మా చిన్నారి కాంప్లెక్స్ కి మళ్ళీ ఒక పెసిడెంటూ, సెగ్రెట్రీ, అరడజన్ మంది మెంబర్లూ,.. బిల్డర్ దగ్గర్నించి తీసుకుని, ఎసోసియేషను తయారు చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ, వెళ్తూ ఎలాగైతే.. ఇండియా, పాకిస్తాన్ గా అఖండ భారతాన్ని విడగొట్టి వెళ్ళారో,.. మా బిల్డరూ ఇంచు మించు అదే పని చేసి వెళ్ళాడు. ఉత్తర దేశీయ మహరాజులూ, తమిళ పులులూ.. మిగిలిన వాళ్ళం ..తెలుగు,మరాఠీ, గుజరాతీయిలు.. మైనారిటీలు గా నిలిచిపోయాం.
బిల్డర్ ఏ విషయం అడిగినా.. అయ్యో అవతల వర్గం వాళ్ళలా అన్నారే అనటం,.. రెండు వర్గాలూ వాదించుకుంటే.. తప్పించుకుపోవటం.. జరుగుతూ.. కొన్ని అసోసియెషన్ మీద వదిలి హాయిగా నిష్క్రమించాడు. తర్వాత మొదలైంది అసలు కథ.
హాండోవర్ మీటింగ్ అయ్యాక, తాత్కాలిక కార్యాచరణ కమిటీ అయితే ఏర్పడింది. మెంబర్లంతా కూర్చుని అద్యక్షుణ్ణి ఎన్నుకోవటమూ అయింది. ఆయన తమిళ్.. దాంతో తమిళ హవా సాగింది మొదటి సంవత్సరం. ఆయన ఒక పేరున్న కంపెనీ లో డైరెక్టర్. ఆయన నేతృత్వం లో ఏమి నిర్ణయం తీసుకున్నా ఉత్తరభారతీయులు వ్యతిరేకించేవారు. ఆఖరికి 'సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ' అని ఆయన అంటే కూడా వ్యతిరేకించటమే! దానితో.. ఈసారి ఉత్తర భారతీయుడు ప్రెసిడెంటయితే... చెప్దామని రెడీ గా ఉన్నారు తమిళులు. తెలివిగా ఈసారి పోటీ చేయకూడదని వాళ్ళూ నిర్ణయించుకున్నారు.
వారికీ ఇష్టం లేదు.. వీరికీ అవసరం లేదు. ఇంక తేర గా దొరికిన వారెవరండీ అంటే మనం ఉన్నాం గా.. తెలుగు వాళ్ళం! గూఢచారుల ద్వారా ఈ విషయం కనిపెట్టి ప్రెసిడెంట్ ఎన్నికల రోజున బయటకెళ్ళే కార్యక్రమం పెట్టా.. నాకే అంత తెలివేడిస్తే.. వాళ్ళకెంత ఉండాలి ? మేము బయటకెళ్ళే పని ఎలాగోలా కాన్సెల్ చేయించి మావారి ని పెసిడెంట్ ని చేసేసారు!!
ప్రెసిండెంట్ గా ఆయన కష్టాలు వదిలేస్తే..నా కష్టకాలం మొదలైంది. పొద్దున్నే లేచి లాన్ లో కలుపు మొక్కలు తీస్తుంటే.. 'మాడం.. మోటర్ పాడయింది ఏం చేయమంటారు? ' .. కార్ సెక్యూరిటీ గేట్ దగ్గర వెళ్తుంటే ఆపి.. 'చెత్త ఎత్తుకెళ్ళేవాడు రాలేదు.. ఏం చేయమంటారు ' అనీ.. రోడ్లూడ్చే ఆవిడ.. తోటమాలి తిట్టాడని, గుండెల్లో గూడు కట్టుకున్న వ్యథ కన్నీటి రూపం లో ఏరులై ప్రవహించేలా.. వెక్కి వెక్కి.. ఏడ్వటం.. లాంటి పిర్యాదులు..
