నిరోష్ఠ్య బ్లాగాయణమా? అంటే?
నేపధ్యం....
ఓష్ఠ్యాలంటే పెదవులు కలిపితే కానీ ఉచ్చరించలేని అక్షరాలు. 'ప, ఫ, బ,భ,మ ' అక్షరాలని మనం పెదవులని కలపకుండా పలకలేము. మా నాన్నగారు నిరోష్ఠ్య రామాయణాన్ని గురించి చెప్పినప్పుడు.. ఆశ్చర్యపోయాను. మరింగంటి అప్పల దేశికుల వారు కుతుబ్ షాహీ ల కాలం లో (కనీసం 400 ఏళ్ల క్రితం అప్పటి మునగాల పరగణా కోదాడ వద్ద నరసింహాపురం వాస్తవ్యులు ) రాసారట ఈ గ్రంథాన్ని. మొత్తం గా ఒక్క ఓష్ఠ్యమూ వాడకుండా రాసిన గ్రంథ రాజమది. అసలది ఎలా సాధ్యం? 'రామ' శబ్దం లోనే ఓష్ఠ్యముంది.ఆయన్ని అంటి పెట్టుకుని తిరిగిన లక్ష్మణుని పేరు లోనూ..'మ' వాడకం ఉంది. సింహాసనం మీద పాదుకలని పెట్టి రాజ్యపాలనా భారాన్ని మోసిన భరతుడి గురించి 'భ ' అక్షరం వాడకుండా ఎలా రాస్తారు? అని.ఇంకో ఉదంతం కూడా చెప్పారు.. ఆచార్యుల వారింట్లో ఒక పని ఆవిడ ఉండేదట. పెద్దగా చదువుకోలేదు.. కానీ వీరింట చర్చలు విని విని.. పాండిత్యం బాగానే వంట పట్టిందట. ఒక అతిథి వారింటి ముంగిట ఉదయపు వేళ వచ్చి.. 'అమ్మా.. ఆచార్యుల వారు ఉన్నారా? ఏం చేస్తున్నారు?' అని అడిగితే.. ఆవిడ ఒక్క ఓష్ట్యమూ వాడకుండా.. 'దశరథ రాజ నందన చరిత రచియిస్తున్నారూ' అని!!! ఆ పుస్తకం కాపీ దొరికితే తప్పక చదవాలని ప్రయత్నాలైతే మొదలు పెట్టాను.
ఈలోగా మొన్నీ మధ్య హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు.. సెలవల్లో కాస్త వెసులు బాటై.. నాకూ ఎలాగైనా ఒక చిన్న ప్రయత్నం చేయాలన్న పిచ్చి పట్టుకుంది. బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరము అవుతోంది గా.. నా ఈ ప్రస్థానం గురించి ఓష్ట్యం అనేది వాడకుండా మీకు వివరిద్దామని ఒక చిన్ని ఆశ...
నేనా, పండితురాలను కాను. కానీ కేవలం ఉత్సాహం తో రాస్తున్నాను. కాబట్టి ఈ ప్రయత్నం లో దోషాలు ఉంటే, (తప్పక ఉంటాయి.. తెలుసు..) తప్పులు సరిదిద్దమని బ్లాగుల్లో పండితులని కోరుకుంటున్నాను. అలాగే ఎవర్నైనా తప్పుగా వర్ణించినా.. బాధించినా చెప్తే..సరి చేస్తాను..
ఇక మొదలు పెడతా .. నిరోష్ట్యబ్లాగాయణం :-)
'ఇలా రాస్తే?' అని ఒకరిద్దరి దగ్గర అనగానే.. 'తల్లీ.. నువ్వు.. నీ రాతల్లో దోషాలకి తావు లేకుండా చూడు.. అనేశారు. నేనూరుకుంటానా? నిరుత్సాహాన్ని దరి చేరనీయకుండా.. ఇదిగో..రాసేసా..
అంతర్జాల గూడుల లేదా ఊసుల గూడుల లోకాన్ని గురించి నేను కొత్తగా వివరించేది లేదనుకోండి..
నా స్నేహితురాలి అరవ గూడు చూసి.. నేను తెలుగు ఊసుల గూడు ఎందుకు కట్టుకోకూడదు అనీ.. అలాగే.. నేనూ నా తల్లినుండి నేర్చిన తెలుగు లో నేనూ నాలుగు వాక్యాలు రాసుకోవద్దూ? అనుకున్నా.
