పది కి కిల బంగారం.. బంగారం.

బజార్లో ముప్ఫై వేలకి తులం అంటున్నారు, ఇతను పది కి కిలో అంటున్నాడు అని చూస్తే బంగారు ముద్దల్లాంటి దోసకాయలు.. నిజమే! బంగారం పెట్టుకున్న దగ్గర్నించీ, వంటి మీద బరువు, ప్రశాంతత కరువు! (బాబోయ్.. నాకూ కవిత్వం వచ్చేస్తోంది!!) అదే దోస కాయలైతే, చలవ, హాయి,.. ఆహా.. ఓహో అనుకుని ఓ కిలో అవీ పడేశా సంచీ లో.


కుంపట్లు, మూకుళ్ళు,. కవ్వాలు, ఇనప పెనాలు, కొలత పాత్రలు,.. చెక్క గరిటెలు, జల్లెడ లూ, కత్తులు, పట్టకార్లు,.. ఆహా  చూస్తేనే,  నాకు కడుపు నిండిపోయింది.



‘కళకి భాషా బేధాల్లేవు..’ అని ‘సినీ’ కళాకారులు ఇచ్చే స్టేట్ మెంట్లు చూసి.. నవ్వుకుంటూ ఉంటాను కానీ, వ్యాపారం విషయం లో మాత్రం, ఒకటే సూత్రం.. ‘ఏ భాషైనా.. వస్తువు అమ్మ గలగాలి, అది అమ్మేమనిషి బాధ్యతే’

‘మల్లే పూల్ , మల్లే పూల్! అంటూ సైకిల్ మీద అమ్మేసుకుంటున్న ఆసామీ, బుర్ఖా వేసుకున్న ఆడవారి కోసం, ఒక్కసారి గా, ‘మొగ్రా, మొగ్రా,.. లేలో, జీ మొగ్రా..’ అని భాష మార్చాడు. ఆంగ్ల భాష లో సంభాషణ జరుపుతూ, వెళ్తున్న కాలేజీ అమ్మాయిలు పక్కన కనపడేసరికల్లా, మళ్లీ ‘ఫాట్ జాస్మిన్స్, ఫ్రెష్, ఫాట్ జాస్మిన్స్.. టేక్ మాడం..’ అని మార్చేశాడు. ఘటికుడే!

వాగ్ధాటి లేని వ్యాపారుల దగ్గర అయ్యో ఒక్కరూ లేరే!


వంకాయల వ్యాపారికి మాత్రం, అతని వాగ్ధాటికీ, వ్యాపార చతురత కీ, నేను మొదటి స్థానం ఇచ్చేస్తాను.

ఓ రాజ శేఖర రెడ్డి లా, ఓ చంద్రబాబు నాయుడిలా, రకరకాల మోడ్యు లేషన్ల తో, ‘అమ్మ్మా! మా వంకాయలు కొని, మీ కుటుంబం లో కలతలొస్తే నాకు సంబంధం లేదు.. లేత గున్నయ్ గదా, పాలు కారుతున్నయ్ అని, నువ్వు మసాల బెట్టి, కమ్మగ వండి, మొగునికి పెట్టకుండ, అత్త,మామకి వాసనైన చూపకుండ, బిడ్డలని కనికరమైన చేయకుండ, పొయ్యి మీదకెల్లి తీసి, అంత నువ్వే తింటే, అది మా తప్పు కాదు. మమ్ముల్ని అడిగితే, మాకు తెల్వదు. మా మీదకు రావొద్దు! లేత వంకాయల్’ అని అందర్నీ ఆకర్షిస్తున్న అతని ముందున్నవి అన్నీ, ఎండిపోయిన, వడలిపోయిన కాయలు. చాలా వరకూ పుచ్చులు కూడా ఉండవచ్చు..

గల గల లాడుతూ, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ, ఎకసెక్కాలు చేసుకుంటూ,..

చీకటి పడిపోతోంది.. త్వర త్వరగా అమ్ముకుని ఇళ్లకి వెళ్దామనుకునే తొందర లో, లైట్ల వెలుగు లో,..

కిలో ఇంతకి’ అని అమ్ముకునే వారల్లా, కుప్ప ఐదుకి, కుప్ప పదికి,.. అని ఖాళీ సంచులు సద్దుకుని, అమ్మిన మేరా, కాస్త తుడిచేసి, పిల్లల్ని, పైసల్ని జాగ్రత్త గా పట్టుకుని, వాళ్ల కార్రియర్ బండ్లు ఎక్కేసి, గొడవ గొడవ గా.. వెళ్లి పోయారు. కూరగాయల మార్కెట్ కవిత్వం, మాత్రం, నన్ను ఇప్పటిదాకా వెంటాడుతూనే ఉంది.. మళ్లీ బెంగుళూరు లో సూపర్ మార్కెట్ లో ‘డల్’ గా రోల్ లోంచి కవర్లు చింపుకుని, కూరగాయలు, పండ్లు నింపుకుని వస్తున్నప్పుడల్లా, ముఖం మీద చిరునవ్వు తెప్పిస్తూనే ఉంది.

Monday, June 4, 2012 29 comments

ఎవెంజర్లూ, రివెంజర్లూ..



 

ఈ వేసవి సెలవల్లో..



‘Ammaa! I am bored.. What should I do?’ పిల్లలు ఈ ప్రశ్న కి రోజూ వారీ సెంచరీ పూర్తి చేసేశారు..



వేసవి సెలవలనేసరికి అమ్మమ్మ ఊరికి పరిగెత్తటం, లేదా, కొత్త ప్రదేశాలకి వెళ్లి రావటం తప్ప, గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటం, చుట్టుపక్కల ఎవ్వరూ పిల్లలు లేకపోవటం, అనేదే మా పిల్లలకి తెలియదు.

ఈసారేమో.. ఒక నెల రోజులు వాళ్ల అమ్మమ్మగారింట్లో గడిపినా, వాళ్లూ ఉత్తర దేశయాత్రలకి బయల్దేరటం తో, బెంగుళూరికి వచ్చి పడ్డారు..

భాగ్య నగరం లో ఎండలు మండినా, .. అమ్మమ్మ, తాత గార్లు, కదలకుండా కూర్చోబెట్టి ఎక్కాలు వల్లె వేయించి, పట్టు పట్టి తెలుగు పద్యాలు, పాటలు నేర్పించినా.. పిజ్జాలూ, నూడిల్సూ, కుదరదని, ఇడ్డెన్లూ, మినపరొట్టెలూ, పెసరట్లు,.. పెట్టినా, స్విమ్మింగ్ పూళ్ళూ, ఎలెక్ట్రానిక్ ఆట సామాగ్రికీ దూరం ఉంచి, కొబ్బరి నూనె రాసి నున్నగా జడలేసి, అష్టా చెమ్మా, పులీ మేకా, కారమ్స్ కి పరిమితం చేసినా.. మాళ్ళూ, ఎమ్యూజ్ మెంట్ పార్కులూ కాదని చార్మినార్లూ, సాలార్ జంగ్ మ్యూజియం లు బస్సులెక్కించి తిప్పినా, వేసవి సెలవల్లో అమ్మమ్మ గారింటికి ఉన్న చార్మ్, ఇంక దేనికీ లేదు కదా..

బెంగుళూరు కి రావటమేమిటి? ఇదిగో ఈ ‘బోర్’ మంత్రం.. పక్కన లైబ్రరీ లో పుస్తకాలన్నీ చదివేసింది పెద్దది. అప్పటికీ ఒక ఇరవై పుస్తకాలు కొని పెట్టాను. అన్నీ అయిపోయాయి. చిన్నదానికి అబ్బే ..పుస్తకాలు అంతగా ఎక్కవు. స్విమ్మింగ్, యోగా, బాడ్మింటన్,..తిరుగుళ్లు, షికార్లు, టీవీలు, అయినా బోరే..

ఈ ‘బోర్,బోర్’ అన్న గొడవ పడే కంటే.. అదిగో పరీక్షలకి దగ్గరుండి చదివించటమే సులువేమో.. కనీసం ఏం చేయాలో తెలుసు.

ఏమయితేనేం? వేసవి సెలవల కోసం ఎదురు చూసినంత సేపు పట్టలేదు! .. వచ్చినట్టే వచ్చి, ఇట్టే అయిపోయాయి.. వచ్చేవారం స్కూళ్లు మళ్లీ తెరుస్తున్నారంటే, ఇంకా వారమే సెలవలు అని ఒక బెంగ మొదలైపోయింది.

సాయంకాలం సినిమా కెడదామా అనుకునేసరికి ఇంట్లో రెండు పార్టీలు తయారు. మా వారు,నేను గబ్బర్ సింగ్ అని, పిల్లలు ‘అవెంజర్స్’ అనీ!

ఎవెంజర్లు!


‘పోన్లే పాపం పిల్లలు ఎవెంజర్స్ అంటున్నారు.. గబ్బర్ సింగ్ లేదు, దమ్ము లేదు.. ఎవెంజర్స్ సినిమా కి వెళ్తున్నాను.. ఎవరొస్తారు నాతో?’ అని మా వారు ఆర్డర్ పాస్ చేసేశారు. . కళ్ళుమూసి తెరిచే లోపల పిల్లలు గాయబ్. ఒకళ్ల చేతిలో నీళ్ల సీసా.. ఇంకోల్ల చేతిలో బండి తాళాలు.. ‘అదేంటి? ఇప్పుడా! మా క్లాస్ మేట్ కర్ణాటక సంగీత కచేరీ కి వెళ్దాం అనుకున్నాం కదా..’ కంగారు గా అన్నాను..



‘ఓ పని చేద్దాం.. ఇంగ్లిష్ సినిమా గంటా, గంటన్నర కి మించి ఉండదు.. అది చూసి, పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి అప్పుడు సంగీత కచేరీ కి వెళ్దాం..’ అప్పుడు అందరూ హాప్పీ... సరేనా?’ అని మావారు అనడగగానే, ‘ఇది బాగానే ఉంది.. ‘అనుకుని, నేనూ చక చకా రెడీ అయపోయా..

