Monday, August 9, 2010

గేటెడ్ కమ్యూనిటీ కథలు - మడిశన్నాక కూసింత ..

తిని తొంగుంటే చాల్దు.. మడిశన్నాక కూసింత కలాపోశన ఉన్నా లేకున్నా, సామాజిక స్పృహ అయితే ఉండాలనీ, సాటి మానవులని ఆదుకుని మనకున్నంత లో ఎదుటి వాడికి కాస్త పెట్టాలని అందరిలానే మా కాంప్లెక్స్ వాళ్ళమూ అనుకుంటూ ఉంటాం...

అందరం దాదాపు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వెలగబెడుతున్నాం కదా.. శంకర నేత్రాలయ, కరుణాశ్రయ (కాన్సర్ లాంటి వ్యాధులతో దీర్ఘ కాలం గా బాధ పడుతూ, మరణానికి చేరువ లో ఉన్న వారికోసం సంస్థ), అక్షయ పాత్ర (బడి పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం), స్పాన్సర్ ఎ చైల్డ్ .. ల్లాంటి వాటికి ఎంతో కొంత దానం చేసినా, ఇంకా ఏదో చేయాలన్న తాపత్రయం .. మా కాలనీ వాసులని చాలా కాలం గా దహించివేస్తోంది.. కాకపోతే మనం చేసే సహాయం లో ప్రతిపైసా బాధితులకి మాత్రమే అందాలన్న ఆతృత తో అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము.

మా తోటమాలి కి ఇద్దరు కూతుళ్ళు.. ఇద్దరూ కాలనీ వాసుల ఇళ్ళల్లో పనికి వచ్చేవారు. తోటమాలి, "మా బిడ్డలకి పెళ్ళిళ్ళు కాలేదు.. కుదిరాయి కానీ కట్నానికి లేదు, వెండి 50 తులాలు పెట్టాలి, ఎక్కడా? తల్లా రోగం తో తీసుకుని గుడిసె లో పడుంది.. దాని వైద్యానికే సరిపోవట్లేదు .. ఎవరు చేస్తారు?" అని బాధ పడుతూ ఉండేవాడు..

"అమ్మయ్యా!! మన సమాజ సేవ కి అర్హులు దొరికారని" మహదానందం గా అందరం విర్రవీగాం. 40 ఇళ్ళల్లో కనీసం 20 ఇళ్ళ వాళ్ళం ఈ పెళ్ళిళ్ళు జరిపించి తీరాలని, ఆ పేద తల్లి కి సంపూర్ణారోగ్యం దక్కేంత వరకూ విశ్రమించేది లేదని నిశ్చయించుకున్నాం.

ఒకావిడ పాత మంచాలు అమ్ముదామనుకున్నది వీళ్ళకే ఇచ్చేసింది.. ఇంకో ఆవిడ కుక్కర్ కొనిపెట్టింది. ఒకాయన తోటమాలి భార్యకి ఇచ్చిన మందుల చీటీ కి మందులు కొని ఇచ్చాడు.. పిల్లలు అమెరికా లో ఉన్న ఒక ఒంటరి ముసలాయన, ఆర్థిక సహాయం పెద్ద మొత్తం లో చేసారు. పెళ్ళి దగ్గర పడుతోంది అనగా.. ఆడ పిల్లలు పని మానేశారు. 10-15 రోజులు అడ్జస్ట్ చేసుకొమ్మని తోటమాలి బ్రతిమలాడగా.. ఈ మాత్రం చేయలేమా అని దయ, జాలి, అభిమానం, ముప్పిరి గొనగా అందరం సహకరించాం..