చిన్నదనాన రాసిన తర్వాత ఎక్కడా అక్కర కు రాదన్న నిర్లక్ష ధోరణి తో వెనక్కి నెట్టిన నా తల్లిని ఎదరకు తెచ్చి తుడిచి.. నానా అలంకారాలూ చేసి..నట్టింట సత్కారాలు చేసి.. ..
అసలు తెలుగు లో అంతర్జాలాన ఎట్లా రాస్తారో కాస్త శోధించి సాధించి .. నా ఆలోచనలన్నీ ఒక కొలిక్కి తెచ్చి, నా గూడులో తొలి లంకె వేసా.!!..క్రిందటేడు నాలుగవ నెల, ఇరవయ్యవ తేదీకి ఇంకా రెండున్నొక్క రోజులున్నాయనగా!
ఎవరైనా చూస్తారా? చూడగలరా? నాకు తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే.. నా కోసం తెలుగు లో నాలుగు వాక్యాలు రాయ గలుగు తున్నా.. ఒకవేళ ఎవరైనా నా రాతలని చూసినా, చదివిన వారికి నచ్చాలి! వారు తిరిగి చూడటానికి రాగలగాలి! అన్న ఆలోచన లేకుండా నాలుగైదు వ్యాసాలు రాసాను.
కొన్ని రోజుల తర్వాత చూస్తే సుజాత గారి వ్యాఖ్య!!... అసలు ఆవిడ కి నా రాతలగురించి ఎ విధం గా తెలిసిందా అని ఆశ్చర్యం తో.. ఆవిడ వివరాలున్న లంకె తెరిచి ఆవిడ గూటికి చేరి చూస్తే.. ఒక కొత్త లోకానికి చేరాను. ఎందరివో గూడులు.. రకరకాల గూడులు.. ఒక్కొక్క గూటిలో ఒక్కక్క వింత..
కొన్ని కథలవైతే.. కొన్ని వెతలవి. కొన్ని రాజకీయాలవి.. కొన్ని ఊసులు, ఇంకొన్ని వెటకారాలు, కొన్ని గేయాలు, ఇంకొన్ని చిత్ర లోక విచిత్రాలూ.. అలాగ ఎవరికి నచ్చిన రీతి న వారు హాయిగా రాస్తున్నట్టుందే అనుకుని చూస్తుంటే నాలుగు సంకలునులు లేదా అగ్రగేటర్లు ఉన్నాయని, తెలిసింది. ఓహో అనుకుని నా గూటినీ.. వాటిలో రాయించుకుని తిరిగి నేను ఇంకో వ్యాసాన్ని రాస్తే..
'నాగేస్రావు' అన్న వ్యక్తి నా గూటిని అనుసరిస్తున్నారని తెలిసింది. ఆయన నా గూటిని గుర్తించి అనుసరించిన తొలి వ్యక్తి. గుండె నా వ్యాసాలని కూడా చదివే వారున్నారా? అని ఏదో గుండె నిండినట్టు!.. ఆరోజు నిద్రా దేవి నన్ను కరుణించనంది. గాలి లోనే విహరించేలా చేసింది. అలాగ, ఒక్కొక్కరూ నా గూటికి వచ్చి వ్యాఖ్య నుంచటాన, కొత్త విషయాలు తెలిసి.. నా గూటికి కొత్త అలంకారాలూ, సోయగాలూ, అతిథుల, వ్యాఖ్యల గణాంకాలు, వివరణలు చేరాయి.
. రంగుటద్దాల కిటికీ లో నాగలోక వాసుల జీవితాలని చూసేలా చేసిన వారు, వారి గూటిలో నా గూడు గురించి రాసి..'దీన్నీ ఒక లుక్కెయ్యండి' అన్నారు.. చక్కగా రాస్తున్నావు.. ఇంకా రాయి అంటూ.. ఆశీర్వదించారు..
*************************************************
నాగిని, శ్రీ, నాగేస్రావ్, సుజాత గార్లు, అగ్రిగేటర్ల లో నేను కొత్తగా రాసిన వ్యాసాలని చూసి తొలి రచన చూసా' అన్నారు.