దారి పొడుగునా “ఆరుగురు సూపర్ హీరోలు.. ఒక్క సినిమా లో..” అని అరమోడ్పు, కన్నులతో, అత్యంత పారవశ్యం గా.. పిల్లలు.. హల్క్, మెటల్ మాన్.. అదీ ఇదీ అని ఏవేవో విశేషాలు చెప్తూనే ఉన్నారు. నాకేమో కార్టూన్ సినిమాలు పట్టవు. సూపర్ మాన్, స్పైడర్ మాన్, బాట్ మాన్ సినిమాలే చిరాకు అనుకుంటే ఒక్క సినిమా లో ఆరుగురే! ఇదెక్కడి గొడవ? అదే కళ్యాణ్ బాబైతే.. వెయ్యి సూపర్ హీరోలకి పెట్టు.. పైగా.. ఒక్క సూపర్ హీరోకి అయినా ప్రేమ వ్యవహారాలూ, డ్యూయేట్లూ ఉంటాయో ఉండవో,.. అని విసుక్కుంటూ, హాల్లో సీట్లు సంపాదించుకుని కూలబడ్దాం..

ఒక కంటికి గంత కట్టుకుని సామ్యూల్ జాక్సన్ గారు, ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నెత్తి మీద వేసుకున్నారు.. యోకీ అన్న గ్రహాంతర వాసి అనుకుంటా.. వచ్చి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి, ప్రపంచాన్ని నాశనం చేయగల రసాయన స్పటికం లాంటిది కొల్లగొట్టి పారిపోయాడు. రెండువారాలే సమయం ఉంది. మన సూపర్ హీరోలందరినీ రప్పించి యోకీ ఎక్కడున్నాడో కనిపెట్టి, రేడియో ఆక్టివ్ మూలకాన్ని తెచ్చి మళ్లీ భద్రపరచాలని.. తెగ సీరియస్ గా ప్లానింగ్ జరుగుతోంది.. ఆవలింతలు.. పక్కన చూస్తే.. పిల్లలు.. సీట్లో స్టిఫ్గా కూర్చుని.. ముందుకు ఒరిగి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. హాల్లో అందరూ దాదాపు అదే అలౌకికావస్థ లో ఉన్నారు.

‘హాఆఆఆఆఅయ్’ నాకు ఆవలింతలు..

నెమ్మదిగా సీట్లో జాలబడి ఓ రెండు నిమిషాలు నా మొబైల్ ఫోన్ లో సరిగ్గా రాని ఫోటోలు తీసేయటం, పాత SMSలు తొలగించటం లాంటివి చేసుకున్నాను.

మళ్లీ ఆవలింతలు..! హిందీ లో డైలాగు వినబడింది.. కుతూహలం గా నేనూ చూడటం మొదలు పెట్టాను.



ఒక సూపర్ హీరో దారిద్ర్యం తో మగ్గుతున్న కోల్కోతా వీధుల్లో, మురిక్కాలవ లో ఒక సంవత్సరం మురగ బెట్టి రెండు వేల చిరుగుల కర్టెన్ వేసిన కొంప లో, భయానక అంటు వ్యాధి తో, (కలరా? ప్లేగ్?) మ్రగ్గుతున్న ముసలి వాడికి వైద్యం చేస్తూ, రెండు ఇంచిల మేర మురికి పట్టిన, తైల సంస్కారం లేని జుట్టు తో, ఈసురోమంటూ, (స్లం డాగ్ పిల్లలు?) ఓ అమ్మాయి, మా నాన్నకు మందియ్యి ప్లీజ్.. నా దగ్గర డబ్బుంది.. అని దీనం గా ప్రాధేయపడుతోంది.. ఒళ్లు మండింది.. మురికి వాడలవెంబడి పరుగులెత్తి హైన్యం కోరుతున్న ఒక ఇంట్లో కి వెళ్లాడు.. ‘నీ అవసరం ఉంది.. ప్రపంచాన్ని రక్షిద్దాం.. పద’ మని ఓ ఏజెంట్ తీసుకుపోయింది.. అంటే.. కోల్కోత్తా లో ప్రపంచం లో భాగం కానట్టు.. వాళ్ల మాన్హాటన్, మాత్రమే ప్రపంచం అన్నట్టు..

లోహపు మనిషి (మెటల్ మాన్) ఎగురుతూ వచ్చి నూరంతుస్థుల మేడ మీద లాండ్ అవటం తోనే, ఒక్కోటి గా ఆయన కవచ కుండలాలు విడిపోయి, వెళ్లి తమ తమ స్థానాల్లో చేరిపోవటం,.. కళ్ళ ముందు హెల్మెట్ గ్లాస్ లాంటి దాని మీద సిక్స్త్ సెన్స్ లా ప్రతీదీ కనపడటం, దాన్ని చేతి కదలికలతో కంట్రోల్ చేయటం.. ‘ ఈ అమెరికన్లు ఎంతైనా సరి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని భలే వా... డుకుం టారు ‘హాఆఆఆయ్’ .. ఆవలింతలు..

చల్ల గా మల్టీప్లెక్స్ లో మెత్తటి సీట్ మీద హాయిగా సుషుప్తావస్థ లోకి జారుకున్నాను.

‘అమ్మా! ఇంత మంచి సినిమా లో నిద్ర పోతావా? ‘ అని కోపం చూస్తో మా పిల్లలు అరుస్తుంటే మెలకువ వచ్చింది.. ఇంటర్వెల్ ట.. సరే.. లేచి పాప్ కార్న్ కోసం బయట పడ్డాం. మా వారు నెమ్మది గా ‘అండాళ్ళూ.. నీకేమైనా అర్థమైందా?’ అని సణిగారు. ‘ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు.. ‘ అంటున్నానో లేదో, పక్కన గబ్బర్ సింగ్ నడిపిస్తున్న స్క్రీన్ లోంచి ‘కెవ్వు కేకా’ అని పాటా, ఈలలూ, హంగామా.. అక్కడికెడితే ఎంత హాయిగా ..ఈ పాటికి తిట్టుకుంటూనో, నవ్వుకుంటూనో, ఆనందంగానో, చూసేవాళ్లం కదా.. ఈ గొరిల్లా యోధుడెంటో! వీళ్లంతా, ఈ ప్రపంచ రక్షణ చేయటమేమిటో, తల రాత! అని విసుక్కుంటూ మళ్లీ మా బుట్ట పేలాల పొట్లం తీసుకుని సీట్లో కూలబడ్డాను. ఎంతకీ అవదే? నా ఖర్మ కాలి రెండున్నర గంటల సినిమా ట!

సెకనుకు ముగ్గురు కొత్త యోధులు గ్రహాంతర వాసుల అంతరీక్ష నౌక నుంచి పుట్టుకొచ్చి మాన్హాటన్ నగరాన్ని .. సారీ వాళ్ల ఉద్దేశంలో ప్రపంచం కదూ, సర్వ నాశనం చేస్తుంటే,.. ఒకడు కత్తితో, ఒకడు బాణాలతో, ఒకడు భవంతుల మీద నుంచి స్పైడర్ మాన్ లంఘించి దూకి, ఇంకోడు గోడ్జిల్లా లాగా శత్రుసైన్యాన్ని చేతుల తో ఎత్తి నేలకి కుదేసి మ్రోది,.. కష్టపడుతుంటే,.. న్యూయార్క్ వాసులు, హాహా కారాలు చేస్తూ, రోడ్ల మీద పరుగులు తీయటం... మొత్తానికి సినిమా ముగిసింది.. హాల్లోంచి పిల్లలు ఆనందంగా.. నేను, మావారు ఒక విధమైన చిరాకు తో, కూడిన విసుగు సమేతమైన నిస్సహాయ స్థితి నుండి ఉద్భవించిన తల నొప్పి తో బయట పడ్డాం..

రివెంజర్లు..

ఇంటికి వెళ్లి పిల్లలని దింపే సమయం లేదు. విశ్వవిద్యాలయం లో నాతో కలిసి చదువుకున్న మోహన్ సంగీత కచేరీ.. ఎప్పుడో లల్లాయి పదాలు, పాత సినిమా పాటలు, పాడుతుండగా ఇరవై ఏళ్ల క్రితం విన్న నా స్నేహితుడి సంగీతం ప్రోగ్రాం.. వదులుకునే సమస్యే లేదని కారాఖండీ గా చెప్పేశా.. పిల్లలు దోవ పొడుగునా, సణుగుతూనే ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు.. ‘ఏం? మీ అవెంజర్లు చూసినప్పుడు మా పరిస్థితీ ఇంతేగా? మీరూ వచ్చి తీరాలి.. వేరే మార్గం లేదు’ అని దటాయించి ‘బెంగుళూరు గాయన సమాజ‘ భవంతి ఎదురు గా కారు ఆపి దిగి చూస్తే, ఒక శాల్తీ లెక్క తక్కువైంది.. చూస్తే మా చిన్నది రెండు చేతులూ కట్టుకుని ‘రానని’ కార్ లోనే భీష్మించుకుని కూర్చుంది. సామ దాన బేధ, దండోపాయాదులని ఉపయోగించి అమ్మాయిని దారిలోకి తెచ్చుకుని నలభై రూపాయల టికెట్లు కొట్టించుకుని హాల్లో కి ప్రవేశించాం. ఐదు వందల మంది పట్టే హాల్లో, అక్కడక్కడా.. నలుగురూ, ఐదుగురూ,.. ముసలి వారు ఉన్నారు. యాభై ఏళ్లకి తక్కువ వయసువారు బహుశా మేము కాకుండా మా మొహనుడి భార్య మాత్రమే నేమో.. . మోహన్ స్టేజ్ మీద నించే పలకరింపుగా చేయి ఊపి అభివాదం చేశాడు.

