Saturday, June 12, 2010

ఊర్వశి కృష్ణప్రియ లా నటించేసా..

సోమవారం ఉదయం.. క్యూబ్ లో కూర్చున్నానే కానీ.. ఒక పది నిమిషాలైనా ఎవరో ఒకరు రాకుండా గడవలేదు.. . ' ఈ బగ్ చూద్దాం .. రావా ? ' అని ఒకరు.. ఈ డాక్యుమెంట్ రెవ్యూ చేద్దామా అని ఒకరు, లాబ్ కెళ్దాం రమ్మని వేరొకరు..

కొత్త సినిమా డవున్ లోడ్ చేసావా?, ఫలానా కంపెనీ లో వెళ్తే 30% హైక్ ఇస్తున్నారట.. అతనెవరో ఐ-ఫోన్ కొన్నాడట.. ఇంకెవరో హొండా సిటీ కొన్నాడట లాంటి ఊసుబోక కబుర్లు.. 9.30 కి వస్తే.. అప్పుడే 11 అవుతోంది.. ఇంక ఇప్పటికైనా మొదలు పెట్టకపోతే పని సాగి, రాత్రి దాకా చేయాల్సివస్తుంది, అనుకుంటుండగా.. ఔట్ లుక్ కాలెండర్ మీటింగ్ రిమైండర్ చూపించింది. 'అమ్మయ్య!' అనుకుని మీటింగ్ రూం కెళ్ళాను. మధ్యలో ఎవరో.. ఏదో చెప్దామనుకుంటే.. 'ఐ ఆం రన్నిగ్ లేట్ ఫర్ ఎ మీటింగ్' అనేసరికి ఎవ్వరూ నోరు మెదప లేదు.

నెమ్మది గా బ్రేక్ రూం లో మగ్ కడిగి కాఫీ మెషీన్ లోంచి కాఫీ వంపుకుని, కాళ్ళీడుస్తూ కాంఫరెన్స్ గది లోకి నడిచాను. 'ఎంత మిగిలిన పని నుండి తప్పించుకుంటే మాత్రం.. పనికి మాలిన మీటింగ్ లో 2 గంటలు కూర్చోవాలంటే ఎంతవిసుగ్గా ఉంటుంది!!" వెళ్ళి చూస్తే ఏముంది.. నాలాంటి వాళ్ళు అప్పటికే ప్రెజెంటర్ కి దూరం కుర్చీలు ఆక్రమించేసారు. నిద్రపోయే స్పాట్లన్నీ నిండిపోయాయి.

"అయ్యో లాప్ టాప్ పెట్టి సీటు ముందర రిజర్వు చేసుకుని, వీళ్ళు ప్రొజెక్టర్, వెబెక్స్ అవీ రెడీ చేసుకునే లోపల కాఫీ కెళ్ళాల్సింది నా 'కాపీనం'వల్లే ఇంక మరీ ప్రెజెంటర్ పక్క సీట్లోనే కూర్చోవాల్సి వస్తుంది :-( అని బాధగా.. కూర్చున్నాను. ఆయన అన్నీ సెట్ చేసుకునే లోపల నేనూ, నా మెసెంజర్, ఈమెయిల్స్, కోడ్ విండో తెరిచి .. మరీ ఉపోద్ఘాతం అయినా వినకపోతే బాగుండదు కదా అని .. తల పైకెత్తి.. ఉత్సాహం నటిస్తున్నాను.


ఆయన 2 స్లైడ్లు చూపించాక.. చుట్టూ గమనిస్తే.. ఇద్దరు ముగ్గురు తప్ప దాదాపు అందరూ లాప్ టాప్ లో కూరుకుపోయారు. వీళ్ళకి పాపం బాగా ఇంట్రస్ట్ ఎక్కువనుకుంటా అనుకుని నేనూ లాప్ టాప్ లోకి తల దూర్చే లోపల గమనించాను.. వాళ్ళ బాసు గారు కూడా వాళ్ళ పక్కనే ఉన్న విషయం. 'అదీ సంగతి.. ' అనుకుని నవ్వుకుని పని చేద్దామా? ముహూర్తం బానే ఉంది కదా.. వర్జ్యం.. ఎప్పుడు ఇలాగా ఆలోచిస్తుండగానే.. ఎవరో మెసెంజర్ మీద 'హాయ్' అన్నారు. 'అరే.. ప్రణవి తో మాట్లాడి 10 రోజులయ్యింది..' అని దానితో సంభాషణ మొదలు పెట్టాను.