'నమో వెంకటేశా' యో లేక 'అదుర్సో' సినిమాకి మల్టీప్లెక్స్ లో టికెట్లు దొరకలేదని ఎలాగైనా చూద్దామని చిన్న థియేటర్ కి వెళ్దామని వెళ్తే మా మాలీ, వాళ్ళ కుటుంబం లో చాల మంది ఆడవాళ్ళూ, పిల్లలూ కూడా ముందు వరసల్లో కనపడ్డారు.. తోటమాలి పెద్దమ్మాయి అయితే పిల్లలని చంకలో ఎత్తుకుని ఎవర్నో అమ్మా అని పిలుస్తోంది కూడా.. ఇంటర్వెల్లో వెళ్ళి నిలదీశాను. మాలీ భార్య కూలీ కెళ్ళి వచ్చి సినిమా చూస్తోంది, కూతుళ్ళతో, అళ్ళుళ్ళతో.. మేము పెళ్ళి చేయిద్దామనుకున్న అమ్మాయిల్లో ఒకమ్మాయి పిల్ల తల్లి కూడా!!!

ఈ సంఘటన తర్వాత, సమాజ సేవ పిచ్చి కాస్త కంట్రోల్ లోకి వచ్చింది. కొత్త పని మనుషులూ, కొత్త మాలీ,.. నడుస్తోంది జీవితం. ఇంతలో అంధ్రప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాల్లో వరదల వార్తలకి అందరం మళ్ళీ చలించిపోయాం.. కానీ ఎవ్వరికీ అపాత్ర దానం చేయకూడదన్న సంకల్పమాయె.. ఏం చేస్తాం? ఒకరెవరో వాన్ లో వస్తువులూ, ఆహార పదార్థాలూ ఇచ్చి వస్తాం అంటే ఇల్లంతా ఖాళీ చేసి నాలుగు వాన్లు పట్టేంత సామాగ్రి చేసాం. 2 ట్రిప్పుల్లో సామాన్లు 300 కిలో మీటర్లు డ్రైవ్ చేసి మరీ ఇచ్చి వచ్చాం.

తర్వాత మళ్ళీ మా సమాజ సేవ కిక్ వచ్చి ఏం చేయవచ్చా అని ఝండా కఱ్ఱ కింద మీటింగ్ పెట్టాం.. ఏం చేసినా తక్కువే వరద బాధితులకి .. మేము చూసి వచ్చిన ఊళ్ళల్లో ఒక ఊళ్ళో స్కూల్ కి గదులు కూలిపోయాయి.. అవి కట్టిస్తే? అన్న ఆలోచన వచ్చింది. 'అబ్బే చూశాం కదా ఎంత మోసపోయామో.. చస్తే డబ్బులిచ్చేదు లేదని.. మనమే వెళ్ళి శ్రమ దానం చేద్దాం అని ప్రపోజల్ వచ్చింది. అంతే.. అది దావానం లా వ్యాపించింది. పిల్లలకి కూడా సమాజ సేవ పట్ల అవగాహన వస్తుంది అని ఇంక ఆగేది లేదని అందరం వెళ్దాం అని ప్లానింగ్ మొదలు పెట్టేసాం..

వాల్వో ఏ సీ బస్సూ, రాత్రి అక్కడే ఉంటాము కాబట్టి ఒక నలభై కి.మీ. దూరం లో ఉన్న మంచి ఏ సీ హోటల్లో గదులూ బుక్కయ్యాయి. మాకెవ్వరికీ ఇటుకలెత్తటం, మాల్ కలపటం, గోడలు కట్టటం రాదు.. అందుకని ఒక మేస్త్రీ, కూలీ ని మాట్లాడుకున్నాం గైడ్ చేసేందుకు.. దెబ్బలు తగిలితే వాడటానికి ప్రథమ చికిత్స సామాగ్రి, తినుబండారాలు లాంటివి అన్నీ వేసుకుని ఒక శుభ ముహూర్తాన, శుక్రవారాన బయల్దేరాం. అందరి మొహాల్లో, మదర్ థెరెస్సాల్లా, బాబా ఆంప్టేల్లా వద్దన్నా తేజస్సు ఉట్టిపడుతోంది, ఒలికిపోతోంది,...