ఏమాట కామాట చెప్పద్దూ, మా పిల్లలు ఉప్పొంగిపోయారు. ఒక విద్వాంసుడు, స్టేజ్ మీద నుంచి నన్ను పలకరించాడని.. సీట్లల్లో కూలబడ్డాకా, మా అమ్మాయి.. ‘అమ్మా! నీకొక ఫన్నీ తింగ్ చెప్తా..’ అంది..

‘ఇప్పుడు కాదు..’ అని వారిస్తున్నా, వినకుండా.. ‘చూడు.. మగవాళ్ల జుట్లన్నీ తెల్లగా, పక్కన కూర్చున్న ఆడవాళ్ల జుట్లు కాటుక లా నల్లగా..’ కిసుక్కున నవ్వాను.. కానీ..’ష్... ‘ అని సీరియస్ గా కూర్చున్నాను. ‘ఏం చేస్తాం? ఉన్నదే ఒక యాభై మంది.. సరిగ్గా వినకపోతే, అసహ్యంగా ఉంటుంది మరి..’

‘ఆట తాళ వర్ణం.. ‘ చక్కగా పాడుతున్నాడు . చిన్నదేమో.. ‘మా సినిమా లో నువ్వు నిద్రపోయావు కాబట్టి నేనూ, మీ ఫ్రెండ్ సంగీతం లో నిద్రపోతా.. రివెంజ్..’ అంది. కోపం గా చూశాను. అంతకు మించి ఏం చేయగలం?

తోడి రాగం లో కీర్తన అందుకున్నాడు మోహన్.. ఈలోగా.. మూడు బాత్ రూమ్ బ్రేక్ లు. తీసుకున్నారు పిల్లలు. ఇంకో సారి అడిగితే ఏమవుతుందో తెలుసు వాళ్లకి.. దానితో, వారిలో వారు సైగలు చేసుకుని, మాటలు రువ్వుకుని, నవ్వుకుని, ఏవో గుసగుసలు మొదలు పెట్టారు.

కీర్తన అయింది. ‘మా క్లాస్ మేట్ కి కాస్త చప్పట్లు కొట్టండి! మీ క్లాస్ మేట్ మొన్న పిచ్చి బోరింగ్ జోక్ చెప్తే , నేను హా హా హా ‘ అని నవ్వా కదే! ‘ అని మరుగున పడుతున్న పాత జ్ఞాపకాలని వెలికి దీసి మా వాళ్లతో మా ఫ్రెండ్ కి చప్పట్లు కొట్టించుకున్నా..

‘దుడుకు గల నన్నే దొర కొడుకూ బ్రోతు రా ..’ మొదలు పెట్టాడు. వీళ్లకి దుందుడుకు హెచ్చింది.. గుసగుసల కొట్లాట మొదలు పెట్టారు. ఎంత మంది ఎలా తల కాయలు ఊపుతున్నారో చెప్పుకుంటూ, నవ్వుకోవటం.. ‘ఇంకా ఎంతసేపు?.. ‘ అని విసుగు చూపించటం.. ‘ఆకలేస్తోంది..’ అనటం.. పక్కన వారు ‘షష్ష్.. ‘ అనేంతవరకూ తెచ్చుకున్నారు..

ఈ లోగా, మోహన్ వెనక్కి తిరిగి ఒక ఫ్లాస్క్ లోంచి ఏదో ద్రవం స్టీలు సీసా లోకి వంపుకున్నాడు. ఇక మా పిల్లలు గొడవ.. ‘అమ్మా.. అదేంటి? కాఫీ? చాయ్? నీళ్లేమో?’ అని. “ అంత అద్భుతం గా పాడుతుంటే, మీకొచ్చే డవుట్లు ఇవా?” అని గుస గుస గా చివాట్లు వేసాను. మా చిన్నది.. పోనీ, ఏదో పని ఉన్నట్టు ముందు వరస లోకెళ్ళిస్మెల్ చేసి రానా? తెలిసిపోతుంది?’ అని ఉత్సాహం గా ఆఫర్ చేసింది. పళ్ళు పటపట లాడించా! ‘ఓకే ఓకే.. జస్ట్ కిడ్డింగ్’ అంది.

బొత్తి గా హాల్ గోడనానుకుని బజ్జీల స్టాల్ పెట్టాడేమో? అందునా, ఏసీ ఖర్చు లేకుండా, పక్క తలుపులు తెరిచి ఉంచాడేమో.. ఉల్లి పాయ పకోడీ, అరటి కాయ బజ్జీల వాసన.. హాల్లోకి మత్తుగా, ఆవరించింది. అంతే!

ఇక మా వాళ్లని ఆపలేకపోయాను. ‘రీతి గౌళ’ రాగం అయ్యేంతవరకూ, వేరే రసాస్వాదన లో తన్మయులై లోపలికి వచ్చారు.

‘కదన కుతూహల ‘ రాగాలాపన ఇటు మోహన్ మొదలు పెట్టేసరికి వీళ్ల చిరాకు తారా స్థాయి కి ఎక్కి, వీళ్ల గొడవ భరింప రానిదై కూర్చుంది... ‘షీ ఈజ్ సో మీన్.. కాదు! అదే స్టార్ట్ చేసింది. నన్ను తిట్టింది.. కాదు కావాలని నన్ను ఎల్బో తో తోసింది..’ ఇలాగ అంటూ అంటూ, .. చిత్రం గా, రాగాలాపన ఆపి కృతి ఆరంభించగానే, పిల్లలు వద్దనుకుంటూనే, నెమ్మదిగా పాట లో లీనమైపోయారు.. తెలియకుండానే తాళం వేయటం మొదలుపెట్టారు.. అప్రయత్నం గానే ఈసారి అడక్కుండానే చప్పట్లు కొట్టారు.

ఇక ఇదే ఆఖరు ఇదే ఆఖరు.. అని పోరు పెట్టడం మొదలు పెట్టినా పట్టించుకోకుండా, మొత్తానికి కచేరీ పూర్తి చేసి బయట పడ్డాం. దోవంతా ఎవరి ఆలోచనల్లో వాళ్లముండి పోయాం.

సంగీతం ప్రభావం వల్ల, మనస్సంతా ప్రశాంతత ఆవరించటం తో, నా ఆలోచనలు సినిమా మీదకి పోయాయి.. ‘ఎంత టెక్నాలజీ! పూర్వం సై ఫై సినిమాలకీ, ఎవెంజర్ సినిమా కీ ఎంత తేడా! అంత అద్భుతం గా ఎలా తీయగలిగారు.. అక్కడక్కడా, హాస్యాన్ని కూడా సందర్భానుసారం గా సంభాషణల్లో, బలవంతాన చొప్పించినట్లు కాకుండా.. ఇలాగ ఏదో ఆలోచిస్తూండగా, ఏదో తేడా గా అనిపించి వెనక్కి తిరిగి చూశాను..

చిరంజీవి పాట ‘యమహా.. నగరీ, కలకత్తా పురీ..’ పాట సన్నగా పాడుకుంటూ, ‘అమ్మ ఫ్రెండ్ పాడిన పాట అచ్చం ఇలాగే ఉంది కదూ..! It must be in the same raagaaa.. ’ అని మా రివెంజర్లు మాట్లాడుకుంటూ..



Sunday, April 29, 2012 24 comments

గేటెడ్ కమ్యూనిటీ కథలు - మా పచ్చ పిచ్చి కథ.

కొత్త ప్రెసిడెంట్ ఎన్నికలొచ్చేశాయి. అంటే ఈ ఎన్నికలు రివర్స్ అశ్వమేథ యాగం లాంటివి అన్నమాట. ప్రెసిడెంట్ కిరీటం పట్టుకుని పాత ప్రెసిడెంట్ దీనంగా, ఆశగా వీధి లో కాపు గాసి ఉండి, ఏమరుపాటు గా రోడ్డు మీదకి వచ్చిన మొదటి వ్యక్తి నెత్తి మీద పెట్టేసి, దాగుడు మూతల ఆట లో లాగా, ‘అంతే, అంతే! దొరికాడు కొత్త అద్యక్షుడు’ అని హాయిగా ఊపిరి పీల్చుకోవటం.. (మరి వేరే ఎవరికీ పెద్దగా ఇంటరెస్ట్ ఉండదు గా?) అలాగ ‘బుక్కయి’ పోయిన (ఇరవయ్యోనంబరాయన) మా నూతన అద్యక్షుల వారు సాధారణం గా ఊర్లో ఉండరు, దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు, అంటే ఆయన ఉద్యోగం అలాంటిది. “నా వల్ల మీకేం ఉపయోగం ఉండదు. మీకు ఏవైనా సమస్యలుంటే నేను అందుబాటు లో కూడా ఉండనే.. మరి నన్నెన్నుకుని మీరేం సాధిస్తారు? నన్నొదిలి పెట్టండి “ అని అత్యంత దయనీయకరం గా వేడుకున్నా.. “అబ్బే మేమంతా ఉన్నాం.. మీకు సహాయం చేస్తాం.. అదీ ఇదీ” అని సర్ది చెప్పి కిరీటాన్ని ఫెవికాల్ తో ఆయన తలకాయ మీద అంటించేశాం.. ముహూర్త బలం బాగున్నట్టుంది. ఆయన కి ఒక్కసారి గా కాలనీ వాసులకి ఏదో ఒకటి చేసి ‘చరిత్ర సృష్టించాలని ‘ దుగ్ధ మొదలైపోయింది.