ఒక పది నిమిషాలు మాట్లాడాక, తనకేదో పని ఉందని వెళ్ళిపోయింది. సరేలే అని స్నేహితులు పంపిన జంక్ మెయిల్స్ చూస్తున్నాను. ఇంతలో ప్రెజెంటర్ గొంతు కాస్త గట్టి గా వినిపిస్తే చూస్తే ఏముంది? 'లాప్ టాప్స్ మూసేయండీ అని ఆజ్ఞ .. '

ఫోన్ కాంఫెరెన్స్ చేసి ఉండాల్సింది.. 'ఎరక్క పోయి వచ్చి ఇరుక్కు పోయాను :-( ' అనుకుని, విందామని చూస్తే.. ఒక్క ముక్కా అర్థం కావట్లేదు.. మరి 15 నిమిషాలు దాటిపోయింది మొదలు పెట్టి.. బాసు ఫోన్ చేస్తానన్నాడు నా కోడ్ రెవ్యూ చేస్తాడట. ఇక్కడేమో.. ఈ బలవంతపు తద్దినం అని నిట్టూర్చాను.

లాప్ టాపులు మూయమని వార్నింగ్ రావటం తో.. జనాలు బానే వింటునట్టున్నారు. కాస్త ఆవలించి.. పనికొచ్చే పని ఏం చేయచ్చా అని చూస్తున్నాను. టబుల్ మీద సెల్ ఫోన్ కనిపించింది.. ఇకనే.. ఐడియా తట్టేసింది. ఇటుపక్క రమ్య కూర్చుంది. చిన్న సైగ చేసి.. తన సెల్ లోంచి నా నంబర్ కి ఎవరూ చూడకుండా బల్ల కిందనుండి నొక్కాను. ఈ పని చేస్తూ... ' ఊర్వశి కృష్ణప్రియ ' లా నటించటం మాత్రం మానలేదండోయ్.. ఫోన్ రింగ్ అవుతూనే..

అయ్యో.. ఇంత మంచి టాక్ లో ఈ డిస్టర్బన్స్ ఏంటి అన్నట్టు, విధి లేక తీస్తున్నట్టు ఫోన్ ఎత్తాను. అందరికీ ఇబ్బంది కలిగించినందుకు, బాధ పడుతున్నట్టు ఒక లుక్కు అందరికీ ఇచ్చి.. బయటకి వచ్చాను. ఏదో ఎమెర్జెన్సీ వచ్చినట్టు నటించి లోపలికి వచ్చి, ఎవరో తరుముతున్నట్టు బయట పడదామని ప్లాను. ఈలోగా కిటికీ లోంచి చూస్తే.. మా బాసు వస్తున్నాడు..

ఈయన చూస్తే.. మళ్ళీ.. 'రా నీ బగ్గు ఎంత వరకొచ్చిందో చూద్దాం అంటాడు..' అని లోపలకొచ్చేసాను. అనుకున్నట్టుగానే.. ఆయన ఫోన్.. చాలా ఇంపార్టెంట్ టాక్ లో ఉన్నట్టు, తర్వాత మాట్లాడదామన్నట్టు లాప్ టాప్ తీసి మెసేజ్ ఇచ్చాను. ఎలాగూ ఫోన్ వంక పెట్టి తీసాను కదా లాప్ టాప్ అని.. గబగబా సీరియస్ మొహం పెట్టి ఫేస్ బుక్కు అప్ డేట్స్ చూసుకుని మూసానో లేదో తలుపు తీసుకుని బాస్!! వచ్చి ఎదురు సీట్లో కూర్చున్నాడు.