*************************************************
నడి వేసవి లో వడగళ్ల వాన వర్ణన చూసి తొలి సారి వెంకట గణేశ్ తను అనుకున్నవే నేనూ రాశానన్నారు.. తోచుట చూచించే సంజ్ఞ
, శ్రీదేవి గార్లు (drsd) , గూడ లలిత, 'నా గూడు!' అని రాసుకుంటున్న తెలుగు వారికి అత్యంత ఇష్టుడైన చిన్నవాడు గార్లూ, వచ్చి వ్యాఖ్యానించారు.
*************************************************
ఉద్యాన నగరి లో చందన నగర సిల్కు చీర కొనటానికి వెళ్ళిన వైనాన్ని రాస్తే కొత్తవారు ఎవరూ రాకున్నా.. కొందరు వ్యాఖ్యలనుంచారు.
*************************************************
నాకు తెలిసినావిడ వికటకవి రచించిన ఒక చక్కని కథ కి నాయిక లాంటిదని అని రాస్తే.. సుజ్జి గారు కొత్తగా వచ్చి కథ చక్కగా ఉందన్నారు.
*************************************************
శేషు,రిషి, శ్రీవిద్య వచ్చి నారాయణ రెడ్డి గారి కథ చదివి వ్యాఖ్యలనందించారు.
*************************************************
ఆయన ఫోటో కి కూడా 'మినబే' జై కొట్టారు..
*************************************************
చదువుకున్న ఆడదీ ఎంత సాధారణం గా తన సంసారాన్ని రక్షించాలని, అత్తింటి ఆరళ్ళు సహించిందో రాస్తే.. అశోక్ చౌదరీ, రవి, తియ్యని వాణి, శ్రీనివాస్ / వికటకవి, గోగినేని వినయ చక్రవర్తి, కావ్య, తొలి సారి వచ్చి వారూ అయ్యో అన్నారు.
*************************************************
రైలు లో జనాల నడత గురించి రాస్తే . శ్రావ్య, చెన్న కేశవ రెడ్డి, సాహితి దండ గారు,... , ఆంధ్రుల సినీ హాస్య చక్రవర్తి గారు, అగ్రహార కథలతో అలరించే, (వేదుల )శ్రీకృష్ణుని చెల్లీ, గూటిలో తొలిసారి వ్యాఖ్యానించారు.
*************************************************
చేతి సంచీలు ఎన్ని రకాల వస్తువుల తో నిండి ఉండటం చూసానో రాస్తే నీటి రొట్టె ఒకట్రెండ్...... కాలి గజ్జె గార్లు వచ్చి వ్యాఖ్య నుంచారు.
*************************************************
ఇక రోజూ చుట్టూ జనాలు సాధారణ రోజూ వారీ జీవితం లో ఏవిధం గా నడుచుకుంటారో రాస్తే.. ఆకాశవీధి లోంచి కిషన్ రెడ్డిగారూ, దేవుడికి నివేదన గారు, 'నాలో నేను ' గూటి రాణి, చిరుగాలి లోకాన్నుంచి ఒక తరుణీ, వచ్చి చూసి వ్యాఖ్య వదిలారు.
*************************************************
రాష్ట్ర రాజధాని నగరాన చిన్న నాటి ద్విచక్రవాహన చోదన విశేషాలు వివరిస్తే అరుణ గారు, చదువరి గారూ, వారాంతాలు రాజకీయాలు చేసే వారూ.. తొంగి చూసి వ్యాఖ్యలు చేశారు.
*************************************************
చిక్కటానికి ఆహార నియంత్రణ చేయాలని కష్టించిన వైనాన్ని వర్ణిస్తే.. డీ జీ గారు వచ్చి తొలిసారి గా వ్యాఖ్య చేసారు..
*************************************************
చిన్న అన్యాయాన్ని ఎదిరించాలన్నా 'వద్దులే.. ' అని జంకి వెనుకంజ వేసే తరం లోని నాకు తల్లిదండ్రుల వల్ల కలిగిన జ్ఞానోదయాన్ని వివరిస్తే.. కృష్ణ గీతాన్ని అందరికి అందించే ఆవిడా తొలి సారి వచ్చి వ్యాఖ్య విడిచారు.