ఈ లోగా ఒక రెండు మూడు నెలలు గా ఖాళీ గా ఉన్న నాలుగో నంబర్ ఇంట్లోకి కొత్త కుటుంబం దిగింది. పిల్లలు సంబరపడి సామాన్లు మోసుకొచ్చిన ట్రక్ వెనగ్గా పొలోమని వెళ్లి చూసి పెదవి విరిచి వచ్చేశారు. ఆ ఇంట్లో దిగిన వారికి పిల్లలు లేరట. పిల్లల్లా పెద్దవాళ్ళం ట్రక్ వెనక పరిగెత్తలేం, అలాగని క్యూరియాసింటీ చంపుకోలేము కదా.. రొటీన్ గా నడవటానికి వెళ్తున్నట్టు కళ్ళచివర నుండే ఎలాంటి సామాన్లున్నాయి, ఏంటి అని గమనించి వచ్చేశాం. లెదర్ సోఫాలూ, నగిషీల డిజైన్ల అల్మారాలూ, చెక్క సామాన్లూ అలాంటివి, వాళ్లింటికి వెళ్తే ఎలాగూ చూస్తాం కానీ, ముందర సామాన్లు దింపుతున్నప్పుడే చూస్తే ఎంత మజా అసలు!






ఆశ్చర్యం గా అలాంటివేవీ కనపడలేదు. అన్నీ మొక్కలే. రంగు రంగుల పూల మొక్కలు, బోన్సాయ్ చెట్లు, కూరగాయల మొక్కలు, తోట పనిముట్లు, ఎరువుల బస్తాలు... ఈలోగా నాలుగు రౌండ్లు నడిచేసరికి మట్టి,ఆకుపచ్చ రంగు బట్టలేసుకుని, పెద్ద ముక్కుపుడక, చాలా ఫాషనబుల్ గా ఒకావిడ వచ్చి పరిచయం చేసుకుంది. తనకి పర్యావరణ సరంక్షణ అంటే పిచ్చి అని, మొక్కలే తన ప్రపంచమనీ,.. చెప్పింది. చూస్తూ చూస్తుండగానే తన ఇల్లంతా ఆకుపచ్చగా మారిపోయింది. ఇంటి చుట్టూ పైనా, కిందా, ఇంట్లో కూడా ఎక్కడ చూసినా మొక్కలే. తలుపులకి నాచు రంగు వేయించింది. వంటింటికి ముదురాకు పచ్చా, హాల్లో లేతాకుపచ్చా.. పూజ గది కి చిలకాకు పచ్చా.. వేయించింది.


ఆమె స్పూర్థి తో కాలనీ వాసులకి ‘పచ్చ పిచ్చి’ ఒక్కసారి గా పట్టుకుంది. ఏ ఇంట్లో చూసినా కొత్తగా పూల కుండీలు, ఇంట్లో పెట్టుకునే మూలికలూ, ఎడారి మొక్కలూ, పాకే తీగలు, నారు మడులూ,పండ్ల మొక్కలూ, డాబాల మీద వాటర్ ప్రూఫ్ కోటింగులు వేయించి ఆకుకూరల మడులు, అబ్బబ్బ.. ఒక్కటని కాదు. వంటింట్లో మొదలుకుని స్నానాల గది దాకా మొక్కలతో, నిండి పోయాయి. అందరూ ఒక్కొక్కరు గా తోట పని కోసం ఒక బట్టలేంటి, చేతి తొడుగులు, పనిముట్లు, కొనేసుకున్నారు. శని,ఆదివారాల్లో ఇక కమ్యూనిటీ వాసులు ఉదయం నుండీ తోట పనే.. ఇల్లంతా నింపేసి, వాకిలంతా పరిచేసి, చోటు చాలక ఇంటి ముందు సొసైటీ వారు వేసిన చెట్టుకి కూడా ఏవో తీగలు పాకించేశారు. నేనూ ఒక సన్నజాజి తీగని పాకించాననుకోండి.


ఎక్కడ మొక్కలు తెచ్చారు, విత్తనాలు ఎక్కడ శ్రేష్ఠం, పేడ ఎక్కడ దొరుకుతుంది, ఎవ్వరింట్లోనూ కనిపించని అపురూపమైన మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, అనేవే చర్చలు.. వారాంతాల్లో మాళ్ళూ, సినిమా హాళ్ళూ మానేసి అందరూ నర్సరీ ల చుట్టూ పరుగులెత్తారు..


మా కొత్త వైస్ ప్రెసిడెంట్ గారికి ఈ మాత్రం చాన్స్ ఇస్తే అల్లుకుపోడూ.. వెంటనే ఒక తోటపని నైపుణ్యం గల ‘కన్సల్టెంట్’ ని పిలిపించి గెస్ట్ లెక్చర్లు ఇప్పించేసాడు. ఆయన చెప్పినట్టు అందరూ వారి వారి ఇళ్ల వెనక పెద్ద గొయ్యి తవ్వి సేంద్రియ ఎరువు తయారీ చేయాలనే శపథాలు తీసేసుకున్నారు.. ట్రాక్టర్ల కొద్దీ పేడ వచ్చేసింది. ఇంట్లోంచి ప్రతి చిన్న వ్యర్థ పదార్థమూ గొయ్యి లోకే..


కొన్ని వారాలయ్యేసరికి అందరి ఇళ్లూ పాచ్చ్చ్చ్చ్గా.. నాలుగో నంబర్ ఆవిడంటే నిజమైన ఆసక్తి కాబట్టి ఎప్పుడూ మట్టి లోనే కాఫీ కప్పుతోనో, పేపర్ తోనో, పుస్తకం తీసుకునో.. కనిపిస్తూనే ఉండేది, కానీ, మిగిలిన వారు మాత్రం నెమ్మది గా ఒక్కొక్కరు గా తోట పని లోంచి తప్పించుకుని పని వాళ్ల మీద వదిలేశారు. అందరిళ్ళ ముందరా, ఒక్కసారి గా తోటమాలులకి గిరాకీ పెరిగిపోయింది.







మా ఇంట్లో కాసాయని ఏదో ఒకటి ఇంకోళ్ళకి సగర్వం గా పంపుకోవటం,.. ‘ఇన్ని చిక్కుడు కాయలు ఏం చేసుకుంటాం.బాబూ..’ అని విసుక్కోవటాలూ.. మొదలైంది. మామూలు మొక్కలూ, విత్తనాలూ, ఒకళ్లకొకరు ఇచ్చుకున్నా, ఫలానా మొక్క వాళ్లింట్లో తప్ప దొరకదని అనిపించుకోవాలనే యావ అందరికీ ఎక్కువైపోయింది. ఇక వాకింగ్ లో మా ఆడవారికి మంచి మసాలా దొరికినట్టయింది. ‘రోజూ చూస్తున్నాను. తొమ్మిదో నంబరావిడ వాళ్ల టమాటా మొక్కలు ఎండిపోయి ‘సైజ్ జీరో కరీనా ‘ ల్లా కనిపించాయి. మరి ఇన్ని నవ నవ లాడే టమాటాలు తెచ్చి మాకు ఎక్కువయ్యాయి అని ఎలా ఇస్తోంది.. బజార్ నుండి కొనే ఇస్తోంది.’ అని రహస్యాలని చేదించిన వారు కొందరు..





మా మామిడి చెట్టు కన్నా మీ మామిడి చెట్టుకి ఎక్కువ పళ్లెలా వచ్చాయని కుళ్లుకునేవారు కొందరైతే, మేకులు కొడితే జామచెట్టు విరగకాస్తుందని, పాత తోలు చెప్పుతో కొడితే నిమ్మచెట్టు రెపరెప లాడుతూ ఎదుగుతుందని.. సెలవిచ్చిన వారు కొందరు. నేనూ ఒక ‘బలహీన క్షణం’ లో పాత చెప్పు తీసి కొడదామా అనుకుని, తర్వాత తీరిగ్గా సిగ్గు పడి నిమ్మచెట్టు కాయకపోతే, పోయే.. మొక్కని చెప్పు తో కొట్టే సమస్యే లేదని ఊరుకున్నాను.


ఆరో నంబర్ ఆవిడ ఆరోజు పొరపాటున ఓ తొండ మీద కాలేసింది.. తర్వాత ఆవిడ చేసింది భరత నాట్యమో, బ్రేక్ డాన్సో ఇప్పటికీ ఎవరూ తేల్చుకోలేక పోయారనుకోండి.. మూడో నంబర్ ఆయన బట్టల అలమర లో ఒక ఎలక దూరింది.. గొయ్యి లో కుళ్లిన కూరగాయల వాసన కాస్త కష్టమై ఎరువు తయారీ ఇంచు మించు అందరిళ్ళల్లోనూ ఆగింది. పూలు,ఆకులూ చెత్తా పడుతున్నాయని ఒకరు, ఇళ్లు బురదవుతోందని కొందరు, ఎలర్జీలు అన్న సాకు తో కొందరు, కాపు కొచ్చిన కూరల్ని,పాదులని పందికొక్కులు మిగల్చట్లేదని కొందరు, పిట్టలు కాపురం పెట్టి ‘ఆగం ఆగం’ చేస్తున్నాయని మరి కొందరు ఏదైతేనేం మొక్కలు తగ్గించేశారు.






ఛత్రపతి శివాజీ తల్లి గారు ఓసారి అంతఃపురం కిటికీ దగ్గర దువ్వుకుంటూ ‘కాజువల్’ గా చూస్తే.. అల్లంత దూరాన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆక్రమించిన ‘సింహగ ఢ్’ కోట కనిపించిందిట. ఆవిడ ఆక్రోశం తో కొడుకుని పిలిపించి మళ్లీ సింహగ ఢ్ ని మన ఆధీనం లోకి తెచ్చుకోవాలని ఆదేశించిందిట. ఆయన మరుక్షణం, కుమారుడి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న తానాజీ ని పిలిపించి తల్లి ఆదేశం చెప్పి కోటని గెలుచుకుని రమ్మన్నాడట.