నేను చాలా ఈ లెక్చర్ లో మునిగిపోయినట్టు,.. ఆయన రావటం కూడా గమనించనట్టు నటించటం మొదలుపెట్టాను. జనాలందరూ, తెగ డవుట్లడుగుతున్నారు. నాకేమో టాపిక్కే సరిగ్గా అర్థం కాలేదు.. సరే మనం మాత్రం ఎందుకు తగ్గాలని.. ' ఈ లాస్ట్ యూ.. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ద లాస్ట్ పార్ట్? ' అని అడిగాను. ప్రెజెంటరేమో.. నన్ను టీజ్ చేస్తున్నట్టు.. 'విచ్ వన్? ' అని అడిగాడు.. 'బయటకి రా నీ పని చూస్తాను.. ' లుక్ పడేయగానే.. చిన్నగా నవ్వుతూ.. రిపీట్ చేసాడు. నేను అప్పుడే కాంఫరెన్స్ రూం లో జ్ఞానోదయం అయినట్టు ఎక్ష్ప్రెషన్లు ఇస్తూ,.. బాసు చూస్తున్నాడా అని క్రీగంట గమనించాను.


తర్వాత.. నెమ్మది గా సెల్ ఫోన్ మీద పాత యెస్ ఎం యెస్ లు డిలీట్ చేయటం మొదలుపెట్టాను. ఇంకా 20 నిమిషాలుంది.. 200 పైగా ఉన్నాయి చెత్త SMS లు. ఈ పని చేయాలని నెల రోజులనుండీ అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది.

ఇంతలో.. మా బాస్ అడుగుతున్నట్టున్నాడు ఏదో ప్రశ్న.. తలెత్తి.. ' థాంక్స్!! నాకూ అదే డవుటు కానీ.. తర్వాత అడుగుదాంలే అందరికీ ఇబ్బంది అనుకున్నాను ' అన్న ఎక్ష్ప్రెషన్ పెట్టి.. తల ఆడించాను.. తర్వాత మళ్ళీ అదే బోర్ డం. అందరూ ఏం బట్టలు వేసుకున్నారా, బ్లాగు లో ఏం పోస్ట్ పెట్టాలా లాంటి ఆలోచనలలో.. మునిగిపోయాను. ఇంతలో.. బయట కాస్త కలకలం.. తర్వాతి మీటింగ్ వాళ్ళనుకుంటా. మాది అవగానే లోపలకి రావటానికోసం ఎదురు చూస్తున్నారు.

వాళ్ళ ప్రెజెంటర్ ఆత్రం గా.. వినేవాళ్ళు భయంగా.. ఎప్పుడు మేము తలుపులు తీస్తామా అని..

నేను ఎరెక్ట్ గా కూర్చుని.. మళ్ళీ వింటున్నట్టు నటన.. వాళ్ళందర్నీ.. చూసి.. 'లుక్స్ లైక్ వీ లాస్ట్ ద రూం ,.. లెట్ అజ్ కంటిన్యూ ఆఫ్టర్ లంచ్' అన్నాడు మా బాస్.

అయ్యో ఇంత అద్భుతమైన టాక్ కి ఈ అవాంతరమేంటి అన్నట్టు బాధ గుమ్మడి లా నటిస్తూ.. లేవలేక లేస్తున్నట్టు లేచాను. లంచ్ తర్వాత వెబెక్స్ లో అటెండ్ అవుతాను కానీ ఈ బాధ పడతానా.. అనుకుంటూ.

మా బాస్ వస్తున్నాడు.. నా వైపు.. 'అయ్యింది నా పని ' అనుకున్నాను. ఆయన వచ్చి.. 'క్రిష్నా!! లుక్స్ లైక్ యూ ఆర్ ఎంజాయింగ్ ద టాక్. లంచ్ కెళ్ళి వచ్చాక కూడా ఇది కంటిన్యూ అవుతుందేమో.. ' బగ్గు గురించి రేపు మాట్లాడదాం. నేను మద్యాహ్నం అంతా బిజీ.. అన్నాడు.

మళ్ళీ ఊర్వశి కృష్ణప్రియ విజృంబించింది.. 'ఓహ్.. షూట్.. ష్యూర్.. ' అని అన్నాను. బాడ్జ్ ఊపుకుంటూ, ఉత్సాహం గా లంచ్ గ్యాంగ్ వైపుకి నడిచాను...

16 comments:

భాస్కర రామిరెడ్డి said...