శనివారం అరపూట తయారవటానికీ, పని అర్థం చేసుకోవటానికీ పట్టింది. ఈలోగా లంచ్ బ్రేక్. సరే తిన్నాక విశ్రాంతి,.. మళ్ళీ మొదలు పెట్టి నాలుగిటకలు వంకర టింకర గా పెడుతూ ఫొటోలు తీసుకునేసరికి సూర్యాస్తమయం! ఈలోగా చిన్న చిన్న దెబ్బలూ, బాండేజిలూ, పిల్లలకి అలుపూ, విరామాలూ, టీ బ్రేకూ..

మళ్ళీ మర్నాటికి వచ్చేసరికి గోడ ఒక పక్క కూలి ఉంది.. నిలిచి ఉన్న గోడకూడా ఏదో చెప్పలేని తేడా తో .. ఉంది. మేము మాట్లాడుకున్న కూలి ఎగ్గొట్టాడు ఆవేళ. మేస్త్రీ.. "పోన్లెండి ఈ గోడ నేను చూసుకుంటాను.. వేరే వైపు మొదలెట్టండి" అన్నాడు.. పిల్లలు 10 నిమిషాల్లో జారుకోగా ఆడవారు అరగంటకీ, మధ్యవయస్కులు ముప్పావుగంటకీ మాయం! మిగిలిన వారు అపసోపాలు పడుతూ, ఏదో మూడడుగుల ఎత్తు గోడ కట్టారు. సాయంత్రం త్వరగా బయల్దేరదామని ఒకటే పోరు అందరూ.

దానితో పని అక్కడే వదిలేసి.. మేస్త్రీ తో మాట్లాడి కట్టినంతవరకూ క్యూరింగ్ అవీ చేయమని.. బెంగుళూరికి చేరుకున్నాక డబ్బు పంపిస్తామనీ, దానితో పని పూర్తి చేయాలనీ చెప్పి బయట పడ్డాం. మా తిండి తిప్పలకీ, షోకులకీ, హోటల్కీ, బస్సుకీ, దోవలో పెట్టిన చిల్లర ఖర్చులకీ.. 2 స్కూళ్ళు కట్టచ్చేమో!! :-)

తర్వాత మళ్ళీ శ్రమ దానం టైప్ సేవ జోలికెళ్ళద్దని అనుకున్నాం.. ఆరు నెలలు గా ఎవరూ వాలంటీరింగ్ ఐడియాల చర్చ చేయట్లేదు.. అని అనుకుంటూ ఉన్నాను.

మొన్నీ మధ్య మా ఇస్త్రీ అమ్మాయి తన బిజినెస్ వేరే వాళ్ళకి అమ్మేసినట్టుంది.. కొత్త కుటుంబం వస్తోంది బట్టలు తీసుకెళ్ళటానికి. వాళ్ళబ్బాయి భార్గవ (8) చాలా చురుకు! పెద్ద లెక్కని ఇట్టే చేసేస్తాడు. వాడికి ఒక తమ్ముడూ, చెల్లెలూ..

"ఏరా స్కూల్ కెళ్ళవా?" అంటే "వెళ్తాను ఆంటీ.." అంటాడు.. "మరి పది అవుతోంది .." అంటే.. "ఇదిగో ఈ బట్టలు తీసుకెళ్ళి వెళ్తాను ఆంటీ.." అని!!

ఒక నెల గడిచాక వీడికి చదువు చెప్తేనో? అని ఆలోచించాను.. ఉత్సాహం గా వాళ్ళ నాన్న తో మాట్లాడితే తెలిసింది.. కాలనీ లో నాకన్నా ముందు బోల్డు మంది లైన్లో ఉన్నారని. వాళ్ళకి చదువు చెప్పటానికి 'ఆల్ మోస్ట్' కొట్టుకుంటున్నారని. ఈలోగా ఒకాయన .. మాకు చాన్స్ లేకుండా ప్రభుత్వ పాఠశాల నుండి తీసేసి.. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఫీజు కట్టేసారని.. పుస్తకాలూ, యూనీఫాంలూ కొనేసారనీ :-( ఏం చేస్తాం.. మళ్ళీ సమాజ సేవ భాగ్యం తృటి లో తప్పిందని నిట్టూర్చాను..