ఇది చాలదన్నట్టు.. పొద్దున్నే కరెక్ట్ గా పోపు పెట్టే సమయానికి ఇంటర్ కాం లో కాలనీ వృద్ధులు ఫోన్ చేసి.. ' మా భజన సంఘం చాప ఎవరో ఎత్తుకెళ్ళారు.. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోం.. మీరేం ఏక్షన్ తీసుకుంటారు ?' అని నిలదీయటాలూ,..
ఒక రోజు ఆఫీస్ లో ఏదో ప్రెజెంటేషన్ ఇస్తుంటే.. ఫోన్ మోగుతూనే ఉంది. అప్పటికీ ఒక్క బీప్ మాత్రమే వచ్చేట్టు పెట్టినా.. చాలా ఇరిటేట్ చేస్తోంది.. స్విచ్ ఆఫ్ చేసి..తర్వాత చూస్తే.. తెలియని నంబర్.. బాబోయ్.. ఎవరో ఏమిటో ..ఎంత అర్జంటైయితే ఇంతలాగా చేస్తారో అని భయపడి.. వాళ్ళకి తిరిగి చేస్తే.. మా కాంప్లెక్స్ లోంచి లీల గారట. ' పొద్దున్నుంచీ నీళ్ళు రాలేదు నాకు ఏంటి.. అసలు? ' అని. చాలా చిర్రెత్తుకొచ్చింది కానీ.. సాధ్యమయినంత సౌమ్యం గా 'నేను వర్క్ లో ఉన్నాను. నాకు అస్సలూ ఐడియా లేదు. ఎం సీ మెంబర్లెవర్నైనా అడగాల్సింది. ' అన్నాను. ఆవిడ వాళ్ళు నా మాట వినటం లేదు. అంది.. తీరా చూస్తే.. ఆవిడ ఇంట్లో నే ఏదో ప్రాబ్లమట.
ఇంకోసారి ఒకావిడ బట్టలారేస్తుంటే.. తోటమాలి నిలబడి చూశాడట. అదో పిర్యాదు. ఇదీ కాక.. ఇంకో ఇంటి ముందు వేసిన వేప చెట్టు కొమ్మలు నరికి ఒక ముసలాయన తీసుకెళ్తున్నాడట. తల బొప్పి కట్టుకుపోతోంది. 'హెందుకు.. ఆ భగవంతుడు.. నాకీ శిక్ష వేస్తున్నాడు..' అని మదనపడుతున్న రోజుల్లో మా జెండా కర్ర కింద జ్ఞానోదయమయ్యింది నాకు.
గోధూళి వేళ..కాదు కాదు వాహనాల దుమ్మూ,ధూళీ,మోత వేళ.. మా కాంప్లెక్స్ మగవారు ఆఫీస్ కిటికీల్లోంచి ఇళ్ళకి వెళ్ళే చిరు ఉద్యోగులని ఈర్ష్య గా చూస్తూ.. తల్లిదండ్రులు తోసారని చిన్నప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా అల్లరి చిల్లరి గా తిరిగితే.. వాళ్ళల్లా హాయిగా ఈ పాటికి సిటీ బస్ లో వేలాడుతూ ఉండేవాళ్ళం కదా .. అని నిట్టూర్చేవేళ.. పిల్లలు ఆడుతుంటే.. ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు.
" ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నాకు అసలు ఏం సంబంధం?" అంటే.. "ప్రెసిడెంట్ భార్య గా అది నీ బాధ్యత " అని గుర్తుచేశారు జనాలు. 'అదేంటి? అసలు నాకామాత్రం సమయం ఉంటే వేరే ఎన్ని పనులు చేద్దునో.. కనీసం ఇంకో గంట నిద్ర పోయేదాన్నేమో.. మావారు ప్రెసిడెంట్.. ఎం సీ (మానేజ్ మెంట్ కమిటీ ) ఉంది వాళ్ళే చూసుకోవాలి ఈ పనులు... ' అన్నాను.. అభ్యర్థిస్తూ..