చదివినంత సేపు నవ్వులే నవ్వులు. ఇక చివర్లో మీ బాసుడు ఈ మాటలన్నప్పుడు
>> 'క్రిష్నా!! లుక్స్ లైక్ యూ ఆర్ ఎంజాయింగ్ ద టాక్. లంచ్ కెళ్ళి వచ్చాక కూడా ఇది కంటిన్యూ అవుతుందేమో.. ' బగ్గు గురించి రేపు మాట్లాడదాం
మీ నటన చూసే భాగ్యం కలగలేదు ప్చ్ :)

కృష్ణప్రియ said...

భాస్కర్ రామి రెడ్డి గారూ,


:-)
Glad you enjoyed this post!

మీరూ ఎప్పుడైనా నటిస్తారా ఇలాగ..? ఒక్కోసారి టెక్నికల్ పని కన్నా ఇలాంటి మానేజ్ మెంట్ పనులే ఎక్కువ చేస్తామేమో అనిపిస్తుంది నాకు...

కృతజ్ఞతలతో,
కృష్ణప్రియ/

భాస్కర రామిరెడ్డి said...

కృష్ణప్రియ గారూ,
>>మీరూ ఎప్పుడైనా నటిస్తారా ఇలాగ..?

ఎంత పెద్ద ప్రశ్నవేసారండీ. నేను అప్పుడప్పుడూ మాత్రమే పని చేస్తుంటాను. మిగతా సమయంలో నటన ప్రాక్టీస్ చేస్తుంటాను. :)

Bhãskar Rãmarãju said...

సోషల్ నెట్వర్క్స్ని మీ ప్రోక్సీ బ్లాక్ చేయదా?
ఐనా ఇదేం మీటింగ్ అండీ ల్యాప్పీలు తీస్కెళ్ళనిస్తారా?
మా ఊళ్ళో ఇలా లేదమ్మా, చోద్యం :):) మా లాంటి సర్వర్ గాళ్ళకే ల్యాప్పీలెత్తుకెళ్ళే అవసరం లేదు మీటింగులకి.

కృష్ణప్రియ said...

లేదండీ.. మా ఆఫీస్ వాళ్ళు ఇప్పటివరకూ అయితే బ్లాక్ చేయలేదు.
engineers discretion కి వదిలేస్తారు.. 2-3 గంటల సుత్తి స్టేటస్ మీటింగులు పెడితే..
ఆ మాత్రం స్వేచ్చ ఇవ్వకపోతే.. చస్తాం. అలాంటి మీటింగ్ ఉన్నరోజు సిక్ లీవు పెట్టడమో.. ఏదో చేయాలి తప్పదు..

Unknown said...

మీ ఆఫీసులో బ్లాక్ ఎందుకుచేయ్యలేదంటే
సర్వర్లు రెండు రకాలు


రెవెన్యూ ఆఫీసుల్లోని కంప్యూటర్లలో కూడా తెలుగు సాఫ్ట్ వేర్లు వాడుతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలూ, వ్యాపార సంస్థలలో మాత్రం ఇంగ్లిష్ వాడుతారు. పల్లెటూర్లలో ఉండే ఎరువుల వ్యాపారులూ, సిమెంట్ వ్యాపారులూ కూడా ఇంకమ్ టాక్స్ లెక్కలు ఇంగ్లిష్ లోనే వ్రాస్తారు.

నేను said...

@చెరసాల శర్మ
LOL.


మా ఊర్లో కూడా లాప్టాప్ మీటింగ్కి తీసుకెళ్ళనీయరు. అందవల్ల మాకు మీటింగ్స్ లో నటనతో పాటు బొమ్మలు గీస్తూ హస్తకళలలొ నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం కూడా కలుగుతుంది.

Bhãskar Rãmarãju said...

పూల కూండీలు మూడు రకాలు
అన్నం వండినప్పుడు పొంగు వస్తే మూత కొంచెం వారగా పెడితే పొయ్యి ఆరిపోదు.
పొయ్యిల్లో కూడా చాలా రకాలుంటాయి. దక్షిణ భరత దేశంలో బియ్యం ఎక్కువ తింటే ఉత్తరభారతంలో గోధుమలు ఎక్కువతింటారు.
జపాను పసిఫిక్ మహాసముద్రంలో ఓ చిన్న దీవి. ఐతే ఓ బోటేస్కుని నెమ్మదిగా నెట్టుకుంటా హిందూ మహా సముద్రంలోకి రావచ్చు. మీకు పర్మిషన్ లేకపోతే బోటు మాత్రం హిందూమహా సముద్రంలోకి వస్తుందేమో కానీ, బాడీ మాత్రం రాకపోవచ్చు.

