“కాటం రాయుడా.. కదిరి నరసింహుడా.. “ యూట్యూబ్ లో
వినీ, వినీ, చూసీ, చూసీ, అత్తారింటికి దారేదో తెలుసుకుని తీరాలని ఘట్టి నిర్ణయం
తీసుకున్నాను. ఈలోగా పోస్టర్లలో
చిద్విలాసం గా ఒక పెద్ద గద పట్టుకుని
రామయ్య ని చూసి ఆయన కూడా వస్తాడేమో కనుక్కుని అత్తారింటికి దారి వెతుక్కున్నాను.
ఈ సినిమాలు ఎలా ఉన్నాయో .. పుంఖానుపుంఖాలు గా రకరకాల భాష్యాలు చూస్తూనే ఉన్నాము. అది వదిలేస్తే, ఆ సినిమాల్లో ఆడవాళ్ల పాత్రలు
ఎంత విచిత్రం గా ఉన్నాయో.. ఆశ్చర్యం వేస్తోంది.
కనీస స్థాయి విలువలని కూడా పాటించలేదనిపించింది. రెండు సినిమాల్లో ఒక్కో పాత్ర కొద్దిగా బెటర్.
మిగిలినవన్నీ మహా బేవార్స్.
“అతి పెద్ద హిట్ “ గా శ్లాఘించబడుతున్న
‘అత్తారింటికి దారేది?” సినిమా లో చూస్తే.. ఓకే.. నదియా అత్తగారు. అద్భుతం గా
నటించింది. టిపికల్ తెలుగు సినిమా అత్త లా కాకుండా, ఆవిడ వ్యక్తిత్వం ఇటు ఇంటి
విషయాల్లో, బిజినెస్ విషయాల్లో ఉంది. బిజినెస్ లో ఓడిపోయే స్థితి కి వచ్చి ఉండవచ్చు
గాక. అలాగే, తండ్రి పట్ల అంత తీవ్ర స్థాయి లో ఉదాశీనత, కటినత్వాన్ని ప్రదర్శించి
ఉండవచ్చు గాక.. పిల్లలకి కొద్దిగా అయినా
నేర్పించిందా?.. తన పిల్లలు ఎంత వెకిలి
గా, బుర్రలేని అమ్మాయిల్లా ప్రవర్తించారు? సమంతా పాత్ర లో కొద్దిగా అయినా, ఒక
రవ్వంతైనా తెలివి కనిపించిందా? అసలా పిల్ల
చదువుతోందా? ఉద్యోగం చేస్తోందా? తల్లి బిజినెస్ పడిపోతుంటే.. తల్లి ఏదో కష్టాలు
పడుతోంది కానీ, కనీసం ఏం జరుగుతోందో.. ఆ పిల్లకి తెలుసా? హీరోయిన్లకి అంతకి మించి తెలివి కానీ,
వ్యక్తిత్వం కానీ కమర్షియల్ చిత్రాల్లో ఉండకూడదేమో..
ఇక “రామయ్యా వస్తావయ్యా!” లో సీనియర్ నటి రోహిణి
హట్టంగళి పాత్ర ఏ ఒక్క తెలుగు వారికైనా నచ్చిందా? ఆ దర్శకుడు, హీరో, రచయిత,
నిర్మాత, (ఇంకా ఎవరెవరికి ఈ పాత్ర చిత్రీకరణ లో జోక్యం ఉంటుందో తెలియదు) ఏ ఒక్కరికీ ఏహ్యం గా అనిపించలేదా? లేక నేనే
కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అని ఆశ్చర్యం వేసింది. ఒక ఎనభయ్యేళ్ళ వృద్ధురాలు, తన వయసుని దాచుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూ,
“బామ్మా.. అని వద్దు.. బేబీ’ అని పిలువు అని వెఱ్ఱి గా ప్రవర్తించడం.. ‘నా కలల రాజకుమారుడివి నీవే’ నని మనవరాలి
వయసున్న హీరో తో వెకిలి గా ప్రవర్తిస్తూ, గుండె నొప్పి వచ్చేదాకా గంతులేయడం.. ఏవిధమైన కామెడీ అది? రోహిణి చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఏమైనా ఉందేమో.. ఇలాంటి పాత్ర ఒప్పుకుంది.. అనిపించింది. శృతి హాసన్ పాత్ర చూస్తే.. పాత్ర చిత్రీకరణ