'అలా కాదు.. వైట్ హవుజ్ లో ఫస్ట్ లేడీ సిబ్బంది బాగోగులూ, కళలూ, కాకరకాయలూ, ఆడవాళ్ళ సమస్యలూ, ఫంక్షన్ల నిర్వహణా .. ఆరోగ్యం, పర్యావరణం, చింతకాయా.. ఇలా అన్నింటి లో ఉత్సాహం చూపిస్తుంది గా అలా ' అని తేల్చి చెప్పారు కాలనీ వాసులు. జీతం, బత్తెం లేకుండా.. ఇంకొకళ్ళు తేర గా దొరికే అవకాశం ఉంటే.. పొగడ్తలు కూడా నాలుగు రాలిస్తే పోలా అనుకుని అట్నుంచి నరుక్కొచ్చినవారూ ఉన్నారు...
" కృష్ణా.. మీకున్న చొరవా..మంచిదనం, తెలివీ.. వేరేవాళ్ళకి ఎక్కడివి చెప్పండి.. మీరిట్టే కలిసిపోతారు మా అందరితో.. అందుకే మీకు చెప్తే.. మా పనులయినట్టే అని నిశ్చింత గా ఉంటాం " లాంటి వి చెప్పి నన్ను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు మా వాళ్ళు. నేను వెంటనే.. సాధ్యమయినంత ప్రశాంతమయిన నవ్వు ఇచ్చాను.. ఎందుకో చటుక్కున వెలిగింది.. 'హహ్!! నేను 4 కే ఇంటికొస్తున్నాను. ఎం సీ లో అందరూ సాఫ్ట్ వేర్ వాళ్ళే.. రాత్రి 10 కి ముందు ఇంటికే రారు. సగం మెంబర్లు ఫారిన్ టూర్లలో తిరుగుతూ ఉంటారు.. " అని.
ఏం చేస్తాం.. ఇంకో 4 నెలలైనా.. దిగని "పొగడ్తల" మత్తు లో పడేశారు నన్ను. ఆఫీస్ లో నాలుగు డెడ్ లైన్లు మిస్సయినా పర్వాలేదు.. ఇంట్లో ఒక 10 రోజులు హోటల్లో తిన్నా పర్వాలేదు కానీ.. ఈ కాంప్లెక్స్ ప్రజల అభివృద్ధి కి ఆఖరి శ్వాస వరకూ.. పని చేయాలని ఒక సంకల్పం 'ఆల్ మోస్ట్' ఏర్పడబోయింది. ;-)
ఏదో ఇలా మూడు గొడవలూ, ఆరు పిర్యాదులు గా జీవితం సాగిపోతుంటే.. అయ్యింది మా ప్లంబర్ పెళ్ళి. ఆయన లేకపోవటం వల్ల కలిగిన అసౌకర్యాలూ, దాని మీద పిర్యాదుల సంగతీ అటుంచి.. ఆయన కి ఒక గిఫ్ట్ కొనాలి అనగానే..
కాంప్లెక్స్ లో పని వారి పెళ్ళిళ్ళకి మనం ఎంత వరకూ పెట్టవచ్చు? కోశాగారం నుండి ఎంత వరకూ తీయవచ్చు అన్నదాని గురించి చర్చ మొదలు! అసలే ఉత్తర,దక్షిణ దృవాలు తగినంత మసాలా లేక బాధ గా ఉన్నారేమో విజృంబించేశారు. దక్షిణాది వారు మొన్న మంజునాథ పెళ్ళికి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఇతనికీ ఇవ్వక్కర్లేదని వారి వాదన. ఉత్తరాది వారు ఊరుకుంటారా? తలా ఐదు వందలూ వేసుకుని చదివింపులు చేయాల్సిందే అని వారి పట్టుదల! సాయంత్రం కార్ గేట్ లోంచి వస్తూనే ఏదో ఒక వర్గం వారి లాజిక్ వివరించటం.. నేనేదో జడ్జ్ లా ఇరు పక్షం వారి వాదనలూ వినటం..
40 గడపల కమ్యూనిటీ లో 30 ఇళ్ళవారిని సంప్రదించి.. బుజ్జగించి, ఒక తీర్మానం చేసేటప్పటికి తల ప్రాణం తోక కొచ్చింది. ఇద్దరికీ..కుటుంబానికి 200 చప్పున ఇచ్చేట్టుగా ఒక మిక్సీ కొని స్వాతంత్ర్య దినోత్సవం నాడు బహుకరించేట్టుగా ఒప్పందం జరిగిపోయింది.