ఈలోగా వెయ్యి కళ్ళతో చుట్టూ గమనిస్తూనే ఉంటాను దొరక్క పోతుందా ఏదైనా అవకాశం అని... మీకూ ఏమైనా ఐడియాలుంటే చెప్పేయండే? ఇంకోళ్ళు కొట్టేసేలోపల నేను వాడేసుకుంటాను ఆ ఐడియాల్ని..

PS: టపా సరదాగా రాసినా నిజానికి నాకు అందర్నీ చూస్తే చాలా గర్వం గా ఉంటుంది. అందరూ ఏదో ఒక ఆర్గనైజేషన్ లో ఆక్టివ్ గా ఉంటారు, వాళ్ళ ఊళ్ళల్లో, పేద చుట్టాలకీ, లేక వారి పని వాళ్ళకీ, చదివిన స్కూల్ కీ, ప్రకృతి ఉత్పాతాలవల్ల దెబ్బ తిన్నవారికీ ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉంటారు..

పాత గేటెడ్ కమ్యూనిటీ కథలు..


http://krishna-diary.blogspot.com/2010/06/blog-post_26.html

http://krishna-diary.blogspot.com/2010/06/blog-post_05.html

29 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Nice post as usual.

Ram Krish Reddy Kotla said...

I really appreciate your helping nature krishna garu...keep going.. :-)

ramesh said...

ఎన్నో రోజుల నుంచి మీ బ్లాగ్ చదువుతున్నపటికీ, ఎన్నో టపాలు నచ్చినప్పటికీ, ఒక కామెంట్ కూడా రాయలేదు. ఈ టపా కి కూడా రాయకపోతే ఏదో పాపం తగులుతుందేమో అనిపించింది. :-)

చివరకు రాయటం మొదలు పెట్టి ఏవేవో రాసి ఏదీ నచ్చక ఇలా సరిపెట్టేస్తున్నానండి.

అభినందనలు - అలాంటి ఇరుగు పొరుగు వున్నందుకు, ఎన్నో మంచి పనులు చేసి, వాటి గురించి చక్కగా (గొప్పగా కాక, ఎంతో గోప్పయినప్పటికీ) చెప్పినందుకు, నలుగురిని ఉపదేశిన్చకుండానే ప్రోత్సహిస్తున్నందుకు, మోస పోయినప్పుడు సయాయమును చేసే అలవాటును కాకుండా, చేసే విధానమును మార్చుకున్నందుకు.

- రమేష్

lalithag said...

చాలా బావుంది, విషయమూ, విశ్లేషణా, ముగింపూ, అన్నీనూ.

Anonymous said...

కృష్ణ ప్రియ గారు,
మీరు గమనిచారో లేదొ చదువుకునే పిల్లల కన్నా ఇస్త్రి బట్టల వారి పిల్లలు ,
పని చేసుకునే వారి పిల్లలు చాలా హుషారుగా ఉంటారని నాకుడా అనిపించింది. వారిలో ఒక జీవత్వం ఉంది. బహుశా చదువు భారం లేక పోవటం వలన కావచ్చు. ఇకపోతె మా కంపేనీకి సి.ఎ.యఫ్. అనే సంస్థ తో టైప్ ఉంది ఈ సంస్థ వారు యన్.జి. ఓ. లను తనీఖీ చేసి వారి పని తీరుని అంచనా వేసి ఒక నివేదిక దానిలో చిన్న పిల్ల చదువు, వృద్దులకి,జంతువులకి ఉన్న మంచి యన్.జీ.ఓ. సంస్థల సుమారు 100+ లిస్ట్ ఉంట్టుంది. మనం నెల జీతం లో ఒక రూ X ఇస్తె కంపెనీ ఇంకొక రూ X వేసుకొని ఆ సంస్థలకి ఇస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

http://www.cafindia.org/

కొత్త పాళీ said...

Yes, there is a lot we can do if we put our mind to it. good show.

Sahithi said...