బాగానే ఉంది అయితే అంత ఫుల్ మేకప్ తో,
పాశ్చాత్య దుస్తుల్లో పల్లెలో తిరుగుతూ టీచర్లు ఉంటారా? మా బెంగుళూరులో MNC లో
మార్కెటింగ్, సేల్స్, HR లలో కూడా అమ్మాయిలు అంత పాష్ గా తయారవడం గత ఆరేళ్లుగా
చూడలేదు నేను.. ఇంటర్నేషనల్ స్కూళ్లల్లో
టీచర్లయినా అలా ఉన్నారా? సమంతా పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే
అంత మంచిది. అంత పెద్ద డాన్ కూతురు.. చిన్న చిన్న బ్లాక్ మెయిళ్ళకి లొంగిపోయి, తన
పిచ్చి బామ్మ తో గెంతులాడిన మనిషి లో మానవత చూసి అకస్మాత్తు గా ప్రేమించేస్తుందా? అలాంటి పిల్ల, తండ్రి
ఎంత పెద్ద విలనో తెలుసుకుని హీరో
కుటుంబాన్ని, ఒక ఊరి జనాలని ఊచకోత కోసిన దుర్మార్గుడా అని బాధ పడి, ప్రాయశ్చితం గా
తన పరివారాన్ని కూకటి వేళ్లతో సహా
పెకిలించి వేసిన హీరో ని పెళ్లి చేసుకుని హీరో మాజీ ప్రియురాలి ఆశయాన్ని
నెరవేర్చడానికి పల్లెకి వెళ్లి టీచర్ అయిపోతుందా? భేష్!! ఒక్క సారి గా 180 degree
tilt in character, అంత గొప్ప ఉదారత, నాలాంటి సామాన్యులకి సాధ్యం కాదు.
తల బొప్పి కట్టేసింది.. కొత్త తెలుగు సినిమాలు చూసి వాటిల్లోని పాత్రల
ఉచితానుచితాల చర్చలు చేయకూడదనుకున్నాను.. కానీ, అన్నీ ఇలాగే ఉంటున్నాయా?ఈమధ్య
ఇంగ్లిష్ వింగ్లిష్ లో శ్రీదేవి పాత్ర అన్న మాట ఒకటి గుర్తొచ్చింది.. “నేను ప్రేమ కోసం మరీ అంత మొహం వాచిపోలేదు. నాకు
కావాల్సింది కొద్దిగా రెస్పెక్ట్..’
సరే.. జనాలందరూ “Lunch Box” అని తెగ ఉత్సాహ పడిపోతున్నారు.. ఆస్కార్స్ కోసం ప్రత్యేకం
గా తీసిన సినిమా అని విని ప్రత్యేకం గా చూసాను. UTV productions, కరణ్ జోహార్ .. అనురాగ్
కశ్యప్ అబ్బో పెద్ద పేర్లు.. ఇర్ఫాన్
ఖాన్, కాద్బరీస్ సిల్క్ ఆడ్ లో కార్ లో
కూర్చుని తినే అమ్మాయి,..
అద్భుతమైన నటులు, కళ్ళు చెమర్చే సంఘటనలు,
చూస్తేనే తినాలనిపించే వంటలు, .. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా పకడ్బందీ గా
తీసిన విధానం.. అంతా ఓకే.. కానీ నాకు ఒకటి
మాత్రం నచ్చలేదు...
‘ఈలా’ పాత్ర.
ఆమె గురించి స్థూలం గా చెప్పాలంటే.. ఈలా ముంబై లో ఒక గృహిణి, ఏడెనిమిదేళ్ల
పాప,
కారీర్/వేరే ఎఫైర్ వల్ల మాటలతోనో, భౌతికం గానో
కష్టపెట్టకపోయినా పూర్తి గా ఇగ్నోర్ చేసే
భర్త. పై పోర్షన్ లో ఆంటీ తో కలిసి వంట
చేసుకుంటూ, పాప ని పెంచుతూ,.. “నిస్సారం”
గా జీవితాన్ని ఈడుస్తూ ఉంటుంది. పుట్టింటి
వైపు వారి పరిస్థితి అంతంత మాత్రమే. ఆమె తమ్ముడు మార్కులు తక్కువొచ్చాయని ఆత్మహత్య
చేసుకున్నాడు. తండ్రి కి అనారోగ్యం.
