Friday, April 23, 2010

ప్రణీత M Tech - 1


ప్రణీత M Tech చదివిన కన్నడ అమ్మాయి. నా ఎదురుగా రెండవ క్యూబ్ లో కూర్చుంటుంది. చామన చాయ, గుండ్రటి మొహం, కాస్త మొటిమల పాత గుర్తులతో, పల్చటి నున్నని జుట్టు ని పోనీ టైల్ గా బిగించి, తన సైజు కి మించిన ఫ్యాబ్ ఇండియా ఖాదీ టాపులూ, జీన్సూ వేసుకుని చక చకా నడుస్తూ వస్తుంది. గల గలా నవ్వుతుంది. నవ్వితే ఒక పక్క పన్ను మీద పన్ను అదనపు ఆకర్షణ తనలో. ఎప్పుడూ ఏదో సంగీతం వింటూ, హెడ్ ఫోను తీయదు, పని చేసేంత వరకూ.

నాకు భలే సరదాగా ఉంటుంది. పదిహేను ఏళ్ళయి పోయింది. యూనివర్సిటి వదిలి. ఎంత సమయం ఉండేదో.. ఎంత హాయిగా గా మనసుకి నచ్చినట్టు గడిపామో .. నా గతానికి ప్రతీక లా ఉండేది ప్రణీత. ఆఫీసు పనే కాకుండా ప్రతి విషయం లో ముందుండేది.

నెమ్మది గా తన లో మార్పులు రావటం మొదలు పెట్టాయి...

సాధ్యమయినంత వరకూ, క్యూబ్ లోనే భోజనం చేయటం మొదలు పెట్టింది. ఎప్పుడైనా ఇంటినుండి తెచ్చుకోలేక పొతే.. నన్ను రమ్మంటుంది కాంటీన్ కి. జనరల్ విషయాలు తప్పితే ఎప్పుడూ స్వవిషయాలు మాట్లాడదు. నేనెప్పుడూ పది మందితో లంచికి వెళ్ళటం పరిపాటి. కానీ ప్రణీత అడిగినప్పుడల్లా, తన తో వెళ్లి దూరం గా కూర్చుని.. కోక్ చప్పరిస్తూ, నలభై నిమిషాల లో తిని, మా బిల్డింగ్ చుట్టూ పది నిమిషాలు నింపాది గా నడిచి వస్తాం.

ఎవరైనా మాట్లాడిస్తే నవ్వుతూ, సరదాగా మాట్లాడుతుంది కానీ ఎవ్వర్నీ తనంతట తాను పలకరించటం నేను చూడలేదు. రెస్ట్ రూమ్ల దగ్గర మాత్రం, చాలా సార్లు ఉద్వేగం గా ఫోన్లో మాట్లాడటం గమనించాను. ఒక్కోసారి ఏడుపు గొంతు తో బేల గా, ఒక్కోసారి కోపం గా, .. అలాంటప్పుడు.. నేను చాలా అర్జంట్ పని ఉన్నట్టు వెళ్ళిపోతాను..

పలకరించను. రోజు రోజుకీ.. గల గలలు తక్కువయి, రెస్ట్ రూం సంభాషణలు ఎక్కువయినట్టు అనిపించింది. కానీ..
MNC లో పని చేసే నా లాంటి ఇద్దరు పిల్లల తల్లులకి అంత కన్నా ఎక్కువ గమనించటానికి, స్పందించటానికి టైం ఉండటం అరుదు.

నా deadlines హడావిడి లో కొంత కాలం గమనించలేదు. అప్పుడప్పుడూ.. పలకరించి ఏవో కామెంట్స్ చేస్తే.. పేలవం గా నవ్వటం తప్ప, తను నాతొ మాట్లాడింది లేదు. ఒక రోజు ఏదో మీటింగ్ నుండి వేరే బిల్డింగ్ నుండి వస్తున్నాను. 'కాఫీ?' అని వినపడింది వెనక నుండి. తిరిగి చూస్తె ప్రణీత. సరే అని ఖాళీ బల్ల వెతుక్కుని చతికిల పడ్డాం.