Good one. The way you have written is too good.I dint know now a days people are so much in to social service. I was thinking I am one of the few people who thinks about it :-)

-Sahithi

Sravya V said...

Nice one !
Really really appreciating your efforts.

kvrn said...

అందరి మొహాల్లో, మదర్ థెరెస్సాల్లా, బాబా ఆంప్టేల్లా వద్దన్నా తేజస్సు ఉట్టిపడుతోంది, ఒలికిపోతోంది,...
very nice....

KumarN said...

Wow..I have been a regular reader of your blog, although I never left a comment, inspite of liking almost each and every post.

But, this one compelled me to write something.

A life spent without making any difference, leaves a void in heart, especially at fag end of life.

I am glad that more people are inclining towards making that choice early in life than later.

Who says the "haves" don't have hearts!!.

said...

one thing i found in bangalore is "Neku vastundi ga, naku ivvu...".

In India if you are giving for free people will ask for TWO Free.

నేస్తం said...

చాలా బాగా రాసారు క్రిష్ణ ప్రియ..నా కైతే ఆధ్యంతం చాలా నచ్చేసింది..మీ మరియు మీ కాలనీ వాళ్ళ హెల్పింగ్ నేచర్ కూడా

హరే కృష్ణ said...

అందరి మొహాల్లో, మదర్ థెరెస్సాల్లా, బాబా ఆంప్టేల్లా వద్దన్నా తేజస్సు ఉట్టిపడుతోంది, ఒలికిపోతోంది,...

హ హ్హా
ఇది సూపర్

Nicely written
Excellent!

కృష్ణప్రియ said...

@ గణేష్,
థాంక్స్!
@ రామకృష్ణ,
మా హెల్పింగ్ నేచర్ కాదు గానీ, కాంపిటీషన్ ఎక్కువైపోయిందండీ..కాంప్లెక్స్ లో :-)
@రమేశ్,
చాలా సంతోషం, మీ మంచి మాటలకి ధన్యవాదాలు! ఈరోజుల్లో చాలా మంది చాలా రకాలు గా సహాయాలు చేస్తూనే ఉంటారు. మా సొసైటీ లో వారు కూడా బానే చేస్తారు. ఒకావిడ ఉన్నారు. ఆవిడంటే అందరికీ చిరాకు. ఎప్పుడూ కసిరినట్టుగా మాట్లాడటం అదీ. కానీ.. ఈ మధ్య వాళ్ళ విన్నాను. ఆవిడ బీహార్ లో తన తోటి కోడలు కూతుర్ని (మూగ చెవుడు) దీనికి చదువు దండగ అని టెంత్ తర్వాత వదిలేస్తే.. ప్రత్యేకం గా పాట్నా కెళ్ళి అందరికీ నచ్చచెప్పి, పెళ్ళి ఆపించి చదువు స్పాన్సర్ చేస్తోంది.. అలాగే ఇంకో కుటుంబం తమ పిల్లల పుట్టినరోజులకి పార్టీలు చేయకుండా ఒక అనాథాశ్రమం లో పిల్లలకి ఫుడ్ స్పాన్సర్ చేసి వారితో రోజంతా గడిపేలా చూసుకుంటుంది. కాకపోతే వీటి గురించి వారు మాట్లాడరు. పాత బట్టలు చాలా మంది ఇప్పటికే.. అమ్మటం అదీ తగ్గించేసారు కదా?

కృష్ణప్రియ said...

@ లలిత,
చాలా థాంక్స్! సంతోషం గా ఉంది మీకు నచ్చినందుకు..
@ కొత్తపాళీగారు,
ధన్యవాదాలు!
@ సాహితి,
థాంక్స్! జెనరల్ గా చాలా మంది ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు, వారిలో కొంత మంది ఏవో కారణాల వల్ల చేయలేకపోతారు, ఇక మిగిలిన వారు కొన్ని సందర్భాల్లోనైనా.. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనుకుంటా. నా లాంటి వాళ్ళు ఇలా చెప్పినా చాలా మంది అస్సలూ చెప్పరనుకుంటా.