మళ్ళీ ఈ నిర్ణయం వల్ల 'హర్ట్ ' అయినవాళ్ళు కనీసం 10 మంది. ఆగస్ట్ 15 వచ్చేసింది. సగం మంది కూడా ఇంకా ఇవ్వలేదు డబ్బు. బడ్జెట్ ప్రకారం ఆఫీస్ నుండి వస్తూ ఆగి 2 మిక్సీలు కొని ఇచ్చేసాను. మళ్ళీ పంద్రాగస్తు వచ్చేస్తోంది. ఇంకా కొంత మంది అప్పుడప్పుడూ వందా,రెండొందలూ ఇస్తూనే ఉంటారు.. నాకు.
కాబట్టి.. జనులారా! గేటెడ్ కమ్యూనిటీ లో ఉండండి.. కానీ.. పదవుల జోలికి వెళ్ళద్దు.. మా వారు ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో దీపావళి పండగ ఆర్గనైజ్ చేసినప్పటి కష్టాలు వింటే.. మీరామాట ఎత్తరనుకోండి !!
కాంప్లెక్స్ దీపావళి ఫటాకాల హడావిడి మరో టపా లో...
పాత గేటెడ్ కమ్యూనిటీ కథ : http://krishna-diary.blogspot.com/2010/06/blog-post_05.html
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
అబ్బా వైట్ హవుజ్ లో ఫస్ట్ లేడీ తో పోల్చిన తరవాత కూడా ఆ కాంప్లెక్స్ ప్రజల అభివృద్ధి కి ఆఖరి శ్వాస వరకూ.. పని చేయాలని ఒక సంకల్పం 'ఆల్ మోస్ట్' ఏర్పడబోయి ఏలా ఆగిపోయింది అని నా ప్రశ్న. అసలు ఆ మాట విన్న తరవాత కూడా మీకు ఆఫీసు డెడ్ లైన్లు , ఇంట్లో వంట ఇంకా ఏలా గుర్తుకు వచ్చాయి హతవిధీ ;)
బాగుందండి పోస్టు ఇంకా నవ్వుతానే ఉన్నా , పాపం మీ పరిస్తితే ఇట్లా ఉంటే
ఇక ప్రెసిడెంట్ గారి పరిస్తితి ఏమిటో పాపం :)
మంచి ప్రశ్న..శ్రావ్య గారూ,..
అంత పొగడ్త తర్వాత.. నాకు చుట్టూ చూస్తే పాలపుంతా, సౌరకుటుంబం లాంటివి తప్ప,.. ఇంట్లో అంట్లూ, పిల్లల హోం వర్కులూ, ఆఫీస్ లో బుగ్గులూ లాంటి తుచ్చమైనవి కనపడలేదంటే నమ్మండి !!!
ఏం చేస్తాం.. వాస్తవికత ధరాతలం మీద ఎప్పుడో ఒకప్పుడు కూలబడక తప్పదు గా.. ఎగ్జాట్లీ ఎప్పుడంటే.. ఏమో .. ఇంక ప్రెసిడెంట్ గారి పరిస్థితి కేముందండీ,.. చక్కగా గేట్ల దగ్గర సాల్యూట్లూ, మందీ, మార్బలం.. అఫ్ కోర్స్..తిట్లూ, చివాట్లూ,.. ఉన్నాయనుకోండి :-) ..
వావ్ వైట్ హౌజ్ లోని ప్రధమ మహిళ తో పోల్చేసారన్నమాట . ఎంత గ్రేట్ కదా . ఆ అదృష్టం ఎంతమంది కొస్తుంది చెప్పండి . వెధవవి మన పనులెప్పుడూ వుండే వే . వారి పనులు చూడండి .
బాగుందండి .