*************************************************
చెన్నై నగరాన నా స్నేహితులు ఈశ్వరీ, శ్రీనివాసుల కథ ని రాస్తే టీ గారు, తన జీవన యానాన సంఘటనలని వివరించే వారు, అనిల్ గారు, సంతోషంగా ఉండే రెడ్డి గారు వేంచేసి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
సంతానాన్ని ఐ ఐ టీ ల్లో చదివించాలని తల్లిదండ్రులు వారిని గురి చేసే నానా రకాల హింసల గురించి రాస్తే, 'చిత్రాలు చూడ'రో అని ఒక గూడూ, ఇంకో గూటిలో తన హృదయ గాథ ని వివరించే వారు, చిన్నూ గారు, నారద వీణా గాన లోలుడు నాగ గారు, కిరణ్ గారు, శరత్ గారు, ఇంకా దేశీ కిశోర్ గారు, అవని గారు వచ్చి చర్చించారు..
*************************************************
టీవీల్లో హోర్తెత్తించే సినీ గేయాల గురించి రాస్తే రాఘవ, ఆవకాయ, ఇంకా విష్ణువు నివసించే కొండ గారు, జయగారు, గడ్డ కట్టిన నీరు వారు , తన హృదయం కథలు వివరిస్తుందనే సతీ దేవి.. వచ్చి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
రాష్ట్ర రాజధాని నగరాన ద్విచక్ర వాహన చోదనా విశేషాలు రాస్తే అరుణ గారు, చదువరి గారూ, వారాంతాలు రాజకీయాలు చేసే వారూ.. తొంగి చూసి వ్యాఖ్యలు చేశారు.
*************************************************
విదేశాల నుండి వచ్చే వారి సంచీలు సద్దుడు కథ కి కొత్తగా వచ్చి వ్యాఖ్యలు ఇచ్చారు తెరెసా గార్లు ..
*************************************************
'నిక్కీ' అన్న చిన్నారి ని తెచ్చి ఆకాశాన విహారాలు చేయించి నేలకి త్రోసిన వైనాన్ని రాస్తే .. కొత్త గా ఎవరూ రాలేదు కానీ. కొందరు వ్యాఖ్యలనుంచారు.
*************************************************
శ్రీనూ రాధల కొత్త ఇంట్లోకి వెళ్ళే కథ కి తియ్యని గురుతుల గూటి రాణీవారు తొలిసారి విచ్చేసి వ్యాఖ్య ఉంచారు.
*************************************************
సిల్కు నైటీల్లో హైందవ ఆచారాలని నిర్వర్తించే ఆడవారి గురించి రాస్తే.. కే వీ ఆర్ ఎన్ గారు, వాలు నారీకేళ చెట్టు గూటి రాణి గారు, తన చక్కని కవిత లతో అందరినీ అలరించే 'జలజాలకి అంకిత కాంత' - వారి తొలి వ్యాఖ్య ఇచ్చారు.
*************************************************
సెలవలనగానే తల్లి గారి తల్లి ఇంటికి వెళ్ళిన చిన్ననాటి విషయాలు గుర్తు చేస్తే, రాధిక, శివ, తేనె, తన చిన్నారి కూతురి ఊసులు వివరించే ఆవిడ, వచ్చి, వారూ వారి విశేషాలు అందించారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో ని కొత్త గా చేరిన వారి తత్వాన్ని వర్ణించే కథ రాస్తే..కే.వీ.ఆర్. ఎన్, గిరీశ్గార్లు తోలి సారి వచ్చి వ్యాఖ్యానించారు.
*************************************************
ఈ తెలుగోళ్ళంతా ఇంతే.. నంటూ రాసిన కథ, నా గూటికి కత్తి గారినీ, కీర్తన గారినీ, శారద గారినీ, వెన్నెల రాజ్యాన్నీ, వాయువు గారినీ.. కొత్తగా చేర్చింది.
************************************************* కార్యాలయాల్లో జరిగే గోష్టుల్లో జరిగే సరదా విశేషాలని, వివరిస్తే.. సూర్య కుల తిలక రెడ్డి గారు, సూర్య కుల తిలక రాజు గారూ జంట గా వచ్చి వ్యాఖ్యానించగా.. చలం గారి ఆలోచనా స్రవంతి ని వివరించే వారూ ,దేశీ జ్ఞాన దేవత గారూ, వచ్చి చూసి వ్యాఖ్యానించారు.