ఉపోద్ఘాతం లేకుండా.. కృష్ణా... 'I am getting divorce' అంది. ఇలాంటి గొడవేదో అవుతోన్దనుకున్నాను కానీ.. ఇంత దూరం వచ్చారనుకోలేదు. నేనూ ఏమీ మాట్లాడలేదు. చాలా సేపు తన విషయాలు చెప్తూ పోయింది.

తండ్రి లేని తను కష్టపడి చదువుకున్న వైనం, పెళ్లి కి ఒక్క రోజు ముందు కాబోయే భర్త తనకేదో మానసిక బాధ (రోగం అన్న పదం వాడాలంటే జంకు తో) కి చికిత్స పొందు తున్నానని చెప్పిన సంగతీ, ఆరు నెలలు తనపై నిఘా వేయించి, తాను శీలవతి అని తెలుసు కునేంత వరకూ తనని దూరం గా ఉంచిన సంగతీ, రెండేళ్ళ దాంపత్య జీవితం లో కనీసం ఇరవై సార్లు దెబ్బలకి, చీత్కారాలకీ తట్టుకోలేక తల్లి గారింటికి వెళ్ళిపోయినా, మోకాళ్ళ మీద కూర్చుని ఏడ్చి మళ్ళీ వెనక్కి తెప్పించుకుని మరీ మణికట్టు మీద బయటకి కనపడకుండా కొట్టిన భర్త భయానక మానసిక స్థితీ.. ,

తల్లి ఆరాటం, చుట్టాల అవహేళ నా , అత్తగారి చీత్కారాలూ, తోటి కోడలి చిన్నచూపూ, తన వెనక ఉన్న ఇద్దరు చెల్లెళ్ళను దృష్టి లో ఉంచుకుని ఓర్చుకున్న విషయమూ,.... ఇంకా ఓర్పు నశించి విడాకులకి పిటిషన్ వేసిన విషయమూ.. ఆరు నెలలు విడిగా ఉండి మళ్ళీ రమ్మన్నారట.. చాలా బాధ వేసింది.

ఈలోగా.. మళ్ళీ భర్త.. కాళ్ళా, వేళ్ళా పడి తీసుకెళ్ళాడు. తల్లి, చెల్లెళ్ళు, మేన మామలు, ఎంత చెప్పినా వినలేదు. గొర్రె కసాయి వాడినే నమ్ముతుందిట. ఎందుకో నమ్మింది వాడిని. Detective Agency వాళ్ళని పెట్టాడు. చివరకి ఆఫీసు లో కూడా నిఘా పెట్టాడు. చెల్లెళ్ళని దుర్బాష లాడటం, పుట్టింటి వారెవర్నీ ఇంటికి రానివ్వకపోవటం.. లంచ్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా.. మగ వారితో టేబుల్ మీద కూర్చుంటే.. సాయంత్రానికి రిపోర్ట్ .. ఒకరిద్దరికి ఆటను ఫోన్ చేసి నా భార్య తో నీకేం పని? ఎందుకు ఎప్పుడూ కాఫీ తాగేటప్పుడు పలకరిస్తావు అని గొడవ.. నెమ్మది గా తన విషయాలు ఆఫీసు లో కూడా తెలుస్తున్నాయి. ఉద్యోగం మాత్రం చేయాలి.. లక్ష రూపాయలు నెలకి.. ఎవరికి చేదు?

మనిషి నల్ల పడింది. కళా హీనం గా తయారయింది.

మన సమాజం లో ఆర్థికం గా నిలబడలేని స్త్రీలూ, సాంఘికం గా ఒక రకమైన బానిస తత్వాన్నీ, భయాన్నీ, చిన్నప్పటినుండీ, నారా నరాల్లో జీర్ణించుకున్న స్త్రీలూ, భర్త తిట్టినా, కొట్టినా, చంప ప్రయత్నించినా వేరే మనుగడ లేదని భావించే స్త్రీలూ ఉన్నారని తెలుసు కానీ.. నా తో రోజూ మాట్లాడే ప్రణీత,.. ఆ కోవ లోకి వస్తుందని కలలో కూడా ఊహించలేక పోయాను.

ఒక రోజు ఫోన్ ఎత్తక పోతే వాళ్ళమ్మ కి భయం.. వాహనాల రద్దీ వల్ల కాస్త ఆఫీసుకి ఆలస్యం అయితే.. నాకు బెంగ! .. ఇంటినుండి పని చేస్తానని అన్న రోజున.. మెసెంజర్ లో కి లొగిన్ అవకపోతే బాసుకి ఆదుర్దా..