హహహ! ఏమి నవ్వించారండి.గేటెడ్లోనే కాదు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కూడా ఇవే తంతులు. నేను వద్దు మొర్రో అన్నా వినకుండా మేమందరం ఉన్నామని చెప్పి మావారిని (ఆయనకు అదేదో మహారాజ పదవిలా మనసులో ఇష్టమే, పైకి అంటే నేనేమంటానోనని పక్క వాళ్ళ సహాయం) ఏడేళ్ళు వేధించారు ప్రెసిడెంటును చేసి.ఆఖరికి మా ఎదురింటి ముసలమ్మ కరెంట్ పోతే నా ఎదురుగానే ఆ పెసిదెంట్ వాడెవడో ఉన్నాడుగా వాడిని అడగండి అని నాముందే మంచీ మర్యాద లేకుండా అని నన్ను చూచి నాలిక్కర్చుకుంది, మరలా తెల్లారి లేస్తే మిరపకాయలూ, నిమ్మకాయలూ, కొత్తిమీర సమస్తం మా ఫ్రిజ్ లోనించే తీసుకుంటది. ఆ దెబ్బకి నా మైండు బ్లాంక్ ఐయ్యి నేనో, ఈ పిచ్చి గోలో ఏదో తేల్చుకొమ్మన్నాను. మూడురోజులు టైమిచ్చి ఈ దరిద్రం వదిలించుకోకపోతే డైవోర్సు ఇస్తానని చెప్పి సీరియస్ గానే, మా చెల్లిదగ్గరకు వెళ్ళిపోయాను . మా ఆయన నేను అంత కోపంగా ఉండటం అంతకుముందు చూడలేదు వదిలించుకున్నారు. మరలా రాయబారాలు. అదేమిటండీ ఇంత చిన్న విషయానికి అంత సీరియస్సా అంటూ. ఏమైనా వదిలిపోయింది. ఆ తరువాత మేము దేశం వదిలిపెట్టాము.
మాల గారూ,
అంతేనంటారా? నా సంకల్పం సరయినదేనన్నమాట! :-)
చాలా థాంక్స్ అండీ.. నా టపా చదివినందుకు, కామెంట్ చేసినందుకు!
కృష్ణప్రియ/
hillarious
పొద్దున్నే భలే నవ్వించారు
సునీత గారూ,
నా టపా సంగతేమో కానీ.. మీ విశేషాలు బాగున్నాయి. స్విమ్మింగ్ పూలు కంపు కొడుతున్నా, కరంటు పోయినా, కాంప్లెక్స్ లో ఎలకలు చేరినా.. ఇంట్లోంచి చెత్త ఒక పూట క్లియర్ చేయటం లేటయినా.. తేరగా దొరికేది పెసిడెంటే గా మరి.
ధన్యవాదాలు!
కృష్ణప్రియ/
Thanks Hare Krishna!
krishnapriya for President!!! :)
కొత్తపాళీ గారికి,
నేనేం పాపం చేశానని ఇంత పెద్ద శిక్ష నాకు? :-)
ధన్యవాదాలు!
కృష్ణప్రియ/
హ్మ్..ఈ పోస్టుకు కూడా కన్నిళ్లొచ్చెస్తున్నాయి నాకు...అయినా ఆనందంగానే ఉంది మీ ప్రతిభా పాటవాల్ని కమ్యునిటిలో గుర్తించినందుకు.
I second with కొత్తపాళి గారు.. :)
నాగార్జున గారూ,
హ్మ్మ్.. నా ప్రతిభాపాటవాలని మా కాలనీ వాళ్ళు గుర్తించినందుకు.. మీరు ఆనంద పడటం చూసి నాకూ కన్నీళ్ళొచ్చేస్తున్నాయి..
అవుతాను బాబూ, అవుతాను.. ఏనాడో ఒకనాడు తప్పకుండా నేను ప్రెసిడెంట్ అవుతాను.. (నువ్వు నాకు నచ్చావు - సునీల్ గారిలా..) :-)
ఇంద్రా థింక్స్ గారు,
Thanks!
మీ ఆవిడకి కూడా 'పెసిడెంట్ గారి పెళ్ళాం ' టైటిల్ వచ్చిందన్నమాట ఒకప్పుడు.