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,
థాంక్స్! :-)

@kvrn,
:-) ఇంకా నవ్వొస్తుంది.. అలాంటి మంచి పని ఏదైనా చేస్తుంటే.. కనుబొమ్మలు విల్లుల్లా పైకి లేస్తాయి కూడా :-)

@ కుమార్,
మీకు నా బ్లాగ్ నచ్చినందుకు, చదువుతున్నందుకు చాలా సంతోషం! మీరు చాలా చక్కగా అందంగా చెప్పారు.. థాంక్స్!

కృష్ణప్రియ said...

@ శేషుకుమార్,
మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. దీంట్లో ఇంకో కోణం.. చాలా మంది మన సంపాదనలో వారికి కాస్త హక్కుందన్నట్టు మాట్లాడతారు :-) 'ఏమ్మా.. అంత సంపాదిస్తున్నావు.. 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వటానికేంటి అంత గింజుకుపోతావు? " లేదా.. "ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నావ్.. ఒక వంద రూపాయలీయటానికి ఏడుస్తావు?' అలాగ.

మా పనమ్మాయి తమ్ముడి భార్య, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికో.. ముగ్గురు పిల్లలు.. అయ్యో పాపం,.. ఒకర్నేమైనా చదివిస్తే.. అనుకుని .. వారి చదువుల వివరాలడిగితే.. వెంటనే.. 'స్కూల్ ఫీజ్ కి 15, 000 అవుతుంది మాడం సంవత్సరానికి ' అంది. 'ఆహా.. సంతోషం ' అని ఊరుకున్నాను. పైగా అడిగాను కదా అని. 'పాపం జీసస్ ప్రోగ్రాం లు చూస్తారట.. వాళ్ళ పిల్లలు.. కలర్ టీ వీ కొనుక్కుంటాం డబ్బులిస్తారా? ' ఇలాంటి ప్రపోజల్స్.. నేనెప్పుడూ ఇంక ఆ ఇంక్లినేషన్ చూపించలేదు. కానీ తర్వాత ఏదో ఆక్సిడెంట్ అయితే.. చూపించుకున్నాక అయిన మెడికల్ బిల్స్ మాత్రం అన్నీ పే చేసి.. నెల రోజులు ఉదయం వేడి పౌష్టిక బ్రేక్ ఫాస్ట్ మాత్రం పెట్టి పంపించాను. పళ్ళిచ్చినా అమ్మేసుకుంటుంది మరి :-)

కృష్ణప్రియ said...

@ నేస్తం,
థాంక్సండీ.. మీ అంత అందం గా రాసేవారికి నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.
@ హరేకృష్ణ,
ధన్యవాదాలు! :-)
కృష్ణప్రియ/

నేను said...

సోషల్ సర్వీస్ చెయ్యాలని చాలమందికి వుంటుంది కాని మొదలుపెట్టరు. ఎవరన్నా మొదలుపెడితే మిగిలినవాళ్ళు కలుస్తారు. అలా మొదలుపెట్టిన వారిని ముందుగా అప్రిషియేట్ చెయ్యాలి.

ఐడియాలు అడిగారు కదా, జీవని కి ఏమన్నా సహాయం చెయ్యగలరేమో చూడండి. http://jeevani2009.blogspot.com/

ఎప్పటిలాగే మీ పోస్ట్ కేక :-)

..nagarjuna.. said...

మొత్తానికి మొదటి పాఠం నేర్చేసుకున్నారు....సంతోషం.