దిన దిన గండం.. నూరేళ్ళ ఆయుషు లా తన దాంపత్య జీవనం సాగి పోతోంది.

నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. అంత కష్టం లో కూడా.. ఏవో ఒక పుస్తకాలగురించీ.. కొత్త సినిమాల గురించీ.. ఖాదీ బట్టల గురించీ.. రామయణం లో పాత్రల ఔచిత్యం గురించీ, మాట్లాడుతుంది.తనకి తెలిసిన జీవిత సత్యాల్నీ..తన అనుభవం నేర్పిన పాఠాల్నీ.. తను విన్న అందమైన స్పూర్థి దాయక మంచి మాటల్నీ ఒక పుస్తకం లో క్రోడీకరించింది.. తనకి కలగ బోయే పిల్లల కోసం..కారంస్, చెస్ లాంటి ఆటలూ, క్రాస్ వర్డ్లూ, చేస్తూ, మెదడు చురుగ్గా ఉంచుకుంటుంది..

మొన్న పుట్టినరోజు తనది. చిన్న పుస్తకం కొని తెచ్చాను ఇద్దామని. ఆఫీసు కి రాలేదు. పదకొండు అయంది. భయంగానే..ఫోన్ చేసాను.. తల్లిగారింట్లోంచి ఎత్తింది. దవడ మీద కొట్టాడట. కంటి కింద నలుపు వచ్చిందిట. ఫోన్ లో నవ్వుతూ, కంఠం లో జీర తో చెప్పింది. ఇల్లు కొంటాడట.. నగలు తెమ్మన్నాడట తల్లి గారివి..

2 రోజుల తర్వాత వచ్చింది. దవడ ఇంకా వాచే ఉంది. చేయి పైకెత్తింది ఏదో చెప్తూ.. ఎర్రటి వాతలు.. ఏంటి అని అడిగితే.. నవ్వేసి.. వెళ్ళాలి నేను మీటింగ్ ఉంది అని వెళ్ళిపోయింది. .. లేని హడావిడి కొని తెచ్చుకుని... మనం ఏమి చెప్పినా వినదు అని తెలుసు.

జాలిగా, విసుగ్గా.. చూస్తూ ఉండి పోయాను. ఎప్పటికి మారుతుందో ఈ ప్రణీత.. ఈ కథ కి మంచి ముగింపు ఉంటుందని.. తర్వాత ఆనందం గా జీవితాంతమూ గడిపింది అని ప్రణీత ఎం టెక్ -2 నేను రాయాలని.. మీరూ కోరుకోండి..

27 comments:

అశోక్ చౌదరి said...

Hmm...

ravi said...

devuda ee janalu marara

సుజ్జి said...

Hmmm.!

మధురవాణి said...

హుమ్మ్... ఏమనాలో తోచట్లేదు!

వాత్సల్య said...

gunde pinde kadha anDee ;))...

శ్రీనివాస్ said...

నూటికి నలభై శాతం కాపురాల్ ఇలాగె ఉన్నట్టు ఉన్నాయి ఎవరేం చేయలేం

కృష్ణప్రియ said...

అందరికీ ధన్యవాదాలు!

ప్రణీత ఒక రియాలిటీ. ఆర్థిక స్వాతంత్ర్యం లేక ఆడవాళ్ళు పెళ్ళి తర్వాత కష్టాలు అనుభవిస్తారు.. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు, అందునా సాఫ్ట్ వేర్ లో పని చేసే స్త్రీల పరిస్థితి చాలా అద్భుతం గా ఉంటుందన్న అపోహకి సమాధానం. ఇంత దుస్థితి కాకపోయినా చాలా మంది అమ్మాయిలు ఏవో కష్టాలు చెప్పుకుని వర్క్ లో బాధపడటం నేను ఎన్నోసార్లు చూసాను.

కృష్ణప్రియ

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
కృష్ణప్రియ said...

@ వినయ్,

ప్రణీత,.. భర్తకి విశ్వాసం కలిగించటానికి 3 నెలల క్రితం ఉద్యోగం వదిలేసింది. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుతుంది.. బాగానే ఉన్నాను అంటుంది. వెళ్ళి చూస్తే కానీ తెలియదు.. :-(

Unknown said...

krishna garu aa vedava address cheppandi .. gurha himsa chattam kinda case pettinchi arrest cheyistaa .. ila mettaga unna ammailu unnanta kalam abbailu alane untaru ..