*************************************************
' ఇంకా సాఫ్ట్ వేర్ ఇంజనీరేనా?' కొలువు లో ఎదుగుదల లేదా? అని చటుక్కున వచ్చి జాలిగా అడిగే వెంకీ ల వల్ల ఒక రోజంతా కాస్త చిరాకయి తిరిగి సద్దుకున్న విషయాన్ని గురించి వివరిస్తే శ్రినివాల్ గారు, స్రవంతి గారు,చింత రుచి కలిగిన ఆయన, ఉష, సునీత గార్లు, ఆర్ గారు, స్నిగ్ధ గార్లూ వచ్చి వ్యాఖ్యనుంచారు. ************************************************* ఇంట్లో ఊరికే అవతలకి విసిరేయాల్సినకూరగాయల తొక్కల తో చేసిన వంటకాలని తినే తెల్ల అధికారి సరదా కథ రాస్తే.. 'చిత్రం' వేణు గారు, తుంటరి, హరేకృష్ణ గార్లు తొలి సారి విచ్చేసి వ్యాఖ్యానించారు.
*************************************************
ఈ దేశ వాసుడైనా, తన సొంత ఊరి నుండి నిర్వాసితుడైన డోగ్రా అన్న కుర్రవాడి కథ వివరిస్తే.. సతీ సహిత శివుడు గారు, శిరీష గారు, సాయి కిరణ్ గారు, 'రాఘవ నరశార్తూల' గారు, దుర్గేశ్వర గారు, సందేశగీతాల గూటివారు, వచ్చి వ్యాఖ్యానించగా.. నాగార్జున గారయితే, కరిగి ఆయనే తన గూటిలో ఇంకో వ్యాసాన్నుంచారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో కాలనీ అధ్యక్షుని ఇల్లాలిగా నా కష్టాల సరదా కథ రాస్తే.. ఆలోచించే ఇంద్ర గారు, జ్యోతి గారు తొంగి చూసి వ్యాఖ్యానించారు.
*************************************************నా తల్లి చెల్లి వివాహాన్నీ, ఆవిడ కొడుకు వివాహాన్నీ, వర్ణిస్తూ రాసిన వ్యాసాన్ని వీక్షించి తొలిసారి వ్యాఖ్యానించిన వారిలో.. వోలేటి వారు, సిద్ధ హస్తురాలు, శ్రీనివాస్ గారు, దివ్య వాణి గారు, విరజాజి గారు, సవ్వడి గార్లూ ఉన్నారు.
*************************************************
చిన్న తనంలో , 'వయస్కులయ్యాక ఇలా ఉండాలి' అని కన్న కలలు గుర్తు చేస్తే.. తన లోకాన్ని అంతర్జాల గూడులోవెల్లడిస్తున్న వెంకట్ నీ, నేస్తాన్నీ, చిన్న కాకి కృష్ణ నీ, గంగ/తులసి/సీత వంటి ఆవిడ నీ , తెలుగు తియ్యదనాన్ని వివరించే 'క్రిష్' నీ లాక్కొచ్చి తొలి సారి వ్యాఖ్యానించేలా చేసింది.
*************************************************
వేరు వేరు దేశాల్లో నివసించి స్వదేశానికితిరిగి వచ్చిన వారు జన జీవన స్రవంతి లో కలవటాన్ని గురించి రాస్తే.. శ్రీకర్ గారు, 'తెలుగు' గారు, శ్రీ గారు, 'కొడుకు' గారు, కవిత గారు, వేణు గారు, రాఘవేంద్ర గారు, snkr గారు వచ్చి తొలి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
హాల్లో, చలన చిత్రాలు చూడటం లో ఉన్న హాయి ని రాస్తే.. ఇంగువ శేషు గారూ, కలల లోక రాణి వారూ, 'ఒకటి తక్కువ నాలుగు' జీ గారూ వచ్చి తొలి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
అన్నయ్య వరసాయన నవ జాత శిశువు ని దత్తు తీసుకున్న వైనాన్ని రాస్తే రాం, స్నేహిత్, చావా కిరణ్ గార్లు, అన్నయ్య వ్యక్తిగత జీవితాన్ని అంతర్జాలానికి ఈడ్చానని అనుకోగా.. అంతర్జాల తెలుగు ఊసుల గూడుల శశిరేఖ గారు, సాహితి గారు, తదితరులు వచ్చి హర్షించి, వ్యాఖ్యానించి వెళ్ళారు. కొందరు సందేహ నివృత్తి చేసుకున్నారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో సంఘ సేవ సరదా కష్టాల కథ రాస్తే.. తన గూటిలో 'ఫీలింగ్స్' రాసుకునే శ్రీశుడు గారు,.. కొడుకున్ :) గారు , శివరంజని గారు , రవి వచ్చి తొలి సారి వ్యాఖ్యలనందించారు.