కృష్ణప్రియ/
వెనకటికెవరో ఏనుగును దానం చేసినట్టు ఈ అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రెసిడెంట్ చేయడం అన్నమాట.:) ..
Hilarious...nice writing style..
40 houses community with educated, decent folks is throwing up so many challenges.. imagine how complex managing a country of 100 crore people with varying degrees of intellect...afterall our politics is not that bad...
జ్యోతి గారూ,
:) అవును. అదేదో పంచతంత్రం లో కథ లాగా.. నెత్తి మీది చక్రాన్ని పాత ప్రెసిండెంట్ నుండి తీసుకున్నట్టు!
వీకెండ్ పొలిటిషియన్ గారూ,
ఈ కమ్యూనిటీ పాలిటిక్స్ లో ఇగో క్లాష్ లూ, ఎవరైనా పని చేసేస్తే చేయించుకోవటం.. డబ్బు పే చేస్తున్నాం కదా, దానికి తగినట్టు సర్వీస్ లుండాలని.. తప్పితే.. అధికార దుర్వినియోగం, కాంప్లెక్స్ పైసలు వాడుకోవటం,.. లాంటివి తక్కువే.. అదీ మాది మరీ చిన్న కమ్యూనిటీ కదా.. ఒక మానేజర్ ని పెట్టుకుంటే సగం తిప్పలు తగ్గుతాయి!
కాస్త పెద్దదయితే.. మీరన్నట్టు ఎన్నో డైమెన్షన్లలో సంక్లిష్టత పెరుగుతుంది.. నిజమే.
ఇంక దేశానివి అందునా.. విభిన్న సంస్కృతుల పాదుకొమ్మయిన మన దేశం లాంటి రాజకీయాల సంగతి చెప్పనక్కరలేదు...
పాలిటిక్స్ అంత బాడ్ కాదన్నారు.. చాలా రోజులనుండి నాకొక డవుటు.. వారాంతపు రాజకీయవాది అంటే? :-)
కృష్ణప్రియ/
కృష్ణప్రియ గారూ,
వీకెండ్ పొలిటీషియన్ అనే పేరు వెనుక పెద్ద కధ కాదుగాని, కొద్దిగా నా సొంత పైత్యం ఉంది. నేను వృత్తి రీత్యా ఒక సాఫ్ట్ వేర్ కంపనీలో మానేజరుగా వెలగబెడుతున్నా కానీ ప్రవృత్తి రీత్యా నేనొక పొలిటీషియన్ ని. నా కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించుకోవలసిన అవసరం ఉంది కాబట్టి వీక్ రోజుల్లో మానేజరు ఉద్యోగమూ, వీకెండ్ లో నా రాజకీయ కార్యకలాపాలూ నెరుపుతున్నా..ప్రస్తుతానికి.
ఏదో ఒక రోజు నా బ్లాగులో ఒక టపా రాస్తా లేండి నా వ్యవహారం గురించి.
హబ్బబ్బ ఏమి నవ్విచ్చారండి బాబు. ఇక్కడో రెండుమూడూ సామెతలేసుకోండి ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్ళు మీ వారి ప్రెసిడెంట్ గిరి మీ తలకయానొప్పులకు.. ఎద్దు పుండు కాకి కి నొప్పా అన్నట్లు మీ కష్టాలు మాకేం హాయి గా నవ్వేస్తున్నాం.. సూపరండీ మీకేంటీ... అటూ ఇటూ గా ఫస్ట్ లేడి తో సమానం. ;-)
సునీత: మీ కష్టాలు కూడా అంతే అండి మీకు చింతను, మాకు నవ్వు ను ప్రసాదించాయి.
ఎంతగా నవ్వించారండీ బాబూ! మీ బాధలన్నీ మాకు నవ్వు తెప్పిస్తున్నాయి. :-D Simply superb!
@ భావన,
మీ సామెతల కామెంట్ నచ్చింది నాకు.. నేను సామెతలు బాగా కూర్చి రాస్తానీసారి ఒక టపా.. :-)
@ మధురవాణి,
ధన్యవాదాలు! :-)
కృష్ణప్రియ/
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.