Indian Minerva said...

తప్పు భర్తది కాదండి. ఆ అమ్మాయిదే.... తను స్వతంత్రంగా జీవించగలిగి కూడా అలాంటి అతన్ని వదులుకోలేకపోతుంది కదా అదీ ఆ తప్పు. నేను గనక ఆ అమ్మాయి పరిస్తితిలోవుండుంటే మొగుడ్ని చావచితక్కొట్టి నేనిచ్చుండేవాడ్ని విడాకులు.

కృష్ణప్రియ said...

@ కావ్య, ఇండియన్ మినర్వ,
:-(.... ఉద్యోగం వదులుకుని.. ఇప్పుడు భర్త తో సింగపూర్ కెళ్ళిపోయింది.. వారానికొక సారి మెయిల్ రాయమనటం కన్నా.. ఎమీ చేయలేకపోయాను.. ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం అది. తల్లి కూడా మార్చలేకపోయింది.

lalithag said...

"నేను గనక ఆ అమ్మాయి పరిస్తితిలోవుండుంటే మొగుడ్ని చావచితక్కొట్టి నేనిచ్చుండేవాడ్ని విడాకులు. "
ఈ మాటలు కృష్ణప్రియవి అనుకున్నానెందుకో.
నా అభిప్రాయం రాయబోతూ మళ్ళీ చదివితే పొరపాటు తెలిసింది.

అలాంటి తెగువ ఉన్న వారిని అలా కష్టపెట్టలేరు కూడా.
మెత్తటి వారినే మొత్తగలరు.
ఆ మెత్తదనానికి కారణాలు ఏవైనా కావచ్చు.
డిటెక్టివ్ లని పెట్టిన వాడు ఎటువంటి emotional blackmail చెయ్యగలడో ఊహించడం కష్టం కాదు.
ఇటువంటి బాధితులకి moral support లేదైనా ఎటువంటి support ఐనా ఇవ్వ దల్చుకునే వారు చాలా బలంగా ఉండాలి, తీర్పులిచ్చెయ్యడం సులువే కానీ నిభాయించడం కష్టం.
ఆ అమ్మాయికి కావల్సిన support దొరికి, మనం expect చేసేదే ఐనా, కాకపోయినా, మంచి పరిస్థితులుకలగి ఉండాలని ఆశిద్దాం.

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
diamond said...

ippudu praneetha ela vundi krishnapriya garu?

VSR said...

@Krishna Priya...

What is the Use of studying Mtech??? and doing a JOB in MNC????? when U don't have self respect.....


maa sontha PEDA NAANNA gaari ammai...ante maa AKKA....Mtech chadivindi......

Bangaaram laanti AMERICA sambandham ani...Pelli chesesaaru.....Akka US velli poindi.....

1 yr tharuvaatha Pregnancy vasthe...maa Peddamma vellindi.....
after delivery My sister also came back to India along with Peddamma....

after 1 yr we all came to know the FACTS....THATY IDIOT is a SADIST....and my sister kept herself quiet as we all may feel BAD...she did not tell the happenings over thr...

That Idiot harrased like HELL....locking the doors...spying....abusing...physical handling...what not...everything....

unfortunate thing was..even my PEDDAMMA did not let us know abt these things though she has understood the situation....

after giving birth to a BABY...and after coming back to India...after almost 2 yrs...We waited for him to some and take his wife and child along with him...but he did not do that....finally got divorce....



Now....my sister is working in IBM.....My question is....What did she do when he was harrasing her?What is the Use of her education???

here also...Mrs.Praneetha.....not once,twice....every time...she is surrendering to that fellow.....if she is ready to accept those harrasments...why should we feel sorry for her????


Let her enjoy that harrasment....



Ammailani chadinchukutunnadi..AMerica Allulla ki ichi Champukovadaani ki kaaadu......


alaage...Chaduvukunna Ammailu.....avasaram ina sandarbhaala lo yeduru thiragaali...


yeduru thiragadaani ki..Chaduve akkar ledu...Ingitham vunte chaalu.....