గతేడాది ఇలాగే మా స్నేహితులు కొందరు ఒకగ్రూపుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేయాలని పూనుకున్నారు. అందులో భాగంగా 10వ తరగతి అంధవిద్యార్థులకు పరీక్షలురాసే పనిఉందని నాక్కబురు పెట్టారు. మీలాగే నేను మడిసన్నాక కాస్త...అనుకొని కమిటైపోయా. సరే సంగతి ఏంట్రా అని ఆరా తిస్తే ఆ పిల్లలకు ఎటూచూపు లేదుకాబట్టి మేమే చదువుకొని పరీక్షరాయాలి అని. ఆ పిల్లలు జస్ట్ అలా పరీక్ష హాళ్లో appearance ఇస్తారు యాక్టింగ్ మొత్తం మేమేననమాట.....అలా ఓ పదిరోజులు నేను ఎపుడో చదివి మర్చిపోయిన వాళ్ళ చదువులు చదివి పరీక్షలు రాసేసాం... కెవ్

కాని ఒక ఆనందం దొరికింది...పరీక్ష ఫలీతాలొచ్చాక వాళ్లు మాకు ఫోన్లు చేసి థాంక్స్ అని చెప్పినప్పుడు తెలీని గర్వం ఒకటి...ఏదో ఊడపొడిచామన్నట్లు :)

nice post

మధురవాణి said...

మీ కాలనీలో అందరికీ ఉన్న సహాయపడే తత్త్వం అభినందనీయం! ఎప్పట్లాగే మీరు రాసే శైలి సూపర్! :-)

..nagarjuna.. said...

అప్పటినుండి ఇలాక్కాదు genuineగా ఉండాలి మనం చేసే సహాయం అనుకుంటూ ఉన్నా...మా స్నేహితులు కూడా అటువంటి ప్రోగ్రాంస్‌ మానుకొని ఆనాథాశ్రమాలకు బట్టలు, మిగత సామాన్లు చేరవేస్తున్నారు ప్రస్తుతానికి

కృష్ణప్రియ said...

@ బద్రి,
థాంక్స్! చూశాను వెబ్ సైట్.. కాలనీ ఏలియాస్ కి కూడా పంపించాను..

@ నాగార్జున,
:-) నాకూ ఒక అనుభవం ఉంది. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట దగ్గరున్న మురికివాడ లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఒకసారి.. అందరిళ్ళకీ వెళ్ళి సర్వే చేస్తుంటే పాపం వాళ్ళు రేషన్ కార్డులిస్తారేమో అనుకున్నారు. తర్వాత 15 రోజుల కాంప్ అని వెళ్ళి అక్కడి పిల్లలకి బోల్డు టీచింగ్ ఎయిడ్స్ తో చెప్పి, మళ్ళీ వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాం. గిల్టీ గా అనిపిస్తుంది నాకు..

కృష్ణప్రియ said...

@ మధురవాణి,
థాంక్స్!

@ నాగార్జున,
చాలా బాగుంది. Keep it up!

శివరంజని said...

చాలా బాగా రాసారు క్రిష్ణ ప్రియ.మీ పేరు చాలా బాగుంది

Change Maker said...

కృష్ణప్రియ గారు, మీ కమ్యూనిటీని చూసి మారు చాలా గర్వపడాలి. మన సేవాదృక్పధం మన పిల్లల కు కూడా అలవడుతుంది. నేను చాలా మంది ధనవంతులను, కోటీశ్వరులను చూసాను, పూచిక పుల్లంత కూడా సమాజ సేవ కానీ ధన సహాయం కానీ చెయ్యట్లేదండి. They dont have that concept.
Keep up your good work. Motivate others.
మనకు ఉన్నంతలో, మనకు తోచినంతలో చేసిన సహాయం లో వచ్చిన ఆనందాన్ని , వేరేదీ ఇవ్వలేదు.
Please include our non profit "Bighelp For Education" in your list of organizations to support and pass it on to your group.
Check out www.bighelp.org

Thanks
Ravi

శ్రీనివాస్ said...

:)

కృష్ణప్రియ said...

@శివరంజని,
థాంక్స్! మీ పేరూ, నా పేరూ ఇంచుమించు ఒకే అర్థాలు.. కృష్ణుడికి ప్రియమైనది కృష్ణప్రియ, శివుడికి ప్రీతికరం శివరంజని..

కృష్ణప్రియ said...

@ రవి,
మంచి మాట చెప్పారు. థాంక్స్! Big help hmm.. మా Mailer కి పాస్ చేసాను..

@ శ్రీనివాస్,
:-))

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;