అలాగ మా గేటెడ్ కమ్యూనిటీ కి ఛత్రపతి, ధర్మప్రభువులు, ప్రెసిడెంట్ గారి తల్లి వచ్చి.. బాల్కనీ లో చాయ్ చప్పరిస్తూ ‘ఈ చెట్లేంటి? ఈ వాలకం ఏంటి? సొసైటీ వేసిన చెట్లని కొమ్మలు కొట్టించి చెట్టు మూలం దగ్గరున్న చిన్న మొక్కలనీ, తీగలనీ పీకించేయి.. ‘ అని ‘ఆర్డర్లు’ జారీ చేసేసింది.


అంతే.. మాతృవాక్య పరిపాలన ఏనాడూ తప్పని మా అద్యక్షుల వారు వెంటనే ఒక ఈ మెయిల్ పంపి కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నా అన్ని చెట్ల బేస్ లు శుభ్రపరిపించాడు. చెట్ల కొమ్మలు కొట్టించాడు.. దానితో నిజమైన ‘పచ్చ పిచ్చి’ ఉన్న వాళ్లు కన్నీరు కార్చి, కవితలు రాసి ఈ మెయిళ్ళు పంపుకుని ఆందోళనలకి దిగి కుమిలి కుమిలి కృశించగా.. ‘అబ్బ! వెలుతురొచ్చినట్టయ్యిందని’ మిగిలిన తాత్కాలిక హరిత ప్రేమికులు ఊపిరి పీల్చుకున్నారు.. కార్ పోర్టికోల మీద పాకించిన తీగల్ని పీకి పారేసి, రూల్ ప్రకారం కంపల్సరీ గా ఉంచాల్సిన లాన్ మాత్రం మిగిల్చి, చుట్టూ గచ్చు చేయించుకుని ‘నీటు’ గా చేసుకుని గత స్మృతులని నెమ్మదిగా మరిచిపోయారు. మరి కొందరు కాస్త నీటి కరువు వచ్చినప్పుడు ‘మనకే లేనిది.. మొక్కలకెక్కడి నుంచి తెస్తా’ మంటూ మానేశారు..


అయితే, తోటమాలి మీద ఆధారపడేవారూ, మొక్కల ప్రేమికులూ, వాళ్ల ఇళ్లని ఇంకా ఆకు పచ్చగా దివ్యం గా ఉంచుతూనే ఉన్నారు. నీరు లేకపోనీ, కూరలు కడిగిన నీరో, వార్చిన గంజో, ఇంకా గతి లేకపోతే బట్టలుతికిన నీరైనా మొక్కలకి పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూనే ఉన్నారు.. అదండీ మా హరిత విప్లవం కథా కమామీషూ..








Thursday, March 8, 2012 49 comments

ఆకుపచ్చ చుడీదార్ అమ్మాయి..

అదేం చిత్రమో?!,


ఖాళీ గా, ఉద్యోగం లో లాంగ్ లీవ్ పెట్టుకుని కూర్చున్నప్పుడు ఒక్క పుస్తకం చదవబుద్ధయ్యేది కాదు. ఒక్క ముక్క నాకోసం రాసుకోబుద్ధయ్యేది కాదు. ఎవరికైనా స్నేహితులకి కాల్ చేసి హస్కు కొట్ట బుద్ధయ్యేది కాదు. ధ్యానం, తోటపనీ .. అబ్బే.. చెప్పనే అక్కరలేదు. కస్టమర్లు ‘ఇదేం ప్రోడక్ట్ రా బాబోయ్!’ అని గగ్గోలు పెట్టినప్పుడు, పనమ్మాయి ‘మెడికల్ లీవు’ పెట్టినప్పుడు, ప్రాజెక్ట్ డెడ్లైన్ నెత్తి మీద ఉన్నప్పుడు, ముఖ్యం గా మార్చ్ లో పిల్లల పరీక్షలున్నప్పుడు.. రోలర్ కోస్టర్ రైడ్ లో కిందా మీదా పడుతూ,లేస్తూ, పుస్తకాలు చదువుతుంటే ఉంటుంది మజా.. అబ్బ!.. చిన్నదనం లో దొంగతనం గా పక్కింటి మామిడి కాయలు రాళ్లతో కొట్టి, వంటింట్లోంచి తెచ్చుకున్న ఉప్పూ,కారం నంచుకుంటూ తిన్నప్పుడు కూడా రాలేదనిపిస్తుంది నాకు.

నెల రోజులనుండీ.. మేము చేసిన ప్రాజెక్ట్ వాడుకున్న పాపానికి బలైన కస్టమర్లు ఫోన్ కాల్ లో, మా కోడ్ దెబ్బకి పడ్డ బాధలకి భోరు భోరున విలపిస్తూ చెప్పుకుంతుంటే ‘ఆహా... పుస్తకాలు తిరగేస్తూ..’ సానుభూతి ప్రకటిస్తూ, ‘మీకెందుకూ.. రేపటికల్లా ఫిక్స్ ఇచ్చేయమూ? ‘ అని ఓదారుస్తూ.. తెగ చదివేశా ఈ మధ్య.

మొన్న మాంచి సస్పెన్స్ లో పుస్తకం చదవటం ఆపేసి స్కూటర్ మీద ఆఫీసు కి వెళ్తుంటే, ఆ సమయం అంతా పుస్తకాలు చదవకుండా అయిపోతుందని ఒకటే బాధ! కాలేజ్ రోజుల్లో బస్సుల్లో వేలాడుతూ ఎన్ని పుస్తకాలు చదివామో.. ఎంత సరదాగా ఉండేదో.. ఒక్కోసారి పుస్తకం లో ములిగి పోయి దిగాల్సిన స్టాప్ దాటేసామని గ్రహించి, మళ్లీ వెనక్కెళ్ళే బస్సు పట్టుకోవటం.. ఆ అనుభవాలన్నీ ఎంత బాగుండేవి.. ఇలా కాదని నిన్న వెళ్లేటప్పుడు మా వారితో వెళ్లి వెనక్కి వచ్చేటప్పుడు బస్సు లో వద్దామని రెండు మూడు పుస్తకాలు బ్యాగు లో పెట్టుకున్నా..వెనక్కి వచ్చేటప్పుడు, ఉత్సాహం గా.. మెయిన్ రోడ్డెక్కేవరకూ కొద్ది కొద్దిగా చదువుతూ రోడ్డెక్కి మూసేసా.. నా ఖర్మేంటో, బస్టాప్ అంతా జనమే జనం. కిక్కిరిసిపోయి, మొహాలూ, లాప్ టాప్ బాగులూ వేలాడేసుకుని బోల్డు అమ్మాయిలూ, అబ్బాయిలూ.. చుట్టూ అన్నీ సాఫ్ట్ వేర్ కంపెనీ లేగా? నేనూ అక్కడే సెటిల్ అయిపోయా.. ఒక్కసారి గా కర్రీ పఫ్ ల వాసన.. తిరిగి చూస్తే పక్కన బేకరీ.. ‘వావ్.. ఇది కూడా తిందాం..చాలా రోజులైంది అని ఒక వెజ్ పఫ్ ఆర్డరిచ్చా..’ అక్కడే ..దుమ్ము లో నిలబడి తింటుంటే.. ఆహా స్వర్గమే.. (ఆఫ్ కోర్స్.. దుమ్ము మేఘాల వల్ల కూడా అలా అనిపించి ఉండవచ్చు).. బస్సుల నిండా వేలాడుతూ జనం.. బాబోయ్.. ఇంత మందా.. ఇక చదివినట్టే.. అనుకుని నిరుత్సాహబడ్డా..

కానీ... పోన్లే.. దంచినమ్మకి బొక్కినంత.. అనుకుని కనీసం కర్ర్రీ పఫ్ తిన్నాను.. అనుకుని ఒక బస్సేక్కేసా నేనూ. పక్కకి కదలటానికి లేదు.. కాకపొతే ఏసీ బస్సు అవటం తో, ఏదో ఒక మాదిరి గా పర్వాలేదు. కొందరు చెవుల్లో ఐ పోడులూ, చేతుల్లో ఐ పాడులూ, బిజీ బిజీ గా.. కొందరు కనీసం ఫోన్లో.. ‘అబ్బా.. ఏమిరుక్కున్నానో.. స్కూటర్ మీదయితే ఈ పాటికి ఇంటికెళ్లి పోయుంటానేమో.. హహ్’ అనుకుంటుండగానే..

‘అది కాదురా! ‘ అని వినపడింది. నా వెనక ఉన్న అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నట్టుంది. వాళ్ల తమ్ముడితోనో, కొడుకుతోనో.. ఏమోలే అనుకున్నా..

‘నువ్వింత లవ్ చేస్తున్నావ్. అది అసలు నిన్ను కేర్ చేస్తుందా? ‘ అంటోంది.. (అబ్బ! రష్ గా ఉంటే ఉంది బస్సు. భలే కబుర్లు వినచ్చు..’ అని చెవి అటువైపు పడేశా..)

‘నువ్వెంత స్ట్రాంగ్ గా ఉండాలంటే.. అది రేపు నీ ప్రాజెక్ట్ లో, నీ పార్ట్ నర్ గా వచ్చినా నువ్వు నవ్వుతూ పని చేయగలగాలి!’ (అమ్మో చాలా తెలివైన పిల్ల లా ఉంది.. ఈ అమ్మాయి మొహం చూద్దామంటే, తల తిప్పే చోటు లేదు. ఆకుపచ్చ చుడీదార్ అంచులు మాత్రం కనిపిస్తున్నాయి)

“అయినా.. నీకు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ వచ్చు.. దానికేమొచ్చు? చచ్చు పుచ్చు ఇంగ్లీషూ అదీనూ.. “ (ఓహో.. ప్రేమ కి ఇవన్నీ కావాలన్నమాట.. ఛా.. ఈ తెలివి లేక అనవసరం గా చదువుకున్నప్పుడు భాషలని లైట్ తీసుకున్నా.. అందుకే ప్రేమ లో పడలేకపోయా  ‘ )

‘నువ్వు.. ఫలానా యూనివర్సిటీ రా.. అది.. ఆ సుత్తి ఉస్మానియా..యూనివర్సిటీ..’ (ఆ అమ్మాయి మీద ఓ మాదిరి గా ఉన్న తున్న భావం .. అంతా.. కూకటి వేళ్లతో పెకిలింపబడిపోయింది.. వార్నీ.. మా ఉస్మానియా కేమైందిట? దీనికి మరీ కొళుపు ఎక్కువ.. అక్కసు గా అనుకున్నా’

‘అయినా. ఏదో పబ్ కి నాతో వచ్చావే అనుకో.. సొ? ఆ మాత్రానికే అలుగుతుందా?’ (ఓహో..అదన్నమాట)

‘సిగ్నల్ చాలా బాగున్నట్టుంది.. అవతల పక్క మాటలు కూడా కొద్దిగా వినబడుతున్నాయి. (నేనూ చెవి కాస్త ఎక్కువ రిక్కించాననుకోండి..)