GADI lo vesi kodithe PILLI kudaa yeduru thiruguthundi......yem...PILLI maatram DHYRYAM cheyyaleraaa????????





P.S: don't show any sympathy on these kind of cases....even I scolded my sister for what she has done by not letting us know the FACTS erlier......

నీహారిక said...

ఇంతకు ముందు ఒక బ్లాగు ప్రతివ్రతని ఇదే ప్రశ్న అడిగాను, ఉద్యోగం కావాలా,భర్త కావాలా తేల్చుకోమని అంటే ఏమని సమాధానం ఇస్తారు అని అడిగాను.

ఇపుడు ప్రణీతకి కూడా ఆ ప్రశ్న ఎదురైంది, ఆమె భర్తనే ఎంచుకున్నారు. ఆమె చేసింది తప్పని కొంతమంది కొత్తిమీర కట్టలకీ, కొంతమంది మిరపకాయ బుడ్డోళ్ళకీ అనిపించవచ్చు. కానీ ప్రణీత చేసింది చాలా కరెక్ట్ నిర్ణయమే తీసుకుంది అని నేను అంటాను.

భారతాన్ని అంత చక్కగా విశ్లేషించారు రామాయణాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నారేమిటి కృష్ణా ??

భర్త రాముడైతే ఈ కాలంలోనైనా ఏ కాలంలోనైనా సీత లాగే ఉండాలి. ప్రణీత కూడా సీత లాగా గెలుస్తుంది, నీవు రాస్తావు. ప్రణీత లాంటివాళ్ళు సీత లాగా ఏదో ఒకరోజు ఎదురుతిరుగుతారు. అపుడు మిరపకాయ లాంటి రాముడి మైండ్ బ్లాంక్ అవుతుంది.

అందరూ కొత్తిమీర కట్టలే,అందరూ మిరపకాయలే, కొత్తిమీర బలహీనంగా కనిపించినా వెయ్యకుండా ఉండలేము వేస్తే దాని రుచె వేరు. మిరపకాయ ఘాటుగా ఉంటుంది, ఉండాలి కదా అని మరీ ఘాటు ఎక్కువైనా, కొత్తిమీర ఎక్కువైనా భరించలేం. అందుకే అటువంటి వాళ్ళను విడదీయటానికి ఒక సంవత్సరం రావణుడి దగ్గర ఉంచారు వాల్మీకి. ఆతి "ప్రేమా" అతి "ద్వేషం" పనికి రావు.

అర్ధం అయిందా? నీ తాలింపు భాషలో చెప్పాను.

కృష్ణప్రియ said...

@ లలిత,

హ్మ్.. నువ్వు చెప్పింది కొంత వరకూ ఏకీభవిస్తాను. ఒక మెట్రో లో పుట్టి పెరిగిన స్త్రీ,
వేరే ఊర్లో ఒక్కత్తే ఉండి చదువుకున్న స్త్రీ, అందునా.. తండ్రి లేడు.
తల్లి, ఇద్దరు తోబుట్టువులని నాలుగేళ్లు ఒక పిల్లర్ లా నిలిచి కుటుంబాన్ని నిలిపిన స్త్రీ,
అదీ కాక నెలకి లక్ష పైన సంపాదించుకుంటూ, ఆఫీస్ లో కూడా టెక్నికల్ గా కూడా తనని తాను నిరూపించుకున్న స్త్రీ..
సపోర్ట్ గా తల్లి ఉంది.. చెల్లెళ్లు ఉన్నారు. ఓకే. కొ వర్కర్లు గా మా సపోర్ట్ పరిమితమైనది గా ఉండచ్చు.

నా ఆశ్చర్యం ఏంటంటే.. ఇంత సపోర్ట్ సిస్టం ఉన్న స్త్రీ ఇంత బాధ పడిందే.. మామూలు స్త్రీ కి ఈ బాధ ఎదురైతే ఏం చేస్తుంది అన్నది..

కృష్ణప్రియ said...