మందులు కొనుక్కోవడానికి తడుముకోవాల్సిన ఆర్ధిక స్థితి. కూతురు దగ్గర్నించి ఏం తీసుకుంటాం.. అదే
కొడుకుంటే ఆదుకునే వాడు అని నిట్టూరుస్తూ..
ఈలోగా ఓ పూట కాస్త “స్పెషల్’ గా భర్తని
“ఇంప్రెస్” చేయాలని భోజనం తయారు చేసి
డబ్బా వాలా తో పంపుతుంది. అయితే అది 99.999% accuracy అని పేరు గాంచిన ముంబై డబ్బా
వాలా ఎప్పుడో గానీ చేయని తప్పు వల్ల ఇర్ఫాన్ ఖాన్ కి వెళ్తుంది. ఆయన కష్టాలు
ఆయనకున్నాయి. ముప్ఫై అయిదేళ్లు గా చేస్తున్న ఉద్యోగం పట్లా, నా అనే వాళ్లే లేని
జీవితం పట్లా వైరాగ్యం పెంచుకుని ముందస్తు పదవీ విరమణ చేయడానికి
నిశ్చయించుకుంటాడు. ఉద్యోగం లో అది ఆయన కి ఆఖరి నెల. ఈ డబ్బా ఆయన జీవితం లో ఒక చిన్న ఆశారేఖ. చపాతీల
మధ్య చీటీల ద్వారా క్రమం గా వారి మధ్య స్నేహ బంధం ఏర్పడటం,.. కలుసుకోవాలనుకుని నిశ్చయించుకుని మళ్లీ ఇంకో
ఆలోచనల తో విరమించుకోవడం.. ఈలా తో పరిచయం వల్ల ఇర్ఫాన్ జీవితం లో మార్పులు, ఉప కథ
గా మోజియుద్దీన్ కి ఇర్ఫాన్ తన పదవీ బాధ్యతలు ఇవ్వడం, అతని పెళ్లి, కథ అలా అలా సాగిపోయి చివరకు వాళ్లు కలుస్తారా? లేదా?
అన్న ప్రశ్న ప్రేక్షకులలో నిలిపి ఆపేయడం..
బాగానే ఉంది, కానీ ఏదో వెలితి.
ఈలా పాత్ర పట్ల సానుభూతి వస్తుంది అని ఒకటి రెండు
రివ్యూలలో చదివి, క్యూరియాసిటీ తో ఈ
సినిమా మీద వచ్చిన (గూగుల్ ద్వారా వెతుక్కోగల్గిన) ప్రతి రివ్యూ లోనూ ఇదే మాట..
ఎలా సానుభూతి వచ్చింది ప్రతివారికీ?
తల్లిదండ్రుల తో ఆమె అనుబంధం..
ఈలా తల్లిదండ్రులకి అంత ఆర్ధిక
ఇబ్బందులున్నప్పుడు ఆమె తప్ప వేరే పిల్లలు వారికి లేనప్పుడు, తండ్రి మందులు కొనుక్కోలేక ఇబ్బందులు
పడుతున్నప్పుడు, ఈలా ఏమీ చేయకుండా,..కనీసం భర్త దగ్గర ప్రస్తావన కూడా తేకుండా..
ఎలా ఉండగల్గింది? ఏం? కనీసం నాలుగు డబ్బాలైనా చేసే అమ్మే పని పెట్టుకుని
తల్లిదండ్రులకి సహాయ పడలేదా? తల్లి కున్న పాటి నిబ్బరం ఆమెకుందా? అనారోగ్యపు భర్త,
ఆత్మహత్య చేసుకున్న కొడుకు, ఈలా లాంటి
కూతురు, పైసా చేతిలో లేకపోయినా ‘ఏం పర్వాలేదు.. మా సంగతి మేము చూసుకుంటాం..
ఆడపిల్ల వాళ్లం.. మీ ఆయన్నేమడుగుతాం? నువ్వు జాగ్రత్త.. “ అని చెప్తుందే?
సరే అయిందేదో అయింది. తండ్రి పోయాడు. కూతురిని తీసుకుని ఎక్కడికో పోదామనుకుంటుది
తప్ప ఒంటరి గా మిగిలిన తల్లి గురించి
ఆలోచించినట్లు ఎక్కడా కనిపించదు.