*************************************************
రవ్వ తో చేసిన వంటకాల ని తినకుండా హాయిగా ఏదో ఇలాగ ఆనందిస్తుంటే.. తిరిగి ఎలాగ అవే వంటలు చేసి తినాల్సి వస్తోందో రాస్తే.. రవి, శ్రీ రాఘవ, వేణూ శ్రీకాంత్, ఆది శేషు, ఇష్టురాలు, విశ్వనాథ్, చందు లు వచ్చి తొలి సారి వ్యాఖ్య ఇచ్చారు.
*************************************************
ఒక అవ్వ చావు చూసి , తర్వాత ఆ ఇంట జరిగిన కథ గురించి రాస్తే ..లక్కరాజు రావు గారు, సుజాత గారు, శివ గారు, తొలిసారి వ్యాఖ్యానించారు.
*************************************************
'వెండి కడ్డీగెలిచారు!! వచ్చి తీసుకెళ్లండ'ని అంటే.. ఉత్సాహాన్ని తట్టుకోలేక వేసిన వేషాల సరదా కథ రాస్తే సునీల్ గారు, 'నా లోగిలి' గూటి వారు, లోకేశ్ శ్రీకాంత్, శిశిర, నీహారిక గార్లు, నవ్వితే నవ్వండనే వారు, సతీ దేవి గారు, ఆత్రేయ గారు, శేషేంద్ర శాయి గారు వచ్చి తొలిసారి వ్యాఖ్యానించి వెళ్లారు.
*************************************************
త్రిదశకానికి ఇంకో రెండు లోకోక్తులని జోడించి కూర్చి ఒక కథ గా అల్లి గూటిలో చేర్చితే.. కన్నాజీ, హంస, కన్నగాడు, గోల్కొండ నాగరాజు, రాధిక (నాని), ఆదిత్య చౌదరి, చంద్రుణ్ణి సిగ లో ధరించిన వారు, తాతయ్య కల ని అందించే వారు, హరి కృష్ణ, ఆంజనేయ రావు గార్లు వచ్చి తొలి సారి వ్యాఖ్యానించారు.
*************************************************
విద్యార్థులు ఏడాదంతా చదివి సాధించిన జ్ఞాన స్థాయిని కొలుస్తుంటే వచ్చే వత్తిడి గురించి రాస్తే స్నేహ గారు, రెంటాల రచన గారు, శ్రీదేవి గారు కొత్తగా వ్యాఖ్యానించారు.
*************************************************
'గుండె ఊసులు ' అంటూ.. అనవసరంగా విదేశీ సాధనాల వాడకాన్ని ఎక్కువ చేసి.. చికిత్స ధర ఎక్కువయ్యేలా చేసిన వైద్యుల గురించి రాస్తే.. వజ్రం, కౌటిల్య, అంతర్జాల ఊసుల యుధిష్టిర జనకుడు, శ్రీవల్లి, రఘు, వచ్చి తొలిసారి వ్యాఖ్యానించారు.
*************************************************
దసరా సెలవల్లో రైలేక్కేదాకా జరిగిన సంఘటనల గురించిరాస్తే.. నేనూ-నువ్వూ అనే సూర్యుడు..... శశి సఖి, ఎస్. ఆర్ రావు, ఇందు గార్లు తొలిసారి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో అరువుల గొడవల గురించి రాస్తే.. లత గారు, నిశిగంధ, ఊహల తేరు వారు, కొత్తగా వ్యాఖ్య నుంచారు.
*************************************************
కార్తీక వన విహారవిందుల కొరకు నేను చేసిన టల్లోస్ తాకిడి నీ తట్టుకుని వ్యాఖ్యాస్త్రాలు సంధించారు, చంద్రిక, అను గార్లు , సంగతులు- కాకరకాయల గూటివారు, కొంటె సంగతుల గూటి వారు, సిరి గారు, ఇంకా రాజేశ్ గార్లు.