@ diamond,

ఇప్పుడావిడ నిక్షేపం లా ఉంది. Time to write Praneeta - II :)

@ VSR,

Agreed! మీ ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఎందుకంటే.. కొంత వరకూ నేనూ ఆ పిల్లని చూస్తూ ఆ బాధని అనుభవించాను కాబట్టి.
పైన లలిత కి చెప్పినట్టు చదువు, ఉద్యోగం , పుట్టింటి వారి సపోర్ట్ మెట్రో జీవితం ఇచ్చిన కాన్ఫిడెన్స్ కన్నా నేను ఎదిరిస్తే నా చెల్లెళ్లు ఏమవుతారు?
అమ్మకి చెడ్డపేరు.. లేదా.. భర్త ని అంతగా ప్రేమిస్తుందేమో.. మానసిక దౌర్బల్యమో, లేదా నీహారిక గారు చెప్పినట్టు సహనం,ఓర్పు వల్లే మార్పు మొదలౌతుందేమో..
అవి ఇచ్చే భయం, సహనం ,ఓర్పు ఆ అమ్మాయి మీద ఎక్కువ ప్రభావం చూపించాయేమో అనిపించింది.

ఏది ఏమైనా ఇప్పుడు ఒక విధం గా బానే ఉందేమో లెండి. త్వర లో రాస్తాను..

కృష్ణప్రియ said...

@ నీహారిక గారు,

****** ఇంతకు ముందు ఒక బ్లాగు ప్రతివ్రతని ఇదే ప్రశ్న అడిగాను, ఉద్యోగం కావాలా,భర్త కావాలా తేల్చుకోమని అంటే ఏమని సమాధానం ఇస్తారు అని అడిగాను.
హ్మ్.. దీనికి హిస్టరీ ఉన్నట్టుంది. నాకు ఐడియా లేదు.
****** కానీ ప్రణీత చేసింది చాలా కరెక్ట్ నిర్ణయమే తీసుకుంది అని నేను అంటాను.

కొంతమంది మీలాగే అన్నారు. తను చేసిందే కరెక్ట్ అని. ఉద్యోగం ఆమెకి ఒక లెక్క కాదు. వదిలేసింది. మీరు చెప్పినట్టు తన జీవితం దాదాపు అతనికి పూర్తిగా అర్పించింది. అతని లో మార్పు వస్తుందా రాదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.. తను చేయగల్గింది చేసి అదృష్టం మీద/భర్త మీద/దేవుడి మీద భారం వేసింది.
చేతిలో పుచ్చకాయ ని భార్య నెత్తి మీదకి విసిరినప్పుడు, గోడ మీదకి ఆవేశం తో నెట్టినప్పుడు అదృష్టం కాపాడింది. భగవంతుడు కాపాడాడు. అలాగే అన్ని వేళ లా ఆవిడ కి అన్నీ కలిసి వచ్చి గెలుపు వచ్చేవరకూ ప్రాణం నిలవాలి కదండీ..
నేనూ చిన్న చిన్న విషయాలకి, ఆ మాటకొస్తే పెద్ద పెద్ద విషయాలకి కూడా విడిపోవటం మాత్రమే సమాధానం అని నేననను. at the same time.. అన్నింటి కన్నా.. ప్రాణం గొప్పదని అనుకుంటాను.
****** ప్రణీత లాంటివాళ్ళు సీత లాగా ఏదో ఒకరోజు ఎదురుతిరుగుతారు. అపుడు మిరపకాయ లాంటి రాముడి మైండ్ బ్లాంక్ అవుతుంది.
హ్మ్. Let us hope so..
******** ఆతి "ప్రేమా" అతి "ద్వేషం" పనికి రావు
లెస్స పలికితిరి!
******** అర్ధం అయిందా? నీ తాలింపు భాషలో చెప్పాను.

:) అర్థం అయింది మాడం! మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు!

Mauli said...

కృష్ణప్రియ గారు,

ఆ అమ్మాయి గురి౦చి మీరు లలిత గారితో చెప్పినవన్నీ నిజాలే కాని, అ౦త తెలివైన అమ్మాయి ఎ౦చుకొన్న భర్తే కదా అతను (ఎన్ని కారణాలయినా). ఉద్యోగం జీవితం కన్నా ఎక్కువేమి కాదు.

మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నా నా స్నేహితురాలోకామే పేరు 'చిన్ని' ..ఇ౦ట్లొ ముద్దుగా పిలిచే పేరుతొ పిలిస్తేనే స్కూల్ లో 'అటెండెన్స్' చెబుతానన్న ఆత్మవిశ్వాసం అక్షరాబ్యాసం లోనే :) ఈ రోజుల్లో కుడా బహు అరుదు . కాని వివాహం, జీవితం విష్యం లో మీ ప్రణిత కన్నా వ౦దరెట్లు ఎక్కువ రాజి పడి౦ది వాళ్ళ నాన్న కోసం :-) తన ఆశలన్ని కూతుర్లలో చూసుకు౦టు౦ది. తను గెలుస్తు౦ది . గెలుపు ను లక్ష రూపాయల జీతం తో పోల్చనక్కరలేదు . (ఇది నా అభిప్రాయమే )

కృష్ణప్రియ said...

మౌళి గారు,

******* ఉద్యోగం జీవితం కన్నా ఎక్కువేమి కాదు.

No disagreement there! అస్సలూ ఎక్కువ కాదు. జీవితం లో ఉద్యోగం ఒక భాగం మాత్రమే. like galbladder in a human body :) లేకపోయినా సిస్టం హాయిగా నడుస్తూనె ఉంటుంది.

ఇలాగ జీవితం లో ఏదో ఒక లెవల్ లో రాజీ పడని ఆడ/మగ వారంటూ ఎవరుంటారు లోకం లో? నా చుట్టూ ఉన్న వాళ్లంతా రాజీ పడిన వారే. పడాలి కూడా!!

ప్రణీత భర్త కి ప్రణీత ఉద్యోగం మాత్రమే ప్రాబ్లం కాదు.
I think I was not able to narrate his story well.

నేను తప్పక పార్ట్ ౨ రాస్తాను. కానీ బహుశా ఈసారి ప్రణీత నాకు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. అడిగి చూస్తా

Mauli said...

@ప్రణీత భర్త కి ప్రణీత ఉద్యోగం మాత్రమే ప్రాబ్లం కాదు.

కావచ్చు కాని భర్త కోసం ఆమె వదిలేసిన వాటిలో ఉద్యోగం ఒకటి మాత్రమె. కాని ఇక్కడ స్ప౦దన లో బోలెడన్ని అబ్యుదయభావాలు . ఇ౦కా అతన్నికుడా అర్ధం చేసికోగాలగాలి (మీరు ఎన్నయినా వ్రాయచ్చు గాక అతని ఆగడాలు ) . అతనలా ప్రవర్తి౦చడానికి కారణాలు తెలుసుకోడం ముఖ్యం. అప్పుడు కేవలం అదృష్టం వల్ల మాత్రమె కాక, జాగ్రత్త వల్ల తను బ్రతికే ఉ౦టు౦ది. మీరు ఇ౦కో భాగం వ్రాయడం వల్ల ఇక్కడ ఉపయోగం పెద్దగ ఉ౦డదు. అయినా మీ ఇష్టం

కృష్ణప్రియ said...

@ మౌళి,

ప్రణీత వదులుకున్నది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.
Anyways, మీరన్న దాంట్లోనూ పాయింట్ ఉంది. అతనలా ప్రవర్తించటం వెనక కారణాలేమున్నాయో!

Thanks for the comment! తన వ్యక్తిగత జీవితం గురించి కదా.. అప్పుడంటే రాయమంది. 99.99% ఈసారి ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి రాయక పోవచ్చు. Good news is.. she is alive and somewhat happy today! That's all we all want too..

Mauli said...

ఉద్యోగం మాత్రమె కాక ఇ౦కా చాల వదులుకొ న్నట్లే నా భావం అ౦డీ

Sree Ram said...

Krishnapriya garu,

One blind question(doubt). Why people like praneetha hangs around marriage even if they are not happy in it? is it because of dependency or love?

కృష్ణప్రియ said...

@ Sriram,

Love, Dependency, భయం, తరతరాల నుండీ వంట బట్టించుకున్న సాంప్రదాయం.. తన తర్వాత తోబుట్టువులకి పెళ్లి అవదేమో అని దిగులు,తన పెళ్లి ఫెయిల్యూర్ అని ఎవరూ అనుకోకూడదు అనే ఇగో, మారతాదేమో అన్న ఆశ..

ఇవీ నాకు కనిపించినవి. ఇంకా ఏమైనా మౌలిక కారణాలున్నాయేమో.. చెప్పలేము.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;