(అవతల పక్కనుండి).. ;అది కాదు తల్లీ.. ఐ లవ్ హర్..’ (ఓహో.. ప్రేమికుడు.. ప్చ్.. పాపం. ).

‘ఒరేయ్.. నువ్వు ఫూలిష్ గా మాటాడకు.. మా లవ్వే మనకు వద్దు. .. ఆగు రూమ్ కెళ్ళాక మాట్లాడతా .. బస్సులో ఉన్నాన్రా!’ (ఓహో నాలా ఇంకా జనాలు వింటున్నారా? చుట్టూ చూశా.. నాలాంటి ‘హుందా తత్వం ‘ ఉన్నవారిలా ఉన్న పెద్దవాళ్లు ఒకరిద్దరు వింటూ, ఈ మాట విన్నాక.. నావైపు అదోరకం గా చూశారు.. అదేదో వాళ్లకొక్కల్లకే వినే హక్కున్నట్టు.. నేను పట్టించుకుంటే కదా..)

‘అసలు.. ఫేస్బుక్ లోకి కొన్ని రోజులు వెళ్లకు.. కాల్స్ కట్ చేయి, సిమ్ కార్డ్ మార్చెయ్..చాట్ లోకి వెళ్లకు.. (ప్లానంతా రెడీ.. గుడ్..)

;(అవతల పక్క నుండి) “అది కాదే.. మొన్న దానికి expensive watch,ring ఇచ్చా.. పైగా.. సమ్యక్ లో సల్వార్లు కొన్నా..’ ( ఇదన్నమాట అబ్బాయి బాధ!)

“ఎప్పటికి మారతార్రా మీరూ.. కన్ఫర్మ్ అవకుండా.. టైం తీసుకోకుండా అలా గిఫ్తులిస్తారా మీరూ! టూ మచ్! ‘ (కన్ఫర్మ్ అంటే ఏంటో.. ఎంత టైం తీసుకున్నాక గిఫ్టులివ్వచ్చో..మనకి ఎలా తెలుస్తుంది?)

“(అవతల పక్కనుంచి..) “నువ్వు మరీ చెప్తావు.. గిఫ్ట్ ఇవ్వకుండా పబ్ దాకా వస్తారా ఎవరైనా.. తన సంగతి వదిలేయ్.. నువ్వేడతావా?’ (అమ్మో..ఇదొకటా? బానే ఉంది)

“ఒరేయ్.. నా సంగతి వదిలేయరా! నేను రమేష్ ని ఎప్పుడూ ఏదీ అడగలేదు. సునీల్ అంటే.. అప్పుడు నాకు తెలియదు రా.. సచ్చా ప్యార్ అంటే ఏంటో..’ (అయ్యో.. ఈ అమ్మాయిని కనుక్కోవాలి సచ్చా ప్యార్ ఏంటో.. )

బస్ స్టాప్ వచ్చింది. జనాలందరూ దిగిపోతున్నారు.. ఈ అమ్మాయి మొహం చూసి తరించవచ్చు.. అని ఉత్సాహం గా తిరిగితే.. పిల్ల కి సీట్ దొరికింది. ముఖం అవతల వైపు.. ఆ పిల్ల పక్కన ఆల్రెడీ ఎవరో .. నుంచున్నారు... నేనూ ఎలాగోలా దూరిపోయా.. కొద్దిగా మిస్సయినట్టున్నా.. కానీ..అసలు ఎలా మాట్లాడుతోంది.. అంత వ్యక్తిగత విషయాలు బస్సులో పది మంది మధ్యలో. కొంతమంది గమనిస్తున్నారని తెలిసినా.. పెద్దగానే మాట్లాడుతుంది..

‘ఇది స్కూల్/కాలేజ్ కాదు రా.. కార్పోరేషన్..’ ( కార్పోరేట్ వరల్డ్ అనుకుంటా..నాలా వింటున్న పెద్ద మనుషులు కిసుక్కు మన్నారు.. నేను సమయానికి గిచ్చుకున్నాను కాబట్టి గట్టి గా నవ్వలేదు.)

‘అది కాదు రా.. అసలు ముందు నువ్వు నన్నే లవ్ చేశావు.. అదే నీకు మంచిది. కానీ నువ్వు నాకు సరిపోవు రా.. అందుకే నీకు సరిపోయే అమ్మాయిని సెట్ చేసే బాధ్యత నాది.. ‘ (ఆ అమ్మాయి కి సరిపోని ఆ అబ్బాయికి ‘సెట్’ చేసి పెట్టేంత మంచి హృదయం .. ఖళ్, ఖళ్, మని దగ్గొచ్చేసింది.. అంటే ఆనందం, తృప్తి, జాలి, కోపం..చిరాకు,బాధ, అసహ్యం లాంటి వాటిల్లో ఎగ్జాక్ట్ గా ఏం కలిగిందో చెప్పటం కష్టం.. ఆ అమ్మాయి మొహం చూడ్డామనుకున్నాను కానీ నేనీ భావ పరంపరల తాకిడి లో ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే.. ఆ పిల్ల లేచి నిలబడింది.. గేట్ దగ్గర కెడుతూ కూడా మాట్లాడుతోంది.. ‘ఇప్పుడు నేను సింగిల్ కాదు రా..రవీ చాలా మంచోడు రా..వాడికి నేనంటే చాలా ఇష్టం..’ అబ్బో!! ఈ అమ్మాయికి వాల్యూస్ చాలా ఎక్కువ లా ఉంది)..

‘వ్వ్వావ్వావ్వాట్!!!!’ కోపం గా అరుస్తూ దిగిపోయింది ఆకుపచ్చ చుడీదార్.. .. బస్సు కదిలిపోయింది. ‘ఆ అబ్బాయి ఏమనుంటాడో.. అంత గట్టి గా వ్వ్హాట్ అంది’ అని నేను ఆలోచిస్తుండగానే నేను దిగవలసిన స్టేజీ వచ్చేసింది... నా పుస్తకాలు బస్సులో తెరిచిన పాపానికి పోలేదని గుర్తుకొచ్చింది.





Wednesday, February 1, 2012 46 comments

సరస్వతీ,మేరీ, నేనూ..


సరస్వతి :

కొత్తింటికి మారుతూనే నేను గమనించిన మొదటి మనిషి, పక్కింటి పనిమనిషి. ఒక యాభయ్యేళ్లుంటాయి. తలుపు కొడుతూ ‘యశోదా! ఓ యశోదా! తెలుపు తీయి.. ‘ అని అరుస్తోంది. ‘అమ్మగారో! అమ్మా! మాడం!..అక్కా! భాభీ!’ ఇలాంటి పిలుపులు విన్నాను కానీ ఇలాగ పేరు పెట్టి, పైగా ఏకవచనంలో పిలుస్తోంది. అని బుగ్గలు నొక్కుకున్నాను. సదరు యశోదా దేవి ‘వరేన్ సరస్వతక్కా’ అని తలుపు తీసేది. తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే.. మనమూ అంతే గా.. మా నాన్నగారు వాళ్లు, మా కన్నా ఒక పది ఏళ్ల క్రితం వరకూ ఉద్యోగాల్లో పై అధికారిని, ‘సార్..మాడం..’ అని పిలిచిన వారే గా.. మరి నేను మా బాసు గార్ని ‘హే రాజేశ్! సంజయ్! రూడీ.. సామ్సన్ ‘ అని పిలవట్లా! ఇదే మార్పు మనకి పనిచేసే వారు చేస్తే మాత్రం ఏంటి.. ఎక్కడో ముల్లు లా గుచ్చుకుంటోంది? నాలో ఇంకో బలహీనత అర్థం అయింది. ఈ మార్పు ని ఆహ్వానించాను.

అన్నట్టు ఒకటి గమనించానబ్బా.. నా చిన్నప్పుడు మా అమ్మా వాళ్లూ మామూలు చీరలైనా కాస్త శుభ్రమైనవి, రంగు వెలవని చీరలు కడితే, మా పని మనుషులు ఏ రంగో గుర్తుపట్టలేని చీరలు, ఒక్కోసారి మాసికలతో,అతుకులతో ఉన్న నాసిరకం చీరలూ, మోకాలు కిందకి ఎగ్గట్టి కట్టి, నేల మీద ఓ బండ మీద కూర్చుని అంట్లు తోమేవారు. కొంతమంది శుభ్రం గా స్నానం చేసి తలకి నూనె రాసుకుని, వచ్చినా కొద్దిమంది స్నానాలు రెగ్యులర్ గా చేసేవారు కాదు.

మరి ఇప్పుడో? బెంగుళూరు సాఫ్ట్వేర్ జనాభా లో ఆడవారు వెలిసినట్టున్న లేత రంగుల గుడ్డలు, మోకాళ్ల కిందకి పాంట్లు, టీ షర్టులూ వేసి తలకి కర్లర్లు, సింగినాదాలూ పెట్టి, పనులు పురమాయిస్తుంటే, సీతాకోక చిలకల్లా రంగు రంగుల చీరల్లో మాంచి ఫాషన్ గా, అందం గా జడలేసుకుని, బొట్లు గాజులు, తలలో పూలతో, లక్ష్మీ దేవుల్లా మెరిసిపోతూ వస్తారు. నాకైతే పొద్దున్నే చాయ్ తాగుతూ మా ఇంటి ముందు వెళ్లే చీరల్ని గమనించటం ఒక హాబీ అయిపోయింది.