*************************************************
చదువు ఒత్తిడి తో కొట్లాటలు ఎక్కువయిన నా కూతుళ్లని 'చదువుకుంటారా ? లేక...' అని నిలదీసానని రాస్తే.. శ్రీ శేషు గారు, కెలుకుడే కెలుకుడు అనేవారు, ఎన్నెల గారు, అనిల్ కృష్ణ గారు, ఆరోగ్య రహస్యాలు వివరించే గూటి వారు వచ్చి వ్యాఖ్యలని విడిచారు.
*************************************************
ఇంటికొచ్చిన అతిథి దేవుని ఆగడాలని వర్ణిస్తే.. ఎస్ శంకర్ గారు తొలిసారి వ్యాఖ్యనుంచారు.
*************************************************
సెలవల్లో తెలుగు వారి రాజధాని విహార విశేషాలు, గ్రంథ విక్రయ శాలల లో కలిసిన సాటి అంతర్జాల తెలుగు గూటి వారి గురించీ చర్చిస్తే .. తెలుగు సినీ గాన గాంధర్వుడు, కాంతి ధార గూటి వారు, తేజస్విని గారు, కిరణ్ గారు, అన్నె శశిధర్ గారు తొలి సారి రాసారు.
*************************************************
ఒక చిన్న విషయాన్ని నాన్చి నాన్చి వివరించే నా చతుర్చక వాహన చోదకుడి (డ్రైవర్) శిశు జనన కథ రాస్తే.. నల్లనయ్య, నాట్య రాణి , శేషు గార్లు వారి తొలి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
'వింటే కురు వంశ కథ వినాలని.. తింటే..?' అంటూ నా కూతుళ్లకి జయ ఇతిహాస గాధ రెండు నెలలు సుదీర్ఘంగా వివరించి ఆ కథ ని వ్యాసంగా రాస్తే.. దళ శ్రీనివాసు, సంజు రాజు గారు, ఇచ్చేశ్వర రావు గారు , సతీశ్ గారు, రుత్ గారు, సత్య గారు, తేనె గారు, 'ఇద్దరు' , వ్యాఖ్యాత , ఎస్ ఎస్ గార్లు వచ్చి వ్యాఖ్యాల్లో చర్చించేలా చేసింది.
*************************************************
నడి రోడ్డున చేజారిన నా దూర వాణి ని గురించి రాస్తే
దుర్గ , తృష్ణ, విరి వంటి స్త్రీ ,యజ్ఞ గార్లు వచ్చి వ్యాఖ్యానించారు.
*************************************************
'నాకూ ఉన్నారు .. ఫాక్షనిష్ట్ స్నేహితులు ..' అని గర్విస్తూ సింగాన్ని గురించి రాస్తే.. శ్రీరాఘవ, జై తెలంగాణా, కథా సాగర్ గార్లు తొలిసారి వచ్చారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో నరకాసుర వర్ధంతి తరువాత రోజు ఉత్సవాలల్లో ఆహార వ్యవహారాల నిర్వహణ విధానాన్ని వర్ణిస్తే.. దివ్వెగారు కొత్తగావచ్చి వ్యాఖ్య నుంచారు.
*************************************************
ఇలాగ అరవై కి నాలుగు తక్కువ గూటి అనుచరులు, ఏడు తక్కువ కథ/వ్యాసాలూ.. ఇరవై నాలుగు వేలకి వెయ్యి తక్కువ అతిథులు,..
ఏడాది క్రితం.. అస్సలూ కలలో కూడా ఊహించనిది! ఈరోజు కూడా ఈ డైరీ రాసే కృష్ణ (అక్కయ్య) నేనేనా? ఈ ఆదరణ అంతా నాకేనా? నా రాతలని చూసి ఒక చిత్రాన్ని వేసినావిడ నాకిచ్చిన గౌరవానికి అచ్చెరువు గా ఉంటుంది. నేను కొత్త వ్యాసాన్ని ఇలాగ రాయగానే చదివి తరచూ వ్యాఖానించిన వారిని తలచుకుంటే గర్వంగా ఉంటుంది.
నా ఊసుల గూటిని ఆదరిస్తున్న అందరికీ ఇవే నా శత కోటి నెనర్లు ..