భర్త తో కమ్యూనికేషన్
సరే..భర్త తనని పూర్తి గా ఇగ్నోర్ చేస్తున్నాడు, పైనింటావిడ కీ, డబ్బాల్లో ఉత్తరాల ద్వారా
పరిచయమైన ఇర్ఫాన్ కీ చెప్పుకుంటూ, కాలం గడిపేస్తుంది తప్ప ఎందుకు? అని
నిలదీసినట్లు కనిపించదు. (బహుశా.. అందంగా తయారయి భర్తని ఆకర్షించాలనిచేసే
ప్రయత్నాలు చూపించారు గా? అని అడగవచ్చేమో).
చిన్న మాట గా అయినా ఒక్కసారి అడిగి చూడకుండా.. , కనీసపు ‘హింట్’ ఇవ్వకుండా
ఇల్లు వదిలిపోయే నిర్ణయం తీసుకోవడం.. సరిగ్గా లేదనిపించింది.
ఇర్ఫాన్ తో అనుబంధం..
ఆరోజు పొరపాటున డబ్బా భర్త కి కాకుండా వేరే మనిషి
కి వెళ్లింది. దానితో ఒక చిన్న “థ్రిల్” కి గురయ్యి, క్రమం గా ఒక సంబంధం
ఏర్పరచుకుంది. తన పరిస్థుతులలో ఆమె కి అంతకు మించి “లెట్ అవుట్” బహుశా లేకపోవచ్చు.
ఓకే. అలాగే భర్త ని వదిలి ఇంటి బయటకి వచ్చే నిర్ణయం కూడా ఆమెకి సరైనదే అనుకుందాం..
ఇర్ఫాన్ ఆమెకి ఉత్తరాల ద్వారా తప్ప తెలియదు. ఏ విధమైన ధైర్యం తో వచ్చేస్తోంది?
అవతల పక్కనున్నది అద్భుతమైన ఉత్తరాలు రాయగల ఒక భయంకరమైన శాడిస్ట్ అయితే? ఉత్తరాల
ద్వారా తన తల్లిని చూస్తానని కానీ, తన కూతుర్ని చేరదీస్తానని కానీ ప్రామిస్ ఏదైనా
చేశాడా? బహుశా.. అంతర్లీనం గా మనసు భాష
ద్వారా చెప్పాడేమో?
ఇర్ఫాన్ తో వెళ్లిపోవడం లో చూపించిన ధైర్యం, తన
చుట్టూ ఉన్న పరిస్థుతులని చక్కదిద్దుకోవడం కోసం చేసే ప్రయత్నం లో చూపించి ఉంటే..
ఎంత బాగుండేది? ఇర్ఫాన్ అటూ ఇటూ ఊగిస
లాడటం,.. “ఎస్కేపిస్ట్” ఆలోచనల నుండి
విముక్తి పొంది, జీవితం పట్ల ప్రేమ పెంచుకోవడం చూపించిన దర్శకుడు, ఈలా పాత్ర ని
మాత్రం, అంత బేల గా చిత్రీకరించడం హాస్యాస్పదం.
నాకు పైన రాసిన తెలుగు సినిమాల్లో సమంతా,
రోహిణి పాత్రల తింగరిదనం కన్నా ఈలా పాత్ర
బాధ పెట్టింది. ఆయా సినిమాల్లో
expectation కూడా లేకపోవడం, పట్టుదలతో ఆస్కార్ స్థాయి చలన చిత్రం తీశాం అని బీరాలు
పోయినందువల్ల, అలాగే దాదాపు ప్రతి రివ్యూ లోనూ, అద్బుతమైన సినిమా గా శ్లాఘించబడ్డ
సినిమా అవడం వల్లనేమో.. లేదా చుట్టూ ఉన్న
నిజమైన సమస్యలని ఎదుర్కుని నిలబడి పోరాడటం మాని, చిన్న పిల్ల పుస్తకం లో భూటాన్ లో
ఎక్కడో ప్రజలు ఆనందం గా ఉంటున్నారనీ, ఇక్కడి రూపాయి అక్కడ ఐదు రూపాయలకి సమానమని రాసారని
అక్కడకి పారిపోయే పలాయన వాదాన్ని, బేలదనాన్ని “గ్లోరిఫై” చేసినందుకేమో L