సరస్వతీ అంతే. భలే చక్కని స్త్రీ. కొత్తింట్లో చేరిన పది రోజుల్లో అర్థమైంది.. కనీసం పదిళ్లల్లో తనే చేస్తుందని. తన వయసుకి అంత వేగం గా, సమర్థవంతం గా అసలు ఎలా చేయగలదు? అన్నది గమనించనారంభించాను. వస్తూనే గడ గడా ఎంత వాగినా, ఎన్ని కబుర్లు చెప్పినా, ఏదో పని చేస్తూనే చేస్తుంది. తన పని అవుతూనే, వాక్యం మధ్యలో ఉన్నా, పత్రికల్లోసస్పెన్స్ సీరియళ్లలా వదిలేసి తర్వాతింటికి వెళ్లిపోతుంది.

చుట్టూ పరిచయాలు పెరిగాక ఇంకొన్ని వివరాలు తెలిశాయి. పిల్లల్లేరని, సరస్వతి భర్త తనని వదిలి ఇంకోపెళ్లి చేసుకుని వెళ్లిపోయాడట. కొంత కాలం దుఃఖ సాగరం లో ములిగినా తాగి భార్య ని కొట్టి పైసలు గుంజుకుపోయే భర్త వల్ల కష్టాల్లో ఉన్న పక్కింటి పిల్లల పెంపకం బాధ్యత నెత్తి మీదకి వేసుకుందని.. వాళ్ల చదువుల కోసం శక్తి కి మించి పని చేస్తుందని..

అన్నేసి ఇళ్లు చేస్తుంది కదా.. ‘ఎలాగూ మళ్లీ సాయంత్రం రావాలి .. ఇంటికెళ్లటం దండగ!’ అనుకుని కాలనీ లో ఒక చంటి పాపాయి ని మధ్యాహ్నం రెండు గంటలు ఆడించటానికి కుదురుకుంది. డబ్బు మాత్రం పుచ్చుకోలేదు. ‘ఎందుకు సరస్వతీ.. నీ విశ్రాంతి సమయం ఇదీ.. ఎలాగూ పిల్లని చూస్తున్నావు.. గంటకి ఇంతా అని మాట్లాడుకోవచ్చుగా!’ అని అడిగాను.

‘క్రిష్ణప్రియా! నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఇది నా విశ్రాంతి సమయం. డబ్బు పుచ్చుకుని చంటి పిల్లని చూస్తే.. అది విశ్రాంతి సమయం ఎందుకవుతుంది? ఏం? నాకు విశ్రాంతి అవసరం లేదా?” అంది. గుండె నిండిపోయింది. మళ్లీ నేను నోరెత్తలేదు. ఈలోగా తనే అనేసింది.. “ఏ జన్మ లో చేసిన పాపానికో.. ఈ జన్మలో బిడ్డలు పుట్టలేదు. ఏమో! ఏం తెలుసు? కనీసం ఈ విధం గా నైనా పిల్లలకు సేవ చేసుకుంటే వచ్చే జన్మ లో తల్లినవుతానేమో ‘ అంది. నేను తలెత్తి చూశాను. ‘సినిమాల్లో/కథల్లో లాగా.. కన్నీటి తెర అడ్డుకోవటం, తల తిప్పేసుకోవటం లాంటివి ఏమీ లేవు.. చాలా చాలా మామూలు గా చెప్పింది.

కొన్నాళ్లకి, ఒక పది రోజులు రాలేదు. తన పక్కింటి వారి పెద్ద కొడుకుకి చెడు స్నేహాలకి మరిగి, చదువు పెక్కన పెట్టి, ఖర్చులకిచేతిలో డబ్బు ఆడట్లేదని నెత్తి మీద మోది మరీ తన తాగుడు కోసం దాచుకున్న డబ్బంతా ఎత్తుకుపోయాడని చెప్పింది. ‘మరి ఎందుకు నీకు ఈ ఆరాటం! ఎవరి గురించీ బాధ పడకు. నీ సంగతి నువ్వు చూసుకో..’ అని అందరూ చిలక్కి చెప్పినట్టు చెప్పారు. వినలేదు. ‘వాడు కాకపోతే, ఇంకా ఉన్నారు గా పిల్లలు! వాడి తప్పు వల్ల మిగిలిన పిల్లలు ఎందుకు శిక్షింపబడాలి?’ అని నవ్వేసి తన పనులు అలాగే చేసుకుంటూ వెళ్లిపోయింది.

ఏంటో, మెలకువ ఉన్న ప్రతి నిమిషమూ, నాకోసం, నా వాళ్ల కోసం ఆలోచించటం, ఇతరుల కోసం, కొద్దో గొప్పో ఆలోచించినా, ఆచరణ కి మాగ్నిట్యూడ్ లో ఏమాత్రం పొంతన లేదనిపించింది. కానీ, ‘ఆ.. ఒంటరి గా ఉంది కాబట్టి ఇరుగూ, పొరుగూ, కష్టం, సుఖం అని మాటలు చెప్తోంది. తనకంటూ కుటుంబం ఉండి ఉంటే ఏమనేది.. తనూ సంసార సాగరం లో ఈదుతూ, మూలుగుతూ, తేలుతూ ఉండేది లే.. అని నాకు నేను సద్ది చెప్పుకుని, దులిపేసుకున్నాను.

తన వైద్యానికి, ఖర్చులకీ, ‘చాలా ఉదారం’ గా ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి, నాకు నేనే శబాషీలిచ్చుకుని, నా అహాన్ని సంతృప్తి పరుచుకున్నాను.

(ఇంకా ఉంది)

Thursday, January 26, 2012 23 comments

మా సింగం సజెస్ట్ చేసిన ‘తమిళ పడం’ సినిమా..


క్యూబ్ లో నేనూ, మా సింగం ( నా సహోద్యోగి) యమా సీరియస్ గా పని చేసుకుంటున్నాం. మా బాసు గారు వెనక నుంచి వచ్చి అంత కన్నా సీరియస్ గా.. ప్రాజెక్ట్ డెడ్ లైన్ పొడిగించబడింది. అమెరికా టీం వాళ్లకి వేరే ఏవో ఎమర్జెన్సీల వల్ల మా పని చేయరు. అని చెప్పి, ఆ వార్త మా మెదడు లో పూర్తిగా ఇంకే లోపలే ఆయన కి ఏదో ఫోన్ కాల్ వచ్చి చక్కా వెళ్లి పోయాడు. ఇంక సగం వాక్యం రాసిన డాక్యుమెంట్ అలాగే వదిలేసి బ్రేక్ రూమ్ లో కెళ్లి పిచ్చాపాటీ లో పడ్డాం. మాతో పాటూ, ఇంకో నలుగురు చేరారు. ఇలాంటి సమయాల్లో మనకి ఉండే టాపిక్కులు ఏముంటాయి? ఆఫీస్/దేశ రాజకీయాలు, మా కంపెనీ కాకుండా అన్ని కంపెనీల్లో ఎంత చక్కటి జీతాలు, గట్రా ఇస్తున్నారో, ఎవరు ఎక్కడ ఇళ్లు కొనేస్తున్నారో అయ్యాక ఇంక మిగిలింది సినిమా యే కదా! బిజినెస్ మాన్ జోకులు, పవన్ కళ్యాణ్ జోకులు, బాలకృష్ణ /జూనియర్ NTR జోకుల్లాంటివి తెలుగు వాళ్లు చెప్తే, తమిళులు, హిందీ వారు వాళ్ల సినిమా స్టార్ల జోకులు చెప్తూ అలరిస్తుండగా మా సింగ పెరుమాళ్ ఇవన్నీ కాదు కానీ క్రిందటేడు ‘తమిళ్ పటం’ అని ఒక సినిమా వచ్చింది. ఒక్క సినిమా చూసారంటే అన్ని సినిమాలూ చూసినట్టే.. ‘నాను గారంటీ’ అనేశాడు. నేనూ ఎక్కడో ఆ సినిమా గురించి చదివాను. సాధారణం గా సింగం మాట మీద నాకు చాలా గురి. క్యూబ్ కెడుతూనే, ఆన్ లైన్ లింక్ నాకు ఇచ్చాడు.

రేపెలాగా గణతంత్ర దినోత్సవం .. ఇంట్లోనే ఉంటాం కదా అప్పుడు చూద్దామనుకున్నాను. లింక్ పని చేస్తోందో లేదో చూద్దామని చూస్తే ఏముంది.. ఆంగ్ల సబ్ టైటిళ్లు లేవు. సర్లే అని వదిలేసి వేరే పనుల్లో పడ్డాను. రాత్రి, మీటింగ్ కాన్సెల్ అయింది. పిల్లలు గణతంత్ర దినోత్సవం కార్యక్రమాలకి తయారవుతూ చాలా బిజీ గా ఉన్నారు. కాస్త బ్లాగులు చూద్దామని లాప్ టాప్ తెరిచాను. ఎదురు గా ‘తమిళ్ పటం ‘ సినిమా డౌన్ లోడ్ అయి ఉంది. సరే చూద్దాం ఎప్పుడు అర్థం కాక బోర్ అనిపిస్తుందో అప్పుడే మానేద్దాం. అని మొదలు పెట్టాను.

ఈ మధ్య కాలం లో భాష పూర్తిగా అర్థం కాకపోయినా అంతగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమా ఇదే..