మైత్రేయి said...

@భాస్కర్ రామరాజు ,
super..

మైత్రేయి said...

@కృష్ణప్రియ గారు., బానే వుంది కాని నాన్ ఐటి జనాలంతా మనం పనిచెయ్యమను కొంటారేమో. (తెలుసుకొంటారేమో). నా బాధ నాది మా అత్త గారు చూస్తే, ఇంత మాత్రానికి హడావిడి చెస్తున్నావేం కోడలా అంటారేమో! మీరు ఇదంతా తూచ్ అని మరో పొష్టు రాయాలి. లేక పోతే మీ బాసుకు, అత్తగారికి, ఆయన గారికి ఇది పంపిస్తాను.:)

కృష్ణప్రియ said...

తప్పకుండా మైత్రేయి గారూ,..

నేనూ అత్తగారు కలదాన్నే.. మీ బాధ,ఆక్రోశం నాకూ అర్థమవుతాయి.. మా అత్తగారు ఒకసారి అమెరికా లో నా ఆఫీసుకొచ్చి.. ఆ అద్దాల బిల్డింగూ, ఏంబియన్స్ చూసి 'ఇప్పుడర్థమైంది.. ఎందుకా వీళ్ళు ఆఫీసూ, ఆఫీసూ అని పడి చస్తారో..' అన్నారు.

ఈ పోస్ట్ బాసుకీ, వాళ్ళకీ పంపిస్తానన్నారు.. అంత పని మాత్రం చేయకండి..

కింద రాసిన లెటర్ చూపించండి.. ఎవరైనా మిమ్మల్ని పనిచేయవేమో అని ఈ పోస్ట్ చూసి అంటే..

సరదాగా,
కృష్ణప్రియ.

To whom so ever concerned,

పైన చెప్పబడ్డ టపా లో ఉదంతం.. పూర్తిగా కల్పితం.. పాత్రలు మాత్రమే నిజం.

Sincerely,
Krishnapriya Ranga.

sphurita mylavarapu said...

కృష్ణ ప్రియా,
Super...నేను ఎక్కువగా ఈ నటన మా వారి దగ్గర చూపిస్తూ వుంటా...ముఖ్యం గా Work from home చేస్తున్నప్పుడు...పాపం మా వారు, నీకు పని చేయించటం చేతకాక నువ్వే చేస్తూ వుంటావ్ అని డవిలాగులు వేస్తూ వుంటే...అందరికీ మీ అంత Talent వుండదు కదా అని నమ్మించేస్తూ వుంటా...ష్..ష్...ఇది మా వారికి మాత్రం చెప్పకండేం...;)

మధురవాణి said...

బాగా నవ్వించారు :-):-)

కృష్ణప్రియ said...

ధన్యవాదాలు స్ఫురిత, మధురవాణి!

మన భగవద్గీత లో ఏనాడో చెప్పారు.. 'జగన్నాటక సూత్రధారి ' దర్శకత్వం లో మనమంతా నటిస్తూనే ఉంటాం.

షేక్ స్పియర్ గారూ అన్నారు. జీవితమే ఒక నాటకం, మనమంతా పాత్ర ధారులం అని..

:-)
కృష్ణప్రియ/

Indian Minerva said...

బాగుంది మీ మీటింగ్ ప్రహసనం. నేనైతే మీటింగ్‌రూంలోకి ఎప్పుడూ ఓ పెన్ను పుస్తకమూ పట్టుకొని వెళతాను. ఆ ప్రెజెంటరుకి నా నోట్‌బుక్‌లో కౌంటర్లివ్వడమో లేక ఏదో ఒక సిల్లీ విషయంపై రాస్తుండటమో ఏదో ఒకటి చేస్తుంటాను.

కృష్ణప్రియ said...

@ Indian Minerva,

:-))

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;