సబ్ టైటిల్స్ కూడా లేకుండా చూసి ఒక రివ్యూ రాసే సాహసానికి ఉసి గొల్పిన సినిమా ఇది. అప్పటికప్పుడు కొంత మంది స్నేహితులకి ఫోన్ చేసి మరీ చూడమని బలవంతం పెట్టేందుకు ప్రేరేపించిన సినిమా ఇది.

“బామ్మా! ఇన్నాళ్లుగా నీ హృదయం లో సమాధి చేసిన రహస్యం చెప్పమ్మా చెప్పు.. నేనెవర్ని? నా తల్లిదండ్రులెవరు? నా ఊరేది?” అని హీరో చచ్చే భావోద్వేగం తో అడిగితే.. నింపాదిగా ‘అదేం పెద్ద విషయం కాదు.. నువ్వడగలేదు.. నేను చెప్పలేదు! అయినా ఇన్ని సినిమాలు చూస్తావు .. GK బొత్తి గా లేదేంటి? “ మెడ లో లాకెట్ చూసుకో.. అంటే కనీస స్పృహ లేని కథా నాయకుడు పాతికేళ్ల జీవితం లో మొట్ట మొదటి సారి లాకెట్ తెరిచి తల్లి దండ్రులని చూసుకుని కన్నీళ్లు పెట్టుకునే సీన్, చూసి చిరునవ్వైనా రాకుండా పోదు.

హీరోయిన్ తండ్రి ‘నీ అంతస్తేంటి నా అంతస్తేంటి? అని హీరో ని అడిగితే, నీకన్నా బోల్డు రెట్లు సంపాదించి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని చాలెంజ్ చేసి హీరో పౌరుషం గా బయటకెళ్లి ఒక పాట అయ్యేలోపల పాల పాకెట్లు, పత్రికలూ వేసి, పండ్లమ్మి, పాత ఇనప సామాన్లు కొని, పార్కులో ప్రేమికులకి పల్లీలమ్మి, కత్తులకి పదును బట్టి, కూలీ పని చేసి వేలాది కోట్లు సంపాదించి (అదీ హీరోయిన్ తండ్రి కప్పు కాఫీ తాగే లోపల!) పది ఫారిన్ కార్లలో రావటం చూస్తే నవ్వే నవ్వు.

ఇక, చెల్లి కాలేజ్ కెళ్తే, అరిచేతుల మీదుగా నడిపించే అన్నలు, రైలు డబ్బా మీద ప్రేమలేఖలు రాసే గంగోత్రులు, కాలేజ్ కెళ్లే నలభై ఏళ్ల లేత బాయ్స్, జులపాల జుట్ల విలన్లు, చిన్న స్టికర్ పెడితేనే ప్రేమికురాలు కూడా గుర్తు పట్టనంత మారిపోయే హీరో రూపం, చూస్తేనే పొట్ట చెక్కలవటం ఖాయం.

హీరోయిన్ ని ఇంప్రెస్ చేసేందుకు హీరో ఒక్క రాత్రంతా కష్టపడి భారత నాట్యం నేర్చుకుని ప్రదర్శన ఇచ్చిన సీన్ చూసి నేనైతే కుర్చీ లోంచి కింద పడి నవ్వాను. (ముఖ్యం గా భాగ్య రాజా స్టెప్ లు చూసి నాట్యం నేర్చుకోవాలని చూడటం)

వీధి లో దుండగులు ఫుట్ పాత్ మీద అమ్ముకునేవారి మీద చేసే జులుం అన్యాయాన్ని ఎదిరించటానికి ఒక పెడల్ వేసి సైకిల్ చక్రం తిప్పి పెద్దయి వచ్చి వారిని చితక్కొట్టిన సీన్ అవగానే దళపతి అయిపోయి, రజనీ కాంత్ లా డాన్స్ వేసే సీన్ ‘అబ్బ! ఎన్ని సినిమాల్లో చూశాం?’ అనిపించక మానదు.

దరిద్రం ఓడుతున్న ఇంటి తలుపు తీస్తూనే అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ఇళ్లు, భయంకరమైన టెక్నాలజీ తో కట్టిన విలన్ల డేన్లూ, ఆదిమ మానవుడి కాలం నుండీ ఒకేరకం గా కనిపించే CBI కార్యాలయాలూ, పోలీస్ ఆఫీసర్లూ.. డాక్టర్లూ,

పనీ పాటా లేకుండా పతంగులకోసం మాంజా కోసం గాజు ముక్కల్ని మరిగిస్తున్న హీరోనీ, అతని బేవార్స్ స్నేహితుల దగ్గరకి కాలనీ సమస్యలు చెప్పుకోవటమే నవ్వు తెప్పిస్తే, ప్రజలకోసం తన డబ్బునీ, బండి నీ లంచం ఇవ్వటం చూస్తే గిగిల్ గిగిల్..

గజనీ, అపరిచితుడు, అపూర్వ సహోదరుల తరహా లో విలన్లని చంపే పద్ధతులు చూసి నవ్వీ నవ్వీ, డొక్కల నొప్పులు..

ఇక అన్నింటి కన్నా హైలైట్ హీరో ప్రేమ ట్రాక్, హీరోయిన్ కనపడుతూనే, లైట్లు వాటంతట అవే వెలగటం, గంటలు మోగటం, రోడ్డు మీద కనపడే ప్రతి ఆడ మనిషి లోనూ హీరోయినే కనిపించటం.. కాలేజీ ఇంటర్ కాం లో మైక్ లో ‘ ఐ లవ్ యూ’ చెప్ప టానికి క్యూ, ఊరంబడా చిత్తం వచ్చినట్టు కలిసి తిరిగి, ప్రధానం సమయం లో మాత్రం తెగ సిగ్గు పడటం.. ‘అబ్బ.. ఒక్కటని చెప్పటానికి లేదు’.

ఆంగ్లం లో విడిపోయిన కుటుంబ సభ్యులు ఎమోషనల్ పాట పాడుతూ కలవటం కూడా తెగ నచ్చింది..

క్లైమాక్స్ లో ఫైట్ అయితే చెప్పనే అక్కరలేదు.

సినిమా లో మొదటి సీన్ లోనే వర్షపు రాత్రి గుడిసె లో ఒక తల్లి ప్రసవ వేదన! మంత్రసాని, గుడిసె బయట తండ్రి ..అంతా మామూలే. బిడ్డ క్యార్ మన్నాడు.

‘మళ్లీ మగ బిడ్డ!’ ఆ ఊరి ఆచారం ప్రకారం బిడ్డ కి జిల్లేడు పాలు పోసి చంపేయమని తండ్రి మంత్రసాని కి ఆదేశం,.. హృదయ విదారకం గా ఏడుస్తున్న పురుట్లో పసి కందు ని మంత్రసాని తీసుకెళ్లిపోతుంది. ‘ఎందుకు? ఎందుకు? ఎందుకు? ‘ దానికో ఫ్లాష్ బాక్. ఆ ఊరి ‘పెదరాయడు’ ఒకానొక చారిత్రాత్మక తీర్పు ఇస్తూ, ‘ఈ ఊరి మగ బిడ్డలు పెరిగి పెద్దయి, చెన్నై కి వెళ్లి అక్కడ పంచ్ డైలాగులు కొడుతూ, హీరోలయిపోయి, మొదటి సినిమా రిలీజ్ అవకుండానే ముఖ్యమంత్రి పదవి కి అభ్యర్టులవుతున్నారు.. కాబట్టి.. పుట్టిన మగ పిల్లలకి.. జిల్లేడు పాలు..

మంత్రసాని హృదయ విదారక మైన పాట పాడుతూ, జిల్లేడు పాలు పట్టబోయేంతలో, ‘బుడ్డ సూపర్ స్టార్’ “ఆగు!! నన్ను గూడ్స్ బండి ఎక్కించు.. అన్ని సినిమాల్లో గూడ్స్ బండి చెన్నై కే వెళ్తుంది కదా!” అంటాడు. ఈవిధం గా బామ్మగారిని మురిపించి, ఆవిడ తోడుగా మదరాసు మహానగరానికి చేరతాడు.

వెంటనే అలవాటు ప్రకారం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పైన జూమ్ చేస్తుంటే ఒక ఆటో డ్రైవర్ వచ్చి.. ‘ఏంటి? మళ్లీ ఇంకో హీరో వచ్చినట్టున్నాడు చెన్నై కి? ఏం బాబూ? మద్రాసంటే ఇక రైల్వే స్టేషన్ ఒక్కటే ఉందా? బీచ్ ఉంది.. కాలేజీ ఉంది.. పోరా..’ అని బెదిరిస్తాడు. ఇలాగ చెన్నై కి చేరిన బాబు హీరో గా ఎదిగిన విధానం, అతని విజయాలు ఈ సినిమా కథ.

మనల్ని ఈసినిమా ఎంత నవ్వించినా తెర పైన పాత్రం చాలా చాలా సీరియస్ గా చేశాయి. అలాగే సంగీతం, ఛాయాగ్రహణం చాలా బాగున్నాయి. హీరో చాలా చాలా ప్రతిభావంతుడు. డైలాగులు పెద్దగా అర్థం కాకపోయినా తెలుగు సినిమాలూ అదే అదే చూపించి మనల్ని ఈ సినిమా చూడటానికి రెడీ చేసేసాయి.

మా అత్తయ్య వాళ్ల ఊర్లో ఒకావిడ అంతంత సొమ్ము పోసి కొంటున్నాం టికెట్టు అని కనీసం 18 రీళ్లయినా ఉండే సినిమాకే వెళ్తాను.. అనేది. అలాగ, ఈ ఒక్క సినిమా చూస్తే వంద సినిమాల పెట్టు.

ఈ సినిమా సమీక్ష కోసం :

http://www.indiaglitz.com/channels/tamil/review/11518.html

ఆలమూరు సౌమ్య రాసిన సమీక్ష చిత్ర మాలిక లో :

http://chitram.maalika.org/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-%E0%B0%A8%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8/




చూసి చెప్పండి మీకెలా అనిపించిందో..

 
;